నేడు మార్కెట్లోకి వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులు అందుబాటులో వస్తున్నాయి. కానీ వాటిలో చాలా ఉత్పత్తులు ఒక చర్మ తత్వం (Skin type) గల వారికి మాత్రమే సూటయ్యేలా తయారవుతున్నాయి. ఇలాంటప్పుడు చాలామందికి వచ్చే ఒక సందేహం.. తమది ఏ తరహా చర్మం అని. చర్మతత్వం తెలుసుకోకుండా ఉత్పత్తులు వాడడం శ్రేయస్కరం కాదు.
Table of Contents
ఒకవేళ అలా వాడినా వాటి వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. సరికదా మన చర్మానికి కొత్త సమస్యలను కూడా తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే సౌందర్య ఉత్పత్తులను వాడేముందు.. మీ చర్మతత్వం ఎలాంటిదన్న విషయంపై అవగాహన పెంచుకోవడం మంచిది. ఈ క్రమంలో, చర్మ తత్వాల గురించి మనమూ తెలుసుకుందాం రండి..!
చర్మ తత్వం తెలుసుకోవడానికి పరీక్షలు
చర్మ సమస్యల ద్వారా చర్మ తత్వాన్ని తెలుసుకోవడం..
చర్మ తత్వాన్ని మార్చడం వీలవుతుందా?
వివిధ రకాల చర్మ తత్వాలు (Different Types Of Skin)
సాధారణంగా చర్మ తత్వాలు నాలుగు రకాలుగా ఉంటాయి. ప్రతి చర్మ తత్వం ప్రత్యేకంగా ఉంటుంది.
1. సాధారణ చర్మం (Normal Skin)
ఈ తరహా చర్మం కలిగి ఉండడం అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ తరహా చర్మానికి సాధారణంగా ఎలాంటి సమస్యలూ రావు. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎలాంటి మార్పు లేకుండా ఉంటుంది. మొటిమలు ఇతర సమస్యలు రావడం కూడా తక్కువే. అందుకే ఈ తరహా చర్మంలో.. ఓ విభిన్నమైన కాంతి ఉంటుంది. మొటిమలతో పాటు చర్మం పొడిబారడం, ముడతలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటివేవీ ఉండవు. అందుకే దీనిని అందరూ కోరుకునే చర్మ తత్వంగా చెప్పుకోవచ్చు.
2. పొడి చర్మం (Dry Skin)
రెండో రకం చర్మం పొడి చర్మం. ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎప్పుడు చూసినా పొడిగానే ఉంటుంది. ఎంత మాయిశ్చరైజర్ రాసినా తిరిగి పొడిబారిపోతూనే ఉంటుంది. ఈ చర్మ తత్వం ఉన్నవారికి రాషెస్, చర్మం పొలుసులుగా రాలిపోవడం, పగలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. యాక్నే సమస్య కూడా ఉండొచ్చు.
3. జిడ్డు చర్మం (Oily Skin)
ఇది చాలా ఇబ్బంది పెట్టే చర్మ తత్వం. కొన్నిసార్లు దీని వల్ల ఎలాంటి ఇబ్బందులూ లేనప్పటికీ.. ఎప్పటికప్పుడు జిడ్డుతనాన్ని పెంపొందించడం దీని నైజం. ఈ చర్మం ఎండాకాలంలో మరింత ఇబ్బంది పెడుతుంది. మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలన్నింటికీ గురవుతూ ఉంటుంది. ఈ చర్మ తత్వాన్ని గుర్తించడం చాలా సులభం.
4. కాంబినేషన్ చర్మం (Combination Skin)
కొన్ని చోట్ల పొడిగా.. మరికొన్ని చోట్ల జిడ్డుగా ఉండే చర్మాన్ని కాంబినేషన్ స్కిన్ అంటాం. ఈ చర్మం నుదురు, ముక్కు, గడ్డం మొదలైన భాగాల్లో ఆయిలీగా.. మిగిలిన చోట్ల పొడిగా ఉంటుంది. లేదా ఆయా ప్రదేశాల్లో పొడిగా మిగిలిన ముఖం మొత్తం ఆయిలీగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఇది సీజన్‌ని బట్టి కూడా మారుతుంది. ఈ చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కాస్త కష్టమే.
5. సెన్సిటివ్ స్కిన్ (Sensitive Skin)
సాధారణంగా ఈ నాలుగు చర్మ తత్వాలు (సాధారణ చర్మం, జిడ్డు చర్మం, పొడి చర్మం, కాంబినేషన్ చర్మం ) కాకుండా సెన్సిటివ్ స్కిన్ అనే అయిదో రకం కూడా ఉంది. ఈ తరహా చర్మానికి ఏ రకమైన ఉత్పత్తులు ఉపయోగించినా.. అది సులభంగా ఇరిటేట్ అయిపోతుంది. దాంతో రాషెస్ వస్తుంటాయి.
అంతే కాదు.. చర్మ ఉత్పత్తులు వాడితే.. ఈ చర్మం ఎర్రగా మారిపోతుంది. అంతే కాదు.. ఈ తరహా చర్మం ఎప్పుడూ రఫ్‌గా, పొడిగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం ఎండలోకి వెళ్లి వచ్చినప్పుడు లేదా రాత్రి పడుకొనే ముందు ఇలా కనిపించడం సహజంగా జరుగుతుంటుంది.
అంతేకాదు.. ఏ మాత్రం దుమ్మూ, ధూళి తగిలినా.. ఈ చర్మానికి దురద పెట్టడం లేదా మంట పుట్టడం జరుగుతుంది. ఈ తరహా చర్మానికి ఏ చర్మ పరిరక్షణ ఉత్పత్తులు ఉపయోగించినా ఫలితం ఉండదు. అందుకే ప్రత్యేకంగా సెన్సిటివ్ స్కిన్ కోసం తయారుచేసిన చర్మ ఉత్పత్తులనే ఉపయోగించాలి. కేవలం క్రీములు మాత్రమే కాదు.. ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్ వంటివన్నీ ఉపయోగించవచ్చు.
చర్మ తత్వం తెలుసుకోవడానికి పరీక్షలు (How To Know Your Skin Type In Telugu)
వివిధ చర్మ తత్వాల గురించి తెలుసుకున్నాం కదా. వీటిలో మీది ఏ చర్మ తత్వమో ఇప్పటికీ అర్థం కావట్లేదా? అయితే చర్మ తత్వం గురించి తెలుసుకోవడానికి ఎన్నో పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చేయించుకోవడం వల్ల.. మీది ఏ తరహా చర్మమో గుర్తించవచ్చు. ఆ పరీక్షలేంటంటే..
1. బ్లాటింగ్ పేపర్ ( Blotting Paper Test)
బ్లాటింగ్ పేపర్‌తో మీ చర్మతత్వాన్ని తెలుసుకునే పరీక్ష గురించి మీరు ఇంతకుముందు వినే ఉంటారు. ఈ బ్లాటింగ్ పేపర్స్ స్టేషనరీ షాపుల్లో, సౌందర్య ఉత్పత్తులు ఎక్కువగా అమ్మే షాపుల్లో కూడా లభ్యమవుతాయి.
ఈ పరీక్ష చేసే ముందు రోజు రాత్రి మీ ముఖాన్ని బాగా కడుక్కొని.. మాయిశ్చరైజర్, టోనర్ లాంటి ఉత్పత్తులేవీ ఉపయోగించకుండా అలాగే నిద్రపోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే మీరు ముఖాన్ని చేతితో ముట్టుకోకుండా అద్దం ముందు నిలబడి బ్లాటింగ్ పేపర్‌తో బాగా రుద్దాలి.
ముఖ్యంగా నుదురు భాగం, ముక్కు, గడ్డంతో పాటు.. మిగిలిన ముఖంమంతా బ్లాటింగ్ పేపరుతో రుద్దాలి. ఆ తర్వాత మొత్తం నూనె అంటుకొని ఆ పేపర్ ట్రాన్స్‌పరెంట్‌గా మారిందా లేదా అన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ పేపర్ ట్రాన్స్‌పరెంట్‌గా మారిపోతే మీది జిడ్డు చర్మం అన్నమాట.
ఒకవేళ మీరు బ్లాటింగ్ పేపర్‌తో రుద్దినప్పుడు.. మరీ ఎక్కువగా కాకుండా కాస్త నూనె అంటుకొని మీ నుదురు, ముక్కు, గడ్డం భాగాల్లో.. నూనె ఎక్కువగా కనిపిస్తే మీది మిక్స్‌డ్ లేదా కాంబినేషన్ చర్మం అనుకోవచ్చు.
ఒకవేళ బ్లాటింగ్ పేపర్‌తో రుద్దడం వల్ల.. చాలా తక్కువ నూనె మాత్రమే కనిపిస్తే మీది సాధారణ చర్మం అనే విషయాన్ని గుర్తించాలి. అసలు నూనె కనిపించకపోతే పొడి చర్మం అని గుర్తించాలి.
2. స్కిన్ టచ్ టెస్ట్ (Touch Your Skin)
మీ చర్మం తత్వాన్ని గుర్తించేందుకు.. మీరు స్కిన్ టచ్ టెస్ట్ కూడా చేయవచ్చు. ఈ టెస్టు చేసే ముందు.. తొలుత మీ టీ జోన్‌ని అంటే మీ నుదురు, ముక్కు, గడ్డం ఉన్న భాగాన్ని వేళ్లతో స్పృశించాలి. ఈ క్రమంలో మీ వేళ్లకు నూనె మాదిరిగా తడి తగిలినట్లు అనిపిస్తే మీది జిడ్డు చర్మం అని చెప్పుకోవచ్చు.
అయితే మీ ముక్కు పై ప్రాంతాన్ని లేదా బుగ్గలను వేళ్లతో టచ్ చేసినప్పుడు.. ఒక దగ్గర జిడ్డుగా.. మరో దగ్గర కాస్త రఫ్‌గా అనిపిస్తే మీది కాంబినేషన్ చర్మం అన్నమాట.
అలాగే మీ ముఖం మొత్తం రఫ్‌గా అనిపిస్తే.. మీది పొడి చర్మమని నిర్థారించుకోవాలి. అలా కాకుండా మీ చర్మం మృదువుగా తేమతో నిండినట్లు అనిపిస్తే మీది సాధారణ చర్మం అన్నమాట.
3. అద్దం చెబుతుంది మీ చర్మ రహస్యం.. (Mirror Test)
ఎలాంటి ఆర్టిఫిషియల్ వెలుగూ లేకుండా సహజమైన కాంతిలో.. అద్దం ముందు నిలబడి మీ చర్మాన్ని ఒకసారి చూడండి. ఈ క్రమంలో టీ జోన్ అంటే మీ నుదురు, ముక్కు, గడ్డం భాగాల్లో ఆయిలీగా ఉన్నట్లు అనిపిస్తే మీది ఆయిలీ స్కిన్ అని చెప్పుకోవచ్చు.
అలాగే మీ ముఖం చూడడానికి కాస్త పొడిబారిపోయినట్లు కనిపిస్తోందా? అయితే మీది పొడి చర్మం అన్నమాట.
ఈ రెండు చర్మ తత్వాలు కలిసినట్లుగా కొంత భాగం జిడ్డుగా, మరికొంత భాగం పొడిగా కనిపిస్తే మీది కాంబినేషన్ స్కిన్ అన్నమాట.
4. ముఖం కడుక్కొని చూడండి.. (Early Morning Test)
ఉదయం లేవగానే ముఖాన్ని బాగా కడుక్కోండి. ఆ తర్వాత ఏ ఉత్పత్తులూ అప్లై చేయకుండా.. కనీసం రెండు గంటల సమయం వరకు ముఖాన్ని అలాగే వదిలేయండి. ఆ తర్వాత మీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకోండి..
అలా అద్దంలో చూసుకున్నప్పుడు మీ చర్మం, నుదురు, ముక్కు, గడ్డం భాగాలు ఆయిలీగా కనిపిస్తే మీది జిడ్డు చర్మం అని తెలుసుకోవచ్చు.
ఒకవేళ ఆ భాగాలు ఆయిలీగా.. మిగిలిన భాగాలు పొడిగా అనిపిస్తే మీది కాంబినేషన్ చర్మ తత్వం అన్నమాట.
అలా కాకుండా.. మీ చర్మం మొత్తం పొడిగా కనిపిస్తే మీది పొడి చర్మం అన్నమాట.
ఇవేవీ కాకుండా మీ ముఖం సాధారణంగా కనిపిస్తే మీది సాధారణ చర్మం అన్నమాట.
5. బయటకు వెళ్లొచ్చాక.. (Evening Test)
మీరు బయటకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత.. మీ ముఖం ఎలా కనిపిస్తుందన్న దానిని ఆధారంగా చేసుకొని కూడా మీ చర్మ తత్వాన్ని గుర్తించవచ్చు. మీరు రోజంతా మేకప్ వేసుకొనే ఉన్నా లేదా మాయిశ్చరైజర్ రాసుకున్నా ఈ మార్పు కనిపిస్తుంది.
ఉదాహరణకు మీది జిడ్డు చర్మమైతే.. ఎండలో తిరిగొచ్చాక… ముఖం కడుక్కోకుండా గమనిస్తే.. అది చాలా ఆయిలీగా కనిపిస్తుంది. అలా కాకుండా నుదురు, ముక్కు భాగాల్లో మాత్రమే కాస్త జిడ్డుగా కనిపిస్తే.. వెంటనే మీది కాంబినేషన్ చర్మం అని గుర్తించాలి. అలా కాకుండా బయటకు వెళ్లినప్పుడు ఎలా ఉందో.. తిరిగి వచ్చాక కూడా అలాగే కనిపిస్తే.. మీది సాధారణ చర్మమని గుర్తించవచ్చు.
6. డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోండి. (Check With Dermatologist)
ఇన్ని పరీక్షలు చేసిన తర్వాత కూడా.. మీ చర్మ తత్వాన్ని తెలుసుకోలేకపోతే.. వెంటనే వైద్యులను సంప్రదించవచ్చు. మంచి డెర్మటాలజిస్ట్‌ని కలిసి మీ చర్మ తత్వం గురించే కాదు.. మీ చర్మ సమస్యల గురించి కూడా ప్రస్తావించవచ్చు. అలాగే మీ చర్మాన్ని అందంగా మార్చే ఉత్పత్తుల గురించి కూడా అడిగి తెలుసుకోవచ్చు. డాక్టర్ తనదైన పద్ధతుల్లో పలు పరీక్షలు చేసి.. మీ చర్మ తత్వాన్ని గుర్తిస్తారు. కాబట్టి వారు చెప్పే సమాధానంలో తప్పుండే అవకాశముండదు.
చర్మ సమస్యల ద్వారా చర్మ తత్వాన్ని తెలుసుకోవడం.. (How To Know The Skin Type With The Help Of Your Skin Problem)
కొన్ని చర్మ సమస్యలు కొన్ని చర్మ తత్వాలకే పరిమితం. అందుకే మీ చర్మ సమస్యలను బట్టి.. మీ చర్మతత్వాన్ని కూడా తెలుసుకోండి
మొటిమలు (Breakouts And Pimples)
మీ చర్మం పై ఎక్కువ మోతాదులో మొటిమలు, మచ్చలు ఏర్పడితే మీది జిడ్డు చర్మమని గుర్తించాలి. జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే కేవలం రుతుస్రావం మొదలయ్యేటప్పుడే కాకుండా.. నెల మొత్తం మీకు మొటిమల సమస్య ఉంటే మీది జిడ్డు చర్మమని గుర్తించాలి.
జిడ్డుగా అనిపించడం (Oily Skin)
సాధారణంగా ఎండాకాలంలో బయటకు వెళ్లి వచ్చాక.. ఎవరికైనా చెమటలు పట్టడం సహజం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీ ముఖమంతా నల్లగా, ఆయిలీగా తయారైనట్లు కనిపిస్తే.. మీది జిడ్డు చర్మం లేదా కాంబినేషన్ చర్మం అని తెలుసుకోవాలి.
డ్రై ప్యాచెస్ (Dry Patches)
బయట బాగా తిరిగి.. ఇంటికొచ్చాక మీ ముఖ చర్మం పొడిబారినట్లు లేదా ప్యాచెస్ ఏర్పడినట్లు కనిపించినా.. మీది పొడి చర్మం అని భావించాలి. ఈ ప్యాచెస్ ఎక్కువగా బుగ్గలు, నుదురు, ముక్కుపై ఏర్పడుతుంటాయి. ఇవి మీ ముఖానికి పౌడర్ అద్దుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి .
చర్మంపై ర్యాషెస్ (Rashes On Skin)
సాధారణంగా డ్రై స్కిన్‌కి రాషెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన చర్మానికి తగినంత తేమ అందకపోవడం వల్ల తరచూ.. ఇలాంటి రాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా రాషెస్ పదే పదే వస్తే.. మీది పొడి చర్మమని గుర్తించాలి.
చర్మతత్వాన్ని మార్చుకోవచ్చా? (Is It Possible To Change Skin Type)
మనం ఇప్పటి వరకూ వివిధ చర్మ తత్వాలను గురించి తెలుసుకున్నాం కదా. అయితే ప్రతి ఒక్కరూ తమదైన చర్మ తత్వంతో ఇబ్బందులు పడుతూ ఉండాల్సిందేనా? అంటే దానికీ ఓ పరిష్కారం ఉంది. కొన్ని పద్దతులను పాటించడం ద్వారా.. ప్రతి ఒక్కరూ తమ ఐడియల్ స్కిన్ టైప్‌కి తప్పకుండా చేరుకోవచ్చు.
ఇవి మార్చి చూడండి (Changes In Food And Skin Care Habits)
అయితే దీనికోసం చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే మీ హార్మోన్లు సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా.. మీ చర్మతత్వం గురించి తెలిసింది కాబట్టి.. దానికి సరిపడే ఉత్పత్తులనే రోజూ మీ చర్మానికి ఉపయోగించాలి. మీ చర్మతత్వానికి తగిన ఉత్పత్తులను ఉపయోగిస్తే.. ముఖం మరింత ప్రకాశవంతంగా కనిపించే వీలుంటుంది. ఉదాహరణకు మీది జిడ్డు చర్మమైతే.. నూనె తక్కువగా ఉండే జెల్ బేస్‌డ్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం సాధారణ స్థాయికి చేరుకుంటుంది. అదే మీది పొడి చర్మమైతే.. ఈ జెల్ బేస్‌డ్ మాయిశ్చరైజర్ వల్ల ఏమాత్రం ఫలితం ఉండదు. కనుక ఆయిల్ బేస్‌డ్ మాయిశ్చరైజర్ రాసుకోవడం బెటర్.
ఫేస్ వాష్ (Face Wash)
సాధారణంగా చర్మ సంరక్షణ అనగానే ముందు గుర్తొచ్చేది ఫేస్ వాష్. మన చర్మ తత్వం ఆధారంగా ఫేస్ వాష్‌ని ఉపయోగించడం మంచిది. ఇలా చేయడం వల్ల అది చర్మానికి తేమను అందించడంతో పాటు.. జిడ్డును తొలిగిస్తుంది. అందుకే మీ చర్మతత్వానికి తగినట్లు.. చర్మంలో తేమను పెంచే ఫేస్ వాష్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.
సన్ స్క్రీన్ లోషన్ (Sunscreen Lotion)
సాధారణంగా సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలంటే.. ఎస్ పీ ఎఫ్ విలువ చూసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ అది సరికాదు. క్రీమ్, ఫేస్ వాష్‌ల మాదిరిగా.. సన్ స్క్రీన్‌ని కూడా మీ చర్మ తత్వం ఆధారంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా అన్ని చర్మతత్వాలకు అందుబాటులో ఉంటుంది.
మాయిశ్చరైజర్ (Moisturizer)
ముందే చెప్పుకున్నట్లు మిగిలిన ఉత్పత్తుల కంటే మాయిశ్చరైజర్ ఎంతో ముఖ్యమైనది. ఇది చర్మంలో తేమను పెంచేందుకు తోడ్పడుతుంది. ఈ మాయిశ్చరైజర్లు కూడా.. మీ చర్మ తత్వానికి తగిన విధంగా తయారువుతున్నాయి. మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి.
అందమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి..
ట్యాన్‌తో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో దాన్ని ఇట్టే దూరం చేసుకోవచ్చు..!
చర్మం పై మొండి మచ్చలా? వాటికి ఇలా చెక్ పెట్టండి..
Images : Shutterstock