ADVERTISEMENT
home / సౌందర్యం
ఈ సహజసిద్ధమైన చిట్కాలతో…. ట్యాన్‌కు టాటా చెప్పేయచ్చు..! (How To Remove Tan In Telugu)

ఈ సహజసిద్ధమైన చిట్కాలతో…. ట్యాన్‌కు టాటా చెప్పేయచ్చు..! (How To Remove Tan In Telugu)

ఎండగా ఉన్న సమయంలో కాసేపు సరదాగా బయటకు వెళ్లి వస్తే చాలు.. చర్మం ఎర్రగా కమిలిపోవడం.. లేదా నల్లగా మారిపోవడం.. జరుగుతుంది. దీనినే ట్యాన్ (Tan) అని పిలుస్తారు. ఈ సమస్య సాధారణంగా వేసవిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ రోజుల్లో మాత్రం సీజన్‌తో సంబంధం లేకుండా సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న ప్రతిసారీ ఇలాంటి చర్మసంబంధిత సమస్యలు చాలామందిలో కనిపిస్తున్నాయి.

ఓవైపు నాణ్యమైన సన్‌స్క్రీన్ లోషన్ ఉపయోగించినప్పటికీ దాని ప్రభావం.. కొద్ది గంటల పాటు మాత్రమే చర్మంపై పని చేయడంతో ఆ తర్వాత స్కిన్ ట్యాన్‌కు గురవుతుంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు అంటే స్కిన్‌ను డీట్యాన్ చేసుకునేందుకు సన్‌స్క్రీన్ లోషన్ వంటివి ఉపయోగిస్తూనే.. కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను సైతం పాటించాల్సి ఉంటుంది. అయితే దీని కోసం ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలనే ఉపయోగిస్తే సరిపోతుంది. దీని కంటే ముందు అసలు ట్యాన్ సమస్య తలెత్తడానికి గల కారణాలేంటో ఓసారి తెలుసుకుందాం..

ట్యాన్ సమస్య తలెత్తడానికి గల కారణాలు (Causes Of Tan)

మన శరీరంలో ముఖం, మెడ.. వంటి ప్రాంతాల్లో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇలాంటి భాగాల వద్ద సూర్యరశ్మి ప్రభావం పడినప్పుడు అవి కమిలినట్లుగా లేదా నల్లగా రంగు మారినట్లు కనిపిస్తాయి. సూర్య కిరణాల్లో ఉండే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలే ట్యాన్‌కు ప్రధాన కారణమని చెప్పచ్చు.

ఇవి చర్మం లోపలి పొరల్లోకి చొచ్చుకెళ్లి మెలనోసైట్స్‌ని (మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలు) ప్రభావితం చేస్తాయి. చర్మంలోని పిగ్మెంటేషన్‌కి కారణమైన ఈ మెలనోసైట్స్ యూవీ కిరణాల బారిన పడిన కారణంగా.. మరింత ఎక్కువ స్థాయుల్లో మెలనిన్ ఉత్పత్తి చేస్తాయి.

ADVERTISEMENT

ఫలితంగా చర్మం రంగులో మార్పు కనిపిస్తుంది. దీంతో పాటు రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులు ఉపయోగించినా కూడా ఈ విధమైన సమస్యలు ఒక్కోసారి తలెత్తుతూ ఉంటాయి. మరి, ఇంట్లో అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం ద్వారా ఈ ట్యాన్‌కు టాటా చెప్పేయచ్చని ముందే తెలుసుకున్నాం కదా. ఇందుకోసం ఏయే పదార్థాలను, ఎంతెంత ఉపయోగించాలి; ఎలా ఉపయోగించాలో కూడా ఓసారి తెలుసుకుందాం రండి..

ట్యాన్‌ని తొలగించే సహజసిద్ధమైన చిట్కాలు (Home Remedies For Tan Removal In Telugu)

సూర్యరశ్మి కారణంగా తలెత్తే ఈ సమస్యకు సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగించడం ద్వారా సులభంగా చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలను తరచూ ఉపయోగిస్తే చాలు. ఈ సమస్య మనల్ని అసలు బాధించదు. ఇంతకీ ఆ చిట్కాలేవంటే..

Shutterstock

ADVERTISEMENT

బంగాళాదుంప రసంతో.. (Potato)

బంగాళాదుంప రసంలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతిమంతంగా మార్చడమే కాకుండా.. సహజసిద్ధమైన బ్లీచ్‌గానూ పని చేస్తాయి. కాబట్టి ట్యాన్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు బంగాళాదుంప రసం మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మనం పెద్దగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక బంగాళాదుంపని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

వాటిని మిక్సీ పట్టి లేదా మెత్తని తురుముగా చేసి రసాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న రసంలో దూదిని ముంచి.. దాంతో ఈ రసాన్ని ట్యాన్ ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకోవాలి. దీనిని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. అనంతరం చర్మానికి నాణ్యమైన మాయిశ్చరైజర్ రాయడం తప్పనిసరని గుర్తుంచుకోండి.

