జ్యోతి రెడ్డి (Jyothi reddy).. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలిసిందే. ఎక్కడో వరంగల్ జిల్లాలోని చిన్న పల్లెటూరిలో పుట్టి పెరిగి అమెరికాలో సాఫ్ట్ వేర్ సంస్థకు అధినేతగా ఎదిగారు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలిచిన ఆమె.. తన ఆత్మస్థైర్యంతో జీవితంలో ఎదిగారు, అమెరికా చేరుకొని అక్కడో సంస్థను ప్రారంభించి.. లాభాల బాటలోనూ పయనించారు. తండ్రి లేకపోయినా తాను పడిన కష్టాలను.. తన పిల్లలు పడకుండా వారికి అద్భుతమైన జీవితాన్ని అందించడంలో సఫలమయ్యారు. తన కథ మరింత మందికి స్ఫూర్తినందించేందుకు పుస్తకం రూపంలోనూ తీసుకొచ్చారు. తాజాగా హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్‌లోనూ తన కథను పంచుకున్నారామె. ఈ సందర్భంగా ఆమె కథ తన మాటల్లోనే..
నాకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు మా నాన్న నన్నో అనాథాశ్రమంలో చేర్చాడు. అక్కడి అధికారులకు నాకు అమ్మ లేదని.. అనాథ అని అబద్ధం చెప్పాడు. మా నాన్న ఓ చిన్న కౌలు రైతు. మాకు పెద్దగా భూమి కూడా లేదు. తనకున్న ఐదుగురు పిల్లలకు కడుపు నిండా తిండిపెట్టే స్థితి కూడా మా నాన్నకు లేదు. అందుకే నన్ను అనాథాశ్రమంలో చేర్చి.. నాకు అమ్మ ఉందన్న విషయం మర్చిపోమ్మని చెప్పారు. ఆయనేం చెప్పారో అర్థం చేసుకునే వయసు నాకప్పుడు లేదు. కానీ చాలా బాధగా అనిపించేది.
నాతో మాట్లాడేందుకు ఒక్కరు కూడా ఉండేవారు కాదు.. నాలో ఉన్న బాధను కోపాన్ని అలాగే మనసులోనే అణుచుకునేదాన్ని. స్కూల్‌కి వెళ్లినప్పుడు.. అక్కడ చాలామంది పిల్లలు వాళ్ల తల్లిదండ్రులతో కలిసి స్కూల్‌కి వచ్చేవారు. వారికి మంచి మంచి దుస్తులు ఉండేవి. నాకు కనీసం ఓ మంచి స్కూల్ బ్యాగ్, చెప్పులు కూడా ఉండేవి కావు. ఇవన్నీ చూస్తూ నేను బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొని.. నాకు కావాల్సిన వస్తువులన్నింటినీ అప్పుడు కొనుక్కోవాలనుకునేదాన్ని.
ఆ రెండేళ్లు నరకం అనుభవించా.. అయినా చావును ఎదురించా : సుస్మిత సేన్
కానీ మా నాన్న నా ఆ కలలను కూడా కల్లలుగా మార్చేశాడు. పదహారేళ్ల వయసులోనే.. నాకంటే పదేళ్లు పెద్దవాడైన వ్యక్తికిచ్చి నా పెళ్లి చేశాడు. ఆ సమయంలో నాకు అసలు పెళ్లి, భార్యభర్తల బంధం అంటే ఏంటో అస్సలు తెలీదు. కానీ రెండేళ్లలోనే నాకు ఇద్దరు పిల్లలు పుట్టేశారు. అందరినీ పోషించే శక్తి నా భర్తకు లేకపోవడంతో.. నేను రోజూ పనికి వెళ్లేదాన్ని. తొమ్మిదో నెలలో ఉన్నప్పుడు కూడా పొలం పనులు చేశాను. పొలం పనులు చేసేందుకు వంగినప్పుడు.. నా కడుపులో చాలా నొప్పిగా ఉండేది. కానీ తప్పదు కాబట్టి.. కాసేపు కూర్చొని మళ్లీ పని చేసేదాన్ని. మా బావగారు తాగిన మందు బాటిళ్లు అమ్మి పిల్లలకు పాలు కొనేదాన్ని. రెండు సంవత్సరాల తర్వాత.. ఈ బాధలన్నీ భరించలేక చనిపోవడానికి ప్రయత్నించాను. కానీ నా పిల్లల ముఖం చూసి ఆగిపోయాను. నేను చనిపోతే వాళ్లు కూడా అనాథలుగా మారిపోతారని భావించి.. వారికోసమైనా నేను పనిచేయాలని నిర్ణయించుకున్నా.
అంతా వేలెత్తి చూపారు.. అయినా కష్టపడి అనుకున్నది సాధించా : స్వప్న
అందుకే వేరే టౌన్‌లో ఉద్యోగం సంపాదించి.. నా పిల్లలతో పాటు అక్కడికి వెళ్లిపోయాను. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తిచేశాను. పరిస్థితులు నాకు చాలా కష్టాలు చూపించాయి. కానీ నాకు కష్టపడి పనిచేయడం.. నా పిల్లల కోసం బతకడం తప్ప మరో దారి కనిపించలేదు. బతకాలి కాబట్టి దానికోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమయ్యాను. ఓసారి అమెరికా నుంచి వచ్చిన మా కజిన్‌ని కలిశాను. తనని కలిసి అమెరికా వెళ్లాలనే నిర్ణయానికి వచ్చాను. ఆ తర్వాత ఓ సంవత్సరం పాటు పాస్ పోర్ట్, వీసా కోసం ప్రయత్నించాను. అమెరికాకి వెళ్లాను. వెళ్లానే కానీ.. అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా తయారైంది. ఓ గుజరాతీ ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ గ్యాస్ స్టేషన్లలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌గా, బేబీ సిట్టర్‌గా.. ఇంకా ఎన్నెన్నో చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండిపోయాను.
అలాంటి పరిస్థితులలో.. నా అనుభవాలే నేను నా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఉపయోగపడ్డాయి. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా. ఏం వ్యాపారం ప్రారంభించాలో అర్థం కానప్పుడు.. ఓసారి నా వీసా ప్రాసెస్‌లో భాగంగా మెక్సికోకి వెళ్లినప్పుడు కన్సల్టింగ్ కంపెనీ ప్రారంభిస్తే బాగుంటుందని అనిపించింది. నాకు వీసా ప్రాసెసింగ్ గురించి, దానికి అవసరమైన పేపర్ వర్క్ గురించి బాగా తెలుసు. అందుకే ఆ వ్యాపారం ప్రారంభించాలనుకున్నా. కానీ నా దగ్గర అప్పుడు ఉన్నవి.. కేవలం నలభై వేల డాలర్లు మాత్రమే. అమెరికాలో ఆ మొత్తం చాలా తక్కువే. అయినా కానీ ముందడుగే వేశాను. 2001 అక్టోబర్‌లో ఫీనిక్స్ ప్రాంతంలో నా ఆఫీస్ ని ప్రారంభించాను. మొదట్లో కాస్త కష్టమైనా తర్వాత పరిస్థితి బాగుపడింది. నా కూతుళ్లు కూడా నాతో ఉండేందుకు అమెరికా చేరుకున్నారు. అక్కడే చదువుకున్నారు.
ఫ్లైట్‌లో నిద్రపోయి ఒంటరిగా నిద్రలేస్తే? ఇది భయపెట్టే కల అసలే కాదు..!
ఇప్పుడు నేను ఆర్థికంగానూ బాగానే నిలదొక్కుకున్నా. వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా జీవిత ప్రయాణంలో ఎక్కడా నెగెటివిటీకి చోటివ్వకుండా నాకోసం నేను కష్టపడి నిలబడి.. నన్ను నేను నిరూపించుకున్నా. జీవితంలో ఏదైనా సాధించేందుకు మగవాళ్ల తోడు అవసరం లేదని నిరూపించాను. కానీ ఇప్పటికీ నాకు నా పాత రోజులు గుర్తున్నాయి. వాటిని మర్చిపోకుండా ఓల్డేజ్ హోమ్‌లకు, అనాథాశ్రమాలకు వెళ్లి.. వాళ్లను కలిసి వారికోసం నాకు తోచిన సాయం చేస్తుంటాను. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి భవిష్యత్తు తరాలకు స్పూర్తినిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. గ్రామాలకు చెందిన ఎందరో పిల్లలు నా గురించి చదివి తెలుసుకుంటారు. ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలను. నేను చిన్నతనంలో వూహించినదానికంటే ఎక్కువ సాధించాను. ఇంతకంటే గొప్ప ఫీలింగ్ మరొకటి లేదు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.