మొన్నటి వరకు ఎర్రని ఎండలతో సతమతమైన మనకి ఇప్పుడు కురుస్తోన్న చల్లని చిరుజల్లులు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. తొలకరి జల్లులు గిలిగింతలు పెడుతున్నాయి. పైగా ఇది వర్షాకాలం. అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. వర్షంలో తడవడం, ఆడుకోవడం బాగానే ఉన్నా.. ఆ సరదా వెనుక కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. అలాగే జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.
ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ వర్షపు నీటిలో తడవడం వల్ల చర్మానికి, కురులకు మేలు జరుగుతుందా? లేదా మన సౌందర్యం దెబ్బ తింటుందా? మనం వానలో తడిచిన తర్వాత జుట్టు బిరుసుగా తయారవుతుంది. చర్మం పొడిగా, దురదగా అనిపిస్తుంది. కానీ వర్షపు నీరు(rainwater) చర్మానికి (skin) మేలు చేస్తుందట. ఈ రెండింటిలో ఏది నిజం?
వర్షపు నీరు స్వచ్ఛమైనదేనా?
వర్షపు నీరు చాలా శుద్ధమైనదని మనకు తెలుసు. భూమి మీద ఉన్న నీరే ఆవిరై మేఘాలుగా మారి వర్షంగా కురుస్తుంది. దీన్ని సాఫ్ట్ వాటర్‌గా పరిగణిస్తారు. పైగా వర్షపు నీరు నాన్ ఆల్కలీన్ గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి సాఫ్ట్ వాటర్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. అయితే ఈ నీటిని నేరుగా చర్మంపై పోసుకోవడం కంటే.. మరిగించి ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. వర్షపు నీరు శుద్ధత వర్షం కురిసిన ప్రదేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట వర్షపు నీరు కూడా కలుషితంగానే ఉంటుంది. వాహనాలు, పరిశ్రమల ఉద్ఘారాల కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట వర్షపు నీటిలో మలినాలు, టాక్సిన్లు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి నీటి వల్ల చర్మం, కురుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే పచ్చదనం నిండిన ప్రాంతాల్లో వర్షపు నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఇలాంటి వర్షంలో తడిచినా చర్మానికి ఎలాంటి నష్టం కలగదు. అయితే సున్నితమైన చర్మం కలిగిన వారు వర్షపు నీటిలో తడవకుండా ఉండటమే మంచిది.
Movie Still
వర్షపు నీరు – సౌందర్య ప్రయోజనాలు
వర్షపు నీరు సౌందర్యంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ నీటిని మనం సరిగ్గా వినియోగించుకుంటే చర్మం, కురులను మరింత అందంగా మార్చుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి సైతం వర్షపు నీటిని మనం ఉపయోగించుకోవచ్చు. దీని కోసం శుభ్రమైన పాత్రలో వర్షపు నీటిని పట్టుకోవాలి. అలాగే ఈ నీటిని ఉపయోగించే ముందు కాచి చల్లార్చుకోవాలి.
ముఖాన్ని రెగ్యులర్‌గా శుభ్రం చేసుకోవడం ద్వారా చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
నిద్రపోయే ముందు వర్షపు నీటిలో దూదిని ముంచి.. దాంతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం ద్వారా చర్మం మృదువుగా మారుతుంది.
ముఖాన్ని శుభ్రం చేసుకున్న అనంతరం వర్షపు నీటితో మరోసారి ముఖం శుభ్రం చేసుకోవడం ద్వారా మచ్చలను తగ్గించుకోవచ్చు.
పెడిక్యూర్ చేసుకోవడానికి వర్షపు నీటిని ఉపయోగించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
కురులు పట్టులా, మృదువుగా మారడానికి వర్షపు నీటిని ఉపయోగించవచ్చు. వర్షపు నీటిని శుభ్రమైన పాత్రలోకి పట్టి.. తలస్నానం చేసిన తర్వాత.. ఈ నీటిని తలపై పోసుకుంటే కురులు సాఫ్ట్‌గా తయారవుతాయి
సాధారణంగా వర్షపు నీటిని వాడేముందు.. శుభ్రమైన పాత్రలో ఆ నీటిని పట్టుకోవాలి. అలాగే ఈ నీటిని ఉపయోగించే ముందు.. తొలుత మరిగించి చల్లార్చి ఆ తర్వాత ఉపయోగించడం మంచిది. ఇలా చేయడం వల్ల వర్షపు నీటిలో చేరిన బ్యాక్టీరియా నశించిపోతుంది.
Movie Still
వర్షంలో తడిచే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షంలో తడవడం వల్ల అనారోగ్యం బారిన పడతారని కొందరు అంటారు. అలా అని మన సరదాను పక్కన పెట్టేయలేం కదా. పైగా వర్షంలో తడవడం మనకు మానసిక ఆనందాన్నిస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వర్షపు నీటి ప్రభావాన్ని చర్మం, కురులపై పడకుండా చూసుకోవచ్చు.
వర్షంలో తడవాలని మీరు అనుకుంటే.. ముందు చర్మ ఆరోగ్యం దెబ్బ తినకుండా చూసుకోవాలి. దీని కోసం చర్మానికి వాటర్ ప్రూఫ్ లోషన్ అప్లై చేసుకోవాలి. వాటర్ ప్రూఫ్ సన్ స్క్రీన్ లోషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ లోషన్ చర్మాన్ని వర్షపు నీటిలో ఉన్న రసాయనాల బారి నుంచి రక్షిస్తుంది.
వర్షాకాలం మొదటి రోజుల్లో కురిసే వానల్లో తడవడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి గాలిలోని కాలుష్యాన్ని తిరిగి భూమి మీదకు తీసుకొస్తాయి. ఇలాంటి వర్షంలో తడవడం అస్సలు మంచిది కాదు.