కలబంద గుజ్జుతో.. (Aloevera)

కలబందను మనం సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. ఇది మన చర్మంలోని తేమ స్థాయులను పెంచేందుకు బాగా తోడ్పడుతుంది. అయితే దీనిని ఉపయోగించి ట్యాన్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు.

కలబంద గుజ్జుని ట్యాన్ సమస్య ఉన్న ప్రాంతంలో అప్లై చేసి.. కాసేపు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ట్యాన్ సమస్య మరింత ఎక్కువగా ఉన్నవారు రాత్రి పడుకునే ముందు ట్యాన్ ఉన్న చోట కలబంద గుజ్జు అప్లై చేసుకుని.. మర్నాడు ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది.

ADVERTISEMENT

పసుపు, శెనగపిండితో.. (Turmeric)

పసుపులో యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది చర్మం పైపొరల్లో పేరుకున్న దుమ్ము, ధూళికణాలను తొలగించడం మాత్రమే కాదు.. ట్యాన్‌ని సైతం సునాయాసంగా తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా.. చెంచా శెనగపిండి తీసుకొని అందులో పావు చెంచా పసుపు వేసి తగినంత రోజ్ వాటర్ జత చేస్తూ బాగా కలుపుకోవాలి.

ఇలా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని ట్యాన్ సమస్య ఉన్న ప్రాంతంలో ప్యాక్‌లా అప్లై చేసుకొని.. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని తరచూ వేసుకోవడం ద్వారా ట్యాన్ సమస్య నుంచి విముక్తి పొందడమే కాదు.. మెరిసే చర్మాన్ని సైతం మన సొంతం చేసుకోవచ్చు.

పెరుగు, తేనెతో.. (Yogurt And Honey)

పెరుగు మన చర్మానికి సహజసిద్ధమైన క్లెన్సింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. ఇందులో ఉండే ఎంజైమ్స్ ఎండ కారణంగా నల్లబడిన చర్మాన్ని తిరిగి మామూలుగా మారుస్తాయి. అయితే దీని కోసం కొద్దిగా పెరుగు, తేనె తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో చిటికెడు పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ట్యాన్ సమస్య ఉన్న ప్రాంతంలో ప్యాక్‌లా అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

కీరాదోస, పాలపొడితో.. (Cucumber And Milk Powder)

ఒక కీరాదోస తీసుకొని తొక్క చెక్కేసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత దీనిని మిక్సీలో వేసి లేదా తురిమి దాని రసాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో సరిపడినంత పాలపొడి వేయాలి. ఆ పైన ఉండలు కట్టకుండా మెత్తని పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ట్యాన్ సమస్య ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకోవాలి.

ADVERTISEMENT

ఇది పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటిలో వేళ్లను ముంచి.. ప్యాక్ పై తిరిగి తడి చేస్తూ గుండ్రంగా మర్దనా చేసుకోవాలి. ప్యాక్ తిరిగి పూర్తిస్థాయిలో తడిగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనిని వారానికి ఒకసారి ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది.

Shutterstock

కీరాదోస రసం, నిమ్మరసం.. (Cucumber And Lemon)

నిమ్మలో బ్లీచింగ్, యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్‌తో పాటు యాంటీ ఫంగల్ గుణాలు కూడా అధికంగా ఉంటాయని మనకు తెలుసు. దీనిని నిమ్మరసంతో కలిపి ఉపయోగించడం ద్వారా కేవలం ట్యాన్ సమస్య‌కు మాత్రమే కాదు.. పిగ్మెంటేషన్‌కు సంబంధించిన సమస్య అయినా సరే.. చక్కని ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం కీరాదోస రసం, నిమ్మరసాలను సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ మిశ్రమంలో దూదిని ముంచి దాంతో ట్యాన్ ఉన్న ప్రాంతంలో జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. దీనిని పూర్తిగా ఆరేంతవరకు ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని రోజూ వేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

ADVERTISEMENT

పెరుగు, టొమాటో రసంతో.. (Yogurt And Tomato Juice)

టొమాటో గుజ్జు రెండు చెంచాలు, పెరుగు, నిమ్మరసం చెంచా చొప్పున ఒక బౌల్లో తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ట్యాన్ సమస్య ఉన్న ప్రాంతంలో ప్యాక్‌లా అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దీనిని తరచూ ఉపయోగించడం వల్ల ట్యాన్ సమస్య తొలగిపోవడం మాత్రమే కాదు.. ప్రకాశవంతమైన చర్మాన్ని సైతం మన సొంతం చేసుకోవచ్చు.

బొప్పాయి, తేనెతో.. (Papaya And Honey)

సహజసిద్ధంగా పండిన బొప్పాయి పండును.. మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న చోట ప్యాక్‌లా అప్లై చేసుకొని 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి.

ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. బొప్పాయి ట్యాన్ సమస్య నుంచి చర్మానికి ఉపశమనం కల్పించడంతో పాటు చర్మాన్ని ప్రకాశవంతంగానూ మారుస్తుంది. అలాగే తేనె చర్మానికి సహజసిద్ధంగా తేమను అందిస్తూ.. మెరిసేలా కనిపించేలా చేస్తుంది.

ట్యాన్ సమస్య నుంచి విముక్తి పొందేందుకు బొప్పాయి గుజ్జులో నిమ్మరసాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. దీనిని తరచూ ఉపయోగించడం ద్వారా ట్యాన్‌కు టాటా చెప్పడమే కాదు.. మెత్తని, మెరిసే చర్మానికి హాయ్ కూడా చెప్పచ్చు.

ADVERTISEMENT

నిమ్మరసంతో.. (Lemon)

నిమ్మలో కేవలం బ్లీచ్ గుణాలు మాత్రమే కాదు.. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు సైతం ఉన్నాయన్న సంగతి మనకు విదితమే. అందుకే ట్యాన్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు వినియోగించే చిట్కాల్లో దీనిని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇందుకోసం సమస్య ఉన్న ప్రాంతంలో నిమ్మచెక్కతో నేరుగా రుద్దుకొని.. కాసేపు ఆరనిచ్చి ఆ తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకున్నా సరిపోతుంది. అయితే నిమ్మరసాన్ని ఇలా నేరుగా ఉపయోగించడానికి ఇబ్బంది పడేవారు దానిని ఇతర పదార్థాలతో మిక్స్ చేసి వినియోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం తేనె, కీరాదోస రసం.. వంటివి ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.

Shutterstock

ఓట్ మీల్, బటర్ మిల్క్‌తో.. (Oatmeal And Buttermilk)

ఓట్ మీల్ చర్మానికి మంచి స్క్రబ్‌గా పని చేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్‌కు, మూడు టేబుల్ స్పూన్ల బటర్ మిల్క్ జత చేసి మెత్తని పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న చోట అప్లై చేసుకొని గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ADVERTISEMENT

ఇందులో మనం ఉపయోగించే బటర్ మిల్క్ చర్మాన్ని మృదువుగా మారుస్తూ.. ట్యాన్‌ని తొలగించేందుకు ఉపయోగపడతాయి. అలాగే ఓట్ మీల్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఈ ప్యాక్‌ని సైతం తరచూ వేసుకోవడం ద్వారా ట్యాన్ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందచ్చు.

పైనాపిల్ గుజ్జు, తేనెతో.. (Pineapple)

చర్మంపై ఉండే మృతకణాలను తొలగించడంలో పైనాపిల్ చాలా సమర్థంగా పని చేస్తుంది. అందుకే దీనిని కేవలం ఆహారంగానే కాదు.. సౌందర్యపరమైన ప్రయోజనాలు అందించే పండుగా కూడా ఉపయోగిస్తుంటారు. అయితే చాలా తక్కువమందికి తెలిసిన విషయం ఏంటంటే.. చర్మంపై వచ్చే ట్యాన్‌ను తొలగించడంలోనూ పైనాపిల్ చాలా సమర్థంగా పని చేస్తుందని. పైగా ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ముడతలను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ట్యాన్ సమస్య నుంచి విముక్తి పొందేందుకు మెత్తగా చేసిన పైనాపిల్ గుజ్జు రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని.. అందులో చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రాంతంలో ప్యాక్‌లా అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

పసుపు, పాలతో.. (Turmeric And Milk)

ఒక చెంచా పచ్చి పాలు తీసుకొని.. అందులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రాంతంలో ప్యాక్‌లా అప్లై చేసుకొని 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ పాలు నేరుగా చర్మానికి అప్లై చేయడానికి ఇబ్బందిపడే వారు.. పాలపొడి ఉపయోగించి తయారుచేసిన ప్యాక్ వినియోగించడం ద్వారా ఈ ఫలితాన్ని పొందవచ్చు.

ADVERTISEMENT

ఇందుకోసం చెంచా పాలపొడి తీసుకొని అందులో రెండు చెంచాల తేనె, రెండు చెంచాల నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రాంతంలో ప్యాక్‌లా అప్లై చేసి మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

Shutterstock

చందనం పేస్ట్‌తో.. (Sandalwood)

చందనం పొడి, కొబ్బరినీళ్లు చెంచా చొప్పున ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ట్యాన్ సమస్య ఉన్న ప్రాంతంలో ప్యాక్‌లా అప్లై చేసి మృదువుగా రుద్దుకోవాలి. తర్వాత పూర్తిగా ఆరేంత వరకు ఉంచి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ADVERTISEMENT

ఈ విధంగా వారానికి మూడుసార్లు చొప్పున క్రమం తప్పకుండా పాటించడం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ ప్యాక్ కారణంగా చర్మం మరీ పొడిబారినట్లు కనిపిస్తుంటే.. ఇందులో కొద్ది చుక్కల బాదంనూనె కలపడం ద్వారా ప్రయోజనం కనిపిస్తుంది.

అలాగే రెండు టేబుల్ స్పూన్ల చందనం పౌడర్ తీసుకొని.. అందులో తగినంత రోజ్ వాటర్ వేసి మెత్తని మిశ్రమంగా చేయాలి. దీనిని సమస్య ఉన్న చోట అప్లై చేసుకున్నా ప్రయోజనం ఉంటుంది.

బంగాళాదుంప, నిమ్మరసం.. (Potato And Lemon)

బంగాళాదుంప, నిమ్మలో బ్లీచింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ట్యాన్ నుంచి విముక్తి పొందేందుకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. బంగాళాదుంప తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టడం లేదా తురమడం ద్వారా రసాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న బంగాళాదుపం రసం 4 చెంచాలు, నిమ్మరసం చెంచా ఒక బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో దూది ముంచి సమస్య ఉన్న ప్రాంతంలో దీనిని అప్లై చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

కొబ్బరినీళ్లతో.. (Coconut Water)

కేవలం కొబ్బరినీళ్లను ఉపయోగించడం ద్వారా కూడా ట్యాన్ నుంచి విముక్తి పొందచ్చని మీకు తెలుసా? అవునండీ.. అప్పుడప్పుడూ ట్యాన్ ఉన్న ప్రాంతంలో కొబ్బరినీళ్లను దూది సాయంతో అప్లై చేసుకొని ఆరనిచ్చి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే అసలు ట్యాన్ సమస్యే ఉండదు. అదీకాకుండా మెత్తని, మృదువైన చర్మాన్ని సైతం మన సొంతం చేసుకోవచ్చు.

ADVERTISEMENT

Shutterstock

ట్యాన్ బారిన పడకుండా ఉండేందుకు చిట్కాలు (Tips To Prevent Tan)

ట్యాన్ బారిన పడకుండా ఉండాలంటే.. బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలి. ఎండలో బయటకు వెళ్లడానికి పావుగంట ముందు చర్మానికి సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. అలాగే సూర్యరశ్మి ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి మూడు గంటలకోసారి సన్‌స్క్రీన్ రాసుకుంటే మరీ మంచిది.

  • సన్‌స్క్రీన్ లోషన్‌కు బదులుగా ఆ గుణాలున్న ఫేస్ క్రీమ్స్ ఉపయోగించినా మంచిదే.
  • ఎస్ పీ ఎఫ్ (సన్ ప్రొటెక్టంట్ ఫ్యాక్టర్) 15 నుంచి 30 వరకు ఉన్న క్రీమ్స్ ఉపయోగించాలి.
  • ఒకవేళ ఎండలో ఎక్కువగా తిరగాల్సి వచ్చినప్పుడు ఎస్ పీ ఎఫ్ 50 ఉన్న క్రీమ్స్ ఉపయోగించాలి. ఇంతకు మించి ఎక్కువ విలువ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.
  • సూర్యరశ్మి ప్రభావం చర్మంపై పడకుండా వీలైనంత ఎక్కువ భాగాన్ని దుస్తులతో కవర్ చేయాలి.
    అలాగే ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరగకండి.
  • తలపై టోపీ, కళ్లకు సన్ గ్లాసెస్.. వంటివి తప్పనిసరిగా ఉపయోగించాలి.
  • ట్యానింగ్ ఆయిల్స్ వంటివి ఉపయోగించకండి.

తరచూ అడిగే సందేహాలు – వాటి సమాధానాలు (FAQ’s)

ట్యాన్ సమస్య నుంచి విముక్తి పొందేందుకు గల సహజసిద్ధమైన చిట్కాల గురించి తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు డీట్యాన్ ప్రక్రియకు సంబంధించి చాలామంది మహిళల్లో తరచూ తలెత్తే కొన్ని సందేహాలు, వాటి సమాధానాలు కూడా ఓసారి తెలుసుకుందాం..

ADVERTISEMENT

డీట్యాన్, బ్లీచ్‌కు మధ్య గల తేడా ఏంటి??

బ్లీచ్ ప్రక్రియ ద్వారా కేవలం చర్మంపై ఉన్న వెంట్రుకల రంగు మాత్రమే లైటర్ షేడ్‌లోకి మారుతుంది. అంతేకానీ చర్మాన్ని ఏమాత్రం ఇది ప్రభావితం చేయదు. ఇక డీట్యాన్ ప్రక్రియకు వచ్చేసరికి ఇది చర్మఛాయను మెరుగుపరుస్తుంది. అయితే ఈ ప్రక్రియల నిమిత్తం రసాయనాలు ఉన్న పదార్థాలు ఎక్కువగా ఉపయోగిస్తే.. చర్మం సహజసిద్ధమైన లుక్‌ని కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది. కాబట్టి వీలైనంత వరకు సహజసిద్ధమైన ప్రక్రియలనే ఆశ్రయించడం మంచిది.

డీట్యాన్ చర్మానికి మంచిదేనా??

సహజసిద్ధమైన ఉత్పత్తులు లేదా పదార్థాలు ఉపయోగించి ట్యాన్ తొలగించుకునే ప్రక్రియ వల్ల చర్మానికి ఎలాంటి నష్టం, హాని ఉండదు. పైగా న్యాచురల్ ఉత్పత్తుల ద్వారా చర్మంలో తేమ స్థాయులను సైతం క్రమబద్ధీకరించుకుంటాం. కాబట్టి పొడిబారి, నిర్జీవంగా మారిపోతుందనే భయం కూడా ఉండదు.

ఒకవేళ చర్మాన్ని పొడిగా మార్చే పదార్థాలు ఏవైనా ప్యాక్స్‌లో ఉపయోగించినప్పటికీ.. ప్యాక్ తొలిగించిన అనంతరం నాణ్యమైన మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం ద్వారా చర్మంలో తేమను తిరిగి నిలిచేలా చేయచ్చు. కాబట్టి డీట్యాన్ ప్రక్రియ చర్మానికి మంచిదే. అయితే రసాయనిక పదార్థాలు ఉపయోగించే విధానాలకు మాత్రం వీలైనంత దూరంగా ఉండడమే శ్రేయస్కరం.

డీట్యానింగ్ వల్ల చర్మానికి కలిగే లాభాలేంటి??

చేతుల వద్ద ఉన్న ట్యాన్‌ను తొలగించడంలో కీరాదోస సమర్థంగా పని చేస్తుంది. ఇందుకోసం మెత్తగా చేసిన కీరాదోస గుజ్జు, పెరుగు చెంచా చొప్పున తీసుకొని.. సరిపడినంత రోజ్ వాటర్ కలుపుతూ మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న ప్రాంతంలో అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని రోజూ అప్లై చేసుకుంటే ట్యాన్ అనే సమస్యే ఉండదు. ఇది కేవలం చేతుల వద్దే కాదు.. ట్యాన్ సమస్య ఉన్న ప్రతిచోటా చక్కగా పని చేస్తుంది.

ADVERTISEMENT

కాళ్ల వద్ద ఉన్న ట్యాన్‌ను తొలగించడానికి టొమాటో గుజ్జు బాగా పని చేస్తుంది. టొమాటో గుజ్జు, పెరుగు, తేనె చెంచా చొప్పున ఒక బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కాళ్ల వద్ద ట్యాన్ ఉన్న చోట అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాలు ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి రెండుసార్లు చొప్పున క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ని ఉపయోగించడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. ఈ ప్యాక్ కేవలం కాళ్ల వద్ద మాత్రమే అప్లై చేయాలనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే.. ఇది ట్యాన్‌ని తొలగించడంలో చాలా సమర్థంగా పని చేస్తుంది. కాబట్టి ట్యాన్ ఉన్న శరీరభాగాలకు దీనిని అప్లై చేసి, ప్రయోజనం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

చీర అందాన్ని మరింతగా పెంచేసే.. ఈ శారీ కుచ్చుల డిజైన్స్ మీరు చూశారా??

ADVERTISEMENT

వేసవిలో మేకప్ వేసుకోవాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..!

అందం, ఆరోగ్యం రెండూ అందించే ఆలివ్ నూనె గురించి.. మీరు తెలుసుకోవాల్సిందే..!

27 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT