ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
మహిళలూ.. ప్రమాదంలో చిక్కుకోకుండా ఈ రక్షణ చిట్కాలు పాటించండి

మహిళలూ.. ప్రమాదంలో చిక్కుకోకుండా ఈ రక్షణ చిట్కాలు పాటించండి

ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే.. దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని గాంధీ మహాత్ముడు అన్నాడు. కానీ మన దేశంలో ఆ రోజు  రావడం కలగానే మిగిలిపోతుందేమో. మహిళలకు అన్ని రంగాల్లో స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు మహాత్మగాంధీ ఆ మాటలన్నారు.

అయితే ప్రస్తుతం అర్ధరాత్రి కాదు కదా.. పట్ట పగలు, సాయంత్రాలు కూడా స్త్రీలు బయట తిరగడం అసాధ్యంగా మారిపోయింది. ఇటీవలే హైదరాబాద్ శివారులోని షాద్‌నగర్ అవుటర్ రింగ్ రోడ్ వద్ద జరిగిన వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, దారుణ హత్య గురించి తెలియని వారు ఈ దేశంలో ఎవరూ ఉండరేమో. 

ప్రస్తుతం #justicefordisha అంటూ దేశమంతా ఆమెకు న్యాయం జరగాలంటూ పోరాడుతోంది. చదువు లేకపోవడం, మితి మీరిన స్వేచ్ఛ, నేర ప్రవృత్తి పెరగడం వంటివి నేడు ఆడపిల్లలపై అత్యాచారాలకు కారణాలవుతున్నాయి. అయితే ఈ క్రమంలో తమపై నేరాలకు ఒడిగట్టే వారి నుండి.. తమను తాము రక్షించుకునే పద్ధతుల  గురించి ప్రతి మహిళా తెలుసుకోవడం ఎంతో అవసరం.

ఇలా జాగ్రత్త పడండి..

ADVERTISEMENT

మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఈ సమాజంలో మానవ మృగాలు ఏ రూపంలో మన చుట్టూ చేరతాయో .. ఏ విధంగా మనల్ని కబలిస్తాయో చెప్పలేం. అందుకే మనమే అన్ని వేళలా అప్రమత్తంగా ఉండడం మంచిది. తాజాగా జరిగిన సంఘటనలో దిశ తన చెల్లెలికి ఆఖరిసారి ఫోన్ చేసే బదులుగా.. ‘డయల్ 100’కి కాల్ చేస్తే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

కొన్నిసార్లు పరిస్థితి అంత సీరియస్ కాదని మనకు అనిపించినా… ప్రమాదం జరిగే వరకూ దాన్ని అంచనా వేయలేం. అందుకే అప్రమత్తంగా ఉండాలి. దానినే మన ఆయుధంగా చేసుకొని ముందుకెళ్లాలి. చాలా కేసుల్లో చదువుకున్న వాళ్లే అయినా.. వారికి స్వీయ రక్షణ గురించి, పోలీసులు అందిస్తున్న సేవల గురించి అవగాహన ఉండట్లేదు. కానీ ఈ విషయాలను గురించి తెలుసుకొని ఉండడం ప్రతి మహిళకూ ఎంతో అవసరం.

* వీలైనంత ఎక్కువగా యాప్ ద్వారా బుక్ చేసే క్యాబ్స్ లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ని మాత్రమే ఎంచుకోండి. అందులో అయితే.. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ఎమర్జెన్సీ బటన్ నొక్కే వీలుంటుంది. ఒకవేళ మీరు సొంత వాహనంలో వెళ్తుంటే బయల్దేరే ముందే టైర్‌లో గాలి ఉందా? పెట్రోల్ సరిపోయేంతగా ఉందా? అనేది కూడా చెక్ చేసుకోవాలి.

* ప్రతి మనిషికి ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. దాన్ని నమ్మండి. ఒక వ్యక్తిని చూశాక.. మీకు తనను నమ్మాలనిపించకపోతే వారి నుంచి దూరంగా ఉండడం మంచిది. కొందరు మంచి వ్యక్తుల్లా నటించి.. నమ్మించి.. మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటివారికి కూడా వీలైనంత ఎక్కువ దూరంగా ఉండాలి.

ADVERTISEMENT

* అలాగే రాత్రి సమయాల్లో వీలైనంత తక్కువగా బయటకు వెళ్లడం మంచిది. స్వేచ్ఛగా జీవించడం అవసరమే కానీ.. అప్రమత్తంగా ఉండడం ఇంకా అవసరం. అలాగే బయటకు వెళ్లినా.. ఎక్కువ జనసంచారం ఉన్న ప్రదేశాల్లోనే ఉండడం మంచిది. దిశ ఘటనలో ఆ అమ్మాయి చెల్లెలు చెప్పినట్లుగా “టోల్ బూత్ దగ్గర నిలబడితే కాస్త ప్రమాదం తప్పేది”.. నిజమే.. వచ్చే పోయే వ్యక్తులు ఏదోలా చూస్తారని.. ఆ అమ్మాయి అక్కడికి వెళ్లేందుకు భయపడింది. కానీ రక్షణ కంటే అదేమీ ఎక్కువ కాదని గుర్తుంచుకుంటే సరిపోతుంది.

* రాత్రి సమయాల్లో ఎవరినైనా తోడు తీసుకొని బయటకు వెళ్లడం మంచిది. అయితే వ్యక్తులు తోడుగా ఉన్నా సరే.. వీలైనంత ఎక్కువగా జనసంచారం ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ఉండడం వల్ల.. చుట్టూ ఉన్నవారు మీకు సహాయం చేయలేకపోయినా పోలీసులకు సమాచారం అందించే వీలుంటుంది.

* ఏదైనా సందర్భంలో అనుకోకుండా ఒంటరిగా ఉండాల్సి వచ్చినా.. మనసులోని భయం బయటకు కనిపించకుండా ధైర్యంగా ఉన్నట్లు నటించాలి. ఎప్పటికప్పుడు మనం ఎక్కడున్నాం.. ఏ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగిస్తున్నాం అన్న విషయాలు కుటుంబసభ్యులు, స్నేహితులకు తెలియజేయడం మంచిది. అలాగే వాట్సాప్‌లో ఉన్న లైవ్ లొకేషన్ ఆన్ చేయడం వల్ల.. వారికి మీ వివరాలు తెలుస్తాయి. మీకేదైనా సహాయం అవసరమైతే దగ్గర్లోని స్నేహితులను కాంటాక్ట్ చేయడం వల్ల.. వెంటనే సహాయం పొందొచ్చు. మీ దగ్గర జీపీఎస్ ట్రాకర్‌ని కూడా పెట్టుకోవడం వల్ల నెట్ వర్క్ లేకపోయినా సాయం పొందే వీలుంటుంది.

* ఎక్కడికి వెళ్లినా హ్యాండ్ బ్యాగ్‌లో చిన్న కత్తి, కారం, పెప్పర్ స్ప్రే పెట్టుకోవాలి. మీపై ఎవరైనా అటాక్ చేస్తే వారిని గిచ్చడం, కొరకడం, రాయి దొరికితే దాన్ని తీసుకొని కొట్టడం వంటివి చేయచ్చు.

ADVERTISEMENT

ఈ యాప్స్ (apps)

* 112 ఇండియా
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 112 ఇండియా యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ రెండింటిలోనూ డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. ఇందులో యాప్ డౌన్ లోడ్ చేసిన తర్వాత.. వివరాలు రిజిస్టర్ చేసుకొని.. కుటుంబ సభ్యులు, స్నేహితుల నంబర్లు కూడా యాడ్ చేసే వీలుంటుంది. ఇందులోని ఎమర్జెన్సీ బటన్‌ని నొక్కితే చాలు.. కాల్ సెంటర్ వాళ్లు మీకు కాల్ చేస్తారు. మీరు కాల్ లిఫ్ట్ చేయకపోతే.. మీ రియల్ టైం లొకేషన్ అందిస్తుంది కాబట్టి.. అక్కడికి పోలీసులు వచ్చే సదుపాయం ఉంటుంది.

