ఎవరైనా పొడుగు జుట్టున్న(long hair) అమ్మాయిలు కనిపిస్తే.. ‘వీళ్లు తలకి ఏం రాసుకుంటున్నారో గానీ.. నాక్కూడా జుట్టు అలాగే పెరిగితే బాగుండు’ అనుకోకుండా ఉండలేం. జుట్టు రాలకుండా ఉండటానికి, పొడవుగా పెరగడానికి(Hair growth) బహుశా మనం ఉపయోగించినన్ని ఉత్పత్తులు మరెవ్వరూ ఉపయోగించి ఉండరు. అయినా సమస్య మాత్రం అలాగే ఉంటుంది. జేబుకు మాత్రం చిల్లుపడుతుంది. అప్పుడప్పుడూ పైసలతో పని లేకుండా జుట్టు(hair) పొడవుగా అయ్యే మార్గం ఏమైనా ఉంటే బాగుండనని కూడా అనిపిస్తుంది. ఇలా వివిధ రకాల చిట్కాలన్నీ ప్రయత్నించి విసిగి వేసారిపోయిన వారికోసమే ఈ కథనం. చిన్న చిన్న చిట్కాలు (tips) పాటించడం ద్వారా జుట్టు పొడవుగా, ఒత్తుగా అయ్యేలా చేసుకోవచ్చు.
Table of Contents
- జుట్టు పొడవుగా అయ్యేలా చేసే చిట్కాలు(Tips to make your hair grow long)
- సాధారణమైన జుట్టు కోసం హెయిర్ మాస్క్స్(Hair masks for normal hair)
- ఆయిలీ హెయిర్ కోసం హెయిర్ మాస్క్స్(Hair masks for oily hair)
- డ్రై హెయిర్ కోసం హెయిర్ మాస్క్స్(Hair masks for dry hair)
- జుట్టును పొడవుగా చేసే నూనెలు (Hair oils that make your hair long)
- తరచూ అడిగే ప్రశ్నలు(Frequently asked questions)
జుట్టు పొడవుగా అయ్యేలా చేసే చిట్కాలు(Tips to make your hair grow long)
కురులు ఒత్తుగా, పొడవుగా ఎదగడానికి పార్లర్‌కి, సెలూన్‌కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా జుట్టు రాలకుండా చూసుకోవచ్చు. అవి మరికాస్త పొడవు పెరిగేలా చేయచ్చు. మరింకెందుకాలస్యం.. ఆ చిట్కాలేంటో మీరూ తెలుసుకుని పొడవాటి జడని సొంతం చేసుకోండి.
ట్రిమ్మింగ్
మీ జుట్టు పొడవు పెరగాలని మీరు భావిస్తే.. నాలుగు నుంచి ఆరు వారాలకోసారి వెంట్రుకల చివర్లను ట్రిమ్ చేస్తుండాలి. వెంట్రుకలను ఇలా కత్తిరించడం వల్ల మనం ఊహించినంత వేగంగా జుట్టు పెరగకపోవచ్చు. కానీ దీనివల్ల జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి. కాబట్టి జుట్టు ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది. అలాగే.. వాటి పెరుగుదల సైతం మెరుగుపడుతుంది.
కండిషనింగ్
తలస్నానం చేసేటప్పుడు షాంపూకి ఎంత ప్రాధాన్యమిస్తామో.. కండిషనర్‌కి కూడా అంతే ప్రాధాన్యమివ్వాలి. ఎందుకంటే షాంపూ జుట్టు, స్కాల్ప్ పై చేరిన మురికి, జిడ్డును వదలగొడుతుంది. కండిషనర్ జుట్టుకి అవసరమైన పోషణ అందిస్తుంది. అలాగే దాన్ని ఒత్తుగా కనిపించేలా చేస్తుంది. జుట్టు తెగిపోకుండా చూస్తుంది.
చల్లటి నీటితో..
తలస్నానం పూర్తయిన తర్వాత కచ్చితంగా ఓ మగ్గుడు చల్లటి నీటిని తలపై పోసుకోవాల్సి ఉంటుంది. తలస్నానం చేసిన ప్రతిసారీ ఈ చిట్కాను పాటించడం మరచిపోవద్దు. ఎందుకంటే.. చల్లటి నీరు వేడి నీటి వల్ల జుట్టు కోల్పోయిన తేమను తిరిగి అందిస్తుంది. జుట్టు పొడిబారిపోకుండా కాపాడుతుంది. ఫలితంగా జుట్టు ఆరోగ్యం మెరుగుపడి.. పొడవుగా, లావుగా తయారవుతుంది.
హెయిర్ స్టైలింగ్ టూల్స్ కి దూరంగా..
హెయిర్ స్ట్రెయిటనర్, కర్లర్ వంటి పరికరాలు ఉపయోగించడం నేటి కాలం అమ్మాయిలకు పరిపాటిగా మారిపోయింది. కానీ వీటివల్ల మనకు జరిగే మేలు కంటే.. నష్టమే ఎక్కువ. వీటి నుంచి వెలువడే ఉష్ణం వల్ల కొన్నిసార్లు వెంట్రుకలు కాలిపోతుంటాయి. అందుకే హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ మీకు హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులు ఉపయోగించడం తప్పనిసరి అయితే.. హీట్ ప్రొటెక్టెంట్ ఉత్పత్తులు వాడటం మంచిది.
ఆరోగ్యకరమైన ఆహారం..
మనం తీసుకునే ఆహారం కూడా వెంట్రుకల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. జుట్టు రాలిపోవడం ఆగిపోయి.. లావుగా, ఒత్తుగా పెరగాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే వాటిని కచ్చితంగా మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కోడిగుడ్లు, పప్పులు, బాదం, వాల్నట్.. వంటి వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతిరోజూ తినాల్సి ఉంటుంది. రెండు మూడు నెలల తర్వాత మార్పు కచ్చితంగా తెలుస్తుంది.
- పొడి జుట్టున్నవారు విటమిన్లు, ప్రొటీన్లు అధికంగా ఉన్న పప్పులు, గింజలు, అరటి పండు, బ్రౌన్ రైస్ ఆహారంగా తీసుకోవాలి.
- ఆయిలీ హెయిర్ కలిగినవారు.. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తినాల్సి ఉంటుంది.
- జుట్టు ఒత్తుగా పెరగాలనుకుంటే.. గుడ్లు, చేపలు, ఆకుకూరలు, మాంసం తినాల్సి ఉంటుంది.
- జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. పట్టులా మెరిసిపోవాలని కోరుకునేవారు విటమిన్ ఎ, సి ఉన్న ఆహార పదార్థాలు తినాలి. అంటే క్యారెట్, స్వీట్ పొటాటో, గుమ్మడి, బ్రొకోలీ, సిట్రస్ జాతి పళ్లు తినాల్సి ఉంటుంది.
కాలుష్యం నుంచి రక్షణ
జుట్టు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తే… ముందు దాన్ని కాలుష్యం బారి నుంచి రక్షించాలి. ముఖ్యంగా గాలి కాలుష్యం, సూర్యకిరణాలు, అధికంగా క్లోరినేట్ చేసిన నీరు కురుల ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. అందుకే వాటి బారిన పడకుండా జుట్టును సంరక్షించుకోవాలి. స్కార్ఫ్, టోపీల సాయంతో కురులను కాపాడుకోవచ్చు. అలాగే స్నానం చేసేటప్పుడు తలపై షవర్ క్యాప్ పెట్టుకోవడం మంచిది.
స్కాల్ప్ శుభ్రంగా
జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే పాటించాల్సిన మరో చిట్కా – మాడుని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం. స్కాల్ఫ్ ఎప్పుడైనా జిడ్డుగా, దురుదగా అనిపిస్తే వెంటనే తలస్నానం చేయాలి. దీనివల్ల మాడుపై చేరిన దుమ్ము, జిడ్డు తొలగిపోతాయి. అది వేసవి కాలమైనా.. శీతాకాలమైనా.. ఈ చిట్కాను పాటించాల్సిందే. అలాగని ఎక్కువసార్లు తలస్నానం చేస్తే జుట్టు పొడిగా మారిపోతుంది. వారానికి రెండు నుంచి మూడుసార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. మీది డ్రై హెయిర్ అయితే.. ఆయిల్ కలిగి ఉన్న షాంపూ ఉపయోగించాలి. ఆయిలీ హెయిర్ అయితే జెల్ బేస్డ్ షాంపూ ఉపయోగించడం మంచిది.
జుట్టు ఫ్లిప్ చేయండి..
జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకునే విషయంలో అతి సులభమైన, ప్రభావవంతమైన చిట్కా ఇది. దీన్ని పాటించాలంటే.. మనం కాస్త కిందకు వంగి.. జుట్టును వెనక నుంచి ముందుకు వచ్చేలా వేసుకోవాలి. అంటే జుట్టు మొత్తం ముఖం మీద నుంచి కిందికి వేలాడుతుంది. ఇదే స్థితిలో రెండు నిమిషాలుండి.. మెల్లగా కుదుళ్లను మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు పొడవుగా తయారవుతాయి.
రసాయన ఉత్పత్తులకు దూరంగా..
ప్రస్తుతం మనం ఉపయోగించే.. షాంపూలు, కండిషనర్లు, హెయిర్ కలర్ తదితర ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం రసాయన పదార్థాలతోనే తయారువుతున్నాయి. వీటిని మనం ఉపయోగిస్తే.. కురులు పెరగడం మాట పక్కన పెడితే.. అవి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. కాబట్టి రసాయనాలు ఉపయోగించకుండా సహజసిద్ధమైన ఉత్పత్తులతో తయారైన షాంపూలు, కండిషనర్లు ఉపయోగించడం మంచిది.
నిద్ర పోయే ముందు తల దువ్వుకుని
రాత్రి మీకు ఎంత నిద్ర ముంచుకు వచ్చేస్తున్నా సరే.. చిక్కులు పడిన జుట్టుతో మాత్రం నిద్రపోవద్దు. మీకు పొడవైన, అందమైన జుట్టు కావాలంటే.. చక్కగా దువ్వుకుని వదులుగా జడవేసుకోవాల్సి ఉంటుంది. దువ్వుకోవడం వల్ల వెంట్రుకల కుదుళ్లకు రక్తసరఫరా సక్రమంగా జరుగుతుంది. అలాగే ముడి వేసుకోవడం లేదా జుట్టు విరబోసుకుని పడుకోవడం వల్ల జుట్టు చిక్కులు పడిపోవడంతో పాటు.. రాపిడికి గురై తెగిపోతుంది.
తడి తలను దువ్వుకోవద్దు..
ఆఫీసుకి లేదా కాలేజీకి సమయం అయిపోతుందనే కారణంతో చాలామంది తల తడిగా ఉన్నప్పుడే దువ్వేసుకుంటారు. మరికొందరేమే తల తడిగా ఉన్నప్పుడు దువ్వు కుంటే చిక్కు త్వరగా వచ్చేస్తుందని భావించి దువ్వుకుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు సాగిపోయి బలహీనంగా తయారవుతుంది. ఒకవేళ దువ్వుకోక తప్పని పరిస్థితి ఎదురైతే.. వెడల్పు పళ్లున్న దువ్వెనతో దువ్వుకోవాల్సి ఉంటుంది.
తడి తలను మసాజ్
జుట్టు ఆరోగ్యంగా, పొడవుగా పెరగడానికి హెయిర్ మసాజ్ చేసుకోవడం చాలా ముఖ్యమని మనకు తెలుసు. అందుకే మనం నూనె పెట్టుకుని మర్దన చేసుకుంటూ ఉంటాం. అయితే తలస్నానం చేసే సమయంలో తడిగా ఉన్న తలను మసాజ్ చేసుకున్నా ఇదే ఫలితం కనిపిస్తుంది. ఇలా మసాజ్ చేసుకోవడానికి ఓ చిన్న టెక్నిక్ పాటించాలి. మెడ దగ్గర నుంచి మొదలుపెట్టి.. మునివేళ్లతో సున్నితంగా రుద్దుకుంటూ.. నెమ్మదిగా చేతివేళ్లను నుదుటి మీదకు తీసుకురావాలి. ఇలా కాసేపు మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా కురులకు సరిపడినంత పోషకాలు అందుతాయి. దీని వల్ల కురులు ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి.
Shutterstock
సాధారణమైన జుట్టు కోసం హెయిర్ మాస్క్స్(Hair masks for normal hair)
వెంట్రుకల చివర్లు చిట్లడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బ తిని రాలిపోతుంటాయి. లేదా పెరగడం ఆగిపోతాయి. ఈ సమస్యలను తగ్గించి జుట్టును ఆరోగ్యంగా చేసే హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం ద్వారా సాధారణమైన జుట్టు కలిగినవారు మంచి ఫలితాలను పొందవచ్చు.
1. శెనగపిండి, బాదం, గుడ్డు
శెనగపిండి రెండు టేబుల్ స్పూన్లు, బాదం గింజల పొడి రెండు టేబుల్ స్పూన్లు, గుడ్డు తెల్లసొన ఒకటి తీసుకోవాలి. వీటన్నింటినీ గిన్నెలో వేసి ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకుని అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.
2. బీర్ హెయిర్ ప్యాక్
టీస్పూన్ నిమ్మరసం, టీస్పూన్ బాదం నూనె, నాలుగు టేబుల్ స్పూన్ల బీర్, టేబుల్ స్పూన్ తేనె, గుడ్డు తెల్లసొన ఒకటి తీసుకోవాలి. వీటన్నింటినీ బ్లెండర్లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టును పైకి మడిచి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. 30 నుంచి 40 నిమిషాల తర్వాత షాంపూ చేసుకోవాలి.
3. బంగాళాదుంప, కలబంద, తేనె
పెద్ద సైజులో ఉన్న బంగాళాదుంపను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఆ తర్వాత బంగాళాదుంప గుజ్జును గుడ్డలో వేసి గిన్నెలోకి రసాన్ని పిండాలి. దీనిలో రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి తలకు షవర్ క్యాప్ లేదా టవల్ చుట్టుకోవాలి. రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
4. పాలు, తేనె
గ్లాసు పచ్చి పాలల్లో చెంచా తేనె కలిపి స్కాల్ప్‌కి రాసుకుని కాసేపు మసాజ్ చేసుకోవాలి. స్కాల్ప్‌కి మాత్రమే కాకుండా వెంట్రుకలు మొత్తానికి ఈ మిశ్రమాన్ని రాసుకుని అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే కురులు అందంగా, ఆరోగ్యంగా తయారవుతాయి.
5. మెంతులతో హెయిర్ ప్యాక్
మెంతులను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తటి పేస్ట్‌లా తయారుచేయాలి. దీన్ని తలకు మాస్క్ లా వేసుకుని ఇరవై నిమిషాల తర్వాత షాంపూ చేసుకుంటే సరిపోతుంది. మెంతులు చుండ్రును తగ్గిస్తాయి. అలాగే జుట్టుకు అవసరమైన పోషణ అందించి రాలడాన్ని నివారిస్తాయి.
Shutterstock
ఆయిలీ హెయిర్ కోసం హెయిర్ మాస్క్స్(Hair masks for oily hair)
ఆయిలీ హెయిర్ కలిగిన వారు వేసుకునే హెయిర్ మాస్క్ లేదా హెయిర్ ప్యాక్ మాడు, జుట్టుపై అధికంగా ఉన్న జిడ్డును తొలగించడంతో పాటు.. వెంట్రుకలు ఆరోగ్యంగా మార్చేదై ఉండాలి. అప్పుడే జుట్టు పొడవుగా, అందంగా ఉంటుంది. అలాంటివే ఈ హెయిర్ ప్యాక్స్..
1. కొబ్బరి పాలు
కొబ్బరిపాలలో రెండు టేబుల్ స్పూన్ల చొప్పున శెనగ పిండి, మెంతి పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకుని కాసేపు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత తలకు షవర్ క్యాప్ పెట్టుకుని గంట సమయం ఆగాలి. అనంతరం షాంపూ చేసుకొని కండిషనర్ రాసుకోవాలి. కొబ్బరిపాలు జుట్టుకి అవసరమైన పోషణ అందిస్తే, మెంతి పిండి చుండ్రు సమస్యను నివారిస్తుంది. శెనగపిండి కురులపై అధికంగా ఉన్న జిడ్డును తొలగిస్తుంది.
2. నిమ్మరసం, కోడిగుడ్డు, కలబంద
టేబుల్ స్పూన్ చొప్పున తేనె, కలబంద గుజ్జు, నిమ్మరసం తీసుకోవాలి. వీటన్నింటినీ కోడిగుడ్డు తెల్లసొనలో వేసి బాగా కలిపి స్కాల్ప్‌కి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి. అనంతరం కండిషనర్ రాసుకోవాల్సి ఉంటుంది. తలస్నానానికి వేడిగా ఉన్న నీరు ఉపయోగించకూడదు. ఎందుకంటే.. వేడి నీటి వల్ల జుట్టు కోడిగుడ్డు వాసన రావడానికి అవకాశం ఉంది.
3. స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్
మీ జుట్టు పొడవును బట్టి పావుకప్పు లేదా అరకప్పు స్ట్రాబెర్రీలను తీసుకోవాలి. వాటి గింజలను తొలగించి మిక్సీలో వేసి పేస్ట్ మాదిరిగా తయారుచేసుకోవాలి. దీన్ని స్కాల్ప్, కురులకు అప్లై చేసుకుని పది నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. షాంపూ ఉపయోగించాల్సిన అవసరం లేదు.
4. నిమ్మరసం, తేనె, ముల్తానీ మట్టి
మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, కొన్ని చుక్కల నిమ్మరసం, కొద్దిగా తేనె, సరిపడినంత నీరు వేసి పేస్ట్ లా తయారుచేయాలి. దీన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
5. గ్రీన్ టీ
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాలామంది గ్రీన్ టీ తాగుతుంటారు. దీన్ని కురుల ఆరోగ్యం కాపాడుకోవడానికి సైతం ఉపయోగించవచ్చు. దీని కోసం కప్పు గ్రీన్ టీ తయారుచేసి చల్లారనివ్వండి. షాంపూ చేసుకోవడం పూర్తయిన తర్వాత దీనిని తలపై పోసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి.
Shutterstock
డ్రై హెయిర్ కోసం హెయిర్ మాస్క్స్(Hair masks for dry hair)
పొడి జుట్టు కలిగిన వారు తమ జుట్టు స్మూత్‌గా ఉంటే బాగుంటుందని భావిస్తారు. దానితో పాటుగా జుట్టు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఈ హెయిర్ ప్యాక్స్ వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
1. తేనె, బాదం, మిల్క్ క్రీం
నాలుగు టేబుల్ స్పూన్ల తేనె, నాలుగు బాదం గింజలు (నానెబెట్టినవి), అర టీస్పూన్ రోజ్ వాటర్, రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ క్రీం తీసుకోవాలి. బాదం గింజలను రోజ్ వాటర్లో కలిపి పేస్ట్‌గా తయారుచేయాలి. ఈ పేస్ట్‌కు తేనె, మిల్క్ క్రీం వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని తలకు అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాల్సి ఉంటుంది.
2. గుడ్డు పసుపు సొన
సాధారణంగా జుట్టుకి ఎగ్ వైట్ మాస్క్ వేసుకుంటాం కానీ.. పసుపు సొనను పెద్దగా ఉపయోగించం. కానీ పొడిజుట్టుతో ఇబ్బంది పడేవారు పసుపు సొనను హెయిర్ మాస్క్‌గా వేసుకోవాల్సి ఉంటుంది. రెండు గుడ్లు తీసుకుని వాటిలోంచి పసుపు సొనను వేరు చేయాలి. వీటికి మూడు టేబుల్ స్పూన్ల నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎగ్ బీటర్ సాయంతో బాగా కలపాలి. ఆ తర్వాత దీన్ని తలకు అప్లై చేసుకుని అరగంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అయితే తలస్నానానికి చల్లటి నీటిని ఉపయోగించాలి. వేడి నీరు ఉపయోగిస్తే వెంట్రుకలు నీచు వాసన వస్తాయి.
3. అవకాడో, అరటి
బాగా ముగ్గిన అవకాడో, అరటిపండు తీసుకోవాలి. ఈ రెండింటినీ మెత్తగా చేసి మిశ్రమంగా కలుపుకోవాలి. దీన్ని తలకు మాస్క్‌లా అప్లై చేసుకుని అరగంట తర్వాత తలస్నానం చేయాలి. అరటి, అవకాడో రెండూ కురులకు పోషణ ఇచ్చేవే. ఇవి కుదుళ్లకు పోషణ ఇచ్చి జుట్టు ఎదిగేలా చేస్తాయి.
4. తేనె, కొబ్బరి నూనె
టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని ఈ రెండింటినీ చిక్కటి మిశ్రమంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకూ అప్లై చేసి 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. కొబ్బరి నూనె, తేనె రెండూ జుట్టును మాయిశ్చరైజ్ చేసేవే.ఇవి కురులను మరింత మెత్తగా, మ్రుదువుగా మారుస్తాయి.
5. పెరుగు, కలబంద, కొబ్బరి నూనె
మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, నాలుగు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని మూడింటిని మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని హెయిర్ ప్యాక్‌లా వేసుకుని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో షాంపూ చేసుకోవాలి. కలబంద స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. కొబ్బరినూనె జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్ వెంట్రుకలను పెరిగేలా చేస్తాయి.
ఫైన మనం చెప్పుకున్న హెయిర్ ప్యాక్స్‌లో ఏదైనా సరే వారానికి రెండు సార్లు వేసుకోవడం ద్వారా జుట్టు రాలడం ఆగడంతో పాటు కురులు నెమ్మదిగా పొడవు పెరగడం ప్రారంభిస్తాయి.
Shutterstock
జుట్టును పొడవుగా చేసే నూనెలు (Hair oils that make your hair long)
క్రమం తప్పకుండా నూనె రాసుకోవడం మన దైనందిన జీవితంలో భాగం. దాని కోసం మనం వివిధ బ్రాండ్లకు చెందిన రకరకాల నూనెలు ఉపయోగిస్తాం. అయితే ప్రయోజనం పెద్దగా కనిపించదు. దీనికి కారణం మన సమస్యకు తగిన నూనెను ఎంచుకోకపోవడమే. జడ పొడవుగా, లావుగా ఉండాలనుకునేవారు దానికి తగిన నూనెలు ఉపయోగించడం ద్వారా కోరుకున్న ఫలితాన్ని సాధించవచ్చు. ఎలాంటి నూనెలు వాడితే కురులు అందంగా పెరుగుతాయో తెలుసుకుందాం.
1. ఆముదం
జుట్టు బాగా పొడవు పెరగాలనుకునేవారు ఆముదాన్ని తమ హెయిర్ కేర్ రొటీన్లో భాగం చేసుకోవాల్సిందే. ఆముదంలో విటమిన్ ఇ, ప్రొటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ మైక్రోబియల్ గుణాలుంటాయి. ఇవి చుండ్రు, ఇతర స్కాల్ఫ్ సమస్యలను సమర్థంగా తగ్గిస్తాయి. ఆముదాన్ని తలకు రాసుకోవడం వల్ల జుట్టు సాఫ్ట్ గా తయారవుతుంది. పొడవుగా ఎదుగుతుంది. మునివేళ్లతో ఆముదాన్ని మాడుకు రాసుకుని మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత వెంట్రుకలకు కూడా ఆముదాన్ని రాసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. వెంట్రుకలకు తగిన పోషణ అందుతుంది.
ఆముదం నూనెతో కలిగే.. సౌందర్య ప్రయోజనాలివే..!
2. నువ్వుల నూనె
జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది నువ్వుల నూనె. ఆయుర్వేదంలో సైతం ఈ నూనెకు ప్రత్యేకమైన ప్రాధాన్యముంది. దీనిలో స్కాల్ఫ్ పై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గించే ఔషధ గుణాలున్నాయి. కాబట్టి ఈ నూనె రాసుకోవడం ద్వారా జుట్టు రాలడానికి కారణమవుతున్న చుండ్రు లాంటి సమస్యలు తగ్గిపోతాయి. నువ్వుల నూనెను గోరువెచ్చగా వేడి చేసి తలకు రాసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ నూనెలో ఉండే విటమిన్ ఇ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు ఈ నూనె ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
3. అర్గాన్ ఆయిల్
ప్రస్తుతం బ్యూటీ ఇండస్ట్రీలో అర్గాన్ ఆయిల్ ఓ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ఈ నూనె వెంట్రుకలను మాయిశ్చరైజ్ చేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ దెబ్బతిన్న కురులను తిరిగి ఆరోగ్యంగా మారుస్తాయి. ఈ నూనెలో ఉన్న విటమిన్ ఇ కురులకు చక్కని పోషణ అందించి అవి ఆరోగ్యంగా ఎదిగేలా దోహదం చేస్తుంది. చివర్లు చిట్లే సమస్య ఉన్నవారు ఈ నూనె ఉపయోగించడం మంచిది. ఇది జుట్టును మాయిశ్చరైజ్ చేసి చివర్లు చిట్లకుండా చేస్తుంది. ఫలితంగా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
4. ఆలివ్ నూనె
జుట్టు, స్కాల్ఫ్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జుట్టును పొడవుగా, బలంగా మారుస్తుంది ఆలివ్ నూనె. దీనిలో జుట్టు పోషణకు అవసరమైన విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది వెంట్రుకల్లోని తేమను బయటకు పోకుండా లాక్ చేస్తుంది. ఆలివ్ నూనెను కొద్దిగా వేడి చేసి తలకు అప్లై చేసుకోవాలి. వేడి నీటిలో ముంచి బాగా పిండిన టవల్ ను తలకు చుట్టుకుని అరగంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం మంచిది.
అందం, ఆరోగ్యం రెండూ అందించే ఆలివ్ నూనె గురించి.. మీరు తెలుసుకోవాల్సిందే..!
5. లావెండర్ ఆయిల్
జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు లావెండర్ ఆయిల్ ఉపయోగించడం మంచిది. కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల లావెండర్ నూనె కలిపి దాన్ని ప్రతిరోజూ తలకు రాసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్య తగ్గేలా చేసుకోవచ్చు.
Shutterstock
తరచూ అడిగే ప్రశ్నలు(Frequently asked questions)
1. నా జుట్టు చివర్లు చిట్లిపోతుంటాయి. ఎంత తరచుగా నేను చివర్లను ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది?
చాలామంది జుట్టు కత్తిరించుకుంటే పొడవు తగ్గిపోతుందనుకుంటారు. కానీ స్ప్లిట్ ఎండ్స్ ఉన్నప్పుడు వాటిని తొలగించుకోకపోతే జుట్టుకు మరింత హాని చేస్తాయి. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవడం మంచిది. అప్పుడు జుట్టు మరింత పొడవుగా పెరుగుతుంది. 6-8 వారాలకోసారి ట్రిమ్మింగ్ చేసుకోవడం ద్వారా స్ప్లింట్ ఎండ్స్ ప్రభావం నుంచి వెంట్రుకలను కాపాడుకోవచ్చు.
