(Types of Facials and their benefits for Skin)
Table of Contents
మీది జిడ్డు చర్మమా? అలాగే మొటిమల సమస్య మిమ్మల్ని వేధిస్తోందా..? అందుకోసం పార్లర్‌కి వెళ్లి ఎప్పుడెప్పుడు ఫేషియల్ చేయించుకోవాలా అని ఆలోచిస్తున్నారా..? అలాగే ఫేషియల్ వల్ల ముఖ చర్మం అందంగా మారుతుందా? లేదా? అని సందేహిస్తున్నారా..?
అయితే ఇది నిజమే.. ఒక్కో రకం ఫేషియల్ వల్ల.. ఒక్కో రకం ప్రయోజనం మన చర్మానికి అందుతుంది. మన చర్మ తత్వాన్ని బట్టి.. మన చర్మ సమస్యను బట్టి.. మనకు అవసరమైన ఫేషియల్‌ని ఎంచుకుంటే చాలు.. మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఫేషియల్ చేయించుకోవడానికి ముందే దానికి సంబంధించి వివరాలు తెలుసుకోవడం వల్ల.. బ్యూటీ పార్లర్‌లో మీ పని సులువవుతుంది. అంతేకాదు.. మీకు ఏ ఫేషియల్ బాగుంటుందో.. మరొకరు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న.. అన్ని రకాల ఫేషియల్స్ గురించి తెలుసుకుందాం రండి..
ఫేషియల్స్‌లో రకాలు
మీ ముఖ చర్మాన్ని బట్టి.. మీకు ఎలాంటి ఫేషియల్ అవసరమో తెలుస్తుంది. ముఖ్యంగా మీ చర్మ తత్వానికి తగిన ఫేషియల్ చేయించుకోవడం వల్ల.. మంచి ఫలితాలు పొందవచ్చు.
1. ఫ్రూట్ ఫేషియల్
ఫేషియల్స్ అన్నింటిలోనూ చాలా సింపుల్ ఫేషియల్ ఇది. దీని ధర కూడా చాలా తక్కువ. ఒకవేళ మీకు ఏ ఫేషియల్ చేయించుకోవాలో అర్థం కాకపోయినా.. లేదా మీ బడ్జెట్ తక్కువగా ఉన్నా.. దీన్ని ప్రయత్నించండి. దీనివల్ల చర్మం మెరుస్తుంది. అంతేకాదు.. ఇది అన్ని రకాల చర్మ తత్వాలకు నప్పుతుంది.
పండ్లలో సాధారణంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ల వల్ల నల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. సహజమైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు కాబట్టి.. ఏ చర్మ తత్వానికైనా ఇది చాలా బాగా నప్పుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి దీన్ని ప్రతి నెల ఒకసారి చేయించుకోవచ్చు.
2. యాక్నే రిడక్షన్ ఫేషియల్
మొటిమలను తగ్గించడానికి చేసే ఫేషియల్ ఇది. మొటిమలు ఎక్కువగా ఉండేవారికి ఈ ఫేషియల్ చేస్తారు. ఈ ఫేషియల్‌లో భాగంగా.. తొలుత చర్మాన్ని డీప్ క్లీన్ చేస్తారు. ఆ తర్వాత అదే చర్మానికి ఆవిరిపట్టి, ఎక్స్ ఫోలియేట్ చేస్తారు. దీనివల్ల చర్మం పై ఎక్కువగా ఉండే నూనెతో పాటు.. చర్మ గ్రంధుల్లో ఉన్న మురికి కూడా తొలగిపోతుంది కాబట్టి మొటిమలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ ఆయిలీ స్కిన్ ఉన్నవారికి చాలా బాగా నప్పుతుంది. దీన్ని కనీసం రెండు నెలలకోసారి చేయించుకోవడం వల్ల.. మంచి ఫలితం ఉంటుంది.
3. అరోమా థెరపీ ఫేషియల్
బ్యూటీ పార్లర్‌లో మీరు ఎన్నో రకాల ఫేషియల్స్ చేయించుకోవడం సహజం. కానీ వాటన్నింటి కంటే ఈ ఫేషియల్ ఎంతో విభిన్నం. ఇందులో భాగంగా చర్మంపై ఏర్పడే మలినాలను తొలగించేందుకు.. తొలుత ఓ స్క్రబ్‌ని ఉపయోగిస్తారు. ఆ తర్వాత మీ చర్మ తత్వాన్ని బట్టి.. దానికి తగినట్లుగా ఉండే ఎస్సెన్షియల్ ఆయిల్స్ కాంబినేషన్‌ని ఫేస్ మాస్క్‌లో భాగంగా ఉపయోగిస్తారు.
ఈ ఫేషియల్ మీ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడంతో పాటు.. మాయిశ్చరైజ్ కూడా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయట. ఈ ఫేషియల్ చర్మ తత్వానికి తగినట్లుగా చేయించుకునే వీలుంటుంది కాబట్టి.. ఎవరైనా దీన్ని ఉపయోగించవచ్చు. అలాగే దీన్ని రెండు నెలలకోసారి ఉపయోగించవచ్చు.
4. యాంటీ ఆక్సిడెంట్ ఫేషియల్
టీనేజ్‌లో ఉన్నప్పుడు చర్మం విషయంలో పెద్ద కేర్ తీసుకోకపోయినా.. ఇబ్బందేమీ ఉండదు. కానీ వయసు పైబడుతున్న కొద్దీ వచ్చే చర్మ సమస్యలను తగ్గించేందుకు.. అలాగే చర్మం ఫ్రెష్‌గా కనిపించేందుకు కాస్త కష్టపడాల్సిందే. మనం తీసుకునే ఆహారంలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే.
ముడతలు ఎక్కువగా ఉన్నప్పుడు యాంటీ ఆక్సిడెంట్ ఫేషియల్ చేయించుకోవడం వల్ల.. అందులోని బీటా కెరాటిన్లు, ఎంజైమ్స్, విటమిన్ ఎ, సి, ఇ వంటివి చర్మానికి ఎలాస్టిసిటీని అందిస్తాయి. తద్వారా మీ ముఖాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. హైపర్ పిగ్మంటేషన్ ఉన్నవారు ఈ ఫేషియల్ చేయించుకోవచ్చు. కనీసం నెలకోసారైనా దీన్ని చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
5. వైన్ ఫేషియల్
మీ చర్మాన్ని రిలాక్స్ చేయడంతో పాటు యవ్వనంగా మెరిసేలా చేసేందుకు.. ఈ వైన్ ఫేషియల్ ఉపయోగపడుతుంది. వారమంతా కష్టపడి అలసిపోయిన వారు.. వారాంతాల్లో దీన్ని ప్రయత్నించవచ్చు. దీన్ని సెలూన్‌లో మాత్రమే కాకుండా.. ఇంట్లోనూ సులువుగా వేసుకోవచ్చు. అంతేకాదు.. దీన్ని వారం లేదా రెండు వారాలకోసారి ప్రయత్నించవచ్చు. అంతేకాదు.. ఈ వైన్ ఫేషియల్ అన్ని రకాల చర్మ తత్వాలకు నప్పుతుంది.
6. యాంటీ ఏజింగ్ ఫేషియల్
వయసు పైబడుతున్న కొద్దీ ప్రతి ఒక్కరూ అందంగా.. యూత్ ఫుల్ లుక్‌తో కనిపించాలని కోరుకోవడం సహజం. చాలామందికి ఇల్లు, ఆఫీస్ పనుల వల్ల శారీరక ఒత్తిడి పెరుగుతుంది. ఈ క్రమంలో చర్మంపై ముడతలు కూడా ఎక్కువవుతాయి.
యాంటీ ఏజింగ్ ఫేషియల్ వల్ల.. ఆ ఒత్తిడి తొలిగిపోవడంతో పాటు చర్మం కూడా మెరుస్తూ కనిపిస్తుంది. ముడతలు కూడా తగ్గిపోతాయి. ఈ ఫేషియల్‌లో భాగంగా ‘విటమిన్ ఈ’ సీరంతో మసాజ్ చేస్తారు. అలాగే మీ చర్మతత్వానికి తగినట్లుగా మాస్కింగ్ కూడా చేస్తారు. కాబట్టి ఇది అన్ని చర్మ తత్వాలకు సరిపోవడంతో పాటు.. చర్మాన్ని, మూడ్‌ని కూడా బాగు చేస్తుంది. ఈ ఫేషియల్‌ని నెలకోసారి వేసుకోవచ్చు.
7. చాక్లెట్ ఫేషియల్
ఒక చిన్న బార్ చాక్లెట్ మీ మూడ్‌ని పూర్తిగా మార్చేస్తుంది. అలాగే మూడ్ స్వింగ్స్‌ని కూడా తగ్గిస్తుంది. అలాంటిది చాక్లెట్‌తో ఫేషియల్ వేసుకుంటే.. మీ చర్మం రంగులో కూడా మార్పు వస్తుంది. అదే చర్మం ఆరోగ్యంగానూ, అందంగానూ మారుతుంది. ఇందులోని కొల్లాజెన్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
ఈ ఫేస్ ప్యాక్‌ని రెండు వారాలకోసారి కూడా ట్రై చేయవచ్చు. చాక్లెట్‌తో చేసిన క్రీములు, స్క్రబ్‌లను ఈ ప్యాక్‌లో ఉపయోగిస్తారు కాబట్టి.. అన్ని రకాల చర్మ తత్వాలకు ఇది బాగా సరిపోతుంది.
8. గ్లైకోలిక్ యాసిడ్ ఫేషియల్
గ్లైకోలిక్ యాసిడ్.. చర్మానికి సంజీవని లాంటిది. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మంపై ఉండే మృత కణాలు తొలిగిపోవడంతో పాటు చర్మపు రంగు కూడా మెరుగవుతుంది. అలాగే చర్మంపై ఏర్పడే మచ్చలు, పిగ్మంటేషన్, ముడతలు, వార్థక్య ఛాయలు వంటివన్నీ తగ్గుతాయి.
ఈ ఫేషియల్‌లో భాగంగా ముందు పీల్‌ని ఉపయోగించి.. మృత కణాలను తొలిగిస్తారు. తర్వాత గ్లైకోలిక్ యాసిడ్‌ని పది నిమిషాలు పాటు అప్లై చేస్తారు. తర్వాత యాసిడ్ పనిని ఆపేందుకు.. న్యూట్రలైజర్‌ని అప్లై చేసి ట్రీట్‌మెంట్‌ని ముగిస్తారు. ఈ ట్రీట్ మెంట్ వల్ల చర్మం టైట్‌గా మారుతుంది. ఈ ట్రీట్‌మెంట్‌ని రెండు నెలలకోసారి చేయించుకోవడం వల్ల.. చర్మం సున్నితంగా మారుతుంది.
9. గోల్డ్ ఫేషియల్
సాధారణంగా మనం చాలా రకాల ఫేషియల్స్‌ని ట్రై చేస్తూ ఉంటాం. కానీ గంటసేపు చర్మానికి బంగారు పూత వేసి.. అదే చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేయడం వల్ల.. మీరు అచ్చం దేవకన్యలా మెరిసిపోతారు. ఏదైనా ఈవెంట్‌లో అద్భుతంగా కనిపించాలనుకుంటే.. ఈ ఫేషియల్ చేయించుకోవడం మంచిది. ఇది రక్త ప్రసరణను పెంచడంతో పాటు.. చర్మంలో సరికొత్త మెరుపును తీసుకొస్తుంది.
10. ఫొటో ఫేషియల్
సెలబ్రిటీల చర్మం చూడడానికి ఎంతో లేతగా, సున్నితంగా కనిపిస్తుంది. కానీ మన చర్మం అలా కనిపించే అవకాశం ఉండదు. అసలు మచ్చల్లేకుండా.. ముఖమంతా ఒకే రంగులో కనిపించడం సాధ్యమా? అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రక్రియను ట్రై చేయాలంటే.. మీరు మరీ ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పని లేదు. ఈ ఫోటో ఫేషియల్‌ను ప్రయత్నిస్తే చాలు.. ఈ ట్రీట్‌మెంట్ వల్ల కాస్త నొప్పి కలుగుతుంది కాబట్టి.. ముందుగానే నంబింగ్ క్రీంని రాస్తారు.
ఆ తర్వాత అల్ట్రా సౌండ్ జెల్ కూడా అప్లై చేస్తారు. తర్వాత అదే ముఖాన్ని వివిధ భాగాలుగా క్లాత్‌తో కవర్ చేసి.. లైట్ విడుదల చేసే హ్యాండ్ పీస్‌ని చర్మంపై ఉంచి రుద్దుతారు. ఈ లైట్ చర్మం లోపలికి ఇంకిపోయి.. నల్లని భాగాలను గుర్తించి వాటిని నాశనం చేస్తుంది. అలాగే చర్మం మొత్తాన్ని ఒకే రంగులోకి మారుస్తుంది. ఈ ట్రీట్‌మెంట్‌ని ఎక్కువగా డెర్మటాలజిస్టులు మాత్రమే చేస్తారు. ఈ ట్రీట్‌మెంట్ చేసిన పది రోజుల్లో.. నల్లని ప్రాంతం మొత్తం చర్మం ఊడిపోతుంది.
తర్వాత చర్మం రంగులో ఉండే చర్మమే కనిపిస్తుంది. దీన్ని తరచూ చేసుకోవడం సరికాదు. ఒకసారి చేసుకున్న తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. మళ్లీ నల్ల మచ్చలు రావు. ఒకవేళ వస్తే ఆరు నెలల నుంచి సంవత్సరం తర్వాత మళ్లీ చేయించుకోవచ్చు.
11. డైమండ్ ఫేషియల్
ఇది ఫేషియల్స్ అన్నింటి కన్నా ఎంతో పాపులర్ ఫేషియల్. ఇది మిమ్మల్ని చూసేందుకు అందంగా మెరిసిపోయేలా చేయడంతో పాటు.. లోపలి నుంచి కూడా చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. చర్మం ఫ్రెష్‌గా, అందంగా మెరిసిపోవాలంటే.. ఈ డైమండ్ ఫేషియల్ ట్రై చేయాల్సిందే.
ఈ ఫేషియల్‌లో డైమండ్ పొడి కలిపిన క్రీంలను ఉపయోగిస్తారు. ఇది మన చర్మాన్ని నెమ్మదిగా స్క్రబ్ చేయడంతో పాటు.. చర్మంలో తేమను పెంచుతుంది. ఇది చర్మంపై ఏర్పడే ముడతలను, సన్నని గీతలను తొలగిస్తుంది. అదే చర్మాన్ని మెరిసిపోయేలా చేస్తుంది. ఈ ఫేషియల్‌ని రెండు నెలలకోసారి చేయించుకోవడం వల్ల.. చర్మం ఎప్పుడూ మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్‌లో చర్మ తత్వాన్ని బట్టి క్రీంలలో మార్పులుంటాయి. కాబట్టి దీనిని అందరూ ట్రై చేయవచ్చు.
12. కొల్లాజెన్ ఫేషియల్
చర్మం సున్నితంగా మారేందుకు ఉపయోగపడే ప్రొటీన్ కొల్లాజెన్. చర్మకణాల మధ్య బంధాలను బలంగా మార్చి చర్మం టైట్‌గా ఉండేలా.. అలాగే ముడతలు లేకుండా కనిపించేలా చేస్తుందీ ఫేషియల్. ఎలాస్టిసిటీని పెంచేందుకు ఇది చాలా బాగా తోడ్పడుతుంది. చర్మంలో కొల్లాజెన్ తగినంతగా లేకపోతే.. చర్మం సాగినట్లుగా మారుతుంది. అలాగే కొందరిలో చర్మం కొల్లాజెన్‌ని ఉత్పత్తి చేయడం తగ్గిస్తుంది.
కొల్లాజెన్ ఫేషియల్ చేయించుకోవడం వల్ల.. చర్మం కాంతిమంతంగా, టైట్‌గా, ఆరోగ్యంగా మారుతుంది. దీనికోసం ముందు హైఅల్యూరోనిక్ యాసిడ్ మాస్క్ వేయాలి. తర్వాత దాన్ని తీసేశాక.. కొల్లాజెన్ మాస్క్ వేయాలి. అప్పుడు చర్మంలో కొల్లాజెన్ పెరిగి చర్మం ఆరోగ్యంగా మారుతుంది. దీన్ని కూడా కనీసం రెండు నెలలకోసారి చేయించుకోవచ్చు. ఇది అందరికీ నప్పుతుంది.
13. ప్లాటినం ఫేషియల్
ప్లాటినం ఫేషియల్ చర్మాన్ని రీఛార్జ్ చేస్తుంది. చర్మ కణాలు బలంగా మారేలా చేస్తుంది. వాటిని శుభ్రపరుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు.. చర్మాన్ని ఆరోగ్యంగా మార్చడంతో పాటు తేమను కూడా పెంచుతాయి. ఈ ఫేషియల్‌ను నెలకోసారి చేయించుకోవచ్చు.
14. సిల్వర్ ఫేషియల్
వెండిలో చర్మంలోని మలినాలను తొలగించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని అప్లై చేసుకోవడం వల్ల ఫలితాలు వెంటనే కనిపిస్తాయి. యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలున్న ఈ ఫేస్ ప్యాక్ వాడడం వల్ల చర్మ సమస్యలు తగ్గడంతో పాటు.. చర్మ రంధ్రాలు కూడా శుభ్రపడతాయి.
అలాగే చర్మం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. ఈ ఫేషియల్‌ని నాలుగైదు వారాలకోసారి ఉపయోగించడం వల్ల.. చర్మం ఎప్పుడూ మెరుస్తూ కనిపిస్తుంది. చర్మానికి తేమ కూడా అందుతుంది. ఇది చర్మాన్ని డీటాక్సిఫై కూడా చేస్తుంది. బ్లాక్ హెడ్స్, మొటిమలు రాకుండా చేస్తుంది.
15. డీ ట్యాన్ ఫేషియల్
ఎండాకాలం రాగానే.. చాలామందిని ఇబ్బందికి గురిచేసే సమస్య ట్యానింగ్. ఎండాకాలంలోని యూవీ కిరణాలు, కాలుష్యం వంటి వాటివల్ల చర్మ కణాలు నల్లబారిపోతాయి. డీ ట్యాన్ ఫేషియల్ వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు.. డీ ట్యాన్ ఫేషియల్ వల్ల మీ చర్మ రంధ్రాలు కూడా శుభ్రమవుతాయి.
దీనికోసం డీ ట్యాన్ ఫేస్ క్రీమ్ రాయడంతో పాటు .. పావు గంట పాటు ఉంచి మాయిశ్చరైజర్ కూడా రాయాలి. దీనివల్ల చర్మం డీ ట్యాన్ అవ్వడంతో పాట.. తేమ కూడా పెరుగుతుంది. దీన్ని రెండు వారాలకోసారి ప్రయత్నించవచ్చు. ఇది కూడా అందరికీ నప్పుతుంది.
16. స్కిన్ లైటెనింగ్ ఫేషియల్
కేవలం ట్యాన్ వల్లనే కాదు.. వివిధ కారణాల వల్ల నల్లబడిన చర్మాన్ని.. సహజంగా తీర్చిదిద్దేందుకు ఈ ఫేషియల్‌ని ఉపయోగిస్తారు. ఈ ఫేషియల్ చర్మాన్ని కాంతిమంతంగా మార్చడంతో పాటు.. చర్మ ఛాయను కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో భాగంగా తొలుత క్లెన్సింగ్ లేదా స్క్రబింగ్ చేస్తారు. ఆ తర్వాత నేచురల్ లైటెనింగ్ సొల్యూషన్ అయిన కోజిక్ యాసిడ్‌ని ఉపయోగించి.. చర్మంపై నల్లగా ఏర్పడే భాగాలను తగ్గించే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇందులోని మెలనిన్ కణాల పనితీరును తగ్గిస్తుంది.
దాంతో చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. ఆ తర్వాత కొల్లాజెన్, స్కిన్ లైటెనింగ్ మాస్క్‌లు వేయడం వల్ల.. అదే చర్మం మరింత తెల్లగా మారుతుంది. ఇందులో ఉపయోగించే క్రీములను కూడా చర్మ తత్వాన్ని బట్టి మార్చుకోవచ్చు. కాబట్టి స్కిన్ లైటెనింగ్ ట్రీట్‌మెంట్‌ని.. కనీసం ఆరు నెలలకోసారి చేయించుకోవడం మంచిది.
17. ఎలక్ట్రిక్ కరంట్ ఫేషియల్
చర్మాన్ని శుభ్రం చేసి, బ్యాక్టీరియాను తొలగించడం అనేది ఎలక్ట్రిక్ కరంట్ షేషియల్ వల్ల సాధ్యమే. మొటిమల సమస్యలను కూడా ఈ ట్రీట్‌మెంట్ ద్వారా నివారించవచ్చు. ఈ ట్రీట్‌మెంట్‌లో ఎలక్ట్రిసిటీని ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేస్తారు. ఆర్గాన్ లేదా నియాన్ గ్యాస్ నిండిన ఎలక్ట్రోడ్‌లతో ఈ ట్రీట్ మెంట్ చేస్తారు. ఇందులో వేర్వేరు గ్యాస్‌లకు వేర్వేరు ప్రయోజనాలు ఉంటాయి.
ముందు ఆక్సిజనేటింగ్ మాస్క్‌ను ఉపయోగించి.. చర్మాన్ని సున్నితంగా మార్చిన తర్వాత.. ఎలక్ట్రిక్ కరంట్‌ని ఉపయోగించి ఈ ఎలక్ట్రోడ్‌లను సమస్యలున్న చర్మం చోట్ల రుద్దాలి. ఈ ఎలక్ట్రిక్ కరంట్ ఫేషియల్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ ఫేషియల్ ఒక్కసారి మాత్రమే చేయించుకోవాలి. ఫిట్స్, గుండె సమస్యలు ఉన్నవారు.. పేస్ మేకర్స్, గాయాలు ఉన్నవారు దీన్ని జోలికి వెళ్లకూడదు.
18. పారాఫిన్ ఫేషియల్
సాధారణ చర్మం కాకుండా.. డ్రై లేదా ఆయిలీ స్కిన్ కలవారికి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. డ్రై స్కిన్‌కి తేమను అందించడంతో పాటు.. ఆయిల్ స్కిన్‌ని శుభ్రపర్చడం పెద్ద పని. డ్రై స్కిన్ ఉన్నవారి కోసం ఎన్నో అద్బుతమైన ఫేషియల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పారాఫిన్ ఫేషియల్.
పారాఫిన్‌ని సాధారణంగా మెనిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్స్‌లో ఉపయోగిస్తుంటారు. ఈ ఫేషియల్‌లో భాగంగా చర్మంపై ఓ సన్నని ఆయిలీ లేయర్ ఏర్పాటు చేస్తారు. ఈ లేయర్ చర్మంలోని నీరు బయటకు వెళ్లిపోయి పొడిబారిపోకుండా చేస్తుంది. దీన్ని రెండు మూడు నెలలకోసారి ఉపయోగించవచ్చు.
19. గాల్వానిక్ ఫేషియల్
ఈ ఫేషియల్ ఎలాంటి వారికైనా నప్పుతుంది. పైగా మొటిమలను తగ్గిస్తుంది. అంతే కాదు.. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇందులో పాజిటివ్ నెగటివ్ కరంట్స్ కాంబినేషన్‌ని ఉపయోగిస్తారు. తద్వారా కాస్మెటిక్ ఉత్పత్తులను చర్మం లోపలి వరకు వెళ్లేలా చేస్తారు. తద్వారా చర్మ సమస్యలను పూర్తిగా తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ఫేషియల్‌ను ప్రతి నెలా చేయడం వల్ల.. చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.
20. సెన్సిగ్లో ఫేషియల్
సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు.. తమ కోసం సరైన ఫేషియల్ ఎంపిక చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా అవగాహన లేకుండా.. కొన్ని ఉత్పత్తులు వాడడం వల్ల వారి చర్మం పాడవుతుంది. కానీ సెన్సిగ్లో ఫేషియల్ ఉపయోగించడం వల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇది సాధారణ ఫేషియల్ లాంటిదే. కానీ ఇందులో ఉపయోగించే పదార్థాలు చాలా మైల్డ్‌గా ఉంటాయి. చర్మానికి ఏమాత్రం అసౌకర్యం కలిగించకుండా.. దానిని అందంగా మార్చేందుకు ఇవి తోడ్పడతాయి.
తరచూ అడిగే ప్రశ్నలు
1. ఫేషియల్ చేయించుకోవడం తప్పనిసరా?
“నేను రెగ్యులర్‌గా ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాను. అలాగే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ వంటివి కూడా ట్రై చేస్తుంటాను. నాకు ఫేషియల్ అవసరం లేదని చాలామంది భావిస్తారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మన ఇంట్లో ఉండే ఫర్నిచర్‌ని రోజూ దులుపుతాం. అప్పుడప్పుడూ తుడుస్తాం. కానీ వాటికి కనీసం సంవత్సరానికోసారైనా పాలిషింగ్ చేయించకపోతే.. రంగు వెలిసిపోయినట్లు కనిపిస్తుంది.
ప్రాణం లేని వస్తువలనే మెయిన్ టెయిన్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు చర్మానికి ఎందుకు కాదు.. మీ చర్మం ఆరోగ్యంగా కనిపిస్తే మీరు అందంగా కనిపించే వీలుంటుంది. ఫేషియల్స్ చర్మాన్ని పునరుత్తేజం చేస్తాయి. చర్మంలోని మురికిని తొలగిస్తాయి. దాని ఛాయను కూడా మెరుగుపరుస్తాయి. అందుకే రెగ్యులర్‌గా ఫేషియల్ చేయించుకోవడం ఎంతో అవసరం.
2. ఫేషియల్ తర్వాత చేయాల్సిన, చేయకూడదని పనులేంటి?
ఫేషియల్ తర్వాత చర్మాన్ని మనం ఎంతలా కాపాడుకుంటామన్న దానిపై.. దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఫేషియల్ తర్వాత నీళ్లు ఎక్కువగా తాగాలని.. అలాగే చర్మం సున్నితంగా తయారైందా? లేదా? చెక్ చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ చర్మాన్ని వీలైనంత తక్కువగా ముట్టుకోవాలి.
అంతేకాదు.. ఫేషియల్ తర్వాత మీ ముఖాన్ని తాకే వస్తువులను కూడా.. చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దిండు కవర్లు, టవల్స్ వంటివన్నీ ఫేషియల్ చేయించుకునేముందే శుభ్రంగా ఉతికి ఉంచాలి. ఎండలోకి అస్సలు వెళ్లకూడదు. మేకప్ వేసుకోకూడదు. ముఖాన్ని కూడా ఇరవై నాలుగు గంటల వరకూ కడుక్కోకూడదు. మరీ అవసరమైతే నీళ్లతో కడుక్కోవడం మంచిది తప్ప.. సబ్బు వాడకూడదు. క్రీంలు, పీల్స్ వంటివి కూడా వాడకూడదు.
3. ఫేషియల్ చేసిన ఎన్ని గంటల తర్వాత మేకప్ వేసుకోవచ్చు?
ఫేషియల్ చేయించుకున్న తర్వాత చర్మ రంధ్రాలు తెరుచుకొని ఉంటాయి. అవి మూసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఈ సమయంలో మేకప్ వేసుకోవడం వల్ల.. అప్పుడే శుభ్రమైన చర్మ రంధ్రాల్లోకి మేకప్ చేరిపోయి.. చర్మం మరింత పాడవుతుంది. అలాగే మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్య కూడా పెరుగుతుంది. అందుకే ఫేషియల్ చేసిన కనీసం 24 గంటల వరకూ.. మేకప్ వేసుకోకూడదు. ఆ తర్వాత కూడా వేసుకునే మేకప్ కోసం స్పాంజెస్, బ్రషెస్ శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్న వాటితోనే మేకప్ చేసుకోవాలి.
4. ఫేషియల్ ప్రభావం ఎన్ని రోజుల వరకూ కనిపిస్తుంది?
ఫేషియల్ వల్ల మనకు సాధారణంగా రెండు రకాల ప్రయోజనాలు కనిపిస్తాయి. ఒకటి పైకి కనిపించేది. ఫేషియల్ తర్వాత చర్మంలోని మురికి మొత్తం శుభ్రమై.. రక్త ప్రసరణ బాగై వెంటనే చర్మానికి మెరుపు వస్తుంది. ఈ మెరుపు దాదాపు నాలుగైదు రోజుల వరకూ ఉంటుంది. ఇవే కాకుండా చర్మాన్ని లోపలి నుంచి బాగు పర్చే గుణాలు కూడా .. ఫేషియల్స్‌లో ఉంటాయి.
కొత్త కణాల పుట్టుకను ప్రోత్సహించడం, పాత కణాలను తొలగించడం వంటి ప్రక్రియలు..ఫేషియల్ తర్వాత 45 రోజుల వరకూ జరుగుతూనే ఉంటాయి. అలాగే చర్మంలో మలినాలేవీ ఏర్పడకుండా చేస్తాయి. అందుకే ప్రతి 45 రోజులకోసారి.. ఫేషియల్ చేయించుకోవడం వల్ల చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఆరోగ్యంగా కనిపిస్తుంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.