చాక్లెట్ (chocolate) అంటే ఇష్టపడని వారు ఈ భూమ్మీద ఎవరైనా ఉంటారా? ఒక చిన్న చాక్లెట్ ముక్క నోట్లో కరిగిపోతే చాలు.. మూడ్ ఎంత బాగాలేకపోయినా.. అంతా ఇట్టే సెట్ అయిపోతుంది. అంతేనా.. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు(Health benefits) కూడా ఉన్నాయి. జ్ఞాపకశక్తిని పెంచడం, కంటిచూపును మెరుగ్గా చేయడం, రక్తపోటును తగ్గించడం వంటివి చేయడమే కాదు.. ఇది అందాన్ని పెంపొందించేందుకు ఎంతో సాయపడుతుంది. చాక్లెట్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
ఇవి చర్మకణాల రిపేర్‌లో తోడ్పడి చర్మం అందంగా, మృదువుగా మారేలా చేస్తాయి. రోజూ చాక్లెట్ తినడం వల్ల మీ ఆరోగ్యానికి, అందానికి ఎంతో ప్రయోజనం(Beauty benefits) ఉంటుందని చెబితే మీరు నమ్ముతారా? చాలామంది ఈ మాట వింటే నవ్వుకుంటారు. కానీ ఇది నిజంగా నిజం. అయితే పూర్తిగా చాక్లెట్ బార్ మొత్తం లాగించేస్తే కాదనుకోండి. రోజుకో చిన్న ముక్క తినడం మంచిదన్నమాట. ఎందుకంటే చాక్లెట్, కొకోవా, కొకోవా బటర్‌లలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. ఇవి మీ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడతాయి. మరి, దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం రండి..
ఈ కథనంలోని ముఖ్యాంశాలు
ఆరోగ్యం కోసం ఎలాంటి చాక్లెట్ మంచిది?
సరైన చాక్లెట్‌ని ఎంచుకోవడం
చాక్లెట్ వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలు
చాక్లెట్‌తో మీ చర్మానికి కలిగే ప్రయోజనాలు
జుట్టుకు అందే ప్రయోజనాలు
చాక్లెట్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
ఇంట్లో ఆరోగ్యం, అందం కోసం చాక్లెట్‌ని ఎలా వాడాలి?
ఆరోగ్యం కోసం ఎలాంటి చాక్లెట్ మంచిది?
చాక్లెట్ ద్వారా కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. అన్ని రకాల చాక్లెట్లు మన ఆరోగ్యానికి మంచివి కావు. ప్రస్తుతం ఎక్కువగా లభించే చాక్లెట్లలో ఎక్కువ శాతం పాలు, పంచదార మాత్రమే ఉంటున్నాయి. దీని వల్ల ఆ చాక్లెట్లు మనలో కొవ్వును పెంచేందుకు తప్ప ఇంకెందుకూ ఉపయోగపడవు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆరోగ్య ప్రయోజనాలన్నింటినీ కేవలం డార్క్ చాక్లెట్ మాత్రమే కలిగి ఉంటుంది.
అందుకే కనీసం 70 శాతం మేరకు డార్క్ చాక్లెట్ ఉన్న బార్స్‌ని తీసుకోండి. చాక్లెట్ శాతం ఎంత ఎక్కువగా ఉంటే అది అంత ఆరోగ్యకరమన్నమాట. మామూలు చాక్లెట్‌లా దీన్ని తినడం అంత సులువేం కాదు. ఇది కాస్త చేదుగా కూడా ఉంటుంది. కానీ ఆరోగ్యం కోసం ఆ మాత్రం చేదు తినడం తప్పు కాదు.
చాక్లెట్లు కొనేముందు లేబుల్ చదివి కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల చాక్లెట్లు ఒకేలా ఉండవు. మీరు తీసుకునే చాక్లెట్‌లో కనీసం 70 శాతం కొకోవా ఉండాల్సిందే. అంటే ఎంతో ఆరోగ్యవంతమైనవని చెప్పుకునే చాలా రకం చాక్లెట్లు కూడా అంత ఆరోగ్యకరం కావన్నమాట. మీరు తీసుకునే చాక్లెట్‌లో మొదటి రెండు పదార్థాల్లో కొకొవా ఉండాల్సిందే. అది లేకుండా పాలు లేదా చక్కెర ఉంటే దాన్ని తీసుకోకపోవడం మంచిది. కొకొవా ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉన్న చాక్లెట్ డార్క్‌గా ఉంటుంది. కొకొవా పెరుగుతుంటే చేదు కూడా పెరుగుతుంది. చేదుగా లేకుండా ఫ్లేవనాయిడ్స్ తీసేసిన చాక్లెట్లు కూడా చాలా ఉంటాయి. వాటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.
అందానికి ఎలాంటి ప్రయోజనాలుంటాయంటే..
చాక్లెట్ వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. అంతే కాదు.. ఇది మన చర్మం, జుట్టు, శరీరానికి కూడా ఎంతో ప్రయోజనకారి. చాక్లెట్ రక్త ప్రసరణను పెంచుతుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చాక్లెట్ మన చర్మానికి అవసరమైన ఎన్నో విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటుంది. క్యాల్షియం, ఐరన్‌తో పాటు విటమిన్ ఎ, బి1, సి, డి, ఇ విటమిన్లు కూడా ఇందులో ఉంటాయి.
ప్రతి కొకొవా బీన్‌లోనూ ఎన్నో ట్యానిన్లు, ఫ్లేవనాయిడ్స్, పాలీఫీనాల్స్ వంటివి నిండి ఉంటాయి. ఇందులో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కాపర్, జింక్, ఐరన్ వంటివన్నీ ఇందులో ఉంటాయి. అందుకే దీన్ని రోజూ చిన్న ముక్క తినడం వల్ల జుట్టు వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇవి చర్మాన్ని కూడా మరింత మృదువుగా మారుస్తాయి. ఇవే కాదు.. మూడ్ బాగాలేనప్పుడు చాక్లెట్ ముక్క తినడం వల్ల మూడ్ మెరుగు అవుతుందని ఎన్నో పరిశోధనలు తేల్చి చెప్పాయి. చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లతో పాటు కాస్త చక్కెర కూడా ఉంటుంది. ఇవన్నీ మెదడుపై పనిచేసి మన మూడ్‌ని మారుస్తాయి.
చాక్లెట్ వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలు
చాక్లెట్ వల్ల మన చర్మానికి ఎన్నో ప్రయోజనాలుంటాయి. ఈ ప్రయోజనాలు వింటే నిజమేనా.. అని ఆశ్చర్యం కలగకమానదు. ఇవన్నీ తెలుసుకుంటే రోజూ చాక్లెట్ తినాలనే నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి. అవేంటంటే..
చర్మాన్ని మెరిపిస్తుంది..
చాక్లెట్ మూడ్‌ని మెరుగుపరుస్తుంది. సహజంగా మూడ్‌ని బాగుచేయడంతో పాటు హార్మోన్లను బ్యాలన్స్ చేస్తుంది. డోపమైన్ హార్మోన్ విడుదలను మెరుగుపర్చి మన చర్మం మరింత అందంగా నిగనిగలాడేలా చేస్తుంది.
నేచురల్ సన్‌స్క్రీన్
కేవలం చాక్లెట్ తింటే చాలు.. ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చని మీరెప్పుడైనా వూహించారా? అవును.. చాక్లెట్ మీ చర్మాన్ని ఎండ బారి నుంచి.. ఎండ వల్ల కలిగే డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. అయితే రోజూ చిన్న ముక్క చాక్లెట్ తినడం వల్ల ఎండ బారి నుంచి రక్షించుకోవచ్చని సన్‌స్క్రీన్ రాసుకోవడం మర్చిపోకండి.
డీటాక్సిఫికేషన్ కోసం..
చాక్లెట్‌లో సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇది మన చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మార్చడంతో పాటు శరీరాన్ని డీటాక్సిఫై కూడా చేస్తుంది. ఫ్రీరాడికల్స్‌ని తొలగిస్తుంది.
చాక్లెట్‌లో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి మన చర్మంలో తేమను పెంచుతాయి. అందుకే చాక్లెట్‌ని తినడంతో పాటు.. ఫేస్‌ప్యాక్‌లో భాగంగా అప్లై చేసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందే వీలుంటుంది. దీన్ని ఉపయోగించడం గురించి కింద తెలుసుకుందాం.
ముడతలను తగ్గిస్తుంది..
డార్క్ చాక్లెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ మన చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో తోడ్పడతాయి. చర్మాన్ని సూర్యకాంతి నుంచి కాపాడడం మాత్రమే కాదు.. రక్త ప్రసరణను మెరుగు పరిచి చర్మాన్ని మెరిసేలా కూడా చేస్తుంది. అంతేకాదు, వార్ధక్య ఛాయలను దూరం చేసి మీరెప్పుడూ నవయవ్వనంతో మెరిసిపోయేలా చేస్తుంది.
జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలుంటాయి?
చాక్లెట్ జుట్టుకు కూడా ప్రయోజనాలు అందిస్తుంది. చాక్లెట్ తినడంతో పాటు సహజ కొకొవా ఎక్స్‌ట్రాక్ట్స్ ఉన్న షాంపూ ఉపయోగించడం వల్ల జుట్టు పట్టులా మెరిసిపోతుంది. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయంటే..
జుట్టు రాలడం తగ్గుతుంది.
జుట్టు పొడిబారి రాలిపోవడాన్ని, వూడిపోవడాన్ని తగ్గిస్తుంది చాక్లెట్. ఇది మీ జుట్టు రాలడాన్ని, తెగిపోవడాన్ని తగ్గించడం మాత్రమే కాదు.. వేగంగా పెరిగేలా కూడా చేస్తుంది. మీ జుట్టులో తేమను పెంచుతుంది.
మాడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కేవలం జుట్టే కాదు.. మాడు ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఎంతో ఉపయోగపడుతుందీ చాక్లెట్. రోజూ చిన్న ముక్క తింటే చాలు.. మాడుపై దురద, ఫ్లేక్స్, ఇన్పెక్షన్లు వంటివి రాకుండా కాపాడుకోవచ్చు.
జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
మీ జుట్టు సన్నగా, పొడిగా కనిపిస్తోందా? అయితే చాక్లెట్‌ని తినండి.. దాన్ని మీ జుట్టుకి కూడా ఉపయోగించండి. దీన్ని ఉపయోగించడం వల్ల మీ జుట్టు ఒత్తుగా, మృదువుగా, సిల్కీగా తయారవుతుంది.
తలకు కొకోవా ఉన్న చాక్లెట్ ఫ్లేవర్ షాంపూని ఉపయోగిస్తూ ఆ వాసనకు చక్కటి చాక్లెట్ తినాలనిపిస్తే మమ్మల్ని అనకండి మరి..
ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందంటే..
చాక్లెట్ వల్ల ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలున్నాయి. అందులో కొన్నింటిని తెలుసుకుందాం..
డీటాక్సిఫికేషన్ కోసం..
యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్.. ఇలా చాక్లెట్‌లో చాలా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఫ్రీరాడికల్స్ పెరిగిపోకుండా ఆపుతాయి. లోపలి నుంచి శరీరాన్ని డీటాక్సిఫై చేస్తాయి. ఇందులో అందుబాటులో ఉండే విటమిన్లు, మినరల్స్ మన శరీరానికి ఎంతో అవసరం.
మూడ్‌ని మెరుగుపరుస్తుంది.
బాధలో ఉన్నప్పుడు చాక్లెట్ తినడం వల్ల మూడ్ మారుతుందని పెద్దలు చెబుతుంటారు. ఇది తప్పేమీ కాదు. ఎందుకంటే ఇందులోని హార్మోన్ రెగ్యులేటరీ గుణాలు ఎండార్ఫిన్లను ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తాయి. ఈ ఎండార్పిన్లు మన మూడ్ మార్చే ఫీల్ గుడ్ హార్మోన్లు అన్నమాట. అందుకే ఈసారి మీ మూడ్ బాగాలేనప్పుడు మంచి క్వాలిటీ డార్క్ చాక్లెట్‌ని కొద్దిగా తీసుకోండి.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
డార్క్ చాక్లెట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణాలు ఇందులో ఉండడం వల్ల మన గుండె ఆరోగ్యం బాగుంటుంది. దీంతో పాటు ఇది చక్కెర స్థాయులను కూడా సమతౌల్యం చేస్తుంది. దీని గ్లైసిమిక్ విలువ తక్కువ కావడం వల్ల.. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలు కూడా మన శరీరరంలో చేరవు. ఇన్ని ప్రయోజనాలున్నాయి ఈ చాక్లెట్ వల్ల.
చాక్లెట్ వల్ల కలిగే ప్రయోజనాలు చూసేశాం కదా. ఇప్పుడు దాని నుంచి అత్యధిక మొత్తంలో ప్రయోజనాలు పొందే మార్గాల గురించి తెలుసుకుందాం.
మృదువైన చర్మం కోసం..
కొకొవా పౌడర్ లేదా చాక్లెట్‌ని మీ చర్మానికి రుద్దడం వల్ల అది మీ చర్మాన్ని లోపలి నుంచి మాయిశ్చరైజ్ చేస్తుంది. మృదువుగా మారుస్తుంది. అందుకే దీన్ని చాలా రకాలైన బాడీ లోషన్లు, బాడీస్క్రబ్‌లలో వాడుతూ ఉంటారు. మనమూ ఇంట్లోనే దీన్ని ఉపయోగించి బాడీస్క్రబ్‌ని తయారుచేసుకోవచ్చు. దీని కోసం ఆలివ్ ఆయిల్, బ్రౌన్ షుగర్, కొకోవా పౌడర్, వెనిలా ఎక్స్ ట్రాక్ట్, టేబుల్ స్పూన్ నీళ్లు ఒక బౌల్‌లో తీసుకొని కలుపుకోవాలి. దీన్ని మీ వేళ్లతో ముఖానికి, శరీరం మొత్తానికి అప్లై చేసుకోవాలి. స్క్రబ్ మీ చర్మంలోకి ఇంకేలా కాసేపు మసాజ్ చేసి.. ఆపై కాసేపు అలా ఉంచుకోవాలి. ఆ తర్వాత చన్నీళ్లతో కడుక్కోవాలి. దీన్ని ఉపయోగించడం వల్ల వెంటనే ఫలితం పొందే వీలుంటుంది.
తెల్లని పళ్ల కోసం..
కొకొవా బీన్స్‌లో పాలీఫినాల్స్, ట్యానిన్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇందులో చాలా రకాల యాంటీ యాక్సిడెంట్లుంటాయని మనకు తెలిసిందే. ఇవి మన దంతాలు, చిగుళ్లకు ఎంతో ఉపయోగపడతాయి. నోట్లో చిగుళ్లు, పళ్లకు బ్యాక్టీరియా అంటుకోకుండా చూస్తూ.. వాటిని కాపాడడంతో పాటు నోటి నుంచి దుర్వాసన కూడా రాకుండా కాపాడుతుంది. అంతేకాదు.. ఎనామిల్ పొరను దృఢంగా మార్చి పళ్లను క్యావిటీల బారి నుంచి కాపాడుతుంది. అందుకే మీకు అందంగా మెరిసే పళ్లు కావాలంటే డార్క్ చాక్లెట్‌ని ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పళ్లను స్క్రబ్ కూడా చేసుకోవచ్చు.
పొడవైన జుట్టు కోసం..
పొడవైన, ఒత్తైన జుట్టు కోసం చాక్లెట్ ఎంతో తోడ్పడుతుందని తెలిసిందే. ఇందులో జుట్టు పెరుగుదలలో తోడ్పడే కాపర్, జింక్, ఐరన్.. ఎ, బి, సి, డి విటమిన్లు ఉంటాయి. మరి, జుట్టు ఒత్తుగా మారేందుకు దీన్ని ఎలా ఉపయోగించాలంటే.. ముందుగా పెరుగు, కొకొవా పౌడర్, తేనె తీసుకొని టేబుల్ స్పూన్ చొప్పున వీటిని ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.
నేచురల్ సన్‌స్క్రీన్ తయారీ కోసం..
చాక్లెట్‌ని రోజూ తినడం వల్ల మీరు సూర్యకిరణాల కారణంగా చర్మానికి హాని కలగకుండా సంరక్షించుకోవచ్చు. ఇది నేచురల్ సన్‌స్క్రీన్‌గా పనిచేస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ సన్ స్క్రీన్‌గా పనిచేస్తాయి. మీరు ఎప్పుడైనా తీపి తినాలనుకుంటే ఈ కారణం చెప్పి డార్క్ చాక్లెట్ తినేయండి. దీని కోసం ఉదయాన్నే పాలు లేదా కాఫీలో కలుపుకొని దీన్ని తాగాలి. ఇలా తాగుతున్నాం కదా అని సన్‌స్క్రీన్ లోషన్ మర్చిపోవద్దు.
చర్మం మెరిసేందుకు..
చాక్లెట్‌ని తరచూ ఉపయోగించడం, తినడం వల్ల చర్మఛాయ కూడా పెరిగి మీరు మెరిసిపోతూ కనిపిస్తారు. ఇది మీ ఒత్తిడిని తగ్గించడం వల్ల.. ఒత్తిడి కారణంగా వచ్చే చర్మ సమస్యల నుంచి కూడా తప్పించుకోవచ్చు. ముడతలు తగ్గించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని కోసం చక్కటి చాక్లెట్ ఫేస్‌ప్యాక్ తయారుచేసుకోండి. అంతే కానీ మిగిలితే తినేద్దాం అనుకోకండే..!
ముందుగా ఒక బౌల్‌లో ముప్పావు కప్పు నీళ్లు పోసి అందులో టేబుల్ స్పూన్ చాక్లెట్ సిరప్, టీ స్పూన్ తేనె, ఒక పెద్ద కప్పు ఓట్‌మీల్ వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని నోరూరించే ఈ మిక్స్‌ని ముఖానికి అప్లై చేసుకోండి. దీన్ని ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని ఆ తర్వాత చన్నీళ్లతో ముఖం కడుక్కోవాలి. అప్పుడు చర్మం మెరవడమే కాదు.. మృదువుగా కూడా తయారవుతుంది.
ముడతలు తగ్గించేందుకు..
మీరు నేరుగా తిన్నా.. లేక ముఖానికి అప్లై చేసుకున్నా.. చాక్లెట్ ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గిస్తుందని తెలుసుకోవాలి. దీని వల్ల కొల్లాజెన్ బంధాలు బలంగా తయారవుతాయి. అలా అవి బలంగా తయారవడం వల్ల చర్మంపై ముడతలు, సన్నని గీతలు రాకుండా ఉంటాయి. దీని కోసం ఇంట్లోనే ఫేస్‌ప్యాక్ తయారుచేసుకోవాలి. టేబుల్ స్పూన్ కొకొవా పౌడర్, టేబుల్ స్పూన్ కరిగించిన చాక్లెట్‌ని ఒక బౌల్‌లో వేసి కలుపుకోవాలి. ఆపై అందులో మిల్క్ క్రీమ్ వేయాలి. ఇందులోనే అర కప్పు శెనగపిండి కలుపుకొని మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఆపై ఈ మాస్క్‌ని ముఖానికి అప్లై చేసుకొని కాసేపటి తర్వాత వేడి నీటితో కడుక్కుంటే సరి.
ఆయిల్ ఫ్రీ చర్మం కోసం..
చర్మం ఆయిలీగా ఉంటే మొటిమలు రావడం కూడా సహజం. దీని కోసం మార్కెట్లో దొరికే స్క్రబ్‌లను ఉపయోగించి చర్మాన్ని కాపాడుకుంటూ ఉంటారు చాలామంది. అయితే అలాంటివి కాకుండా ఇంట్లోనే స్క్రబ్ తయారుచేసుకుంటే పొదుపుతో పాటు సహజమైన పదార్థాల వల్ల మీ చర్మం మరింత ఎక్కువ ప్రయోజనాలను పొందుతుంది. దీని కోసం ఏం చేయాలంటే.. ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ కొకోవా పౌడర్ వేసుకోవాలి. అందులో టీస్పూన్ రోజ్‌వాటర్, తేనె కలుపుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న ఓట్‌మీల్‌ని కప్పు అందులో వేయాలి. ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఆపై ఆలివ్ ఆయిల్‌లో చేతులు ముంచి ఆ చేతులతో ముఖం, శరీర భాగాలన్నింటినీ దీన్ని అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.
దొండపండులాంటి పెదాల కోసం..
మీరు డార్క్ చాక్లెట్ కొనేటప్పుడు జొజొబా ఆయిల్ మిక్స్ చేసిన చాక్లెట్ కొనండి. ఇందులో సాధారణం కంటే ఎక్కువ మినరల్స్, విటమిన్లు ఉంటాయి. ఇది సున్నితమైన మన చర్మాన్ని కాపాడుతుంది. దీన్ని మంచి లిప్‌బామ్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. ఇంట్లోనే లిప్‌బామ్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోయాలి. అందులో మరో చిన్న బౌల్ ఉంచి అందులో చాక్లెట్ బార్ సగం వేసుకోవాలి. ఇది కరిగిన తర్వాత అందులో తేనె కలుపుకోవాలి. ఆపై దీన్ని చల్లార్చుకొని.. ఆ మిశ్రమాన్ని కాస్త మీ వేళ్లతో తీసుకొని పెదాలకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత దానిపై ఆలివ్ ఆయిల్‌తో రుద్దుకోవాలి. ఇలా పావుగంట పాటు ఉంచుకొని గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి. దొండపండులాంటి ఎర్రని మృదువైన పెదాలు మీ సొంతమవుతాయి.
ఇవి కూడా చదవండి.
బొప్పాయి మీకందించే.. బహుచక్కని ప్రయోజనాలేమిటో తెలుసా..?
నల్లా నల్లని ద్రాక్ష.. మీ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుందిలా..!