సంతృప్తి కోసం పనిచేయాలి.. జీతం కోసం కాదు.. ఈ మాట మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. కానీ నిజంగా ఆలోచిస్తే ఎక్కువ జీతం రావడం కూడా ప్రధానమే.. రోజూ ఉదయాన్నే లేచి ఆఫీస్‌కి వెళ్లాలనే ఫీలింగ్ మంచి జీతంతోనే వస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇంటి ఖర్చులకు వెచ్చించేది, పొదుపు కోసం మిగిల్చేది ఆ డబ్బేగా మరి! అందుకే మన జీవితంలో జీతం కూడా ఎంతో ముఖ్యమైన అంశం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు తగిన జీతం అందట్లేదు అనిపిస్తే దాని గురించి మీ పై అధికారులతో మాట్లాడే ప్రయత్నం(Negotiate) చేయండి.
Table of Contents
- వేతనం గురించి ప్రతి మహిళ ఎందుకు ప్రశ్నించాలి?(Why Do You Need To Negotiate)
- చర్చల కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలు(Some Importance Tips For Discussion)
- ఫోన్ ద్వారా (Negotiation On Phone)
- ఈమెయిల్ ద్వారా (Through E-mail)
- కొత్త ఉద్యోగం అయితే.. (New Job)
- చర్చ సందర్భంలో ఈ పొరపాట్లు చేయకండి.. (Do Not Make These Mistakes)
- జీతం పెరిగితే ఏం చేయాలి? (What To Do If Salary Increases)
వేతనం గురించి ప్రతి మహిళ ఎందుకు ప్రశ్నించాలి
చర్చల కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలు
చర్చ సందర్భంలో ఈ పొరపాట్లు చేయకండి..
సాధారణంగా ఏ సంస్థైనా తక్కువ జీతం(Salary) ఇవ్వాలనే భావిస్తుంది. కానీ వారు ఇస్తున్న జీతం కంటే మీరు ఇంకా ఎక్కువ పొందేందుకు అర్హులని చెప్పగలగడం మీపైనే ఆధారపడి ఉంటుంది. ప్రొఫెషనల్స్ అందరికీ ఇది ఎంతో అవసరం కూడా. అందుకే సిలికాన్ వ్యాలీలో జీతం పెంపుదల(Salary Hike) కోసం సంస్థలను ఎలా అడగాలో నేర్పించే ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారంటే ఒక ఉద్యోగి జీవితంలో ఇది ఎంత ముఖ్యమైన అంశమో గుర్తించవచ్చు. అందుకే ప్రొఫెషనల్స్ సాయం లేకపోయినా జీతం పెంచమని సంస్థను అడిగే సరైన విధానం ఏంటో తెలుసుకుందాం రండి.
వేతనం గురించి ప్రతి మహిళ ఎందుకు ప్రశ్నించాలి?(Why Do You Need To Negotiate)
ఒకే సంస్థలో ఒకే రకంగా పనిచేసే స్త్రీ, పురుషులకు వేతనాల్లో వ్యత్యాసం ఉండడం మనం గమనించవచ్చు. ఇది ఒకటీ రెండు చోట్ల కాదు.. కార్పొరేట్ సంస్థలన్నింటిలో ఉన్న సమస్యే.. మన దేశంలో 20శాతం జెండర్ పే గ్యాప్ ఉందట. అంటే తనతో సమానంగా పనిచేస్తున్న పురుషుల కంటే స్త్రీలు 20శాతం తక్కువ జీతం పొందుతున్నారన్నమాట. అందుకే జీతం పెంచడం గురించి సంస్థ ఉన్నతాధికారులతో మాట్లాడడం ఎంతో అవసరం అని చెబుతున్నారు నిపుణులు.
కేవలం నిపుణులే కాదు.. ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా అయితే మహిళలు తమ విలువను తెలుసుకోవాలని.. వేతనాల పెంపుదల కోసం చర్చించాలని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. షెరిల్ శాండ్‌బర్గ్ తన పుస్తకం “లీన్ ఇన్ విమెన్ వర్క్ అండ్ ద విల్ టు లీడ్” పుస్తకంలో వేతనాల్లో పెంపు కోసం, ప్రమోషన్ల కోసం తమ గొంతుకను వినిపించిన మహిళలు విమర్శలకు గురవుతారని.. అదే మగవారు ఆ పనులు చేస్తే వారికి ఎలాంటి విమర్శలూ ఉండవని చెప్పారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే మహిళలకు తమ జీతం విషయంలో ఎలాంటి ఆకాంక్షలు ఉండవని.. తాము పనిచేసే సంస్థల నుంచి వారు చాలా తక్కువ కోరుకుంటారని.. ఇదే వారిని జీతం గురించి చర్చించకుండా ఆపుతుందని చెబుతారు నిపుణులు. చాలామంది మహిళలు తమ వేతనాల పెంపు గురించి ఉన్నతాధికారులతో చర్చించాలని భావిస్తూ ఉంటారు. అయితే దానివల్ల తమ మీద ఒకరకమైన ముద్ర పడిపోతుందని వారు భావిస్తారు.
మగవారు మాత్రం ఇలాంటివి ఆలోచించకుండా ముందడుగు వేయడం వల్లే వారు వేతనాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఇలా తమ విలువ తాము తెలుసుకోలేకపోవడంతో పాటు ఎక్కువ జీతం గురించి అడగలేకపోవడం కూడా వారి ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తోందట. మరి, ఇప్పుడు ఏం చేయాలి? జీతం పెంపుదల కోసం పై అధికారులను ఎలా అడగాలో తెలుసుకుందాం.
వేతనం పెంపు కోసం ఎలా చర్చించాలి?(How To Discuss The Salary)
అసలు వేతనం కోసం చర్చించడం గురించి తెలుసుకోవాలంటే బేసిక్స్ నుంచి తెలుసుకోవాల్సిందే. వేతనం కోసం చర్చలు ముఖ్యంగా మీకు, మీరు ప్రస్తుతం పనిచేస్తున్న లేదా పనిచేయాలనుకుంటున్న సంస్థ ప్రతినిధికి మధ్య జరుగుతాయి. దీనివల్ల మీరు ఎక్కువ మొత్తం పొందే వీలుంటుంది. మీరు చేరాలనుకుంటున్న సంస్థ అయినా సరే.. వాళ్లు అందించే జీతం మీకు సరిపోవట్లేదు అనుకుంటే దాని గురించి చర్చించే వీలుంటుంది. జీతం సరిగ్గా ఉంటేనే పనిచేయాలనే ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి ఉన్న ఉద్యోగుల వల్లే సంస్థ సక్సెస్ సాధించగలుగుతుంది. అయితే ఇలా చర్చించాలంటే ముందుగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1. మంచి పనితీరు(Good Performance) – మీ వేతనం పెంచమని మీ సంస్థను కోరే ముందు మీకు ఆ పెంపు ఎందుకు ఇవ్వాలో మీరు చెప్పగలిగి ఉండాలి. దీనికి మీ పనితీరు కూడా చక్కగా ఉండాల్సి ఉంటుంది. మీకు పెంచే జీతానికి తగిన పని మీరు చేయగలరని వారు నమ్మాల్సి ఉంటుంది. అందుకే జీతం పెంచమని అడిగే ముందు మీ పనితీరును మెరుగుపర్చుకోవాలి.
2. “నో” అనే మాట వినేందుకు సిద్ధంగా ఉండండి(Be Prepared For “No”) – మీరు అడగగానే అడిగినంత మొత్తం పెంచుతారని భావించకండి. ముందు తప్పనిసరిగా నో అనే చెబుతారని వూహించే రంగంలోకి దిగండి.
3. మరీ మొండిగా ఉండకండి(Be Little Flexible) – మీరు పెంచమని అడగగానే కొంత మొత్తం పెంచేందుకు మీ సంస్థ ముందుకు రావచ్చు. కానీ అంత తక్కువ మొత్తానికి మీరు ఒప్పుకోకపోవడం మంచిది. అయితే మంచి మొత్తం పెంచినప్పుడు ఇంకా పెంచాలని మొండిపట్టు పట్టడం కూడా సరికాదు. తగినంత మొత్తానికి ఒప్పుకోవడం మంచిది.
ఈ చర్చలు నిజంగా అవసరమా?(Is Negotiation Really Necessary)
వేతనం పెంచడం గురించి మీ సంస్థ ప్రతినిధులతో మాట్లాడే ప్రసక్తి వస్తే.. అసలు అది అవసరమా? అన్న అనుమానం కూడా వస్తుంది. అయితే ఇది అవసరమన్న సంగతి మీక్కూడా తెలుసు. మీ ప్రస్తుత జీతం కేవలం మీ స్థితినే కాదు.. మీ కెరీర్‌ని కూడా నిర్దేశిస్తుంది. అందుకే ఈ చర్చలు తప్పనిసరి. ఇది డబ్బు గురించే కాదు.. ఆ సంస్థ మీకు ఎలాంటి విలువనిస్తోంది. మీరు అందులోనే ఉండాలని ఎంతగా కోరుకుంటోంది అన్నది కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ చర్చలు నిజంగానే అవసరం అని చెప్పుకోవాలి.
నా విలువను నేను ఎలా తెలుసుకోగలను?(How Do I Know My Value)
ప్రతి ఉద్యోగికి తమ సంస్థలో లేదా తమలాంటి ఇతర సంస్థల్లో తాను పనిచేస్తున్న పొజిషన్‌లో.. తనలాంటి స్కిల్స్, తనకున్నంత అనుభవం ఉన్నవారు ఎంత ఆర్జిస్తున్నారో తెలిసి ఉండడం అవసరం. దీనివల్ల ఇండస్ట్రీ అంచనాల గురించి తెలుస్తుంది. దీనికి మీ సంస్థలో ఉన్నవారితోనే కాదు.. ఇతర సంస్థల్లో మీలాంటి పనిచేస్తున్న వారితో స్నేహం పెంచుకోవడం, వారితో అప్పుడప్పుడు మాట్లాడుతుండడం వల్ల వారికి ఎంత మొత్తం జీతంగా వస్తుందన్న విషయం మీకు తెలుస్తుంది.
ఒకవేళ మీరు ఇలా చేయలేకపోతే గ్లాస్‌డోర్, పేస్కేల్, పేచెక్ వంటి వెబ్‌సైట్లు మీ ఇండస్ట్రీలో మీకున్న నైపుణ్యాలు, అనుభవానికి మీకు ఎంత జీతం లభించాలో చెబుతాయి. మీ క్వాలిఫికేషన్లకు ఎంత జీతం వస్తుందో తెలియాలంటే గ్లాస్‌డోర్ వెబ్‌సైట్‌లో నో యువర్ వర్త్ అనే టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీరో సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనుకోండి. ఇండస్ట్రీ విలువ ప్రకారం మీ జీతం రూ. 30,000 నుంచి 50,000 మధ్యలో ఉంటే.. మీరు 44,000 కావాలని భావిస్తున్నారనుకోండి. అప్పుడు మీరు జీతం కోసం మాట్లాడుతున్నప్పుడు 44,000 కావాలని కాకుండా 40,000 నుంచి 48,000 మధ్య జీతం పెంచమని మీ సంస్థను కోరవచ్చు.
చర్చల కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలు(Some Importance Tips For Discussion)
ఒక మొత్తాన్ని చెప్పి.. పరిమితి పెట్టుకోండి..(Just Say A Limit)
జీతం కోసం పై అధికారులతో చర్చించాలనుకుంటున్నప్పుడు ముందుగా మీకు ఎంత జీతం లభించాలో నిర్ణయించుకోండి. ఇది కూడా ఇండస్ట్రీ నిబంధనల ప్రకారం ఉంటే మంచిది. అలా ఒక రేంజ్‌ని నిర్ణయించుకున్న తర్వాత అందులో ఎక్కువ మొత్తాన్ని మీ సంస్థ వారికి చెప్పండి. మీ మనసులో తక్కువ మొత్తం ఎంతో కూడా తెలుసు కాబట్టి దానికంటే తక్కువ మొత్తానికి ఒప్పుకోకండి.
ఉదాహరణకు మీరు మార్కెట్‌లో వేతనాల ఆధారంగా మీ జీతం రూ. 40 నుంచి 44 వేల మధ్య ఉండాలని నిర్ణయించుకుంటే.. ముందుగా మీ సంస్థ ప్రతినిధులకు చెప్పేటప్పుడు 44వేలుగా మీ ఆకాంక్షలను బయటపెట్టండి. వారితో మీరు మాట్లాడినప్పుడు మీరు చెప్పిన మొత్తం కాకుండా కాస్త తక్కువ మొత్తానికి వారు ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఇలా తక్కువ మొత్తాన్ని ప్రతిపాదించినప్పుడు మీరు అనుకున్న 40 వేల కంటే తక్కువకు ఒప్పుకోకపోవడం మంచిది.
ముందే ప్రాక్టీస్ చేయండి (Practice Before)
మీటింగ్ వెళ్లడానికి ముందే అక్కడ ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయో ఓసారి ఆలోచించండి. వాటన్నింటికీ సమాధానాలు ఆలోచించి పెట్టుకోండి. కేవలం ఆలోచించడం మాత్రమే కాదు.. మీ స్నేహితుల సాయంతో ఓసారి ప్రాక్టీస్ చేయడం కూడా ఎంతో మంచిది. ఎందుకంటే మీ టేబుల్‌కి అటు వైపు ఉన్నవారు ఈ తరహా చర్చల్లో సిద్ధహస్తులు.
మిమ్మల్ని తక్కువ మొత్తానికి ఒప్పించడానికే వాళ్లు చాలా ప్రయత్నిస్తారు. అయితే మీ సమాధానం సూటిగా ఉండాల్సి ఉంటుంది. మీకు ఎందుకు వేతనం పెంచాలో మీరు కచ్చితంగా చెప్పగలిగి ఉండాలి. ముందే ప్రాక్టీస్ చేయడం వల్ల దీనికి సిద్ధంగా ఉండొచ్చు.
ధైర్యంగా మాట్లాడండి (Talk With Confidence)
జీతం పెంచమని అడుగుతున్నాం కదా అని ఈ విషయంలో మర్యాద లేకుండా వ్యవహరించడం సరికాదు. ధైర్యంగానే మాట్లాడినా ప్రొఫెషనలిజం ఉట్టిపడేలా చూసుకోండి. మీరు చెప్పాల్సిన అంశాలన్నీ మర్యాదపూర్వకంగా వారికి వెల్లడించండి. ఈ విషయంలో ఏమాత్రం గడుసుదనం పనికిరాదు. కాస్త నెమ్మదిగా సంస్థ మీకు అందించిన సౌకర్యాల గురించి చెబుతూనే మీరు ఈ వేతనం ఎందుకు కోరుకుంటున్నారో వారికి వివరించి చెప్పండి. వారు మీ మాటను అర్థం చేసుకునేందుకు వీలుంటుంది.
సంస్థలో మీ విలువెంత? (Your Value In Company)
మీరు జీతం గురించి సంస్థ ప్రతినిధులతో కచ్చితంగా మాట్లాడాలంటే మీకు ఆ సంస్థలో మంచి పేరు ఉండాల్సి ఉంటుంది. అలాగే మీరు చేసే పనిని ఎవరూ భర్తీ చేయలేరు అంటే సంస్థ కచ్చితంగా మీరు చెప్పిన అంశం గురించి ఆలోచించే వీలుంటుది. అలా అని మీతో పాటు పనిచేసేవారు ఉంటే మాట్లాడవద్దని కాదు. సంస్థతో మీ అనుబంధం ఎలా ఉందని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎన్నో రోజుల నుంచి ఆ సంస్థలో పనిచేస్తూ సంస్థ అభివృద్ధిలో మీ వంతు పాత్ర పోషించిన వారైతే తప్పక మీ గురించి సంస్థ ఆలోచించే వీలుంటుంది. సంస్థలో ఇటీవలే చేరి.. మీ పనితీరు కూడా అంత చెప్పుకోదగినట్లుగా లేకపోతే మీరు మాట్లాడినా ఫలితం పెద్దగా కనిపించకపోవచ్చు.
ఇతర అంశాల గురించీ మాట్లాడండి (Talk About Other Things)
ఈ చర్చ కేవలం మీకు మంచి వేతనం అందించేందుకు మాత్రమే కాదు.. వేతనంతో పాటు ఇతర సౌకర్యాల గురించి మాట్లాడడం మర్చిపోవద్దు. ఇవి మెడికల్ ఇన్స్యూరెన్స్, వేతనంతో కూడిన సెలవులు, ట్రావెల్ అలవెన్సులు ఇలా వేటి గురించి అయినా కావచ్చు.. అలాగే మీ పర్సనల్ విషయాల ఆధారంగా పనిలో ఇబ్బందులు లేదా సమయం మార్చుకోవాలనుకుంటే దాని గురించి ఇలా అన్ని విషయాల గురించి ఒకేసారి చర్చించడం మంచిది.
వినడం కూడా అవసరమే.. (Listen To Them As Well)
అన్ని విషయాలు చెప్పమన్నాం కదా అని.. పూసగుచ్చి అన్నీ మీరే చెబుతూ పోకండి. అవతలి వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని కూడా వినడం అవసరం అని గుర్తించండి. మీకు కావాల్సిన విషయాలు చెబుతున్నప్పుడు ఎదుటివాళ్లు ఏం చెబుతున్నారో వింటే మీకూ వారికి మధ్య ఒక సయోధ్య కుదిరే అవకాశం ఉంటుంది. అవతలి వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నారో గుర్తిస్తేనే మీకూ సంస్థకు మధ్య ఒక అవగాహన కుదురుతుంది.
మీ పనిని చూపించండి.. (Show Your Work)
మీటింగ్‌లో మీరు మీ పని గురించి మాటలతో చెప్పడం కంటే మీ పని మీ గురించి మాట్లాడేలా చేయడం మంచిది. అందుకే మీరు సాధించిన విజయాలు, సంస్థ కోసం మీరు చేసిన సేవలు.. ఇలా వారు కాదనలేని విషయాలన్నింటినీ ఒక రిపోర్ట్ చేసి వారికి అందించడం మంచిది. మీ కంపెనీకి మీ స్థానంలో ఇంతకుముందున్న వారెవరూ చేయని సేవలు మీరు మాత్రమే చేసినవి చెప్పండి. అంతేకాదు. మీరు సంస్థ కోసం ఏవైనా అదనపు బాధ్యతలు తీసుకుంటే వాటి గురించి కూడా చెప్పడం మంచిది. మీరు చేసిన పని సంస్థకు అలాగే కొనసాగాలంటే మీకు ఎక్కువ జీతం ఇవ్వాలన్న సంగతి వారికి అర్థమవుతుంది.
నో వినేందుకు సిద్ధంగా ఉండండి. (Be Prepared To Listen)
చర్చలు అంటే రెండు వేర్వేరు వాదనలున్న పక్షాలు కలిసి ఒక సయోధ్యకు చేరుకోవడం.. అయితే అన్నివేళలా ఇది సాధ్యమవుతుందని చెప్పలేం. మీరు చెప్పిన మొత్తానికి వారు వెంటనే ఓకే చెప్పేస్తారని కూడా అనుకోలేం. ఇలా అడగగానే అలా ఒకే చెప్పడం అనేది ఎప్పుడూ జరగదు. అందుకే ఒకవేళ మీకు నో అనే సమాధానం లభిస్తే చిన్నబుచ్చుకోకండి. అక్కడి నుంచి మీ ప్రయత్నాలు ప్రారంభమవుతాయని.. ఇంకా మీరు ఈ దిశగా చేయాల్సిన పని చాలా ఉందని గుర్తుంచుకోండి.
ప్రయత్నం మానొద్దు.. (Try The Effort)
చర్చల సమయంలో వాళ్లు ఒక మొత్తం చెప్పిన తర్వాత తిరిగి దాని గురించి మాట్లాడాలంటే చాలామంది ఆలోచిస్తారు. ఇలా మాట్లాడడం కాస్త అగౌరవంగా అనిపిస్తుందేమో అని భావిస్తారు. కానీ ఇలా మాట్లాడడం సరైనదే.. మీరు ఎంత ఎక్కువగా దీని గురించి చర్చిస్తే.. అంత ఎక్కువ జీతం పొందే వీలుంటుంది. అయితే ఈ మాట్లాడే పద్ధతి ఎలా ఉందనే విషయం మాత్రం పరిగణనలోకి తీసుకోండి. మీరు నెమ్మదిగా మాట్లాడితే చాలు.. మీరు అనుకున్న మొత్తం వచ్చేవరకూ చర్చించే వీలుంటుంది.
వ్యక్తిగత అవసరాల కోసం వద్దు (Nothing For Personal Needs)
మీరు జీతం పెంచమని అడిగేది మీరు అంతమొత్తం పొందేందుకు అర్హులు కాబట్టి. అంతేకానీ మీ వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువ జీతం కావాలని అడగడం సరికాదు. అందుకే జీతం పెంచమని అడిగేటప్పుడు మీరు చేసే పని గురించి ప్రస్తావించండి అంతేకానీ పెట్రోల్ ధర పెరుగుతుంది. నా ఖర్చులు పెరిగిపోయాయి. నాకు జీతం పెంచండి అని అడగడం సరికాదు. ఈ ఖర్చులు అందరికీ పెరుగుతాయి. అయితే అందరికీ జీతం పెంచాల్సిన అవసరం సంస్థకు ఉండకపోవచ్చు. ఈ సంస్థ కోసం పనిచేయడం నాకెంతో ఇష్టం. కానీ నేను నిర్వర్తిస్తున్న బాధ్యతలకు తగిన జీతం నాకు అందడం లేదని నా భావన. అని చెబితే మంచి ఫలితం ఉండే వీలుంటుంది.
జీతం గురించి చర్చలు జరిపేందుకు వివిధ రకాల మార్గాలుంటాయి. ఒక్కో మార్గానికి సంబంధించిన టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
ఫోన్ ద్వారా (Negotiation On Phone)
సాధారణంగా కలిసి మాట్లాడడం, ఫోన్ ద్వారా మాట్లాడడం ఒకే రకంగా ఉంటుంది కానీ ఫోన్‌లో మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు మరికొన్ని ఉంటాయి అవేంటంటే..
1. ముందుగా సిద్ధమవ్వండి.. (Prepare First)
నేరుగా మాట్లాడేందుకు సిద్ధమైనట్లుగానే ఫోన్ మాట్లాడేందుకు కూడా ముందుగానే సిద్ధం కావాల్సి ఉంటుంది. అందుకే మీరు ప్రిపేరైన తర్వాతే ఫోన్ మాట్లాడేలా షెడ్యూల్ వేసుకోవాలి. మీ మనసులో ఒక ప్లాన్ సిద్ధం చేసుకొని ఆఖరికి మీకు కావాల్సిన మొత్తం దగ్గర చర్చ ఆగేలా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఒకవేళ ఒకసారి కంటే ఎక్కువ సార్లు మీరు మాట్లాడాల్సి వస్తే మాట్లాడే ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తిచేసుకోవడం వల్ల అవతలి వ్యక్తికి మీరు అంత మొత్తానికి రాజీ పడిపోయారని భావించే వీలు లేకుండా చూడండి.
2. రిలాక్స్‌డ్ గా కూర్చొని మాట్లాడండి. (Talk Calmly And Relaxed)
ఈ చర్చపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మీకు తెలుసు. మీరు ఇందులో యాక్టివ్‌గా మాట్లాడడం మంచిది. మరీ ప్రొఫెషనల్‌గా కాకుండా కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడడం వల్ల ఎక్కువ పాయింట్లు పడే అవకాశం ఉంటుంది. అయితే మీ మాటలు, గొంతుక స్థాయి, మాట్లాడే విధానం కూడా మీ చర్చలో ప్రధాన పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోండి.
3. ఫాలో అప్ అవసరం (Take Follow Up)
నేరుగా మాట్లాడినప్పుడు మీ నిర్ణయాన్ని నేరుగా చెప్పడంతో పాటు ఈమెయిల్ ద్వారా తెలియజేసినట్లే ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా ఈమెయిల్ చేయడం అవసరం. ఇందులో మీరు మాట్లాడిన వాటిలో ముఖ్యమైన పాయింట్లను వెల్లడిస్తూ చర్చలో ఆఖరికి మీకు నిర్ణయించిన వేతనం గురించి రాయడం మర్చిపోవద్దు. ఇలా రాతపూర్వకంగా ఉండడం వల్ల భవిష్యత్తులో చాలా ప్రయోజనాలుంటాయి.
ఈమెయిల్ ద్వారా (Through E-mail)
నేరుగా, ఫోన్‌లో మాట్లాడడమే కాదు.. ఈమెయిల్ చేయడం కూడా చర్చలు కొనసాగించేందుకు మంచి పద్ధతి అనే చెప్పుకోవచ్చు. అయితే ఇందులో నేరుగా లేదా ఫోన్‌లో మాట్లాడినట్లు ముఖాముఖిగా మనం మాట్లాడాల్సింది చెప్పలేం కాబట్టి మెయిల్‌లో ఉపయోగించే భాష గురించి కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. నేరుగా మాట్లాడితే మీరు ఎంత కచ్చితంగా ఉన్నారో తెలియజేసేందుకు వీలుంటుంది. అందుకే మీ ఆలోచనల గురించి చెబుతూ నేరుగా లేదా ఫోన్‌లో మాట్లాడే అవకాశం కూడా అడగడం కూడా మంచిదే.
1. అవకాశం కోసం థ్యాంక్స్ చెప్పండి. (Tell Details For The Opportunity)
మీరు మీ మాటలను చెప్పడానికి సంస్థ కల్పించిన అవకాశానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మెయిల్‌ని ప్రారంభించాల్సి ఉంటుంది. ఇది వారు తర్వాత రాసిన విషయాలను జాగ్రత్తగా చదివేలా చేస్తుంది. ఆ సంస్థలో పనిచేయడం మీకు ఎంత ఇష్టమో ఈ మెయిల్ ద్వారా `వెల్లడిస్తూ తగిన మొత్తంలో వేతనం అందిచగలిగితేనే పని చేయడానికి మీకు ఆసక్తి ఉంటుందని వెల్లడించండి.
2. మీ ఆఫర్ వెల్లడించండి.. (Disclose Your Offer)
ఒకవేళ వారు మీకు ఒక ఆఫర్‌ని వెల్లడిస్తే దాని గురించి చర్చలు జరపాల్సి వస్తే మీ ఆఫర్ నాకు సమ్మతమే కానీ జీతం గురించి ఇంకాస్త చర్చిస్తే బాగుంటుందేమో.. దాని గురించి నేను మీతో మాట్లాడాల్సి ఉంది అని మెయిల్ చేయడం మంచిది. వారు ఒక ఆఫర్ చెప్పినప్పుడు మీరు దాని గురించి మళ్లీ చర్చలు జరుపుతారని ఎక్కువ జీతం అడుగుతారని వారు కూడా భావిస్తారు.. అందుకే మీ ఆఫర్ ని చెప్పడం ఏమాత్రం తప్పు కాదు. అయితే మీ ఆఫర్ చెప్పేటప్పుడు అంత మొత్తం ఎందుకు కావాలో కూడా మీరు చెప్పగలిగి ఉండాలి. మీరు చెప్పిన అంశాలు వారి మనసుకు నచ్చితేనే మీకు జీతం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు.
3. షరతుల్లా అనిపించకూడదు.. (Negotiate Carefully)
మీ ఈమెయిల్ ఎక్కువ మొత్తం కోసం అడిగే లేఖలా ఉండాలి తప్ప ఇంత మొత్తం అయితేనే పనిచేస్తాను అనే అల్టిమేటంలా అనిపించకుండా జాగ్రత్తపడాలి. అందుకే నాకు ఇంత మొత్తం కావాలి. ఎందుకంటే నేను దానికి అర్హురాలిని అనో.. లేక ఫలానా మొత్తం కంటే తక్కువైతే నేను ఒప్పుకోను అనో మెయిల్‌లో రాస్తే అది సరికాదు. ఇలాంటివి ఎదుటివారికి మీపై ఉన్న ఇంప్రెషన్ ని తగ్గిస్తాయి.
కొత్త ఉద్యోగం అయితే.. (New Job)
1. రీసర్చ్ అన్నింటికంటే ముఖ్యం (Research Is Important)
మార్కెట్లో మీరు చేసే ఉద్యోగానికి ఎంత విలువ ఉంటుందో తెలుసుకోవాలంటే మేం చెప్పిన కొన్ని వెబ్ సైట్లను చూసి తెలుసుకోండి. దీని ద్వారా మీకు ఈ సంస్థ అందించిన ఆఫర్ మొత్తం సరైనదో, కాదో చెక్ చేసుకోండి. ఇంతకుముందు పని చేస్తున్న సంస్థ మీకు అందించిన జీతం కంటే ఎక్కువ మొత్తాన్ని మీరు పొందాలనుకోవడం సహజం. అయితే మీరు కావాలనుకుంటున్న మొత్తం కంటే 10 నుంచి 15 ఎక్కువ అడగడం మంచిది. దీనివల్ల వాళ్లు తక్కువ మొత్తం గురించి మిమ్మల్ని అడిగితే తక్కువకు ఒప్పుకున్నా మీరు అనుకున్న జీతానికి ఒప్పుకోవచ్చు. ఒకవేళ వాళ్లు మీరు అడిగిన జీతం ఇస్తే ఎక్కువ జీతం పొందే వీలుంటుంది.
2. ఇతరత్రా విషయాల గురించీ మాట్లాడండి.. (Talk About Other Details)
జీతంతో పాటు సంస్థ అందించే ఇతర సౌకర్యాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందుకే జీతం గురించి మాట్లాడేటప్పుడే వీటి గురించి కూడా మాట్లాడడం మంచిది. జీతం తక్కువైనా సరే.. మంచి సౌకర్యాలు, ఇతర ప్రయోజనాలు ఎక్కువగా అందించే సంస్థ అయితే ఆ ఉద్యోగాన్ని ఒప్పుకోవడం మంచిదే.
3. ముందు వారినే అడగండి.. (Asking By Yourself)
చాలామంది ఇంటర్వ్యూలో సంస్థ తమకు ఎంత మొత్తాన్ని ఆఫర్ చేయాలనుకుంటోంది అన్న విషయం అడిగేందుకు వెనకాడుతూ ఉంటారు. అయితే ముందుగా వారు ఒక మొత్తాన్ని చెబితే మీరు దానికంటే ఎక్కువ మొత్తాన్ని చెప్పి ఎక్కువ జీతం పొందే వీలుంటుంది. ఇండస్ట్రీలో ఎంత జీతం ఉందో మీకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి ఎక్కువ జీతం కోసం అడగడం మంచిది.
చాలా సంస్థలు ఉద్యోగమిచ్చాయా? ఎక్కువ జీతం కోసం ఇలా అడగండి. (Many Jobs Are Present, Ask More)
మార్కెట్లో మీరు చేసే పనికి మంచి డిమాండ్ ఉందా? మీకు ఒకటి కాదు.. రెండు మూడు సంస్థల నుంచి ఆఫర్లు వచ్చాయా? అయితే సంస్థలు మీ నైపుణ్యాలపై నమ్మకం ఉంచి.. మిమ్మల్ని తీసుకోవడం వల్ల అవి అభివృద్ధి అవుతాయని భావిస్తున్నాయన్నమాట. ఇలాంటప్పుడు ఎక్కువ జీతం అందించడం గురించి అడగడం ఇంకా సులభమవుతుంది. అదెలాగంటే..
అసలు విషయం చెప్పండి.. (Tell The Original Thing)
చాలామంది ఇతర కంపెనీల్లో తమకు ఉద్యోగం వచ్చిందన్న విషయాన్ని దాచి ఇంటర్వ్యూ కొనసాగిస్తారు. అలా చెప్పడం తప్పు అనుకుంటారు. కానీ అదో మంచి విషయం. ఇంకో సంస్థ ఆఫర్ కూడా మీకు లభించిందని చెప్పడం వల్ల ఒకవేళ ఆ సంస్థ మిమ్మల్ని తప్పక తీసుకోవాలి అనుకుంటే వాళ్లు అందించే జీతాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీరు ఎక్కువ మొత్తం పొందే వీలుంటుంది. ఇది కొంచెం రిస్కీయే అయినా దీనివల్ల మీకు ఎక్కువ నైపుణ్యాలు ఉన్నాయని సంస్థ భావించే వీలుంటుంది.
ముందే ఓకే చెప్పేయకండి.. (Wait Before You Say “Okay”)
ఇంటర్వ్యూలో ఎంపికై జాబ్ ఆఫర్ పొందడం పట్ల ఆనందం వ్యక్తం చేయండి. కానీ దానికి వెంటనే ఓకే చెప్పకుండా ఉండడం మంచిది. మీకు ఇతర ఆఫర్లు ఉన్నా కూడా.. ఏ నిర్ణయం చెప్పేముందు కాస్త సమయం తీసుకోవడం మంచిది. ఆ తర్వాత మీకు ఆఫర్ వచ్చిన సంస్థలన్నింటి గురించి, వారు అందించిన ప్యాకేజ్ గురించి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. కొంత సమయం కోసం అడగడం.. ఆ తర్వాత జీతం పెంచడం గురించి చర్చించడం వల్ల సంస్థలు మీపై నిజంగా ఆసక్తి చూపిస్తే జీతం పెంచే వీలు కూడా ఉంటుంది.
చర్చ సందర్భంలో ఈ పొరపాట్లు చేయకండి.. (Do Not Make These Mistakes)
ఎమోషనల్ అవ్వకండి.. (Don’t Be Emotional)
ఎక్కువ జీతం అడగడం, దానికి సంస్థలు నో చెప్పడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎవరైనా కాస్త ఎమోషనల్‌గా ఫీలయ్యే అవకాశం లేకపోలేదు. అయితే ఇలాంటి సందర్భాల్లో కామ్గా ఉండడం మంచిది. సంస్థ ప్రతినిధులు మీకు నో చెప్పారంటే.. మీ ప్రతిభ సరైన స్థాయిలో లేదని అర్థం కాదు. మీరు సరిగ్గా పనిచేయట్లేదు అని వారు చెప్పేవరకూ మీ ప్రతిభపై మీరు నమ్మకముంచండి. ఇలా మీ గురించి మీరు నెగటివ్‌గా ఆలోచించడం వల్ల పరిస్థితి మీ చేతుల్లోంచి దాటిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రొఫెషనల్‌గా వ్యవహరించడం మంచిది.
మొదటి ఆఫర్‌కే ఒప్పుకోకండి.. (Don’t Accept The First Offer)
మీరు ఫలానా మొత్తం కావాలని సంస్థను అడిగారనుకోండి. తప్పనిసరిగా మీకు వచ్చే సమాధానం మేము అంత ప్యాకేజ్ ఇవ్వలేం. ఈ మొత్తం అయితే ఇవ్వగలం అని చెబుతారు. అయితే ఈ మొత్తానికే మీరు ఒప్పుకోవడం సరికాదు. మీరు కావాల్సిన మొత్తం కంటే ఎక్కువ అడిగినట్లే.. వారు ఇవ్వాల్సిన మొత్తం కంటే తక్కువ చెబుతుంటారు. ఇది మనసులో పెట్టుకొని చర్చ జరపడం మంచిది. ఆరోగ్యవంతమైన చర్చంటే మీరు చెప్పిన మొత్తం కంటే తక్కువకు మీరు ఒప్పుకోవడంతో పాటు వాళ్లు చెప్పిన మొత్తం కంటే ఎక్కువకు వారూ ఒప్పుకోవాల్సి ఉంటుంది.
పట్టుబట్టకండి.. (Negotiate Wisely)
మీరు ఒక రేంజ్ అనుకున్నప్పుడు దానిలో తక్కువ స్థాయి మొత్తం వచ్చినా అందుకు ఒప్పుకోవడం మంచిది. అలా కాదని మీరు చెప్పిన మొత్తాన్నే ఇవ్వాలని భావించడం కూడా సరికాదు. ఉదాహరణకు మీరు 45,000 నుంచి 50,000 మధ్య జీతం కావాలని నిర్ణయించుకొని 50,000 జీతం కావాలని సంస్థ వారితో చెప్పారనుకోండి. వారు మీతో చర్చలు జరిపి 46,000 ఇస్తామంటే మీరు అనుకున్న మొత్తం 45,000 కంటే అది కాస్త ఎక్కువే కాబట్టి ఓకే చెప్పేయడం మంచిది. కానీ 50,000 చెప్పాను కాబట్టి కనీసం 49,000 అయినా కావాల్సిందే అనుకోవడం సరికాదు.
రాతపూర్వకంగా తీసుకోవాల్సిందే.. (Take Finalise Decisions In Written)
మీరు మీ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి ఇరు వర్గాల సమ్మతంతో ఒక మొత్తానికి నిర్ణయం జరిగిందనుకోండి. ఈ మొత్తం మీకు జీతంగా ఇస్తామన్నట్లుగా వారి దగ్గర నుంచి రాత పూర్వకంగా తీసుకోవాల్సి ఉంటుంది. మీటింగ్ తర్వాత మీరు తీసుకున్న నిర్ణయం గురించి హెచ్ ఆర్ మీకు మెయిల్ చేసేలా చూసుకోండి. ఇది చేయడం వల్ల మీరు తీసుకున్న నిర్ణయం అమలవుతుందని మీకో నమ్మకం లభిస్తుంది.
నేరుగా జీతం గురించే మాట్లాడడం (Directly Talking About Salary)
చర్చల కోసం వెళ్లిన తర్వాత వెంటనే జీతం గురించి మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పడం సరికాదు. జీతం గురించి మాట్లాడాలి కానీ కాస్త ప్రొఫెషనల్‌గా మాట్లాడడం మంచిది. అయితే మరీ చుట్టూ తిప్పి మాట్లాడడం కూడా సరికాదు. ముందు మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కాస్త మాట్లాడి, ఆ తర్వాత ఈ విషయం గురించి చర్చించడం మంచిది.
ముందుగా మీరే చెప్పండి.. (Ask Their Offer First)
చర్చల కోసం వెళ్లినప్పుడు మీరు ఎంత జీతం ఆశిస్తున్నారనే విషయం మీరే ముందుగా చెప్పడం మంచిది. ఎందుకంటే మీరు వారికి ఈ అవకాశాన్ని అందిస్తే వారు చెప్పే మొత్తం చాలా తక్కువగా ఉండొచ్చు. ఆ తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా వారు చెప్పిన మొత్తానికి కాస్త ఎక్కువగా పొందగలరు అంతే తప్ప మీరు అనుకున్న మొత్తం పొందలేరు. అందుకే ముందుగా మీరే ఇంత జీతం ఆశిస్తున్నా అని చెప్పడం మంచిది.
తప్పు చేసినట్లుగా ఫీలవ్వడం (Feeling Wrong About Negotiation)
మహిళలు ఎక్కువ జీతం ఆశించాలంటే అదేదో తప్పుగా భావిస్తుంటారు. అందుకే ఇది జరుగుతున్నందుకు నేను బాధపడుతున్నా.. ఇది మీకెంత ఇబ్బందిగా ఉందో నాక్కూడా అలాగే ఉంది అనే మాటలు వాడుతుంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ జీతం అడగడం మీ హక్కు. దీని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇలా మీరు ముందు నుంచి బాధపడడం వల్ల తక్కువ మొత్తానికే ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది.
మీ మాటలకు వ్యతిరేకంగా మాట్లాడకండి (Speaking Against Your Words)
నేను ఫలానా మొత్తం కావాలనుకున్నాను కానీ ఈ మొత్తానికి ఫిక్స్ అయిపోతున్నా.. అని చెప్పుకోవడం సరికాదు. ఇది మిమ్మల్ని మీరు కించపర్చుకోవడం అవుతుంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు వాళ్లు ఉన్నారు. ఇది మీ పని కాదని నిర్ధారించుకోవడం మంచిది. మీరు ఆఫర్ చెప్పడం తర్వాత వాళ్లు కాస్త మొత్తం తగ్గించి చెబుతారు. ఈ పనిని వారికి అప్పగించండి. మీరు అలా మాట్లాడకపోవడం మంచిది.
బాధ్యతలు పెరిగినా ఒప్పుకోండి.. (Accept Obligations)
మీరు జీతం పెంచమని కోరినప్పుడు మీ యాజమాన్యం దానికి ఒప్పుకొని మీకు జీతం పెంచడంతో పాటు కొన్ని అదనపు బాధ్యతలను అందించే వీలుంటుంది. ఇలాంటప్పుడు ఆ అదనపు బాధ్యతలను మీరు కాదనడం సరికాదు. అయితే పెరిగే బాధ్యతలు కూడా జీతానికి తగినట్లుగానే ఉండాలని గుర్తుంచుకోండి. మీ జీతాన్ని 50 శాతం మేర పెంచి.. పనిని 75 శాతం పెంచితే ఆ తర్వాత మీరు ఆ బాధ్యతలు నిర్వహించడానికి ఇబ్బంది పడాలి. ఇలాంటప్పుడు దాన్ని ఒప్పకోకపోవడం మంచిది.
ఇతరులతో పోల్చకండి (Don’t Compare With Others)
మీరు మీ జీతం పెంపు కోసం అడిగేందుకు అక్కడికి వెళ్లారు. మీ పని గురించి మాత్రమే మాట్లాడండి. మీ తోటి ఉద్యోగుల జీతం గురించి.. మరో సంస్థలో మీ స్థాయిలో పనిచేసే వారి జీతాల గురించి మాట్లాడడం సరికాదు. మీ నైపుణ్యాలేంటో వివరించి దానికి తగిన జీతం అందించమని మీ సంస్థను కోరాలి అంతేకానీ ఇతరులతో పోల్చుకోకూడదు. అయితే ఇది అన్ని సందర్భాల్లోనూ వర్తించదనుకోండి. మీ సంస్థలో మీ స్థాయిలో ఉన్నవారందరి కంటే మీ జీతం తక్కువగా ఉందనిపిస్తే.. వారందరి జీతాన్ని కోట్ చేస్తూ మీ వేతనం పెంచమని మీ సంస్థను కోరే వీలుంటుంది.
బెదిరించడం సరికాదు.. (Threating Is Not Right)
ఇది చాలామంది చేసే తప్పు. ఫలానా మొత్తం మాకు అందిస్తేనే ఈ సంస్థలో పనిచేస్తాం లేదంటే రాజీనామా చేస్తాం అని చెప్పడం వల్ల వేతనం గురించి చర్చించే అవకాశం కూడా లేకుండా మీకు మీరే అన్యాయం చేసుకున్న వారవుతారు. ఇలా మీరు బెదిరించినప్పుడు ఒకవేళ మీ బాస్ ఒప్పుకోకపోతే ఏం చేయాలో కూడా నిర్ణయించుకొని రంగంలోకి దిగండి.
చర్చలు విఫలమైతే ఏం చేయాలి? (What To Do If Negotiation Fails)
మీరు ముందుగా బాగా ప్రిపేరయ్యే చర్చలకు వెళ్లారు. చర్చల్లోనూ సరైన ఆధారాలతో మీ నైపుణ్యాల గురించి చర్చించారు. అయినా సరే సంస్థ మీ జీతం పెంచడానికి ఒప్పుకోకపోవచ్చు. దీనికి చాలా కారణాలే ఉండొచ్చు.. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇది మీ జీతం పెరిగేందుకు ఓ అడ్డుగోడే కావచ్చు. కానీ కొన్ని పద్ధతులు పాటిస్తే ఈ పరిస్థితిని కూడా సులభంగా హ్యాండిల్ చేసే వీలుంటుంది.
పరిస్థతిని అంచనా వేయండి (Estimate The Conditions)
ఒకసారి మీరు ప్రస్తుతం ఉన్న స్థితిని గమనించండి. మీరు ప్రస్తుతం ఎక్కడున్నారో అక్కడ ఉండాల్సిన అవసరం ఉందా? లేక ఇంకెక్కడికైనా మారే వీలుందా గమనించాలి. ఉద్యోగం వదిలేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా తక్కువ జీతం ఇస్తున్నా మీ ఉద్యోగాన్ని మీరు ప్రేమిస్తున్నారా? మీ సంస్థ జీతం తక్కువగానే ఇస్తున్నా ఇతర ప్రయోజనాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల మీరు లాభం పొందుతున్నారా? మీరు చేయాలనుకున్నవన్నీ చేయగలుగుతున్నారా? లేదా అవి చేయడంలో మీకు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకొని మీ పరిస్థితి గురించి ఓ అంచనాకి రండి.
భవిష్యత్తు గురించి ఆలోచించండి (Think About Future)
గతంలో జరిగిపోయినదాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే గతం గురించి ఆలోచించకుండా పై అధికారులు మీ పనితీరును గుర్తించేలా కష్టపడి పని చేయడానికి ప్రయత్నించండి. భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు తిరిగి ఇలాంటి చర్చల్లో పాల్గొంటే అప్పుడు మీ పనితీరు గురించి చెప్పడానికి మీకు వీలుంటుంది. ఈ విషయం గుర్తుంచుకోండి.
కొంత సమయం తర్వాత తిరిగి అడగండి (Ask Again After Sometime)
ఒకసారి మీరు అడిగిన జీతానికి సంస్థ ఒప్పుకోలేదని ఎప్పుడూ అదే పరిస్థితి ఉంటుందని భావించకండి. కొన్నాళ్ల తర్వాత తిరిగి దాని గురించి చర్చించే అవకాశం మీకు లభించవచ్చు. ఒకవేళ అవకాశం దొరికినా దొరకకపోయినా ఇంతకుముందు జరిగిన మీ చర్చల ఫలితం ఆధారంగా తగినంత సమయాన్ని కేటాయించుకొని తిరిగి దాని గురించి అడగడం మంచిది. మీరు నైపుణ్యాల గురించి ఎంత బాగా చెప్పగలిగారన్నదానిపై ఆధారపడి మీ చర్చలు కొనసాగుతాయి. అందుకే ఈసారైనా బాగా ప్రాక్టీస్ చేసి వెళ్లడం మంచిది.
పాజిటివ్‌గా ఉండండి (Be Positive)
ఒకసారి జీతం పెరగనంతమాత్రాన మీలో లోపం ఉన్నట్లు కాదు. అందుకే పాజిటివ్‌గా ఉండండి. మీ పై అధికారులకు కూడా మీరు ఒక బాధ్యాతాయుతమైన ఉద్యోగిగానే తెలిసి ఉండాలి. మీ పై అధికారుల ఆలోచనలతో మీరు ఏకీభవించకపోయినా.. వారి నిర్ణయాన్ని మీరు గౌరవిస్తున్నట్లుగా వారు భావించాలి. మీ ప్రవర్తన అలా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది.
ఇంకాస్త కష్టపడండి (Trying Harder)
ఇప్పుడు మీరు ఎక్కడికి చేరుకోవాలన్న అంశంపై మీకో క్లారిటీ వచ్చి ఉంటుంది. ఫలానా స్థాయికి చేరుకుంటే నాకు జీతం పెరుగుతుంది అని మీరు భావిస్తే అంతకంటే మరో మెట్టు ఎక్కువగా ఎక్కిన తర్వాతే తిరిగి చర్చలకు వెళ్లాలనే సంకల్పంతో పనిచేయండి. ఈ ప్రయత్నంలో మీ తోటివారు, పై అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం మర్చిపోవద్దు. దీనివల్లే మిమ్మల్ని మీరు మరింత మెరుగుపరుచుకోగలరు. అందుకే మీ మేనేజర్ సాయంతో మీరు చేయాల్సిన పనులు, చేరుకోవాల్సిన గమ్యాలకు సంబంధించిన పట్టికను తయారుచేసుకోండి.
జీతం పెరిగితే ఏం చేయాలి? (What To Do If Salary Increases)
పెరిగిన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించండి.. (Increase Your Responsibility Properly)
మీ స్థానంలో ఏ మార్పు లేకపోయినా జీతం పెరిగిందంటే చాలు.. తప్పనిసరిగా బాధ్యతలు పెరుగుతాయి. మీకు జీతం పెంచడం సరైన నిర్ణయమే అని వాళ్లు సంస్థకు చెప్పడానికి మీకు అదనపు బాధ్యతలను అందించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడం మంచిది. మీరు వారు అనుకున్న స్థానానికి చేరేందుకు ఇది మంచి అవకాశం. ఇప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకుంటే.. మీరు ఉన్నతస్థానాలకు చేరితే చక్కగా పనిచేయగలుగుతారని వారికి నిరూపించిన వారవుతారు.ఇందుకోసం ఓ ఫార్మల్ ఈమెయిల్ చేయడం మంచి పద్ధతి. ఇకపై మీ బాధ్యతలేంటి? పాత బాధ్యతలకు అదనంగా మీరేమైనా కొత్త పనులు చేయాల్సి ఉంటుందా? వంటివన్నీ ఈ మెయిల్ ద్వారా అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. వాళ్లు దానికి రిప్లై ఇవ్వడం వల్ల మీరు చేయాల్సిన పనిని అధికారికంగా ధృవీకరించిన వారవుతారు.
మీకు గౌరవం పెరుగుతుంది (Your Respect Will Increase)
మీ విలువ మీరు తెలుసుకొని జీతం పెంచమని అడిగినందుకు మీ బాస్ మిమ్మల్ని మరింత గౌరవించే అవకాశాలుంటాయి. ఇలా మీరు జీతం పెంచమని అడగడం వల్ల మీ బాస్‌కి రెండు విషయాలు స్పష్టమవుతాయి. మీరు కొత్త బాధ్యతలు తీసుకోవడానికి కానీ, మీ స్థాయికి తగినట్లుగా జీతం పెంచమని అడగడానికి కానీ వెనుకాడరని మీ బాస్‌కి అర్థమవుతుంది. రెండోది ఆ సంస్థలో మీ స్థానం పట్ల మీరు చాలా నమ్మకంతో ఉన్నారని ఇంకా చాలా రోజులు అక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని వారికి అర్థమవుతుంది కాబట్టి కొత్త బాధ్యతలను మీకు అప్పగించడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది.
ఇది ఆఖరి చర్చ కాదు.. (This isn’t Your Final Debate)
ఇలా జీతం పెంచమని అడిగే చర్చల విషయానికి వస్తే.. ఇవి ఒకసారితో అయిపోయేవి కావు.. ఎప్పటికప్పుడు మార్కెట్‌ని బట్టి జీతం పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ పెరగకపోతే మీరు మరోసారి అడగాల్సి ఉంటుంది కూడా. ఇప్పుడు మీ జీతం పెరిగింది కదా అని మళ్లీ ఇంకో సారి అడిగే వీలుండదని అనుకోవడానికి లేదు. అందుకే మీ పనిని సమర్థంగా చేస్తూ ఉండడం మంచిది. ఇప్పుడు ఎలాగూ వేతనం పెంచారు కదా మళ్లీ అడిగినా పెంచుతారు అనుకోవద్దు. ఎందుకంటే మళ్లీ మీరు అడిగినప్పుడు ఇంతకుముందు మీకు వేతనం పెంచితే మీ పనితీరు ఎలా ఉందన్న విషయం కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
అందుకే ఇంతకుముందు కంటే ఇంకాస్త కష్టపడి పనిచేయడం మంచిది. ఎప్పుడు జీతం పెంచమని అడిగినా అప్పుడు మీ విలువను మీరు నిరూపించుకోవాల్సి వస్తుందనేది ఎవరూ కాదనలేని సత్యం. ఇలా జీతం పెంచమని అడగడం కూడా ఒక మంచి కళ. అభివృద్ధి చెందిన దేశాల్లో దీన్ని నేర్పించేందుకు లైఫ్ కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటారు. కానీ మనం ఇంకా దాన్ని అంత సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే మన స్థాయిలో మార్పు ఉండడం లేదన్నది నిజం. మహిళలకు ఇతరులతో పోల్చితే జీతం తక్కువగా ఉంటుంది కాబట్టి వారు ఈ కళలో ఆరితేరి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఎక్కువ వేతనానికి అర్హులని చెప్పడానికి కానీ.. మీ పనితీరు ద్వారా దాన్ని నిరూపించడానికి కానీ ఏమాత్రం వెనుకాడద్దు.
ఇవి కూడా చదవండి.
మీరు పనిచేయాలనుకునే కంపెనీ దృష్టిలో పడేందుకు చిట్కాలను ఆంగ్లంలో చదవండి.
లింక్‌డ్ఇన్ లో ఉద్యోగాలను వెతుక్కోవడం ఎలాగో ఆంగ్లంలో చదవండి.
ఉద్యోగానికి అప్లై చేస్తున్నప్పుడు చేయకూడదని పొరపాట్ల గురించి ఆంగ్లంలో చదవండి.
Images : Shutterstock/Giphy