2. నేను హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులు అసలు ఉపయోగించను. తలస్నానానికి ముందు కచ్చితంగా నూనె రాసుకుంటాను. అయినా వెంట్రుకల చివర్లు చిట్లిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది?
జుట్టుని గాలికి ఆరబెట్టుకోవడం, హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులు ఉపయోగించుకుండా ఉండటం వల్ల ఎలాంటి హాని జరగదని చాలామంది భావిస్తారు. కానీ వెంట్రుకలు ఎక్కువ సమయం తడిగా ఉండటం వల్ల హెయిర్ క్యుటికల్స్ ఉబ్బిపోతాయి. దీనివల్ల జుట్టు రాలిపోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కాబట్టి జుట్టు ఆరబెట్టుకోవడానికి బ్లో డ్రైయర్ ఉపయోగించాల్సి ఉంటుంది. కాకపోతే నో హీట్ సెట్టింగ్స్ పెట్టుకుని బ్లో డ్రై చేసుకోవాలి. అలాగే తడి తలను దువ్వడం, తల తడిగా ఉన్నప్పుడు నిద్రపోవడం, తల దువ్వుకోకుండా నిద్రపోవడం వల్ల కూడా జుట్టు చివర్లు చిట్లడం, రాలడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
3. నెలలో జుట్టు ఎంత పొడవు పెరుగుతుంది?
ఏదైనా హెయిర్ కేర్ ఉత్పత్తి వాడటం మొదలు పెట్టిన క్షణం నుంచి జుట్టు ఎంత పొడవు పెరిగిందని చూసుకుంటూ ఉంటాం. వారం రోజులు వాడిన తర్వాత అంగుళం కూడా పొడవు పెరగలేదని బాధపడిపోయేవారు ఎందరో ఉంటారు. కానీ నెలకు జుట్టు అరంగుళం మేర అంటే ఒకటింపావు సెం.మీ. మాత్రమే పెరుగుతుంది. అంటే మీరు కోరుకున్న పొడవు పెరగాలంటే.. చాలా కాలం ఎదురుచూడాల్సిందే.
4. ట్రిమ్మింగ్ చేసుకోవడం వల్ల నిజంగానే జుట్టు పెరుగుతుందా?
పైన చెప్పుకున్నట్టుగానే మనం ఎంత ప్రయత్నం చేసినా నెల రోజుల్లో జుట్టు పెరిగేది అరంగుళం మాత్రమే. కానీ ట్రిమ్మింగ్ చేసుకోవడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ సమస్య రాకుండా ఉంటుంది. కాబట్టి జుట్టు ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే తరచూ ట్రిమ్మింగ్ చేసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా ఉన్నట్టు కనిపిస్తుంది.
5. జుట్టు పొడవుగా, లావుగా ఎదగాలంటే నూనె ఎలా పెట్టుకోవాలి?
ముందు కురులను చిక్కు లేకుండా దువ్వుకోవాలి. మీరు తలకు రాసుకోవాలనుకుంటున్న నూనెను గోరువెచ్చగా వేడి చేసి మునివేళ్ల సాయంతో కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. అలాగే కాసేపు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టును పాయలుగా విడదీసి ఒక్కొక్కదానికి నూనెను పై నుంచి కిందకు అప్లై చేసుకోవాలి. నూనే రాసుకోవడం పూర్తయిన తర్వాత వేడి నీటిలో ముంచి బాగా పిండిన టవల్ ను తలకు చుట్టుకుని అరగంట తర్వాత తలస్నానం చేయాలి. జుట్టు పొడవుగా పెరగాలంటే ప్రతి రోజూ నూనె పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వారానికి రెండు సార్లు తలస్నానం చేసే ముందు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
Feature Image: Shutterstock
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది