అందమైన మెరిసే (glowing) చర్మం (skin) కావాలని అనుకోని వ్యక్తులు ఎవరూ ఉండరేమో.. కానీ అది పొందడం మాత్రం చాలా తక్కువ మందికే సాధ్యమవుతుంది.. చాలామంది అందంగా సిద్ధమవ్వాలి అనుకునే రోజుకే ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. కళ్ల కింద నల్లని వలయాలో.. అనుకోని విధంగా వచ్చిన ఓ మొటిమో.. లేక పొడిబారిన, నల్లబడిన చర్మమో.. ఇలా అందానికి అడ్డంకిగా ఏదో ఒక సమస్య మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. దీన్ని దాటేందుకు.. అందమైన చర్మం సొంతం చేసుకునేందుకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క ఉత్పత్తిని వాడి చర్మాన్ని కాపాడుకుందాం అనుకుంటారు. కానీ ఎంత ఖరీదైన ఉత్పత్తులు ఉపయోగించినా చర్మం మామూలుగా మారదు. అయితే రాత్రికి రాత్రే మెరిసే చర్మం పొందడం కాస్త కష్టమే అయినా కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే మీ చర్మాన్ని ఎప్పటికీ మెరిసేలా ఉంచుకోవచ్చు.
Table of Contents
మెరిసే ముఖం కోసం రోజువారీ చిట్కాలు
మెరిసే ముఖం కోసం ఎన్ని ఉత్పత్తులు ఉపయోగించినా రోజువారీ రొటీన్‌లో కొన్ని చిట్కాలు పాటించడం తప్పనిసరి. వాటిని పాటించడం వల్ల మెరిసే చర్మాన్ని ఎప్పటికీ మన సొంతం చేసుకోవచ్చు.
shutterstock
మేకప్ తొలగించడం మర్చిపోవద్దు
పొరపాటున కూడా మర్చిపోయి ఎప్పుడైనా మేకప్ తొలగించుకోకుండా నిద్ర పొవడం సరికాదు. మన చర్మం చర్మ రంధ్రాల ద్వారా గాలి పీల్చుకుంటుంది. గాలి పీల్చుకునే వీలుంటేనే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలా లేకుండా చర్మ రంధ్రాలు మూసుకుపోతే ఆ చోట్లలో బ్లాక్ హెడ్స్, మొటిమలు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అస్సలు సమయం లేకపోయినా సరే.. నిద్రకు ఓ ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ మేకప్ తొలగించకుండా మాత్రం నిద్రపోవద్దు. ఒకవేళ మీ దగ్గర సమయానికి మేకప్ రిమూవర్ లేకపోతే మీ ఇంట్లో ఉండే ఆలివ్ ఆయిల్, బేబీ ఆయిల్ ఏదైనా ఉపయోగించవచ్చు.
ఎక్స్ ఫోలియేట్ చేయండి.
మేకప్ తొలగించడంతో పని అయిపోలేదు. రాత్రి పడుకునే ముందు ఎక్స్ ఫోలియేట్ చేసి చర్మాన్ని శుభ్రపర్చుకోవాలి. రోజూ చేయకపోయినా కనీసం వారానికి రెండు సార్లయినా సరే చర్మాన్ని స్క్రబ్ చేసి శుభ్రపర్చుకోవాలి. దీనివల్ల మ్రత చర్మం తొలగిపోయి చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. స్క్రబ్బింగ్ కోసం మార్కెట్లో లభించే స్క్రబ్స్ ని ఉపయోగించవచ్చు లేదా వాల్ నట్ పౌడర్, పెరుగు కలిపి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవచ్చు. వాల్‌నట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు మురికిని తొలగించి.. మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
shutterstock
క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్
ఎక్స్‌ఫోలియేషన్‌తో పాటు క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ కూడా ముఖ్యం. ఎక్స్ ఫోలియేషన్ వల్ల చర్మంపై ఉన్న మురికి మొత్తం తొలగిపోతుంది. ఆ తర్వాత చక్కటి క్లెన్సర్‌తో ముఖం కడుక్కోవడం వల్ల చర్మంపై అవి నిలిచి ఉండకుండా చర్మం మెరిసేలా తయారవుతుంది. ఆ తర్వాత శుభ్రమైన ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఒకవేళ మీ క్లెన్సర్ పీహెచ్ చర్మం పీహెచ్ తో వేరుగా ఉంటే మధ్యలో టోనర్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇలా రోజూ రాత్రి క్లెన్సింగ్, మాయిశ్చరైజేషన్ ఉపయోగించడం వల్ల చర్మం ఎలాంటి మురికి పేరుకోకుండా అందంగా మారడంతో పాటు చర్మానికి అవసరమైన తేమ అందుతుంది కాబట్టి అందంగానూ తయారవుతుంది.