* హాక్ ఐ

హాక్ ఐ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని పేరు నమోదు చేసుకోవాలి. అలాగే మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వంటివి పొందుపర్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌లో మన కుటుంబ సభ్యుల నంబర్లు ఫీడ్ చేసుకోవచ్చు. ఇందులోని ‘వుమెన్ ట్రావెల్ మోడ్ సేఫ్’ అనే ఫీచర్ని మీరు రాత్రుళ్లు ప్రయాణాలు చేస్తున్నప్పుడు యాక్టివేట్ చేసుకోండి. ఇందులో భాగంగా యాప్‌లో మీ ప్రయాణ వివరాలు పొందుపర్చాలి.

ADVERTISEMENT

మీరు వెళ్లే క్యాబ్, ఆటో నంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు ఐటీ సెల్ ద్వారా మీ ప్రయాణాన్ని పోలీసులు చెక్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మధ్యలో వాహనం ఆగినా.. లేక వేరే మార్గంలో ప్రయాణించినా పోలీసులే గుర్తించి మనల్ని సంప్రదిస్తారు.

ఒకవేళ మనం ఫోన్ ఎత్తకపోతే.. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుంటారు. ప్రయాణం పూర్తయిన తర్వాత.. వారి నుంచి మెసేజ్ అందే వరకూ ఈ సేవలు అందిస్తారు. ఇది రిజిస్టర్ చేసుకోకపోయినా.. ఏదైనా ప్రమాదం పొంచి ఉందని అనిపిస్తే.. ఎస్ ఓ ఎస్ బటన్‌ని నొక్కితే పోలీస్ స్టేషన్లకు సమాచారం అందుతుంది. అలాగే కమ్యునిటీ పోలీసింగ్‌లో భాగంగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న స్త్రీలకు సాయం చేయాలనుకున్న అబ్బాయిలు రిజిస్టర్ చేసుకోవచ్చు. వారు బటన్ నొక్కినప్పుడు వీరికి కూడా సమాచారం అందుతుంది. కాబట్టి దగ్గర్లో ఉంటే వెళ్లి వారిని కాపాడే వీలుంటుంది.

ఇవే కాకుండా హైదరాబాద్ పోలీసులు ‘షీ సేఫ్’ అనే యాప్ని, విజయవాడ పోలీసులు ‘ఫోర్త్ లయన్’ అనే యాప్‌ని కూడా అందుబాటులో ఉంచారు. ఈ యాప్స్ (apps) కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఈ నంబర్లతో..

ADVERTISEMENT

కేవలం యాప్స్ ద్వారా మాత్రమే కాదు..  అత్యవసర సమయంలో చిన్న ఫోన్ కాల్ చేసినా సరే.. దూరంలో పోలీసులు మీకు అందుబాటులో ఉంటారు. 100, 181, 112, 1091, 1090, 1096 వంటి హెల్ప్ లైన్ నంబర్లలో ఏదో ఒక దానికి సమాచారం అందిస్తే చాలు.. పది నిమిషాల సమయంలో పోలీసులు మీరుండే ప్రదేశానికి చేరుకుంటారు. ఇవి కాకుండా 9490616555, 9490617444, 9490617111 వంటి నంబర్లు స్పీడ్ డయల్‌లో సేవ్ చేసుకొని వాటికి కాల్ చేయడం మంచిది. ఒకవేళ మీది స్మార్ట్ ఫోన్ కాకపోయినా సరే.. మీ ఫోన్‌లోని 1, 5, 9 నంబర్లలో ఒకటి గట్టిగా ఒత్తి ఉంచడం వల్ల పోలీసులకు సమాచారం అందించే వీలుంటుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

02 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT