ఇప్పుడు మీ వయసు ఎంత? ఇరవై ఏళ్లా? అయితే ఇది మీ కోసమే. ఇప్పుడు మీరు చాలా బిజీ కదా..! అవును.. ఇప్పుడిప్పుడే చదువు ముగించుకొంటూ కెరీర్ నిర్మించుకొనే ప్రయత్నాలు చేయడం.. జాబ్ సంపాదించుకోవడం.. ఆపై ప్రేమ.. పెళ్లి.. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చేసరికి మీ వయసు దాదాపు 30 దగ్గరకొచ్చేస్తుంది. ఇక ఈ బిజీ సమయంలో చర్మం ఆరోగ్యం గురించి పట్టించుకొనేదెప్పడు చెప్పండి? అదేంటీ.. అప్పుడప్పుడూ ఫేషియల్ చేయించుకొంటున్నా.. కుదిరినప్పుడల్లా క్లెన్సింగ్ చేసుకొంటున్నా కదా.. అనుకొంటే మాత్రం పొరపాటే. చర్మ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇవి మాత్రమే సరిపోవు. మరికొన్ని పనులు చేయడం మానేయాలి. అప్పుడే మీరు ఎప్పటికీ ఇరవైల్లో ఉన్న అమ్మాయిగానే కనిపిస్తారు. దానికోసం మీరు మానేయాల్సిన కొన్ని skincare habits ఏంటో తెలుసుకొందాం.
1. హాని కలిగించే టోనర్లు వాడడం ఆపేయాలి
చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి టోనర్ ఉపయోగించడం తప్పనిసరి. అప్పుడే చర్మరంధ్రాల్లో చేరిన మురికి వదిలిపోతుంది. చర్మం జిడ్డుగా మారకుండా ఉంటుంది. అయితే కొన్ని రకాల టోనర్లలో చర్మానికి హానిచేసే ఆల్కహాల్ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని ఉపయోగించకుండా.. సహజసిద్ధమైన టోనర్ ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికోసం రోజ్ టోనర్ ఉపయోగిస్తే.. ఇది చర్మాన్ని టోనింగ్ చేస్తుంది. అలాగే రసాయన రహితం కాబట్టి చర్మానికి హాని చేయదు.
Also Read: తాన్ తొలగించడానికి సహజ మార్గాలు (Natural Ways To Remove Sun Tan)
2. చర్మానికి అవసరమైన విటమిన్లు తీసుకోకపోవడం..
చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచే విషయంలో విటమిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. కాబట్టి ఈ విటమిన్లు కలిగి ఉండే ఆహారం రోజూ తీసుకొంటూ ఉండాలి. అలాగే విటమిన్ సప్లిమెంట్స్ లేదా ఇవి కలిగి ఉన్న సౌందర్య ఉత్పత్తులను కూడా వాడొచ్చు.
3. సన్ స్క్రీన్ అప్లై చేసుకోకపోవడం..
సూర్యకిరణాలు చర్మ కణాలను నాశనం చేస్తాయి. దీనివల్ల చిన్న వయసులోనే ముదిమి ఛాయలు కనిపిస్తాయి. అంతేకాదు.. చర్మం సాగినట్లుగా కనిపిస్తుంది. దీనివల్ల మీ అందం తగ్గపోతుంది. కాబట్టి బయటకు వెళ్లినప్పడు సన్ స్క్రీన్ రాసుకోవడం తప్పనిసరి. అప్పుడే సూర్యకిరణాల ప్రభావం చర్మంపై పడకుండా ఉంటుంది. కాబట్టి రోజూ సన్ స్క్రీన్ వాడటం ప్రారంభించండి.
4. ఎప్పడూ ఒకే రకమైన సౌందర్య ఉత్పత్తులు వాడటం
మన వయసు పెరిగే కొద్దీ స్కిన్ టెక్స్ఛర్ కూడా మారుతుంది. కాబట్టి దానికి తగిన సౌందర్య ఉత్పత్తులను వాడటం మంచిది. ముఖ్యంగా ఇరవైల్లో ఉన్నప్పుడు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఈ వయసులో ఉపయోగించే ఉత్పత్తులు చర్మాన్ని జిడ్డుగా మారకుండా చేసి మొటిమలు ఏర్పడకుండా చేసేవై ఉంటాయి. ముప్పైల్లోకి వచ్చేసరికి ఆ వయసుకి తగిన చర్మ సౌందర్య ఉత్పత్తులు వాడాల్సి ఉంటుంది.
5. నీరు తాగకపోవడం
శరీర నిర్మాణంలో నీరు కీలకపాత్ర పోషిస్తుంది. ఆహారం జీర్ణమవ్వడానికి, జీర్ణమైన ఆహారం శోషించుకోవడానికి, శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించడానికి ఇలా ఎన్నో ముఖ్యమైన పనుల్లో నీటి పాత్ర చాలా కీలకం అని చెప్పుకోవచ్చు.. అవును, ఈ విషయం మీక్కూడా తెలుసు. తెలిసినా తగినంత నీరు తాగడం మాత్రం మరచిపోతుంటారు. ఇక నుంచి ఇలా చేయకుండా.. రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు ప్రకాశవంతంగానూ మారుతుంది.
6. తగినంత నిద్రపోకపోవడం..
ఇరవైల్లో ఉన్నప్పుడు వీడియో గేమ్స్ ఆడుతూనో.. చాటింగ్ చేస్తూనో చాలా తక్కువ నిద్రపోతుంటారు. ఇలా చేయడం వల్ల చర్మానికి చాలా నష్టం జరుగుతుంది. తగినంత విశ్రాంతి లేకపోతే.. శరీరం కార్టిసోల్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. దీన్ని స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తారు. ఇది మనలో ఒత్తిడి కలిగిస్తుంది. దీని ప్రభావం వల్ల కలిగే ఇనఫ్లమేషన్ చర్మం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చర్మం పొడిగా మారి దురద పెడుతుంది. కాబట్టి తగినంత సమయం నిద్రపోవడం అవసరం. రోజుకి కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం తప్పనిసరి.
7. అనవసరమైన స్కిన్ కేర్ ఉత్పత్తులు ఉపయోగించడం
వయసు ఇరవైల్లోనే ఉన్నప్పటికీ కొన్నిసార్లు చర్మంపై గీతలు ఏర్పడటం, ముడతలు పడటం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో చాలామంది యాంటీ రింకిల్, యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు వాడటం మొదలుపెట్టేస్తారు. ఇలా చేయడం సరికాదు. ఎందుకంటే ఇలాంటి ఉత్పత్తుల్లో రెటినాల్, పెప్టైడ్స్ అధికంగా ఉంటాయి. వీటివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీనికారణంగా చర్మంపై ఎర్రటి పొక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్య ఎదురైతే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. అంతే తప్ప కనిపించిన ఉత్పత్తులన్నీ వాడకూడదు.
8. ఉన్నట్టుండి డైట్ మార్చేయడం..
ఇరవైల్లో ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలు స్లిమ్‌గా ఉండాలని కోరుకొంటారు. దానికోసం ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ సరైన ఫలితాలు రావడం లేదనో.. మరేదైనా కారణం చేతనో.. సడెన్‌గా డైట్ మార్చేస్తుంటారు. దీని ప్రభావం చర్మంపై అధికంగా పడుతుంది. కాబట్టి తరచూ డైట్ మార్చకుండా.. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను భాగం చేసుకోవాలి. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతో పాటు చర్మానికి తగిన పోషణ అందుతుంది.
9.నైట్ క్రీం రాసుకోకపోవడం..
కళ్ల చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దీని కారణంగానే.. అక్కడి చర్మం ముడతలు పడటం, పొడిగా మారడం వంటివి తరచూ జరుగుతుంటాయి. కాబట్టి అక్కడి చర్మాన్ని ఎప్పుడూ హైడ్రెటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం గ్లిజరిన్, హైలూరోనిక్ ఆమ్లం ఉన్న నైట్ క్రీం ఎంచుకోవాలి. ఇవి కళ్ల కింద చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉండేలా చేస్తాయి. దీనివల్ల అక్కడ చర్మం మృదువుగా మారుతుంది. మీ కళ్ల కింద చర్మం నల్లగా ఉంటే.. నియాసినమైడ్(niacinamide) వంటి యాంటీ ఇనఫ్లమేటరీ గుణాలున్న క్రీంను ఎంచుకోవడం మంచిది.
10. తరచూ చర్మాన్ని తాకుతుండటం..
ముఖంపై మొటిమ వస్తే దాన్ని తరచూ తాకడం, బ్లాక్ హెడ్స్‌ను గోర్లతో తొలగించుకోవడానికి ప్రయత్నం చేయడం వంటివి అమ్మాయిలు తరచూ చేసేవే. కానీ ఇలా చేయడం వల్ల అక్కడి చర్మకణాలు నాశనం అయిపోతాయి. ఇది పిగ్మెంటేషన్ సమస్యకు దారితీయవచ్చు. కొందరిలో ముఖంపై మొటిమల మచ్చలు ఏర్పడతాయి. ఇలా కాకుండా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి తొలగించుకోవడానికి kaolin clay, చార్కోల్ కలిగి ఉన్న స్క్రబ్‌లను ఉపయోగించడం మంచిది. స్క్రబ్ చేసుకొన్న తర్వాత మాయిశ్చరైజ్ చేసుకొంటే..చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
హెల్త్ సరిగ్గా లేకున్నా ఆఫీసుకి వెళ్లాల్సొస్తే.. ఏం చేయాలి..?
జస్ట్.. ఒక్క నిమిషంలో.. అందమైన ఐబ్రోస్ కావాలంటే ఏం చేయాలి..?
ఓ కామన్ గర్ల్.. నేటితరానికి చెప్పిన అతిగొప్ప సౌందర్య చిట్కా ఇదే..!