సన్ స్క్రీన్ లోషన్ వాడాల్సిందే
ప్రతిరోజూ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యం బాగుంటుంది. కొందరు ఎండ తక్కువగా ఉందనో మరే ఇతర కారణాల వల్లనో దీనికి దూరంగా ఉంటారు. కానీ ఇది మన చర్మాన్ని యూవీ కిరణాల నుంచి కాపాడుతుందని గుర్తుంచుకోవాలి. ఈ కిరణాలు చాలా తక్కువ ఎండలోనూ ఉంటాయి కాబట్టి కాలమేదైనా.. రోజు ఎలా ఉన్నా తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. కావాలంటే ఇప్పుడు సన్ స్క్రీన్ లోషన్, మాయిశ్చరైజర్ కలిసి వస్తున్న క్రీంలను ఎంచుకోవచ్చు. కానీ సన్ స్క్రీన్ చర్మ రంధ్రాల్లో పేరుకుపొయి మొటిమల్లాంటివి కలిగించకుండా నాన్ యాక్నేజెనిక్ లోషన్ ఉపయోగించాలి.
shutterstock
ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం
మనం ఎలా ఉన్నాం అన్నది మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందంటారు నిపుణులు. అందుకే మీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. చక్కెర తక్కువగా ఉండే డైట్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ పెరిగే అవకాశం లేకుండా జాగ్రత్త పడవద్దు. అలాగే ఉప్పూ కారం ఎక్కువగా ఉన్న ఆహారం, నూనె ఎక్కువగా ఉపయోగించి తయారుచేసిన ఆహారం తీసుకోకూడదు. వీటన్నింటితో పాటు రోజూ వ్యాయామం చేయడం.. ముఖంలోని కండరాలను కూడా కదిలిస్తూ ఉండడం వల్ల ఆరోగ్యం తో పాటు మెరిసే చర్మం కూడా మీ సొంతం అవుతుంది.
చక్కటి నిద్ర
మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరంలోని కణాలన్నీ రిపేర్ ప్రక్రియను చేపడతాయి. చర్మం కూడా డ్యామేజ్ అయిన కణాల స్థానంలో కొత్త కణాలను రూపొందిస్తుంది. ఇదంతా చేయడానికి కాస్త సమయం పడుతుంది .అందుకే మనకు ప్రతి రోజూ ఎనిమిది గంటల పాటు గాఢ నిద్ర ఎంతో అవసరం. ఇది మనకు మెరిసే చర్మాన్ని అందించడంతో పాటు మనం ఎల్లప్పుడూ యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు కూడా సాయపడుతుంది.
shutterstock
తగినన్ని నీళ్లు
రోజూ కనీసం పది నుంచి పన్నెండు గ్లాసుల నీళ్లు తాగడం మన అందానికి, ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను, విషతుల్యాలను బయటకు పంపించేయడానికి తోడ్పడుతుంది. మనం ఎంత ఎక్కువ నీళ్లు తాగితే మన చర్మం అంత మెరుస్తూ కనిపిస్తుంది. అంతే కాదు.. తగినన్ని నీరు తాగడం వల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. తగినన్ని నీరు తాగకపోతే చర్మం డల్‌గా నిర్జీవంగా, పొడిబారిపోయినట్లుగా కనిపిస్తుంది.
అందమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి..మెరిసే ముఖం కోసం ఇంట్లో చేసుకునే ఫేషియల్స్
అందమైన మెరిసే చర్మం కోసం రోజూ స్కిన్ కేర్ రొటీన్ పాటించడంతో పాటు కొన్ని ఫేస్ ప్యాక్స్ కూడా ఉపయోగించవచ్చు. వాటి వల్ల చర్మం మరింత మెరుపును సంతరించుకుంటుంది.
shutterstock
కీర దోస, రాళ్ల ఉప్పుతో..
కావాల్సినవి
కీర దోస – సగం
రాళ్ల ఉప్పు – అర కప్పు
పెప్పర్‌మింట్ ఎస్సెన్షియల్ నూనె – పావు టీస్పూన్
ఫేస్ ప్యాక్ వేసుకునే పద్ధతి
కీర దోసను మిక్సీ పట్టుకొని అందులో రాళ్ల ఉప్పు, ఎస్సెన్షియల్ నూనె వేసి కలిపి దీన్ని ముఖానికి బాగా పట్టించాలి. పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత మరో పది నిమిషాల పాటు అలాగే వదిలేసి చల్లని నీటితో కడుక్కోవాలి.
ప్రయోజనాలు
రాళ్ల ఉప్పులో చర్మానికి అవసరమైన మినరల్స్ అందుబాటులో ఉంటాయి. దీనికి కీరాను కలపడం వల్ల అందులోని గుణాలు చర్మాన్ని చల్లబరుస్తాయి. ఇది చర్మంపై ఉన్న మురికిని తొలగించి ఎక్కువగా ఉన్న నూనెను తొలగిస్తుంది. దీన్ని తరచూ ఉపయోగిస్తే చాలు.. మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
shutter stock
చందనం, తేనె, పాలకూర
కావాల్సినవి
పాలకూర – కట్ట
చందనం – టీస్పూన్
తేనె – టీస్పూన్
ఫేస్ ప్యాక్ వేసుకునే పద్ధతి
ముందుగా పాలకూరను రుబ్బుకొని మెత్తని పేస్ట్ గా చేసి పెట్టుకోవాలి. ఇందులో చందనం పొడి, తేనె కలుపుకొని మంచి మిశ్రమంగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్యాక్‌ని ముఖం మొత్తం పట్టించాలి. మెడకు కూడా రుద్దుకోవచ్చు. తర్వాత దీన్ని బాగా ఆరనిచ్చి చల్లని నీటితో ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
ప్రయోజనాలు
పాలకూరలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మిశ్రమం సెన్సిటివ్ స్కిన్ కోసం అద్భుతమైనదని చెప్పుకోవచ్చు. ఇది చర్మంలో తేమను పెంచడంతో పాటు మచ్చలు, పిగ్మంటేషన్ కూడా తగ్గిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా వాడితే చాలు.. చర్మం మెరిసిపోతుంది.
shutter stock
బాదం నూనె, శెనగ పిండి
కావాల్సినవి
శెనగపిండి – టేబుల్ స్పూన్
బాదం నూనె – టీస్పూన్
ఫేస్ ప్యాక్ వేసుకునే పద్ధతి
ముందుగా శెనగ పిండిని ఓ బౌల్ లో తీసుకొని అందులో బాదం నూనె వేసి క్రీంలా తయారయ్యే వరకూ కలుపుకోవాలి. కావాలంటే బాదం నూనె కాస్త ఎక్కువ లేదా తక్కువ చేసుకోవచ్చు. దీన్ని కలుపుకున్న తర్వాత మిశ్రమాన్ని వేళ్లతో ముఖానికి అప్లై చేసుకోవాలి. గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా పది నిమిషాల పాటు చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.
ప్రయోజనాలు
శెనగపిండి మన చర్మ రంధ్రాలను తెరుస్తుంది. బాదం నూనె మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడే ఎన్నో అత్యవసరమైన విటమిన్లు అందిస్తుంది. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి తేమ అందడంతో పాటు చర్మం పొడిబారకుండా ఉంటుంది.
shutter stock
ద్రాక్ష రసం, చక్కెర
కావాల్సినవి
ద్రాక్ష రసం – రెండు టేబుల్ స్పూన్లు
పెరుగు – టేబుల్ స్పూన్
చక్కెర – రెండు టీస్పూన్లు
ఫేస్ ప్యాక్ వేసుకునే పద్ధతి
ముందుగా ద్రాక్షరసంలో పెరుగు కలుపుకోవాలి. ఆ తర్వాత దాన్ని బాగా కలిపి చక్కెర వేసుకొని అది కరిగే వరకూ కలుపుకోవాలి. ఆ తర్వాత వెంటనే చర్మానికి అప్లై చేసుకోవాలి. వేళ్ల సాయంతో కళ్ల కింద తప్ప మిగిలిన ముఖం మొత్తం మసాజ్ చేసుకోవాలి. తర్వాత పది నిమిషాల పాటు అలాగే ఉంచుకొని గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.
ప్రయోజనాలు
ఈ మాస్క్ మెరిసే చర్మాన్ని అందిస్తుంది. ద్రాక్ష రసంలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇక ఇందులో కొద్దిగా ఉండే చక్కెర చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. దీనివల్ల కొత్త కణాలు పుట్టుకొస్తాయి. చర్మంపై ఉన్న నల్లని మచ్చలను తగ్గిస్తుంది. పిగ్మంటేషన్‌ని కూడా దూరం చేస్తుంది.
shutter stock
నిమ్మరసం, పసుపు
కావాల్సినవి
పసుపు – అర టీస్పూన్
నిమ్మరసం – అర టీస్పూన్
తేనె – టేబుల్ స్పూన్
ఫేస్ ప్యాక్ వేసుకునే పద్ధతి
ముందుగా ఒక బౌల్‌లో తేనె వేసుకోవాలి. ఆ తర్వాత అందులో పసుపు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత పది నిమిషాల పాటు అలాగే ఉంచుకొని తర్వాత గోరు వెచ్చని లేదా చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి.
ప్రయోజనాలు
ఇది చర్మం మెరిసేలా చేసే ప్యాక్స్ లో ఒకటి. దీనిలోని నిమ్మరసం మనకు విటమిన్ సి ని అందిస్తుంది. అది చర్మం పై ఉన్న నల్ల మచ్చలు, నల్ల వలయాలను తగ్గిస్తుంది. తేనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. తేమను కూడా పెంచుతుంది.
shutter stock
పాలు, పసుపు, శనగ పిండి
కావాల్సినవి
శెనగపిండి – రెండు టేబుల్ స్పూన్లు
పసుపు – అర టీస్పూన్
పాలు – టేబుల్ స్పూన్
ఫేస్ ప్యాక్ వేసుకునే పద్ధతి
ఒక బౌల్‌లో శెనగపిండి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో పాలు పోసి బాగా కలుపుకోవాలి. మీకు గట్టిగా కావాలా లేక లూజ్‌గా ఉండాలా చూసుకొని దాని ఆధారంగా పాలను తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అలా పదిహేను నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.
ప్రయోజనాలు
దీన్ని ప్రతి వారం అప్లై చేసుకుంటే చాలు.. ఇందులోని గుణాలు చర్మం మెరిసేలా చేస్తాయి. చర్మంలోని మలినాలన్నింటినీ తొలగించి మెరుపును అందిస్తుంది.
బెల్లం, టొమాటో పేస్ట్ తో
కావాల్సినవి
బెల్లం (పొడి చేసుకోవాలి) – టేబుల్ స్పూన్
రోజ్ వాటర్ – టీస్పూన్
టొమాటో గుజ్జు – టీస్పూన్
ఫేస్ ప్యాక్ వేసుకునే పద్ధతి
ముందుగా టొమాటో గుజ్జులో బెల్లం పొడిని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దానికి తగినంత రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని ముఖానికి దీన్ని అప్లై చేసుకొని పావుగంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి.
ప్రయోజనాలు
జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది చక్కటి హెర్బల్ ఫేస్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. బెల్లం ముఖంపై ఎక్కువ నూనె విడుదల కాకుండా ఆపుతుంది. ఈ ఫేస్ ప్యాక్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొల్లాజెన్ ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇది చర్మం రంగును కూడా పెంచుతుంది.
shutter stock
బంతి పూలు, గులాబీ రేకులు
కావాల్సినవి
బంతి పూరేకులు – గుప్పెడు
గులాబీ పూరేకులు – గుప్పెడు
బాదం నూనె – టీస్పూన్
ఫేస్ ప్యాక్ వేసుకునే పద్ధతి
ముందుగా బంతి, గులాబీ రేకులను రుబ్బి అందులో బాదం నూనెను కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. తర్వాత పావు గంట పాటు ఉంచుకొని గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.
ప్రయోజనాలు
బంతి పూరేకులు చర్మంలో తేమను పెంచుతాయి. చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తాయి. బాదం నూనెతో పాటు గులాబీ రేకులు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. ఈ మాస్క్ మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. ముఖాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది.
shutter stock
దానిమ్మ, కీర దోసలతో..
కావాల్సినవి
దానిమ్మ గింజలు – అర కప్పు
కీర దోస – ఒకటి
ఫేస్ ప్యాక్ వేసుకునే పద్ధతి
దీన్ని ఎప్పటికప్పుడు తాజాగా చేసుకొని గంటలోపు వాడితే మంచి ఫలితాలు పొందవచ్చు. దీనికోసం కీర దోసను తురిమి రసం పిండుకోవాలి. దానిమ్మ గింజలను కూడా మిక్సీ పట్టుకొని వడగట్టుకోవాలి. ఈ రెండింటినీ వేర్వేరుగా ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. రోజూ ఉదయాన్నే రెండింటి నుంచి టీస్పూన్ చొప్పున రసాన్ని తీసుకొని వాటిని ఒక బౌల్ లో వేసి కలుపుకోవాలి. అందులో కాటన్ వేసి దానితో ముఖం తుడుచుకోవాలి. ఇది మంచి టోనర్ పనిచేస్తుంది.
ప్రయోజనాలు
దానిమ్మ, కీర రెండింటి రసం చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మురికిని దూరం చేస్తుంది. మ్రత కణాలను కూడా దూరం చేసి డల్‌గా మారిన చర్మానికి మెరుపును అందిస్తుంది.
shutter stock
దాల్చిన చెక్క, తేనె ఫేస్ ప్యాక్
కావాల్సినవి
దాల్చిన చెక్క – టీస్పూన్
తేనె – రెండు టీస్పూన్లు
ఫేస్ ప్యాక్ వేసుకునే పద్ధతి
ఈ రెండింటినీ ఓ బౌల్‌లో వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం అయ్యే వరకూ మిక్స్ చేసి దాన్ని వేళ్ల సాయంతో ముఖానికి అప్లై చేసుకోవాలి. కళ్ల వద్ద తప్ప ముఖం, మెడ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత పావు గంట పాటు అలా ఉంచుకొని గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. దాల్చిన చెక్క మీ ముఖంపై మంట వచ్చేలా చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే దీన్ని వారానికి రెండు సార్లకు మించి ఉపయోగించడం సరికాదు.
ప్రయోజనాలు
దాల్చిన చెక్క ముఖంపై ముడతలను తగ్గించి రక్త ప్రసరణను పెంపొందిస్తుంది. అంతేకాదు.. దాల్చిన చెక్క, తేనె లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ ఫేస్ మాస్క్ వల్ల మొటిమలు పూర్తిగా తగ్గుతాయి.
అందమైన ముఖం కోసం చేయకూడని పనులు
shutter stock
అందమైన మెరిసే ముఖం కోసం చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. అయితే చేయకూడని పనులు కూడా కొన్ని ఉంటాయి.
1. వ్యాయామం మర్చిపోవద్దు. వ్యాయామం చేయడం వల్ల చెమట పట్టి చర్మ రంధ్రాలు శుభ్రంగా మారతాయి. ఎక్కువగా నూనెలు విడుదలవకుండా టోనర్ రాసుకొని వెళ్లడం.. రాగానే ఎక్స్ ఫోలియేట్ చేసి ముఖం శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మానికి తేమ అందుతుంది.
2. ముఖం కడుక్కోవడానికి ఎప్పుడూ వేడి నీటిని ఉపయోగించకూడదు. పొడి చర్మం కోసం ఆల్కహాల్ రహిత క్లెన్సర్లను ఎంచుకోవాలి. ఎందుకంటే వేడినీరు, ఆల్కహాల్ చర్మం నుంచి తేమను తొలగిస్తాయి.
3. రోజూ ఉదయాన్నే రోజ్ వాటర్‌తో ముఖాన్ని కడుక్కోవాలి. దీనివల్ల పీహెచ్ బ్యాలన్స్ అవడంతో పాటు రోజంతా చర్మంలోని తేమను నిలిపి ఉంచుతుంది.
4. సాధారణంగా మొటిమలు రాగానే దాన్ని గిల్లడం మనలో చాలామందికి అలవాటు దీనివల్ల మచ్చలు పడిపోయి ఆ ప్రాంతం మొత్తం నల్లగా కనిపిస్తుంది. అందుకే మొటిమలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ ప్రాంతాన్ని రోజ్ వాటర్ తో శుభ్రం చేసి చల్లని గ్రీన్ టీ బ్యాగ్ ని దానిపై ఉంచండి. దీని వల్ల మొటిమలు తగ్గిపోతాయి.
5. వీటన్నింటితో పాటు నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, ఉప్పు, కారం ఎక్కువగా ఉండే ఆహారం, ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం తగ్గించాలి. వీలుంటే పూర్తిగా మానేయాలి.
6. చర్మంపై మచ్చలు, ముడతలు లేకుండా ఉంటూ చర్మం మెరుస్తుండడమే అందమైన చర్మం అని చెప్పుకోవచ్చు. దీని కోసం రోజూ కనీసం ఐదు నిమిషాల పాటు ఫేషియల్ ఎక్సర్ సైజులు చేయాలి.
7. ఒత్తిడి తగ్గించుకొని రోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. దీనివల్ల కళ్ల చుట్టూ నల్లని వలయాలు తగ్గుతాయి. ఇప్పటికే ఉన్నవి తగ్గేందుకు నల్లని వలయాలపై ఐస్ ముక్కలతో రుద్దితే సరిపోతుంది.
తరచూ అడిగే ప్రశ్నలు, సమాధానాలు
1. రాత్రికి రాత్రే చర్మాన్ని మెరిపించడం సాధ్యమవుతుందా?
shutter stock
చర్మాన్ని కొద్ది సమయంలో మెరిపించడం కాస్త కష్టమే కానీ ఇంట్లో తయారుచేసుకున్న ఫేస్ ప్యాక్స్ ఉపయోగించడం వల్ల కాస్త మెరిసినట్లుగా కనిపించే వీలుంటుంది. వీటితో పాటు రాత్రి పూట చర్మానికి చిక్కని పాలు లేదా బొప్పాయి తేనె మిశ్రమం, లేక ఆలివ్, బాదం నూనెల్లో ఏదో ఒకటి.. కలబంద గుజ్జు.. వీటిలో ఏదో ఒకటి ఉపయోగించడం వల్ల చర్మం ఉదయానికల్లా కాస్త మెరుపును సంతరించుకుంటుంది. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం మెరుస్తూ కనిపిస్తుంది.
2. చలికాలంలో ముఖాన్ని మెరిపించడం ఎలా?
చలికాలంలో ముఖం పొడిబారిపోయి.. ముడతలతో కనిపిస్తుంటుంది. దీన్ని తగ్గించుకునేందుకు మరీ వేడి నీటితో కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ముఖం కడుక్కోవడానికి కూడా అలాంటి నీటినే ఉపయోగించాలి. మంచి మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. ముఖం కడుక్కోగానే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. స్వెటర్, గ్లవ్స్, స్కార్ఫ్ వంటివి ఉపయోగించాలి. చలికాలం కదా అని నీరు తక్కువగా తాగకూడదు. రాత్రి పూట కేవలం ముఖానికే కాకుండా చర్మభాగాలన్నింటినీ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇంట్లో తయారుచేసుకునే మాస్క్ లను ఎక్కువగా ఉపయోగించాలి.
3. నల్లని చర్మాన్ని మెరిపించడం ఎలా?
shutter stock
చర్మం రంగుకి మెరుస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి సంబంధం ఉండదు. కాస్త నల్లని చర్మం ఉన్నవారు కూడా చర్మాన్ని ఆరోగ్యంగా మెరుస్తూ ఉండేలా చేసుకోవచ్చు. దీని కోసం రోజూ ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నానబెట్టిన వస్త్రాన్ని ముఖంపై వేసుకోవాలి. అలా పావుగంట పాటు ఉంచుకొని తీసిన తర్వాత ఆర్గానిక్ క్లెన్సర్ తో ముఖం కడుక్కోవాలి. నిమ్మరసంతో తయారుచేసిన టోనర్ ని ఉపయోగిస్తూ.. కొబ్బరి, ఆలివ్, జొజొబా నూనెతో చర్మాన్ని రోజూ మసాజ్ చేసుకోవాలి. మీ చర్మంలోని తేమను, ఆయిల్స్ ని లాగేసే ఆల్కహాల్ ఎక్కువగా ఉన్న క్లెన్సర్స్ ని ఉపయోగించకూడదు. అలాగే బయటకు వెళ్తున్నప్పుడు మంచి మాయిశ్చరైజర్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు.
4. మెరిసే చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
చర్మం అందంగా మెరవాలంటే ముందు ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. రోజూ పది నుంచి పన్నెండు గ్లాసుల నీళ్లు తాగడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది. దీంతో పాటు ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవే కాదు.. పసుపు, సిట్రస్ పండ్లు, మామిడి, అరటి, బొప్పాయి, యాపిల్, బెర్రీస్ వంటి పండ్లతో పాటు క్యారట్లు, చేపలు, గ్రీన్ టీ, పెరుగు, సొరకాయ, కాకరకాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.