బాలాపూర్ (Balapur) పేరు చెప్పగానే గుర్తొచ్చేది.. ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం రోజు జరిగే లడ్డు వేలం పాట. 1994 సంవత్సరంలో మొదలైన ఈ లడ్డు వేలంపాట .. క్రమక్రమంగా పెరుగుతూ ప్రస్తుతం లక్షల ధరలో ఆక్షన్‌కి (Auction) సిద్ధమవుతోంది. ఇక ఈ వేలం పాటలో పాల్గొనేందుకు బాలాపూర్ గ్రామస్తులే కాకుండా.. రాష్ట్ర నలుమూలల నుండి కూడా ప్రముఖులు వస్తుంటారు. దీనిని బట్టి ఈ లడ్డుకి ఉన్న ఫాలోయింగ్ ఏంటో చెప్పనక్కర్లేదు.
మీకు “వీసా దేవుడు – చిలుకూరు బాలాజీ” గురించి ఈ విశేషాలు తెలుసా…!
ఇక ఈ సంవత్సరం వేలం పాట కొద్దిసేపటి క్రితమే ముగియగా.. రూ 17.60 లక్షలకి ఈ లడ్డుని కొలను రామిరెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నట్లు తెలుస్తున్నది. గత ఏడాది ఈ లడ్డు రూ 16.60 లక్షలు పలకగా.. ఈ సంవత్సరానికి సుమారు 1 లక్ష రూపాయలు అదనంగా పెరిగింది. బంగారు పూతతో తయారుచేసే ఈ 21 కిలోల లడ్డుని .. తాపేశ్వరానికి చెందిన ప్రముఖ స్వీట్ షాపు నిర్వాహకులు తయారుచేస్తారట.
మొత్తం 19 మంది ఈ లడ్డు వేలంపాటలో పాల్గొనగా.. కొలను వంశానికి చెందిన రామిరెడ్డి దీనిని దక్కించుకోవడం విశేషం. చిత్రమేంటంటే.. అసలు ఈ లడ్డు వేలంపాట మొదలైనప్పుడు.. తొలిసారిగా దక్కించుకుంది కూడా కొలను వంశస్థులే. ఈ సంవత్సరంతో కలిపి మొత్తంగా 9 సార్లు.. వారు ఈ వేలం పాటలో లడ్డుని దక్కించుకోవడం జరిగింది.
అయితే మొదటిసారిగా ఈ లడ్డు వేలం జరిగినప్పుడు కేవలం రూ. 450 రూపాయలు మాత్రమే ధర పలికిందట. ఆ మరుసటి ఏడాది రూ. 4500 ధర పలికింది. ఇక ఈ వేలం పాటలో కొనుగోలు చేసిన లడ్డులో కొంతభాగం బంధువులకి, స్నేహితులకి పంచగా.. మిగతా భాగాన్ని తమ పొలాల్లో చల్లడం ఆనవాయతీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల ఆ పొలాల్లో సాగు పెరుగుతుందని కూడా ప్రచారం జరగడంతో.. ఈ లడ్డు వేలంపాటకి అనూహ్యంగా ప్రాధాన్యత పెరిగింది.
ఆ విధంగా ఈ బాలాపూర్ లడ్డు (Balapur Laddu) వేలంపాటకు దేశవ్యాప్తంగా విశేషమైన ఆదరణ వచ్చింది. అందుకనే ప్రతి ఏడాది ఈ బాలాపూర్ లడ్డు వేలంపాటలో.. లడ్డు ధర పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
హైదరాబాద్ ట్రెండ్స్: భాగ్యనగరంలోని.. రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ పాయింట్స్ ఇవే..!
ఇక 1994 నుండి 2019 వరకు బాలాపూర్ లడ్డుని వేలంపాటలో దక్కించుకున్న వారి వివరాలు
1994 – కొలను మోహన్ రెడ్డి (రూ. 450)
1995 – కొలను మోహన్ రెడ్డి -రూ. 4,500
1996 – కొలను క్రిష్ణా రెడ్డి-రూ . 18,000
1997 – కొలను క్రిష్ణా రెడ్డి -రూ. 28,000
1998 – కొలను మోహన్ రెడ్డి -రూ. 51,000
1999 – కల్లెం ప్రతాప్ రెడ్డి -రూ. 65,000
2000 – కల్లెం అంజిరెడ్డి -రూ. 66,000
2001 – జి. రఘునందన్ చారి -రూ. 85,000
2002 – కందాడ మాధవ రెడ్డి -రూ. 1,05,000
2003 – చిగిరింత బాల్ రెడ్డి -రూ. 1,55,000
2004 – కొలను మోహన్ రెడ్డి -రూ.2,01,000
2005 – ఇబ్రాం శేఖర్ -రూ.2,08,000
2006 – చిగిరింత తిరుపతి రెడ్డి -రూ.3,00,000
2007 – జి. రఘునందన్ చారి -రూ.4.15,000
2008 – కొలను మోహన్ రెడ్డి -రూ.5,07,000
2009 – సరిత -రూ.5,10,000
2010 – కొడాలి శ్రీధర్ బాబు -రూ.5,35,000
2011 – కొలను బ్రదర్స్ -రూ.5,45,000
2012 – పన్నాల గోవర్ధన్ రెడ్డి -రూ. 7,50,000
2013 – తీగల క్రిష్ణారెడ్డి -రూ. 9,26,000
2014 – సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ. 9,50,000
2015 – కొలను మదన్ మోహన్ రెడ్డి -రూ. 10,32,000
2016 – స్కైలాబ్ రెడ్డి -రూ. 14.65,000
2017 – నాగం తిరుపతిరెడ్డి- రూ. 15. 60 లక్షలు
2018 – శ్రీనివాస్ గుప్తా – రూ 16.60 లక్షలు
2019 – కొలను రామిరెడ్డి – రూ 17.60 లక్షలు
ఏదేమైనా.. చాలా చోట్ల ఎతైన ప్రతిమలతో.. వినాయకు విగ్రహాలు రికార్డులు నెలకొల్పుతుంటే.. ఈ బాలాపూర్ లడ్డు మాత్రం లడ్డు వేలంపాట ద్వారా రికార్డులు సాధించడం గమనార్హం.
రామోజీ ఫిలిం సిటీని సందర్శించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఈ వివరాలు తెలియాల్సిందే..!
Featured Image: Representational (Shutterstock)