ADVERTISEMENT
home / సౌందర్యం
మీ కురులు ఒత్తుగా కనిపించాలా?? అయితే ఇలా చేయాల్సిందే..

మీ కురులు ఒత్తుగా కనిపించాలా?? అయితే ఇలా చేయాల్సిందే..

ఈ రోజుల్లో చాలామంది మహిళలు తమ కురులు (Hair) నల్లగా, ఒత్తుగా (Fuller) కనిపించాలని ఆశపడడం సహజంగా మారిపోయింది. కానీ మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న కాలుష్యం, హార్మోన్లలో వచ్చే మార్పులు.. వంటి అనేక కారణాల వల్ల జుట్టు రాలిపోవడం లేదా పలుచబడం సర్వసాధారణమైపోయింది. మరి, పలుచగా మారిన జుట్టుని తిరిగి ఒత్తుగా కనిపించేలా చేయాలంటే ఏం చేయాలి? అసలు కురులు ఒత్తుగా పెరగాలంటే మనం ఎలాంటి చిట్కాలు పాటించాలి అనే విషయాలు ఓసారి తెలుసుకుందాం..

కురులు ఒత్తుగా కనిపించేలా చేసే చిట్కాలు

జుట్టు పలుచగా ఉన్నప్పుడు జడ వేసుకున్నా లేక కురులను వదులుగా వదిలేసినా సన్నగా లేక పలుచగా ఉన్నట్లే కనిపిస్తుంది. ఫలితంగా ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా అది అంతగా నప్పకపోవచ్చు. అలాగని అప్పటికప్పుడు జుట్టు ఒత్తుగా రావాలన్నా అది సాధ్యం కాదు కదా.. అందుకే.. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా తక్షణమే కురులు ఒత్తుగా కనిపించేలా చేయచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏవంటే..

చేతివేళ్లతో ఆరబెట్టుకోండి..

తలస్నానం చేసిన తర్వాత మీరు కురులను ఎలా ఆరబెట్టుకుంటున్నారు?? దువ్వెనతో దువ్వుకుంటూ.. బ్లో డ్రయర్ తోనా?? అయితే వెంటనే మీ పద్ధతి మార్చుకోవాల్సిందే. బ్లో డ్రయర్ ఉపయోగించినప్పుడు దువ్వెనతో కాకుండా మీ చేతివేళ్లను ఉపయోగించి కురులను ఆరబెట్టుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఫలితంగా కురులను ఆరోగ్యవంతమైన పద్ధతిలో ఆరబెట్టుకోవడంతో పాటు కాస్త ఒత్తుగా కనిపించేలా కూడా చేయచ్చు. ఇలా కురులు పూర్తిగా ఆరిన తర్వాత గుండ్రని పెద్ద బ్రష్ తో స్టైల్ చేసుకుంటే సరి.. మీ కురులు ఉన్నదాని కంటే ఒత్తుగా కనిపించడం ఖాయం.

ADVERTISEMENT

షాంపూకి ముందు కండిషనర్

కండిషనర్ ఉపయోగించడం ద్వారా కురులను అవసరమైన తేమ, పోషణ అందిస్తూ ఆరోగ్యంగా ఎదిగేలా చేయచ్చని మనందరికీ తెలుసు. అయితే కండిషనర్ ఉపయోగించడం అనగానే చాలామంది షాంపూ చేసుకున్న తర్వాత కండిషనర్ అప్లై చేసుకోవాలని భావిస్తారు. అయితే ఈ విధంగా చేయడం వల్ల కురులు చాలా స్మూత్ గా మారిపోయి తక్కువ ఒత్తుగా ఉన్నట్లు కనిపించే అవకాశాలున్నాయి. అందుకే కురులు ఒత్తుగా కనిపించాలని మీరు భావించినప్పుడు షాంపూ కంటే ముందు కండిషనర్ అప్లై చేసుకోవడం మంచిది.

చిన్న క్లిప్ ఉపయోగించండి..

కురులు పలుచగా ఉన్నప్పుడు ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నా అది సన్నగా కనిపిస్తుంది. ముఖ్యంగా పోనీటెయిల్ వంటి హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు ఆ లుక్ కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఈసారి ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే ఓ చిన్న చిట్కా పాటించి చూడండి. కురులను నీట్ గా దువ్వుకొని పోనీటెయిల్ వేసుకోండి. ఆ తర్వాత దాని మధ్యభాగంలో ఒక చిన్న క్లిప్ పెట్టి చూడండి. మామూలుగా కనిపించే దాని కన్నా మీ హెయిర్ స్టైల్ ఒత్తుగా కనిపిస్తుంది.

పాయలుగా విడదీసి దువ్వండి

Shutterstock

ADVERTISEMENT

కొంతమందికి కురులు మధ్యభాగంలో ఒత్తుగానే కనిపిస్తాయి. కానీ కుదుళ్ల వద్ద మాత్రం పలుచగా కనిపిస్తుంటుంది. మీరూ ఇదే సమస్యతో బాధపడుతున్నారా?? అయితే ఈ చిట్కా మీ కోసమే.. మీరు జుట్టు దువ్వుకొనేటప్పుడు అంతా ఒకేసారి కాకుండా చిన్న చిన్న పాయలుగా దానిని విడదీయండి. దువ్వుకునే క్రమాన్ని కూడా మార్చండి. అంటే కుదుళ్ల నుంచి చివర్ల దిశగా కాకుండా చివర్ల నుంచి కుదుళ్ల వైపుకు దువ్వెనతో దువ్వుకోండి. ప్రతి పాయతోనూ ఈ విధంగా చేయడం వల్ల కుదుళ్ల వద్ద జుట్టు ఒత్తుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆఖరులో మీకు నచ్చిన హెయిర్ స్టైల్ వేసుకొని హెయిర్ స్ప్రేతో సెట్ చేసుకుంటే సరి.

పోనీటెయిల్‌ని విడదీసి కట్టుకోండి..

అవునండీ.. మీరు సరిగ్గానే చదివారు.. కురులు ఒత్తుగా కనిపించాలంటే దానిని పాయలుగా విడదీయడం కూడా ముఖ్యమే. అయితే పోనీటెయిల్ హెయిర్ స్టైల్ లో జుట్టు ఒత్తుగా కనిపించాలని భావించేవారు పూర్తి జుట్టు దువ్వుకొని బ్యాండ్ పెట్టుకునే క్రమంలో దానిని రెండు భాగాలుగా విడదీయాలి. అంటే రబ్బర్ బ్యాండ్ తో మొదటి ఒకటి లేదా రెండు రౌండ్లు పూర్తి జుట్టుకు పెడుతూనే ఆ తర్వాత పోనీటెయిల్ ని రెండు సమాన భాగాలుగా విడదీయాలి. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ తో మరో రౌండ్ ని కింది సగభాగానికి వేయాలి. అంటే మనం ఒకే రబ్బర బ్యాండ్ తో రెండు పోనీటెయిల్స్ వేసినట్లు. ఇలా చేయడం వల్ల కూడా కురులు ఒత్తుగా కనిపిస్తాయి.

చిన్న చిన్న ముడులు వేయండి..

తలస్నానం చేసిన తర్వాత లేదా హెయిర్ స్టైలింగ్ చేసుకునే ముందు కురులు ఒత్తుగా కనిపించేలా చేయాలంటే చిట్కాలు ఉన్నాయి.. ఓకె.. మరి, ఉదయం నిద్ర లేచేసరికే కురులు ఒత్తుగా కనిపించాలంటే?? అందుకూ ఓ చిట్కా ఉందండోయ్.. అదేంటంటే.. కురులను చిక్కులు లేకుండా దువ్వుకొని చిన్న చిన్న పాయలుగా విడదీసుకోవాలి. ఇప్పుడు ఒక్కో పాయనూ గుండ్రంగా ముడిలా వేస్తూ చివర్లకు పిన్ పెట్టుకోవాలి.

ఇలా జుట్టంతా పాయలుపాయలుగా విడదీసి చిన్న చిన్న ముడులు వేసుకొని రాత్రంతా హాయిగా నిద్రపోండి. ఉదయం నిద్ర లేచి చూసేసరికి మీ కురుల్లోని తేడా మీరే గమనించవచ్చు. ముఖ్యంగా చివర్ల వద్ద జుట్టు ఒత్తుగా కనిపించాలనుకునేవారికి ఇదొక మంచి చిట్కా.

ADVERTISEMENT

సన్ గ్లాసెస్‌ని.. హెడ్ బ్యాండ్‌గా ఉపయోగించండి..

తలస్నానం చేసిన తర్వాత కురులు తడిగా ఉన్నప్పుడు చాలామంది చేసే పని ఒక హెయిర్ క్లిప్ లేదా హెడ్ బ్యాండ్ పెట్టుకుని బయటకు వెళ్లడం. మీరూ అలాగే చేస్తారా?? కానీ ఈ విధంగా చేయడం వల్ల కురులు పలుచగా లేదా ఒత్తు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తాయి. అందుకే కురులు తడిగా ఉన్నప్పుడు హెయిర్ బ్యాండ్ కు బదులుగా మీరు ఉపయోగించే సన్ గ్లాసెస్ ని ఉపయోగించి చూడండి. దానిని కూడా ముందుకు కాస్త వదులుగా ఉండేలా పెట్టుకుంటే గాలికి కురులు ఆరుతూనే ఒత్తుగానూ కనిపిస్తాయి.

హెయిర్ స్టైలింగ్ అయ్యాక.. బ్లో డ్రై చేయండి..

హెయిర్ స్టైలింగ్ చేసుకున్న తర్వాత బ్లో డ్రయర్ తో మరోసారి కురులను సెట్ చేసుకోండి. ఇందుకోసం మెడ కిందకు వంచి కురులను బ్లో డ్రై చేస్తూ చేతి వేళ్ల సాయంతో సెట్ చేసుకోవాలి. ఫలితంగా కురులు ఒత్తుగా ఉన్నట్లు కనిపిస్తాయి.

ఐ షాడో కలర్ ఉపయోగించండి..

కొంతమందిలో కురులు ఒత్తుగానే ఉన్నప్పటికీ నుదురు లేదా పాపిట వద్ద పలుచగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు ఏం చేసినా ఆ స్థానంలో జుట్టు లేనట్లు లేక తక్కువ ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ఫలితంగా ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నా అది వారికి అంతగా నప్పకపోవచ్చు. ఈ సమస్యతో ఇబ్బందిపడేవారు ఏవేవో చిట్కాలు ప్రయత్నించడానికి బదులుగా వెడల్పుగా ఉన్న పాపిట వద్ద ఐ షాడో కలర్ ని అప్లై చేసుకుంటే చాలు. సమస్యకు కాస్త పరిష్కారం దొరికినట్లే.

అల్లికను వదులు చేయండి..

జుట్టు సన్నగా లేదా పలుచగా ఉన్నవారు జడ అల్లుకున్నప్పుడు అది సన్నగా కనిపించడం సాధారణమే. ఆ అల్లికను చేతివేళ్ల సహాయంతో వదులుగా చేయడం ద్వారా జుట్టు కాస్త ఒత్తుగా ఉన్నట్లు కనిపించేలా చేయచ్చు.

ADVERTISEMENT

ఒత్తైన కురులు పొందడానికి ఇవి చేయాల్సిందే..

పలుచగా ఉన్న కురులు తిరిగి ఒత్తుగా మారాలంటే వాటికి తగిన పోషణ అందించడం చాలా అవసరం. అలాగే మరికొన్ని చిట్కాలు అనుసరించడం ద్వారా కూడా ఒత్తైన కురులు పొందవచ్చు. అవేంటంటే..

హైలైట్ చేసుకోవడం..

Shutterstock

ADVERTISEMENT

కురులను పూర్తిగా డై చేసుకోవడం పాత పద్ధతి. అక్కడక్కడా లేదా ఒక పద్ధతి ప్రకారం హైలైట్ చేసుకోవడం కొత్త పద్ధతి. పైగా జుట్టంతా డై చేసుకోవడానికి బదులుగా ఇలా పాయలు పాయలుగా విడదీసి నచ్చిన చోట హెయిర్ డై అప్లై చేసుకోవడం ద్వారా స్టైలిష్ లుక్ కూడా మన సొంతం చేసుకోవచ్చు. అందుకే కాలేజీ అమ్మాయిలు మొదలుకొని ఆఫీసులకు వెళ్లే మహిళల వరకు ఈ ట్రెండ్ కు ఓటేస్తున్నారు. మీకు తెలుసా?? ఈ విధంగా కురులను హైలైట్ చేసుకోవడం ద్వారా జుట్టు ఒత్తుగా కనిపించేలా కూడా చేసుకోవచ్చు. ఇందుకు హైలైట్స్, లోలైట్స్ అని రెండు రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు ఏది సరైందో, బాగా నప్పుతుందో మీ బ్యుటీషియన్ ని సంప్రదించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

విటమిన్స్ తీసుకోవాలి..

ఆరోగ్యంగా ఉండేందుకు, జీవక్రియలన్నీ సక్రమంగా సాగేందుకు మన శరీరానికి మనం ఏవిధంగా అన్ని రకాల పోషకాలు అందిస్తామో అలాగే కురులు ఆరోగ్యంగా, ఒత్తుగా ఎదిగేందుకు కూడా తగిన పోషకాలు అందించడం చాలా అవసరం. ముఖ్యంగా జుట్టు ఎదుగుదలకు కొన్ని రకాల విటమిన్స్ చాలా అవసరం. అవి కుదుళ్ల వద్ద బలంగా ఉండేలా చేయడంతో పాటు, కొన్ని సమస్యలను నివారించి జుట్టు ఎదిగేలా చేయడంలో బాగా తోడ్పడతాయి. కాబట్టి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ లేదా మీ కాస్మెటాలజిస్ట్ సూచించిన విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.

నూనె పెట్టండి..

కురులకు అవసరమైన పోషకాలు అందించడానికి, వాటి ఎదుగుదల సక్రమంగా ఉండడానికి నూనె పెట్టుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా కొబ్బరినూనె లేదా జమైకన్ బ్లాక్ క్యాస్టర్ ఆయిల్.. వంటివి జుట్టు వేగంగా ఎదిగేందుకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని వినియోగించడం ద్వారా ఒత్తైన జుట్టుతో పాటు హెయిర్ డ్యామేజ్‌ని కూడా తగ్గించుకోవచ్చు.

సరైన హెయిర్ కట్..

జుట్టు పలుచగా ఉన్నా లేక ఒత్తుగా ఉన్నా మన ముఖాక్రుతికి నప్పే హెయిర్ కట్ లేనట్లయితే ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నా లుక్ అంతగా ఇనుమడించదు. కాబట్టి మీ ముఖాక్రుతికి అనుగుణంగా ఉంటూ, కురులను ఒత్తుగా ఉన్నట్లు కనిపించేలా చేస్ హెయిర్ కట్ చేయించుకోండి. ఈ క్రమంలో లేయర్స్, బ్యాంక్స్.. వంటివి కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఈ విషయంలో మీకు సౌందర్య నిపుణులు బాగా సహాయపడతారు.

ADVERTISEMENT

హెయిర్ ఎక్స్టెన్షన్స్..

పలుచగా ఉన్న కురులు ఒత్తుగా కనిపించేలా చేసేందుకు ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా ఎంచుకుంటున్న పరిష్కారంలో హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా ముందువరుసలో ఉంటున్నాయి. కుదుళ్ల వద్ద నుంచి అతికించేవి, కురుల మధ్యలో పెట్టి జడ వేయడం ద్వారా జుట్టు పొడవుగా కనిపించేలా చేసేవి.. ఇలా చాలారకాలు అందుబాటులో ఉంటున్నాయి. మనం చేయాల్సిందల్లా.. మన అవసరానికి అనుగుణంగా ఉండే నాణ్యమైన హెయిర్ ఎక్స్టెన్షన్‌ని ఎంచుకోవడమే.

హెయిర్ ప్లగ్స్ అండ్ ఇంప్లాంట్స్..

కురులను ఒత్తుగా కనిపించేలా చేసేందుకు కొందరు తాత్కాలిక ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటే ఇంకొందరు శాశ్వత పరిష్కారాలను ఆశ్రయిస్తూ ఉంటారు. అలాంటి పరిష్కార మార్గాల్లో హెయిర్ ప్లగ్స్ అండ్ ఇంప్లాంట్స్ కూడా ఒకటి. దీని ద్వారా ఓ దాత నుంచి తీసుకున్న కురులను మీ కుదుళ్లలోకి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. అలాగే ఇంకొందరు రాలిపోయిన లేదా ఊడిపోయిన తమ జుట్టునే తిరిగి ఇంప్లాంట్ చేయించుకుంటూ ఉంటారు. కొన్ని క్లినిక్స్ లో మీ తల వెనుక భాగం నుంచి తీసుకున్న జుట్టునే రాలిపోయిన వాటి స్థానంలో ఇంప్లాంట్ చేస్తూ ఉంటారు.

కర్లింగ్..

స్మూత్‌గా ఉండే జుట్టు చూడడానికి అణిగిపోయి, ఒత్తు తక్కువగా ఉన్నట్లే కనిపిస్తుంది. కాబట్టి దానిని కర్లింగ్ ప్రక్రియ ద్వారా వంపులు తిప్పి చూడండి. లేయర్డ్ లుక్ తో జుట్టు ఒత్తుగా, వేవీగా ఉన్నట్లు కనిపిస్తుంది. మీకు అందమైన లుక్‌ని కూడా ఇస్తుంది. ఒక్కసారి ఈ చిట్కా అనుసరించి చూడండి.. తేడా మీకే స్పష్టంగా కనిపిస్తుంది.

ADVERTISEMENT

మర్దన చేయండి..

కురులకు నూనె పెట్టుకొనేటప్పుడు, షాంపూ రాసుకొనేటప్పుడు, కండిషనర్ అప్లై చేసేటప్పుడు నామమాత్రంగా రాసి వదిలేయడం ఏమాత్రం సరికాదు. జుట్టుకు ఏది అప్లై చేసినా అది పూర్తిగా లోపలి వరకు వెళ్లాలంటే అందుకు కుదుళ్ల వద్ద క్రమపద్ధతిలో మర్దన చేయడం చాలా ముఖ్యం. ఫలితంగా ఆయా పదార్థాల ద్వారా అందే పోషణ జుట్టుకు అందుతుంది. కురులు బలంగా మారతాయి.

తగిన హెయిర్ స్టైల్స్..

shutterstock

పోనీటెయిల్, బన్ లేదా జుట్టు వదులుగా వేయడం.. ఇలాంటి హెయిర్ స్టైల్స్ అన్నీ జుట్టు ఒత్తుగా కనిపించేలా చేసేవే. అలాగే జుట్టంతటినీ ఒకవైపుకు దువ్వుకొని చిన్న పిన్స్ పెట్టుకోవడం ద్వారా కూడా కురులను ఒత్తుగా కనిపించేలా చేసుకోవచ్చు. అలాగే కురులు వేవీగా కనిపించేలా వాటిని కర్ల్ చేసుకోవడం కూడా జుట్టు ఒత్తుగా కనిపించేలా చేసేందుకు ఒక చక్కని పరిష్కారం. అయితే మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ ఎంచుకున్నా సరే.. అది మరీ బిగుతుగా ఉండకుండా మాత్రం జాగ్రత్తపడాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

భుజాల వరకు ఉండే హెయిర్ కట్స్ అంటే.. బాబ్, పిక్సీ హెయిర్ కట్ వంటివి షార్ట్ హెయిర్ ని ఒత్తుగా కనిపించేలా చేస్తాయి. అలాగే లేయర్స్ కూడా కురులను ఒత్తుగా కనిపించేలా చేస్తాయి.

తరచూ అడిగే ప్రశ్నలు – వాటి సమాధానాలు

జుట్టు పలుచగా ఉన్నవారు ఎక్కువగా అడిగే ప్రశ్నలు చాలానే ఉంటాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు మీ కోసం..

తక్కువ సమయంలోనే జుట్టు ఒత్తుగా కనిపించాలంటే ఏం చేయాలి?

జుట్టు పెరగడానికి అవసరమైన పోషణ, తేమ.. వంటివన్నీ సక్రమంగా అందిస్తేనే ఎదుగుదల సక్రమంగా సాగుతుంది. అయితే సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా జుట్టు ఎదగాలంటే అందుకు కాస్త సమయం పట్టడం సహజమే. కానీ తక్కువ సమయంలోనే జుట్టు ఒత్తుగా కనిపించేలా చేయాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే.. హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉపయోగించడం, వేవీగా కనిపించేలా కర్ల్స్ చేసుకోవడం, కురులు ఒత్తుగా కనిపించేలా చేసే హెయిర్ స్టైల్స్ వేసుకోవడం.. వంటివి వాటిలో ముఖ్యమైనవి. వీటిలో మీకు అందుబాటులో ఉన్న పద్ధతిని ఎంపిక చేసుకొని దానిని అమలు చేయడం ద్వారా తక్కువ సమయంలోనే మీ కురులు ఒత్తుగా కనిపించేలా చేసుకోవచ్చు.

ADVERTISEMENT

లేయర్స్ జుట్టుని ఒత్తుగా కనిపించేలా చేస్తాయా?

లేయర్డ్ హెయిర్ స్టైల్స్ కారణంగా జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. అందుకే చాలామంది సౌందర్య నిపుణులు లేయర్స్ కంటే జుట్టు టెక్స్చర్‌ని సంరక్షించుకోవాలని తమ వినియోగదారులకు సూచిస్తూ ఉంటారు. కురుల టెక్స్చర్ బాగున్నప్పుడు జుట్టు అందంగా మాత్రమే కాదు.. ఒత్తుగా కూడా కనిపిస్తుంది. అలాగే జుట్టు పొడవు తక్కువ ఉన్నవారు లేయర్డ్ హెయిర్ కట్ చేయించుకోవడం ద్వారా కురులు ఒత్తుగా కనిపించేలా చేసుకోవచ్చు.

డార్క్ హెయిర్ జుట్టుని ఒత్తుగా కనిపించేలా చేస్తుందా?

సాధారణంగా పూర్తిగా హెయిర్‌ని డై చేసుకున్నప్పుడు జుట్టు అంతా ఒకేలా కనిపిస్తుంది. ఒక్క రంగులో తప్ప జుట్టు మందంలో తేడా అంతగా కనిపించదు. దీనికి బదులుగా జుట్టుని అక్కడక్కడా మీకు నచ్చిన కలర్‌తో హైలైట్ చేసుకోవడం ద్వారా ఒత్తుగా కనిపించేలా చేయచ్చు. అయితే కురులకు ఉపయోగించే కలర్‌ని కూడా మీ చర్మఛాయకు తగినట్లుగా ఉన్నదే ఎంచుకోవాలి. అప్పుడే లుక్ ఇనుమడిస్తుంది.

పలుచగా ఉన్న జుట్టు ఒత్తుగా కనిపించాలంటే ఎలాంటి హెయిర్ కట్స్ చేయించుకోవాలి?

పలుచగా ఉన్న జుట్టు ఒత్తుగా కనిపించేలా చేయడానికి కొన్ని హెయిర్ కట్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. వాటిలో డెన్స్ పిక్సీ, బ్లంట్ బాబ్, యాంగిల్డ్ బాబ్, క్లాసిక్ లాబ్.. వంటివి తక్కువ పొడవు ఉన్న జుట్టుకి బాగా నప్పుతాయి. అలాగే పొడవు మధ్యస్థంగా ఉండే జుట్టుకి లాంగ్ లేయర్స్, బ్లంట్ ఎండ్స్, సైడ్ బ్యాంగ్స్.. వంటి హెయిర్ కట్స్ బాగా నప్పుతాయి. అయితే వీటిలో మీకు ఏది నప్పుతుందన్నది మీ సౌందర్య నిపుణులను అడిగి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది.

చూశారుగా.. పలుచగా ఉన్న కురులను తిరిగి ఒత్తుగా మార్చుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన చిట్కాలు.. మీరూ వీటిని అనుసరిస్తూ మీ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ సమస్య పరిష్కారానికి ఉన్న తాత్కాలిక పరిష్కారమార్గాలతో ఉపశమనం పొందండి.

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి

మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా? వాటిని ఇలా దూరం చేసుకోండి..!

గోళ్లను అందంగా మార్చే.. ఈ విభిన్నమైన నెయిల్ పాలిష్‌లు మీ దగ్గర ఉండాల్సిందే..!

వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండేందుకు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!

30 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT