కొన్ని ప్రదేశాలను (Tourist Places) ప్రత్యేకమైన కాలాల్లో సందర్శిస్తేనే వాటి అందం మనకు తెలుస్తుంది. అదేనండీ.. వేసవిలో పర్యటించదగిన ప్రదేశాలు కొన్ని ఉన్నట్లే.. వర్షాకాలంలో సందర్శించదగిన ప్రదేశాలు కూడా ఉంటాయి. పైగా ఈ సమయంలోనే ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ.. మనల్ని మనం మైమరచిపోయే వీలు కూడా ఉంటుంది.
Table of Contents
మరి, ప్రస్తుతం వర్షాకాలం (Monsoon) వచ్చేసింది.. ఇప్పటికే చిరుజల్లులు మనల్ని పలకరించడం మొదలెట్టేశాయి. ఇలాంటి తరుణంలో మనసుకు నచ్చిన సాహసాలు చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే ఎలాంటి ప్రదేశాలకు వెళ్లాలి అని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు మీకు మేం చెబుతాం రండి..
వర్షాకాలంలో మనమంతా తప్పక సందర్శించదగిన పర్యాటక ప్రదేశాల వివరాలు.. అక్కడ మనం చేయదగిన సాహసాలు, చూడదగిన లొకేషన్ల (Tourist Destinations) వివరాలు ఈ కింద చదివి తెలుసుకోండి..
వర్షాకాలంలో మనం తప్పక సందర్శించాల్సిన.. పర్యాటక ప్రదేశాలు
భారతదేశంలోని ముఖ్య పర్యాటక ప్రదేశాల వివరాలు ఈ కింద వివరిస్తున్నాం.
* వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన బద్రీనాథ్‌కి సమీపంలో ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంది. ఛమోలీ జిల్లాలో భాగమైన ఈ పిక్చర్స్ క్యూ నేషనల్ పార్క్‌లో దాదాపు 400 రకాల పువ్వులను మనం ఒకే చోట చూడచ్చు. ఈ ప్రదేశాన్ని యునెస్కో వారు హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు.
Valley Of Flowers
ఇక్కడ చూడవలసినవి & చేయదగినవి
* ఒకే ప్రదేశంలో దాదాపు 400 రకాల పూలు
* ట్రెక్కింగ్
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే –
ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కి దగ్గరగా ఉన్న విమానాశ్రయం – డెహ్రాడూన్ & దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ రిషికేష్. ఇక రిషికేష్ నుంచి రోడ్డు మార్గంలో గోవింద్ ఘాట్‌కి చేరుకున్న తరువాత.. అక్కడి నుంచి 18 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనం ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు చేరుకోవచ్చు.
* ఉదయ్ పూర్
రాజరికానికి.. అలాగే రాజదర్పానికి అద్దం పట్టే విధంగా ఉంటుంది రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్. ఎక్కడ చూసినా.. కోటలు, మహారాజులు గడిపిన జీవితాన్ని మన కళ్ళకి కట్టినట్టుగా చూపించే కట్టడాలు మనల్ని కట్టిపడేస్తాయి. పైగా వర్షాకాలంలో ఈ ఉదయ్‌పూర్ చాలామంది పర్యటకులకు చక్కటి పర్యాటక కేంద్రంగా మారిపోతుంది.
Udaipur
ఇక్కడ చేయవలసినవి & చూడదగినవి –
* సైట్ సీయింగ్
* బోటింగ్
* సజ్జన్ ఘర్
* మాన్‌సూన్ ప్యాలెస్
ఇక్కడికి ఎలా చేరుకోవాలి –
దాదాపు దేశ నలుమూలల నుంచి ఉదయ్‌పూర్‌కి రోడ్డు, రైలు మరియు విమాన సదుపాయాలు ఉన్నాయి. అన్నివిధాలుగా రవాణా సౌకర్యం ఉండడం వల్ల కూడా.. ఈ ఉదయ్‌పూర్ రొమాంటిక్ డెస్టినేషన్ ఇన్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకుంది.
* వయనాడ్
కేరళ రాష్ట్రంలో ఉన్న మరొక హిల్ స్టేషన్ ‘వయనాడ్’. ఇక్కడ ప్రతి సంవత్సరం పర్యాటకుల రాకని దృష్టిలో పెట్టుకుని మాన్‌సూన్ ఫెస్టివల్‌ని ఏర్పాటు చేస్తారట. ఇక ఈ వర్షాకాలంలో ఇక్కడ గుహలు, జలపాతాలు, కొండలు ఇలా అనేక ప్రకృతి అందాలను మనం వీక్షించవచ్చు.
Wayanad
ఇక్కడ చేయవలసినవి & చూడదగినవి –
* ట్రెక్కింగ్
* టీ ప్లాంటేషన్
* సైట్ సీయింగ్
* మాన్‌సూన్ కార్నివల్
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే –
కోజికోడ్ రైల్వేస్టేషన్ నుంచి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వయనాడ్. అలాగే కోజికోడ్ విమానాశ్రయం నుంచి కూడా.. ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అలాగే కేరళ ని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ వయనాడ్‌కి రోడ్డు మార్గం ఉంది.
* షిల్లాంగ్
షిల్లాంగ్ ఒక హిల్‌స్టేషన్ మాత్రమే కాదు.. మేఘాలయ రాష్ట్రానికి రాజధాని కూడా. ఈ ప్రాంతాన్ని వర్షాకాలంలో సందర్శిస్తే ఇక్కడ ఉండే ప్రకృతి సోయగాలకు, జలపాతాలకు ఫిదా అయిపోతారు. అలాగే ఇక్కడ స్థానికంగా ఉండే వారు కూడా మృదుస్వభావులు. ఈ ప్రాంతంలో టూర్‌కి వచ్చి విహరించడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
Shillong
ఇక్కడ చేయవలసినవి & చూడదగినవి
* ట్రెక్కింగ్
* బోటింగ్
* ప్రఖ్యాతిగాంచిన డేవిడ్ స్కాట్ ట్రెయిల్ ట్రెక్
* జలపాతాలు – ఎలిఫెంట్ ఫాల్స్ & స్ప్రెడ్ ఈగిల్ ఫాల్స్
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే –
రైలు మార్గం ద్వారా వచ్చేవారు.. షిల్లాంగ్‌కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌహతి రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.
* రాణీఖేత్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో ఉన్న ఈ హిల్‌స్టేషన్ రాణీఖేత్‌లో.. ఒకప్పుడు బ్రిటిష్ సైన్యం విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించేవారు. కాలక్రమంలో ప్రస్తుతం ఇక్కడ ఇండియన్ ఆర్మీకి చెందిన కుమావొ రెజిమెంట్ & నాగ రెజిమెంట్ వారి మిలిటరీ హాస్పిటల్‌ని ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడి నుంచి చూస్తే మనకు హిమాలయాల పశ్చిమ భాగం కనిపిస్తుంది. వర్షాకాలంలో ఇక్కడ ట్రెక్కింగ్‌కి అనువుగా ఉండడంతో.. ఎక్కువమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వారు ట్రెక్కింగ్ చేసే సమయంలో అడవులు & పచ్చటి పొలాలు దర్శనిమిస్తుంటాయి.
Ranikhet
ఇక్కడ చూడవలసినవి & చేయవలసినవి
* ట్రెక్కింగ్
* వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్
* హిమాలయాలు
ఇక్కడికి ఎలా చేరుకోవాలి
ఇక్కడికి నేరుగా రైలు మార్గం లేదు. అందుకే కట్టుగొదం వరకు రైలు మార్గంలో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక ఢిల్లీ నుండి ఈ రాణీఖేత్ సుమారు 360 కిలోమీటర్ల దూరంలో ఉంది.
* పుష్కర్
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో ఉన్న పుష్కర్ వర్షాకాలంలో ఎక్కువమంది పర్యాటకులని ఆకర్షిస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం.. దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తుంటే ఇక్కడ మాత్రం ఒక మోస్తరుకి మించి వర్షపాతం నమోదు కాదు. అయితే పుష్కర్‌ని ఆనుకుని ఉన్న ఎడారిలో ఒంటె మీద ప్రయాణం కోసం చాలామంది ఇక్కడికి వస్తుంటారు.
Pushkar
ఇక్కడ చూడవలసినవి & చేయదగినవి
* జీప్ సఫారీ
* ఒంటె రైడ్
* హైకింగ్
* పుష్కర్ ఫెయిర్
* ఎడారిలో క్యాంపు
ఇక్కడికి ఎలా చేరుకోవాలి –
జైపూర్ విమానాశ్రయం నుంచి పుష్కర్‌కి సుమారు 150 కిలోమీటర్లు దూరం ఉంటుంది. అలాగే రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకోవాలంటే వయా అజ్మీర్ నుండి రావాల్సి ఉంటుంది.
* పుదుచ్చేరి
భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటైన ఈ పుదుచ్చేరి అలియాస్ పాండిచ్చేరి కూడా.. పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందుతోంది. చాలాకాలం పాటు ఇది ఫ్రెంచ్ వారి అధీనంలో ఉండడంతో.. ఇక్కడ చాలావరకు ఫ్రెంచ్ వారి సంస్కృతి కనిపిస్తుంటుంది. ప్రధానంగా వారు నిర్మించిన భవనాల్లో వారిదైన ప్రత్యేకత తెలుస్తుంటుంది. అయితే ఇక్కడ బీచ్‌లు మాత్రం ఒకప్పటిలా లేవు. కాలక్రమంలో సముద్రపు ఒడ్డున పెరుగుతున్న కట్టడాల నేపథ్యంలో సముద్రపు తీరం కుచించుకుపోతోంది.
Pondicherry
ఇక్కడ చూడవలసినవి & చేయవలసినవి
* ప్రోమ్నెడ్ బీచ్
* పాండిచ్చేరి మ్యూజియం
* స్కూబా డైవింగ్
* ఫ్రెంచ్ సంస్కృతి
ఇక్కడికి ఎలా చేరుకోవాలి
చెన్నై నగరం నుంచి పాండిచ్చేరికి బస్సు సౌకర్యం ఉంది. అలాగే దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి పాండిచ్చేరి రైల్వే స్టేషన్‌కి రైలు సదుపాయం ఉంది. ఇవే కాకుండా పాండిచ్చేరి ఎయిర్ పోర్ట్‌కి దేశంలోని కొన్ని నగరాల నుంచి విమాన సౌకర్యం కలదు.
* ఓర్చా
వర్షాకాలంలో భేత్వా నది పునరుజ్జీవం పొందాక.. ఈ ఓర్చా ప్రాంతమంతా కొత్త రూపు సంతరించుకుంది. ముఖ్యంగా ఈ నదిని ఆనుకుని ఉన్న కట్టడాలకు కొత్త శోభ వస్తుంది. ఇక ఈ ఓర్చా మొత్తం రాజమహళ్లు & ప్యాలెస్‌లతో కళకళలాడుతుంటుంది. వర్షాకాలంలో గనుక ఇక్కడికి వెళితే.. సైట్ సీయింగ్‌తో మనకి రోజు ఎలా గడిచిపోతుందో తెలియదు. అంతలా ఆకట్టుకుంటాయి ఇక్కడి కట్టడాలు.
Orchcha
ఇక్కడ చూడవలసినవి & చేయవలసినవి
* జహంగీర్ ప్యాలెస్
* ఫూల్ బాగ్
* రాయి ప్రవీణ్ మహల్
ఇక్కడికి ఎలా చేరుకోవాలి
ఝాన్సీ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఓర్చా. అలాగే గ్వాలియర్ విమానాశ్రయం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
రామోజీ ఫిలిం సిటీని సందర్శించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఈ వివరాలు తెలియాల్సిందే..!
* మున్నార్
కేరళ రాష్ట్రంలో ఉన్న మున్నార్‌ని వర్షాకాలంలో తప్పనిసరిగా చూసి తీరాల్సిందే అంటారు ప్రకృతి ఆరాధకులు. కారణమేంటంటే – ఇక్కడ మనం చూసే ప్రకృతి సోయగాలకి దాసోహం కాని వారు ఉండరనేది అతిశయోక్తి కాదు. ఇక్కడి పశ్చిమ కనుమల్లో అందమైన లొకేషన్స్‌ని చూడవచ్చు. అదే సమయంలో ఈ సీజన్‌లో పొంగిపొరలే జలపాతాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అందుకే వర్షాకాలంలో తప్పక వెళ్ళాల్సిన ప్రదేశంగా ఇది మారిపోయింది.
Munnar
ఇక్కడ చూడవలసినవి & చేయవలసినవి
* ట్రెక్కింగ్
* సైట్ సీయింగ్
* టీ ప్లాంటేషన్
* స్థానికంగా దొరికే వంటకాలు
* అట్టుకల్ జలపాతాలు
ఇక్కడికి ఎలా చేరుకోవాలి
కేరళ రాజధాని కొచ్చి పట్టణం నుంచి రోడ్డు మార్గంలో వస్తే 110 కిలోమీటర్ల దూరంలో మున్నార్ ఉంది. మధురై విమానాశ్రయం నుంచి 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇక్కడికి చేరుకోవచ్చు.
* మహాబలేశ్వర్
పని ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగులు వారాంతపు సెలవుల్లో.. సేద తీరేందుకు చక్కటి ప్రదేశం – మహాబలేశ్వర్. ముంబయి & పుణె నగరాలకు దగ్గరగా ఉండే ఈ మహాబలేశ్వర్‌కి సెలవు రోజుల్లో పర్యటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇక వర్షాకాలంలో ఇక్కడ ప్రకృతి ప్రేమికులు కోరుకునే విధంగా పచ్చటి తోరణాల మాదిరిగా వృక్షాలు, వర్షపు నీటితో ఎటు చూసినా పచ్చగా కనిపించే నేలలు ఇక్కడ దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడ ఉండే ఫోర్ట్స్‌కి.. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే.
Mahabaleshwar
ఇక్కడ చూడదగినవి & చేయవలసినవి
* ప్రతాప్ ఘడ్
* ఎలిఫెంట్ హెడ్ పాయింట్
* లింగమాల జలపాతాలు
* ట్రెక్కింగ్
ఇక్కడికి ఎలా చేరుకోవాలి
పుణె నుంచి ఇక్కడికి చేరుకోవడం చాలా సులువు. రోడ్డు మార్గంలో ఇక్కడికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. అదే ముంబయి నుంచి అయితే గనుక.. ఇంకొక మూడు గంటలు అదనంగా వేసుకోవాలి.
* లోనావాలా
ముంబయి & పుణెలలో నివసించే వారు.. వారాంతాల్లో ఒక రోజు వెళ్లి హాయిగా గడిపేందుకు ఇది అనువైన హిల్ స్టేషన్. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడికి వచ్చే పర్యటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కారణమేంటి అంటే – ట్రెక్కింగ్‌కి ఇది అనువైన ప్రదేశం. అలాగే ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
Lonavala
ఇక్కడ చూడదగినవి, చేయవలసినవి
* టైగర్స్ లీప్
* లయన్స్ పాయింట్
* రాజ్ మచి ఫోర్ట్
* కార్ల గుహలు
* భూషి డ్యామ్
ఇక్కడికి ఎలా చేరుకోవాలి
ముంబయి నుంచి లోనావాలా 90 కిలోమీటర్ల దూరంలో ఉంటే.. పుణె నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాధారణంగా ఇక్కడికి వచ్చేవారంతా తమ సొంత వాహనాలు లేదా ప్రైవేటు వాహనాల్లో వస్తుంటారు. అయితే ప్రభుత్వ సర్వీసుల సదుపాయం కూడా ఉంది.
* కొడైకెనాల్
కొడైకెనాల్‌కి పర్యటకుల తాకిడి వేసవి కాలంతో పాటు.. వర్షాకాలంలో కూడా తీవ్రంగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో.. వర్షాలు మొదలయ్యాక కొడైకెనాల్ పరిసరాల్లో ఉన్న జలపాతాలు నూతన కళని సంతరించుకుంటాయి. అదే సమయంలో ఇక్కడ ట్రెక్కింగ్‌కి కూడా.. ఇది సరైన సమయంగా భావిస్తారు పర్యటకులు.
Kodaikanal
ఇక్కడ చూడవలసినవి & చేయవలసినవి
* బోటింగ్
* ట్రెక్కింగ్
* పంబర్ ఫాల్స్
* డాల్ఫిన్ నోస్
* కొడై సరస్సు
* బేరిజమ్ సరస్సు
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే –
మధురై విమానాశ్రయం నుంచి ఇక్కడికి 130 కిలోమీటర్లు. అలాగే కోయంబత్తూర్ విమానాశ్రయం నుంచి 170 కిలోమీటర్లు. ఇక రైలు మార్గానికి వస్తే పళని స్టేషన్ సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సమ్మర్ స్పెషల్: ఆనందంగా.. ఆహ్లాదంగా ఈ పర్యాటక ప్రదేశాల్లో ఎంజాయ్ చేసేద్దామా..!
* కూర్గ్
ఈ కూర్గ్ అటు వేసవిలోనూ.. ఇటు వర్షాకాలంలోనూ పర్యటకులను ఎంతగానో ఆకర్షించే ప్రాంతం. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి వేసవిలో ఇక్కడికి వస్తే; వర్షాకాలంలో కురిసే జల్లులకి ఇక్కడి ప్రకృతి అందాలని చూడటానికి పర్యటకులు వస్తుంటారు. ఇక ఈ కాలంలో ఇక్కడికి చాలామంది పర్యాటకులు రోడ్డు మార్గంలో తమ సొంత వాహనాలపై వస్తుంటారు. కారణమేంటంటే – కూర్గ్‌కి వచ్చే ప్రయాణ మార్గం మొత్తం కూడా ప్రకృతి తన అందాలతో స్వాగతం పలుకుతుంటుంది.
Coorg
ఇక్కడ చేయాల్సినవి & చూడదగినవి
* ట్రెక్కింగ్
* కాఫీ ప్లాంటేషన్
* జలపాతాలు
* మడికేరి ఫోర్ట్
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే
బెంగుళూరు విమానాశ్రయం నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఉండగా; మైసూర్ ఎయిర్ పోర్ట్ నుంచి 120 కిలోమీటర్ల ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక రైలు ప్రయాణానికి వస్తే, మైసూర్ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి రావచ్చు.
* చిరపుంజీ
చిన్నప్పుడు మనం చదువుకున్నాము కదా… అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం చిరపుంజీ అని. అటువంటిది వర్షాకాలంలో అక్కడికి వెళితే ఎలా ఉంటుంది? వర్షాకాలంలో ఇక్కడ మనకి కనిపించే జలపాతాల సంఖ్య చాలా ఎక్కువ. అదే సమయంలో ఇక్కడ వర్షపాతం కారణంగా ఎక్కడ చూసినా కూడా.. పచ్చదనమే మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి జలపాతాలకి తోడుగా కొన్ని గుహలు కూడా దర్శనమిస్తాయి.
Cheerrapunji
ఇక్కడ చూడవలసినవి
* నోకాళికై జలపాతాలు
ఇక్కడికి ఎలా చేరుకోవాలి
మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో చిరపుంజీ ఉంది. రైలు మార్గం ద్వారా వచ్చేవారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌహతి రైల్వే స్టేషన్‌లో దిగి.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి రావచ్చు.
* అలీబాగ్
ముంబయి మహానగరం నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ చిన్న గ్రామం. ఇక ఈ అలీబాగ్‌కి రోజురోజుకి పర్యటకుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. చాలామంది సెలబ్రిటీలు అలీబాగ్‌కి వచ్చి సేదతీరుతుంటారు. ఉదాహరణకి షారుక్ ఖాన్ తన కుటుంబంతో.. అలీబాగ్‌కి విహారయాత్రకు వస్తుంటారు. ఇక ఇక్కడ ఇతర బీచులతో పాటుగా కులాబా ఫోర్ట్‌ని కూడా చూడచ్చు. అయితే ఫెర్రీ ద్వారా గెట్ వే ఆఫ్ ముంబయి నుంచి అలీబాగ్‌కి రోజూ సర్వీసులు నడుపుతుంటారు. అలా ఫెర్రీ ద్వారా చేసే ప్రయాణం కూడా చాలామందిని ఆకర్షిస్తుంది.
Alibaug
ఇక్కడ చూడవలసినవి & చేయవలసినవి
* జెట్ స్కీయింగ్
* కులాబ ఫోర్ట్
* మురుద్ బీచ్
* ఖందేరి
* అలీబాగ్ ఫోర్ట్
* సిద్దేశ్వర్ మందిర్
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే
రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే పెన్ అనే రైల్వే స్టేషన్‌లో దిగితే సరిపోతుంది. అలాగే బోటు ద్వారా గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి అలీబాగ్ చేరుకోవచ్చు. ఇక రోడ్డు మార్గం ద్వారా అంటే ముంబయి – గోవా హైవే వెళ్లే దారిలో అలీబాగ్‌కి చేరుకోవచ్చు.
* అతిరాపల్లి ఫాల్స్
బాహుబలి సినిమాలో చూశారు కదా ఒక భారీ జలపాతం.. ఆ జలపాతమే ఈ అతిరాపల్లి జలపాతం. కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లా కేంద్రానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతానికి చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే పర్యాటకుల నుంచి సినిమా వారి వరకు.. అందరూ కూడా ఈ జలపాతానికి అభిమానులే. దీనికి నయాగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా అని పేరు కూడా వచ్చిందంటే దీనికి ఎంత ఖ్యాతి ఉందో మీరే అర్ధం చేసుకోవాలి.
Athirapally Falls
ఇక్కడ చూడదగినవి & చేయదగినవి
* ట్రెక్కింగ్
* సఫారీ
* వరాచల్ పిక్నిక్ స్పాట్
* ఛర్పా ఫాల్స్
ఇక్కడికి ఎలా చేరుకోవాలి-
కొచ్చి విమానాశ్రయం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ అతిరాపల్లి ఫాల్స్. అలాగే కొచ్చి నుంచి దాదాపు రోడ్డు మార్గం ద్వారా రెండు నుంచి మూడు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.
* అగుంబే
కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలో ఉన్న అగుంబే ఒక చిన్న గ్రామం. దీనిని దక్షిణాది చిరపుంజీగా పిలుస్తారు. ఎందుకంటే ఈ అగుంబే చుట్టూ కూడా అనేక జలపాతాలు ఉన్నాయి. అదే సమయంలో ఈ అగుంబే ప్రాంతం ట్రెక్కింగ్‌కి కూడా చాలా అనువైన ప్రాంతంగా గుర్తించారు. అగుంబే నుంచి సూర్యాస్తమయాన్ని చూసేందుకు సన్ సెట్ పాయింట్ కూడా ఉంది. ఈ పాయింట్ ద్వారా అరేబియా మహాసముద్రంపైన సూర్యాస్తమయాన్ని చూడవచ్చు.
Agumbe
ఇక్కడ చూడదగినవి & చేయదగినవి
* బర్కనా ఫాల్స్
* జోగిగుండి ఫాల్స్
* కోడ్లు తీర్థ ఫాల్స్
* సన్ సెట్ పాయింట్
ఇక్కడికి ఎలా చేరుకోవాలి –
అగుంబేకి 110 కిలోమీటర్ల దూరంలో మంగళూరు విమానాశ్రయం ఉంది. ఇక రైలు మార్గం విషయానికి వస్తే.. ఉడిపి రైల్వే స్టేషన్ అగుంబేకి 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం KSRTC తరపున బెంగళూరు, మంగళూరు, ఉడిపిల నుంచి అగుంబేకి సర్వీసులని నడిపిస్తోంది.
* అలెప్పి
కేరళ బ్యాక్ వాటర్స్ గురించి తెలియని వారుండరు కదా. అలా ప్రతి వర్షాకాలంలో అలెప్పికి ఈ బ్యాక్ వాటర్స్‌ని చూసేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక ఇక్కడ అందరూ చెప్పుకునే బోట్ హౌస్‌తో పాటుగా ..ప్రత్యేకంగా లభించే ఆయుర్వేద వైద్యం కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణ.
Allappey
ఇక్కడ చేయవలసినవి & చూడదగినవి
* బ్యాక్ వాటర్స్‌లో బోట్ హౌస్
* కయల్ కల్టివేషన్
* కనిట్ట
* విలకుమరం తోడు
ఇక్కడికి ఎలా చేరుకోవాలి –
అలెప్పికి అనువైన రోడ్డు మార్గం ఉంది. కేరళ రాజధాని కొచ్చి విమానాశ్రయం నుంచి కూడా నేరుగా ఇక్కడికి రావొచ్చు. దాదాపు కొచ్చి నుంచి 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో అలెప్పి ఉంది.
హైదరాబాద్ నగరవాసులను విశేషంగా అలరిస్తోన్న తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ 2019…
* కౌసాని
ఈ కౌసాని ప్రాంతం కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న హిల్ స్టేషన్స్‌లో ఒకటి. భాగేశ్వర్ జిల్లాలో ఉన్న హిల్ స్టేషన్ కౌసాని. ఈ హిల్ స్టేషన్‌కి ట్రెక్కింగ్ కోసం వచ్చే పర్యటకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందుకే హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేయాలనుకునేవారు ఈ కౌసానికి కూడా వస్తుంటారు.
Kausani
ఇక్కడ చేయవలసినవి & చూడదగినవి
* ట్రెక్కింగ్
* భాగేశ్వర్
* రుద్రాధ్రి ధామ్
* చౌకోరి
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే –
పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ నుంచి దాదాపు 178 కిలోమీటర్ల దూరంలో ఈ హిల్ స్టేషన్ ఉంది. అలాగే కథ్ గోదం రైల్వే స్టేషన్ (140 కిలోమీటర్ల) నుంచి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.
* బికనేర్
రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న బికనేర్ కూడా వర్షాకాలంలో పర్యటించదగ్గ ప్రదేశాలలో ఒకటి. బికనేర్ నగరంలో ఉండే కట్టడాలకు తోడు.. థార్ ఎడారి కూడా పక్కనే ఉండడంతో ఒంటెల పైన తిరుగుతూ పర్యటించే వీలుండడం ఇక్కడ విశేషం. ఇక బికనేర్‌లో ప్రతి యేడు ‘వరల్డ్ క్యామెల్ ఫెస్టివల్’ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఎందరో పర్యటకులు ఇక్కడికి వస్తుంటారు.
Bikaner
ఇక్కడ చూడవలసినవి & చేయదగినవి
* జునగర్ ఫోర్ట్
* లక్ష్మి నివాస్ ప్యాలెస్
* రావు బికాజీస్ ఫోర్ట్
* కర్ణి మాత గుడి
* క్యామెల్ రైడ్
* ఈక్వైన్స్ రీసర్చ్ సెంటర్
* క్యామెల్ రీసర్చ్ సెంటర్
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే –
బికనేర్‌కి రోడ్డు, రైలు & విమాన మార్గం ద్వారా చేరుకునే సౌకర్యం ఉంది. బికనేర్‌లో డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్‌తో పాటుగా బస్ టెర్మినల్ కూడా ఉంది.
* కన్యాకుమారి
కన్యాకుమారి అలియాస్ కేప్ కొమొరిన్ మన దేశానికి దక్షిణాన ఉన్న చిట్టచివరి పట్టణం. ఇక ఇక్కడ ఉండే స్వామి వివేకానంద్ రాక్ మెమోరియల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. ఈ మెమోరియల్‌కి చేరుకోవడానికి ఒడ్డు నుంచి మూడు బోట్లలలో పర్యాటకులని తరలిస్తుంటారు. అలాగే ఇక్కడ ఉండే బీచ్ & మరికొన్ని పర్యటక స్థలాలు… పర్యటకులని విశేషంగా ఆకర్షిస్తుంటాయి.
Kanyakumari
ఇక్కడ చేయవలిసినవి & చూడదగినవి
* సీ ఫుడ్
* స్వామి వివేకానంద రాక్ మెమోరియల్
* తిరువళ్ళువర్ స్టాట్యు
* భగవతి అమ్మన్ టెంపుల్
* సునామి మెమోరియల్ పార్క్
* గాంధీ మెమోరియల్ మండపం
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే
దేశంలో అన్ని వైపుల నుంచి ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉంది. అలాగే కన్యాకుమారికి 90 కిలోమీటర్ల దూరంలో తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ ఉంది.
* మండు
రాణి రూప్ మతి, యువరాజు బాజ్ బహదూర్‌ల ప్రేమకి చిహ్నంగా మండులో ఉండే కట్టడాలు మనకి దర్శనిమిస్తాయి. ఈ ప్రదేశం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలో ఉంది. దీనికి మాండవ్ ఘడ్ అని మరొక పేరు కూడా ఉంది. దాదాపు 37 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ఫోర్ట్‌కి దాదాపు 12 గేట్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వారు ఈ ప్యాలెస్ సౌందర్యానికి ముగ్దులవ్వాల్సిందే.
Mandu
ఇక్కడ చూడాల్సినవి
* ధర్వాజాలు (గేట్లు)
* బాజ్ బహదూర్ ప్యాలెస్
* రేవా కుంద్
ఇక్కడికి చేరుకోవాలంటే
ఇండోర్ పట్టణానికి సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. రోడ్డు, రైలు & విమానం ద్వారా ఇండోర్‌కి చేరుకొని అక్కడి నుంచి మండుకి చేరుకోవచ్చు.
* పంచ్ గని
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న హిల్ స్టేషన్ పంచ్ గని. ఈ హిల్ స్టేషన్‌ని పాచ్ గని అని కూడా పిలుస్తుంటారు. అయితే పంచ్ గనికి ఈ పేరు రావడానికి కారణం ఆ ప్రదేశం చుట్టూ ఉండే అయిదు ఊర్లు – దాండే ఘర్, గోదావళి, అమ్రాల్, ఖింగర్ & తైఘాట్.
Panchgani
ఇక్కడ చూడవలసినవి & చేయదగినవి
* సిడ్నీ పాయింట్
* టేబుల్ ల్యాండ్
* పార్శి పాయింట్
* డెవిల్స్ కిచెన్
* స్ట్రాబెరి ఫార్మ్స్
* బోర్డింగ్ స్కూల్స్
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే
పుణె నగరం నుంచి 2 గంటల ప్రయాణ దూరంలో ఉంది ఈ ప్రదేశం. మహాబలేశ్వర్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు మార్గం కూడా ఉంది. ముంబయి & పుణె నుంచి చాలామంది పర్యటకులు వారాంతాల్లో సేదతీరడానికి ఇక్కడికి చేరుకుంటుంటారు.
* ముస్సోరి
ముస్సోరి – క్వీన్ ఆఫ్ హిల్స్‌గా పిలవబడే ఈ ప్రదేశం పర్యటకులకు స్వర్గధామం అని చెప్పొచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలో ఉన్న హిల్ స్టేషన్ ఈ ముస్సోరి. గర్హ్వాల్ హిమాలయన్ రేంజెస్‌లో ఉండే ఈ హిల్ స్టేషన్‌లో మిలిటరీ కంటోన్మెంట్ కూడా ఉంది.
Mussorie
ఇక్కడ చూడాల్సినవి, చేయవలసినవి
* ట్రెక్కింగ్
* ముస్సోరి లేక్
* భట్టా ఫాల్స్
* హ్యాపీ వ్యాలీ
* లేక్ మిస్ట్
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే
డెహ్రాడూన్‌లో ఉన్న జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ నుంచి ముస్సోరి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా అయితే ఢిల్లీ నుండి కూడా వెళ్లచ్చు.
* అండమాన్ & నికోబార్
దాదాపు 572 ద్వీపాల సమాహారం.. 37 ద్వీపాలలో జనసంచారం ఉండగా.. అందులో కూడా కొన్నింటిలో మాత్రమే పర్యటకుల సంచారానికి అనుమతి ఉంది. ఒకప్పుడు బ్రిటిష్ వారు తమకి వ్యతిరేకంగా పనిచేసేవారిని ఇక్కడ కాలాపాని జైలులో బంధించేవారు. ఆ జైలు పేరుతో ఒక చిత్రం కూడా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ ద్వీపాలకి ప్రపంచవ్యాప్తంగా మంచి పర్యాటక కేంద్రంగా ఆదరణ లభిస్తోంది. పోర్ట్ బ్లెయిర్ ఈ ద్వీపాల సమూహానికి రాజధానిగా ఉంది.
Andaman And Nicobar Island
ఇక్కడ చూడవలసినవి, చేయదగినవి
* సెల్యులార్ జైలు
* మహాత్మా గాంధీ మెరైన్ పార్క్
* అండమాన్ స్పోర్ట్స్ వాటర్ కాంప్లెక్స్
* స్కూబా డైవింగ్
* వందూర్ బీచ్
* నావల్ మ్యూజియం
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే
దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి వీర్ సవార్కర్ పోర్ట్ బ్లెయిర్ ఎయిర్ పోర్ట్‌కి రోజూ విమాన రాకపోకలు జరుగుతుంటాయి. అలాగే విశాఖపట్నం, చెన్నైల నుండి కూడా షిప్‌లలో వెళ్లే సౌకర్యం కూడా ఉంది.
ఇవి మన దేశంలో పర్యాటకులు ఎక్కువగా వర్షాకాలంలో సందర్శించే ప్రదేశాలు & వాటి సమగ్ర వివరాలు. ఈ పైన పేర్కొన్న వాటికి ఇంకేవైనా జత పరచాలి అని మీరు అనుకుంటే ఈ క్రింది కామెంట్ బాక్స్‌లో తెలియపరచగలరు.