వినాయక చవితి (Vinayaka chavithi).. గణేష్ చతుర్థిగా కూడా పిలిచే ఈ పండగ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. మన దేశంలోనే ఎక్కువ మంది జరుపుకునే పండగల్లో ఒకటి. పవిత్రతకు, విజయానికి మారుపేరైన వినాయకుడిని భక్తితో పూజించే రోజు ఇది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధించడానికి ముందుగా గణపతి (ganesha) పూజ చేయడం మనకు అలవాటు.
Table of Contents
- వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటారు? (Why Is Vinayaka Chavithi Celebrated?)
- వినాయక చవితి కథ (Story Behind Vinayaka Chavithi In Telugu )
- వినాయక చవితి ఎలా జరుపుకుంటారు? (How Is Vinayaka Chavithi Celebrated)
- వినాయక స్థాపన ఎలా చేయాలి? (Rituals Performed In Vinayaka Chavithi)
- వినాయక చవితి పూజ చేసే విధానం (What Rituals To Be Done In Ganesh Sthapana At Home?)
- వినాయక ప్రతిమ లను ఎందుకు నిమజ్జనం చేస్తారు? (Why Is Ganesh Statues Immersed In Water At The End Of Festival?)
- వినాయక చవితి ఎక్కువగా జరుపుకునే ప్రాంతాలు (Places In India And World Where The Festival Is Mostly Celebrated)
- వినాయక చవితి ప్రత్యేక వంటకాలు (Vinayaka Chavithi Special Dishes Of Telugu States )
- వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా చెప్పండి.. (Vinayaka Chavithi Quotes And Wishes)
అలా ప్రమద గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవత వినాయకుడిని పూజించేందుకు ఈ రోజు ప్రత్యేకం. మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో కూడా వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తారు.
వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటారు? (Why Is Vinayaka Chavithi Celebrated?)
భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగో రోజు (చవితి) రోజు ఈ పండగను జరుపుకుంటారు. వినాయకుడి జన్మదినంగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు పుట్టిన రోజు ఇది. ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి.. ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఈ సంవత్సరం భాద్రపద చవితి సెప్టెంబర్ 2న వస్తోంది. సెప్టెంబర్ రెండో తేదీ ఉదయం 04.56 నుంచి మూడో తేదీ అర్ధరాత్రి 1.53 వరకూ చవితి ముహూర్తం ఉంది. పూజ కోసం రెండో తేదీ ఉదయం 11.05 నుంచి మధ్యాహ్నం 1.36 వరకూ సమయం ఉంది.
వినాయక చవితి కథ (Story Behind Vinayaka Chavithi In Telugu )
పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి ఆయన ఎల్లప్పుడూ తన కడుపులోనే ఉండిపోవాలన్న కోరికను కోరి కడుపులోనే మహాశివుడిని దాచుకుంటాడు. కొన్ని రోజులకు ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీ దేవి శ్రీమహావిష్టువు సహాయం కోరగా ఆయన బ్రహ్మ సాయంతో నందిని తీసుకొని గంగిరెద్దులను ఆడించేవారిగా వెళ్లి గంగిరెద్దును గజాసురుడి ముందు ఆడిస్తారు. దానికి తన్మయత్వం పొందిన గజాసురుడు ఏం కావాలో కోరుకోమని చెబుతాడు. దీంతో విష్ణుమూర్తి శివుడిని తిరిగి ఇచ్చేయమని కోరగా.. తన దగ్గరికి వచ్చింది సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువేనని అర్థం చేసుకున్న గజాసురుడు నందీశ్వరుడిని తన పొట్ట చీల్చమని శివుడిని బయటకు వచ్చేలా చేశాడు. ఆ తర్వాత తన తలను లోకమంతా ఆరాధించబడేలా చేయమని, తన చర్మాన్ని శివుడి వస్త్రంగా ధరించమని కోరుకొని మరణించాడు.
శివుడి రాక గురించి విన్న పార్వతీ దేవి చాలా సంతోషించి భర్త రాక సందర్బంగా అందంగా సిద్ధమయ్యేందుకు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఓ బాలుడి రూపాన్ని తయారుచేసి దానికి ప్రాణం పోసి ద్వారం వద్ద నిలబెట్టి ఎవరినీ రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్లింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరుడినే ఎదుర్కోగా ఆయన కోపంతో బిడ్డ శిరస్సును ఖండించి లోపలికి వెళ్లాడు. అప్పటికే స్నానం ముగించుకొని అలంకరించుకున్న పార్వతీ దేవి భర్తను చూసి సంతోషించి ఆయనతో మాట్లాడింది. కాసేపటికి బయట ఉన్న బాలుడి ప్రస్తావన రాగా శివుడికి అతడు తమ బిడ్డ అని పార్వతీ దేవి చెబుతుంది. శివుడు బాధతో గజాసురుడి తలను ఆ పిల్లవాడికి అతికించి అతడిని బతికించాడు. గజ ముఖం ఉండడం వల్ల వినాయకుడు గజాననుడిగా పేరు పొందాడు. అతడి వాహనం అనింద్యుడు అనే ఎలుక.
కొన్ని రోజుల తర్వాత దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్లి తమకు విఘ్నం రాకుండా ఉండేందుకు కొలవడానికి ఓ దేవుడిని ప్రసాదించమని కోరగా ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ముల్లోకాల్లోని పుణ్య నదులన్నింటిలో స్నానం చేసి తిరిగి మొదట వచ్చిన వారే ఈ పదవికి అర్హులు అని చెప్పగా వెంటనే కుమార స్వామి నెమలి వాహనం ఎక్కి వెళ్లిపోయాడు. గజాననుడు మాత్రం నా బలాబలాలు తెలిసి మీరీ షరతు విధించడం సబబేనా? అని అడగ్గా.. తండ్రి అతడికో తరుణోపాయం చెప్పాడు.
ఓ మంత్రాన్ని వివరించి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దాన్ని పఠించమని చెప్పగా మంత్ర పఠనం చేస్తూ వినాయకుడు అక్కడే ఉండిపోయాడు. ఈ మంత్ర ప్రభావం వల్ల కుమార స్వామికి తాను వెళ్లిన ప్రతి చోట తనకంటే ముందుగా వినాయకుడే స్నానం చేసి వెళ్తున్నట్లుగా కనిపించసాగింది. దాంతో తిరిగొచ్చి తండ్రీ అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం అప్పగించండి అని చెప్పాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు. ఆ రోజు దేవతలు, మునులు అందరూ వివిధ రకాల కుడుములు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకం, వడపప్పు వంటివన్నీ సమర్పించారు.
వాటిని తినగలిగినన్ని తిని మిగిలినవి తీసుకొని భుక్తాయాసంతో రాత్రి సమయానికి కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రుల కాళ్లకు నమస్కారం చేయడానికి ప్రయత్నిస్తే కడుపు నేలకు ఆనుతుందే కానీ చేతులు ఆనట్లేదు. ఇది చూసి చంద్రుడు నవ్వగా దిష్టి తగిలి పొట్ట పగిలి వినాయకుడు చనిపోతాడు. దీంతో పార్వతీ దేవి ఆగ్రహించి ఆ రోజు చంద్రుడిని చూసిన వాళ్లందరూ నీలాపనిందలకు గురవుతారని శాపమిస్తుంది. చంద్రుడిని చూసిన రుషి పత్నులు తమ భర్తల దగ్గర అపనిందలకు గురవుతారు.
రుషులు, దేవతలు ఈ విషయాన్ని శ్రీమహా విష్ణువుకి విన్నవించగా ఆయన అంతా తెలుసుకొని రుషులకు తమ భార్యల గురించి నిజం చెప్పి ఒప్పించడంతో పాటు వినాయకుడి పొట్టను పాముతో కుట్టించి ఆయనకు అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత దేవతలందరి విన్నపం మేరకు పార్వతి తన శాపవిమోచనాన్ని ప్రకటిస్తుంది. ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆరోజు మాత్రం అతడిని చూడకూడదు అని చెబుతుంది. దీంతో దేవతలంతా సంతోషిస్తారు. ఆ రోజే భాద్రపద శుద్ధ చవితి. ఆ రోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం.
వినాయక చవితి ఎలా జరుపుకుంటారు? (How Is Vinayaka Chavithi Celebrated)
వినాయక చవితి ( రోజు గణనాథుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకొచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి, పూలు, పండ్లు, నైవేద్యాలు పెట్టి పూజిస్తారు. అలా తొమ్మిది రాత్రుల పాటు ఇంట్లో ఉంచి పదో రోజు ఉదయాన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం వరకూ ప్రతి రోజు వినాయకుడికి మూడు సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు. కేవలం ఇళ్లలోనే కాదు.. కాలనీలో అందరూ కలిసి, దేవాలయాల దగ్గర, వివిధ ప్రముఖ ప్రదేశాల్లో ఇలా వినాయక మండపాలను వివిధ చోట్ల ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు.
వినాయక స్థాపన ఎలా చేయాలి? (Rituals Performed In Vinayaka Chavithi)
వినాయక చవితి (Vinayaka chavithi) సందర్భంగా విగ్రహం తీసుకోవాలనుకునేవారు తొండం ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే తెలుపు, కుంకుమ రంగుల్లో ఉన్న విగ్రహాలను తీసుకోవాలి. లేదంటే మట్టి రంగులో ఉన్నా సరే.. పూజించే విగ్రహం మాత్రం మట్టితో చేసినదై ఉండాలి. రసాయనాలు ఉపయోగించిందై ఉండకూడదు. వినాయక చవితి పూజ కోసం ఏక వింశతి పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఇందులో తులసి, జిల్లేడు, రేగు, మరువం, రావి, దానిమ్మ, ఉత్తరేణి, బిల్వ, మారేడు, గరిక, జమ్మి, మాచీ పత్రి, ఉమ్మెత్త, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంత, దేవదారు, వావిలి, జాజి, గండలీ, మద్ది ఆకులతో పాటు బంతి, పారిజాతంతో పాటు మీకు వీలున్న పూలు, వెలక్కాయతో పాటు వీలున్న పండ్లు, నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి.
ఆ రోజు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసి మామిడి తోరణాలు, పూలు కట్టి వాకిళ్లు అలంకరించాలి. ఒక పీటకు పసుపు రాసి దానిపై బియ్యం వేసి కుంకుమ బొట్టు పెట్టి దానిపై వినాయకుడి తలపై వచ్చేలా పాలవెల్లిని ఏర్పాటు చేయాలి. దీని కోసం వెదురు ముక్కలతో పందిరిలా కట్టి దానికి పండ్లు, వెలగ కాయ, మొక్కజొన్న కండెలు, పూలు కట్టి అందంగా అలంకరించాలి. దానికి పసుపు, కుంకుమ పెట్టి పీట పై ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత వినాయకుడి నైవేద్యం కోసం గారెలు, పాయసం, ఉండ్రాళ్లు, కుడుములు అక్కడ పెట్టుకోవాలి.
ఆ తర్వాత రాగి లేదా వెండి చెంబుకి పసుపు రాసి కొబ్బరికాయ ఉంచి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆపై పసుపు ముద్దతో గణపతిని తయారుచేసుకొని పక్కన పళ్లెం పెట్టుకోవాలి. ఆ తర్వాత పూజ ప్రారంభించి వినాయక ప్రార్థన చేసి సంకల్పం తీసుకొని కలశ పూజ చేయాలి. కలశ పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని పూజించి ప్రాణ ప్రతిష్ట చేసి పీటపై ఉంచాలి. ఆ తర్వాత అధాంగ పూజ, అష్టోత్తరం, కథ పూర్తి చేసి నైవేద్యాన్ని స్వామికి నివేదించాలి.
వినాయక చవితి పూజ చేసే విధానం (What Rituals To Be Done In Ganesh Sthapana At Home?)
పూజకి ముందే పసుపు, కుంకుమ, అగరొత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూల దండలు, అరటి పండ్లు, కొబ్బరి కాయలు, బెల్లం, పంచామ్రుతం, తోరం, దీపారాధాన కుందులు, నెయ్యి, వత్తులు, 21 రకాల ఆకులు (పత్రి), నైవేద్యం సిద్ధం చేసుకోవాలి. దీపారాధన కోసం తీసుకున్న జిల్లేడు వత్తులను కుందుల్లో ఉంచి నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ తర్వాత కలశం, పసుపు వినాయకుడిని సిద్ధం చేసుకొని ఆ తర్వాత వినాయక ప్రార్థనతో పూజ ప్రారంభించాలి. ఆపై సంకల్పం తీసుకొని కలశ పూజ చేయాలి.
ఆ తర్వాత పసుపుతో చేసిన గణపతికి మహా గణాధిపతి పూజ చేయాలి. ఆపై విగ్రహ స్థాపన చేసి పంచామ్రుతాలతో అభిషేకం చేసి అథాంగ పూజ ప్రారంభించాలి. తర్వాత మనం తీసుకున్న 21 పత్రాలతో ఏక వింశతి పూజ, అష్టోత్తర నామావళి చెప్పి వినాయక వ్రత కథ చదవాలి. ఆఖరులో వినాయక దండకం చదివి.. నైవేద్యం అర్పించాలి. దీంతో పూజ పూర్తవుతుంది. ఆఖరులో పూజకు ఉపయోగించిన అక్షతలను తలపై వేసుకోవాలి. వీటన్నింటికీ సంబంధించిన మంత్రాలతో ఉన్న పుస్తకాలు మార్కెట్లో చాలా లభిస్తున్నాయి.
లేదంటే ఇంటర్నెట్లోనూ వినాయక వ్రత కల్పం డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇలా మొదటి రోజు అంటే వినాయక చవితి రోజు పూర్తి పూజ చేసి ఆ తర్వాత రోజూ వినాయక దండకం చదివి అర్చన చేసి హారతి ఇచ్చి నైవేద్యం అర్పిస్తే సరిపోతుంది.
వినాయక ప్రతిమ లను ఎందుకు నిమజ్జనం చేస్తారు? (Why Is Ganesh Statues Immersed In Water At The End Of Festival?)
వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ప్రాక్రుతిక కారణం చూస్తే వినాయక చవితి వర్షాకాలం ప్రారంభంలో వస్తుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి దాంతో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువులో కలుపుతారు. విగ్రహాలకు మట్టి తీయడం వల్ల చెరువుల్లో లోతు పెరుగుతుంది. ఆ తర్వాత ఆయుర్వేద గుణాలున్న పత్రితో కలిపి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీళ్లు పారే వీలుంటుంది. అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి కాబట్టి వాటిని తాగడం వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
పౌరాణిక కారణాలను చూస్తే.. వినాయకుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి కేవలం పది రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్లిపోతాడు. భక్తులు నిత్యం పూజలందిస్తూ ఉంటే కైలాసానికి దూరంగా ఉంటాడని పదిరోజుల పాటు పూజలందుకొని తిరిగి రమ్మని చెప్పి వినాయకుడిని పార్వతీ దేవి పంపినట్లుగా చాలామంది చెబుతుంటారు. అందులో ఎంత నిజం ఉందనేది మాత్రం ఎవరికీ తెలియని విషయమే.. దీనికి మరో కారణం కూడా చెబుతారు.
ఏ దేవతా విగ్రహం అయినా మట్టితో చేస్తే అది కేవలం నవ రాత్రులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని ఆ తర్వాత అందులో దైవత్వం పోతుందని అందుకే నిమజ్జనం చేయాలని కూడా కొందరు చెబుతుంటారు. వినాయక నిమజ్జనంతో పాటు దుర్గామాత విగ్రహాలను కూడా నవరాత్రులు పూర్తయ్యాక నిమజ్జనం చేయడం గురించి మనకు తెలిసిందే.
వినాయక చవితి ఎక్కువగా జరుపుకునే ప్రాంతాలు (Places In India And World Where The Festival Is Mostly Celebrated)
మన హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. ఉత్సవాలన్నీ ఒకెత్తయితే.. ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం మాత్రం ఒకెత్తు. దేశంలోనే ఎత్తైన వినాయకుడి విగ్రహం ఇదేనట. కేవలం ఇదొక్కదానికే కాదు.. బరువైన లడ్డూ, పొడవైన విగ్రహం.. ఇలా చాలా కేటగిరిల్లో ఈ విగ్రహం రికార్డు సాధించింది. దీని తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లోనే కాణిపాకం స్వయంభు వినాయకుడి దేవాలయంలో వినాయక చవితి సందర్బంగా నవరాత్రుల పాటు పూజలు జరుగుతాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని వివిధ చోట్ల కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయి. అవెక్కడంటే..
మైసూర్ (Mysore)
మైసూర్‌కి చెందిర వడయార్ రాజవంశం అన్ని రకాల పండగలను ఘనంగా నిర్వహిస్తుంది. లోకల్ మార్కెట్లన్నీ వినాయక విగ్రహాలతో నిండిపోతాయి. మైసూర్లో వినాయక విగ్రహాలకు అరటి పండ్లను నైవేద్యంగా అర్పిస్తారు. అంతేకాదు.. వినాయక చవితి ముందు రోజు ఇక్కడ ప్రత్యేకంగా గౌరీ మాతను కొలుస్తారు.
దిల్లీ (Delhi)
ఒకప్పుడు మరాఠా రాజ్యం రాజధానిగా ఉన్న దిల్లీ కూడా గణేశ్ చతుర్థి వేడుకలకు పెట్టింది పేరు. ముఖ్యంగా సౌత్ దిల్లీలో వేడుకలు చూసేందుకు రెండు కళ్లూ సరిపోయేవి కావట. అద్భుతమైన పండళ్లతో పాటు ఆకట్టుకునే వేడుకలు జరుగుతాయి. ఇక్కడున్న లక్షలాది మరాఠీ కుటుంబాలు ప్రత్యేకంగా ఈ పండగను జరుపుకుంటుంటారట. సరోజినీ నగర్‌లోని దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.
ముంబయి (Mumbai)
గణేశ్ చతుర్థి అనగానే ముందుగా గుర్తొచ్చేది ముంబయి. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఘనంగా జరుగుతుంది. మంత్రోచ్ఛారణలు, డోలు వాయిద్యాలతో పాటు గణపతి బప్పా మోరియా అనే మాటతో వీధులన్నీ నిండిపోతాయి. దహీ హండీ (ఉట్లు కొట్టడం) అన్ని చోట్లా అద్భుతంగా జరుగుతుంది. మంచి మంచి పండళ్లు అందరినీ ఆకర్షిస్తాయి.
ముఖ్యంగా లాల్ బాగ్ చా రాజా విగ్రహానికి ప్రపంచమంతటి నుంచి భక్తులు వస్తుంటారు. ఇక జీఎస్ బీ సేవ మండల్ ప్రపంచంలోనే ఖరీదైన పండాల్. అక్కడ దేవుడి విగ్రహానికి 68 కేజీల బంగారం, 315 కేజీల వెండితో ఆభరణాలను అలంకరించారు. ఈ మండపానికి ఇన్సూరెన్స్ కవర్ కూడా ఉంది. 300 కోట్లకుగాను దీన్ని ఇన్స్యూర్ చేశారు.
ఇవే కాకుండా నేపాల్, సింగపూర్, థాయిలాండ్, బర్మా, కాంబోడియా, మారిషస్, అమెరికా, కెనడా, ఫిజి దేశాల్లో కూడా ఈ పండగను జరుపుకుంటారు.
వినాయక చవితి ప్రత్యేక వంటకాలు (Vinayaka Chavithi Special Dishes Of Telugu States )
మోదకాలు (మోదక్)
కావాల్సినవి
గోధుమ పిండి : 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము : 1 కప్పు
బెల్లం తురుము : 1 కప్పు
సోంపు : స్పూన్
నూనె : వేయించడానికి సరిపడా
తయారీ
ముందుగా గోధుమ పిండిని నీళ్లు పోసి తడిపి పెట్టుకోవాలి. కొబ్బరి, బెల్లం కూడా విడివిడిగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, బెల్లం తురుము, సోంపు.. అన్నీ కలుపుకొని పెట్టుకోవాలి. గోధుమ పిండిని చిన్న పూరీల్లా చేసుకొని అందులో కొబ్బరి మిశ్రమం పెట్టి మోదక్‌లా దగ్గరకు చేసుకోవాలి. వీటిని నూనెలో వేయించుకోవాలి. లేదా ఆవిరిపై ఉడికించుకోవచ్చు.
ఉండ్రాళ్లు (Undrallu)
కావాల్సినవి
బియ్యం రవ్వ : కప్పు
శెనగ పప్పు : అర కప్పు
జీలకర్ర : కొద్దిగా
నీళ్లు : ఒకటిన్నర కప్పు
తయారీ
ముందుగా మందపాటి గిన్నెలో కాస్త నూనె వేసి అందులో జీలకర్ర వేసి వేయించి.. నీళ్లు, ఉప్పు, వేసి మరిగిన తర్వాత శెనగ పప్పు, బియ్యం రవ్వ వేసి కలపాలి. తక్కువ మంటపై ఉడికించి దించే ముందు నెయ్యి వేసి కలపాలి. ఉడికిన తర్వాత దింపి గుండ్రంగా ఉండల్లా కట్టాలి. అవే ఉండ్రాళ్లు..
జిల్లేడు కాయలు (Grilled Nuts)
కావాల్సినవి
బియ్యం రవ్వ : రెండు కప్పులు
బెల్లం తురుము : కప్పు
పచ్చికొబ్బరి తురుము : రెండు కప్పులు
గసగసాలు : కొన్ని
డ్రైఫ్రూట్స్ : కొన్ని
నెయ్యి : కొద్దిగా
యాలకుల పొడి : చిటికెడు
తయారీ
ముందుగా నాలుగు గ్లాసుల నీళ్లలో చిటికెడు ఉప్పు వేసి ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి మరిగించి అందులో రవ్వ వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. రవ్వ మెత్తగా ఉడికాక చల్లార్చాలి. మరో గిన్నెలో కొబ్బరి, బెల్లం కలిపి కొద్దిగా నీళ్లు జల్లి ఉడికించాలి. ఇందులో వేయించిన డ్రైఫ్రూట్స్, గసగసాలు వేసి కలపాలి. ఆ తర్వాత దీన్ని చల్లార్చి చిన్న ఉండలు చేసుకోవాలి. ఆపై బియ్యపు రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని పూరీలా చేసి మధ్యలో కొబ్బరి, బెల్లం ముద్ద పెట్టి అన్ని వైపులా మూసేయాలి. దీన్ని గుండ్రంగా లేదా పొడవుగా చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరిపై ఉడికించాలి.
పాల తాలికలు (Pala Talikal)
కావాల్సినవి
పాలు : లీటర్
నీళ్లు : లీటర్
సగ్గు బియ్యం : వంద గ్రాములు
బియ్యం పిండి : వంద గ్రాములు
మైదా పిండి : రెండు టీస్పూన్లు
చక్కెర : 200 గ్రాములు
బెల్లం : పావు కేజీ
యాలకుల పొడి : చిటికెడు
నెయ్యి : కొద్దిగా
తయారీ
పాలల్లో నీటిని కలిపి బాగా మరిగించాలి. పొంగు వచ్చాక స్టవ్ మంట తగ్గించి అందులో సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. ఈలోపు బియ్యం పిండి, మైదా పిండి, స్పూన్ పంచదార వేసి పిండి కలుపుకోవాలి. ఈ పిండిని అరచేతిలోకి తీసుకొని రెండు అర చేతుల సాయంతో సన్నగా నూడిల్స్‌లా లేదా వత్తుల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని తాలికలు అంటారు. వీటిని మరుగుతున్న పాలల్లో వేసి ఒకదానికి మరొకటి అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ఇవి కాస్త ఉడకగానే బెల్లం, చక్కెర వేసి బాగా కలపాలి. ఇది కరిగిన తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలిపి దింపుకోవాలి. పాల తాలికలు సిద్ధం.
వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా చెప్పండి.. (Vinayaka Chavithi Quotes And Wishes)
వినాయక చవితి (Vinayaka chavithi) సందర్భంగా ఆ విఘ్ననాయకుడిని పూజించడం మాత్రమే కాదు.. స్నేహితులు, సన్నిహితులు, బంధువులకు కూడా పండగ శుభాకాంక్షలు చెప్పుకొని అందరితో కలిసి పండగ జరుపుకున్నంత ఆనందాన్ని మూటగట్టుకోవడం ఇప్పుడు సాధారణం అయింది. మరి, మీ ఆత్మీయులకు పండగ శుభాకాంక్షలు ఎలా చెప్పాలంటే..
కృష్ణాష్టమి సందేశాలు (Janmashtami Quotes In Telugu)
1. మీరు ఏ పని ప్రారంభించినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహా గణపతిని మనస్పూర్తిగా వేడుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
2. ఆ గణనాథుడు అన్నివేళలా మిమ్మల్ని చల్లగా చూడాలని.. ఆయన ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలని ఆశిస్తూ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
3. ఓం గణానాంత్వా గణపతి గం హవామహే, ప్రియాణాంత్వా ప్రియపతి గం హవామహే, నిధీనాంత్వా నిధిపతి గం హవామహేవసే మమ, ఆ హమజాతి గర్భధమా త్వాం జాసి గర్భధం, ఓం గం గణపతయే నమః.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
4. ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య, ఆయు, ఆరోగ్యాలు అందించాలని సుఖసంతోషాలు మీ ఇంట్లో కొలువుండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
5. ఆ గణపయ్య మిమ్మల్ని ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ వినాయక చతుర్థి శుభాకాంక్షలు.
6. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
7. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో మీ జీవితం సుఖశాంతులతో ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
8. ఆ బొజ్జ గణపయ్య మీ మనసులోని భయాలను, బాధలను తొలగించి మీ జీవితాన్ని ప్రేమ, ఆనందంతో నింపాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు
9. మీ జీవితంలో సంతోషం వినాయకుడి బొజ్జంత, ఆయుష్షు ఆయన తొండమంత.. సమస్యలు ఆయన ఎలుకంత ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు
10. గణేశుడు మీ ఇంటికి వచ్చి మీరు పెట్టిన లడ్డూలు, కుడుములతో పాటు మీ కష్టాలు, ఇబ్బందులను కూడా తీసుకువెళ్లాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
11. ఈ వినాయక చవితికి విఘ్ననాయకుడు మీ జీవితాన్ని ఆయన చేతిలో ఉన్న లడ్డూ అంత తియ్యగా మార్చాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
12. ఆ గణపయ్య మీ కన్నీళ్లను నవ్వులుగా, మీ ఇబ్బందులను ఆనందంగా.. కారుమబ్బులను ఇంద్రధనస్సులా మార్చాలని కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి.
13. ఆ బొజ్జ గణపయ్య మీ ప్రార్థనలన్నింటినీ విని మీరు అడిగింది మీకు అందించాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
14. ఓం గంగణపతయే నమో నమ: శ్రీ సిద్ధివినాయక నమోనమ: అష్టవినాయక నమో నమ: గణపతి బప్పా మోరియా. గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు..
15. ఆ విఘ్ననాయకుడు మీ జీవితంలోని విఘ్నాలన్నింటినీ తొలగించి మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. వినాయక చవితి శుభాకాంక్షలు .
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.
ఇవి కూడా చదవండి.