Hyderabadi’s Winter Special Dish – Mutton Marag
చలికాలం వచ్చేసిందంటే చాలు.. దుప్పట్లు కప్పుకోవడం లేదా వెచ్చగా ఉండే దుస్తులను ధరించడం పరిపాటి. అయితే అన్నింటినీ మించి.. ఒక వైపు చల్లగాలిని ఆస్వాదిస్తూ.. మరోవైపు వేడి వేడి వంటకాలని రుచి చూడడంలో ఉండే మజానే వేరు. వెజిటేరియన్స్ అయితే వేడి వేడి పకోడీలు, బోండాలు లేదా ఛాట్, సమోసా లాంటి వైపు మొగ్గుచూపుతారు.
హైదరబాదీ స్పెషల్ వంటకం.. ‘కిచిడి – ఖీమా’ తయారీ విధానం మీకోసం ..!
మరి నాన్ వెజిటేరియన్స్ సంగతి. అందుకు బెంగపడాల్సిన పని లేదు. హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో అయితే.. మాంసాహార ప్రియులకు లభించని వంటకమే దొరకదు. ఉదాహరణకు.. ఇక్కడ పాయాని ఎక్కువగా రుచి చూడడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇదే కోవకు చెందిన మరొక హైదరాబాదీ వంటకమే మటన్ మరగ్ . ఇక ఈ వింటర్ స్పెషల్ డిష్ తయారీకి కావాల్సిన పదార్ధాలు ఇవే –
* 1/2 కేజీ మటన్
* ఉల్లిగడ్డలు – 6
* అల్లం వెల్లులి పేస్ట్ – 2 టీ స్పూనులు
* పసుపు – 1 టీ స్పూన్
* మిరియాల పొడి – 2 టీ స్పూనులు
* గరం మసాలా – 1 టీ స్పూన్
* ఉప్పు – 4 టీ స్పూనులు
* నూనె – 5 టేబుల్ స్పూనులు
* పుదీనా – 1 కట్ట
* కొత్తిమీర – 1 కట్ట
* జీడి పప్పు – అర కప్పు
* బాదం పప్పు – అర కప్పు
* పిస్తా పప్పు – అర కప్పు
హైదరాబాద్ ఖీమా లుక్మీ గురించి మీకు తెలుసా??
ఇక ఇప్పుడు మటన్ మరగ్ తయారీ విధానం (Recipe) గురించి తెలుసుకుందాం..
ఈ వంటకం ఇంటిలో సిద్ధం చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్ అయితే వీలుగా ఉంటుంది. అప్పుడే రుచి కూడా పక్కగా మనం అనుకున్నట్లు వస్తుంది. ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని.. అందులో 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తరువాత.. ఉల్లిగడ్డల ముక్కలు కూడా వేయాలి. తర్వాత బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవలసి ఉంటుంది. ఆ తరువాత అందులో.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డల ముక్కలతో బాగా కలిసిపోయాక.. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఉప్పు, బోన్స్‌తో కూడిన మటన్‌ని వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తరువాత.. 2 కప్పుల నీరు పోసుకుని, పుదీనా & కొత్తిమీరని కూడా మిశ్రమానికి అద్దాలి. ఆ తర్వాత.. కుక్కర్ మూత పెట్టి.. 4 నుండి 5 విజిల్స్ వరకు ఉంచాలి.
ఆ తర్వాత కుక్కర్ మూత తెరిచి.. అందులో ఉన్న నీరు మొత్తం ఆవిరయ్యే వరకు కలుపుతూ ఉండాలి. నీరంతా ఆవిరయ్యాక.. ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడి పప్పు, పిస్తా పప్పుల పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలి. దీనికి తోడుగా 1 1/2 లీటర్ల నీరు పోసుకుని బాగా కలుపుకోవాలి.
అలా బాగా కలిపిన తర్వాత.. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుని.. పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. అలా వేసి కలుపుకున్న తరువాత.. ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. దీనితో మీ నోరూరించే మటన్ మరగ్ సిద్ధమైపోతుంది.
ఈ వంటకాన్ని సూప్‌లా కూడా తీసుకోవచ్చు. అదే సమయంలో బన్, నాన్ లేదా రోటీలోకి కూడా దీనిని తీసుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా చలికాలంలో చేసుకొనే వంట కావడంతో.. ఈ సీజన్‌లో మటన్ మరగ్‌కి చాలా డిమాండ్ ఉంటుంది. అయితే దీనిని ఇంటిలోనే ఎలా తయారు చేసుకోవాలో తెలిసింది కాబట్టి.. మీరు కూడా ట్రై చేయవచ్చు.
హైదరాబాదీ ఫేమస్.. నోరూరించే పాయా ఎలా చేయాలో తెలుసుకుందామా?
Image: Wikisource