దీపిక, సోనమ్.. వెడ్డింగ్ స్టయిల్ లో ఎవరు మేటి?

దీపిక, సోనమ్.. వెడ్డింగ్ స్టయిల్ లో ఎవరు మేటి?

బాలీవుడ్ తారలు దీపికా పదుకొణే, రణ్ వీర్ సింగ్ ఇటీవలే ఒకింటివారయ్యారు. ఈ జంటను ఇప్పుడు దీప్ వీర్ గా పిలుస్తున్నారంతా. వివాహం ఇటలీలో జరిగినప్పటికీ ముంబయి నగరంలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వధూవరులైన దీపిక, రణ్ వీర్ ధరించిన దుస్తులు అందరినీ ఆకట్టుకొన్నాయి.


అయితే పెళ్లికూతురు దీపిక ధరించిన వస్త్రాలు.. మరో నటి సోనమ్ కపూర్ ధరించిన వాటికి దగ్గరగా ఉన్నాయి. తెలుపు, బంగారు వర్ణాల్లో రూపొందించిన ఈ దుస్తుల్లో ఇద్దరూ అందంగా మెరిసిపోయారు. సోనమ్ ఈ దుస్తులను తన మెహందీ ఫంక్షన్లో ధరించింది. ఒకే రంగు దుస్తులు అయనప్పటికీ ఇద్దరూ తమ తమ స్టైల్ ను ఫాలో అయ్యారు. అంతేకాదు ఇద్దరూ ఎవరికి వారే సాటి అని నిరూపించుకొన్నారు. మరి ఆ సంగతేంటో ఓ సారి చూద్దామా..


2 wedding looks of deepika and sonam


డిజైన్లే కాదు.. డిజైనర్లు కూడా ఒక్కరే..


సోనమ్, దీపిక ఇద్దరికీ ప్రముఖ డిజైనర్లు సందీప్ ఖోస్లా, అబు జానీ లెహంగాలను దాదాపు ఒకేరకమైన డిజైన్లలో రూపొందించారు.  తెలుపు రంగు లెహంగాపై అదే రంగు దారంతో చేసిన చికంకారీ ఎంబ్రాయిడరీ వర్క్ సోనమ్, దీపిక ఇద్దరికీ క్లాసిక్ లుక్ అందించింది.


అయినా విభిన్నమే..


సోనమ్, దీపిక ధరించిన దుస్తుల కలర్ కాంబినేషన్, వాటిపై ఉన్న  ఎంబ్రాయిడరీ ఒకటే. పైగా రెండింటిని రూపొందించిన డిజైనర్లు ఒక్కరే. అయినప్పటికీ ఇద్ధరూ భిన్నంగానే కనిపిస్తున్నారు. దానికి కారణం వారి స్టైలింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సోనమ్ లెహంగాపై బ్యాక్ లెస్ బ్లౌజ్ ధరించి మోడ్రన్ గా కనిపిస్తే దీపిక మాత్రం పొడవాటి దుప్పట్టాతో బాజీరావు మస్తానీ సినిమాలో మాదిరిగా రాజసం ఒలకబోసింది.


3 wedding looks of deepika and sonam


ఆ హెయిర్ స్టైల్స్ గమనించారా?


తన మెహందీ ఫంక్షన్లో సోనమ్ చక్కగా జడ వేసుకొంటే.. దీపిక మాత్రం తాను ఎప్పడూ రొటీన్ గా వేసుకొనే ముడికే ప్రాధాన్యమిచ్చింది. ఇద్దరిలోనూ నాకు మాత్రం సోనమ్ జడ నచ్చింది. మరి మీకు?


నగలు చూశారా?


ఇక వీరిద్దరి నగలు కూడా భిన్నంగానే ఉన్నాయి. సోనమ్ ముత్యాలు పొదిగిన కుందన్ చోకర్, జుంకాలు, పాపిట బిళ్ల ధరించగా.. దీపిక మాత్రం వజ్రాలు, ముత్యాలు పొదిగిన రాణీ హారాన్ని ధరించింది. సోనమ్ తన తల్లి రూపొందించిన నగలను, దీపిక సందీప్ ఖోస్లా, అబుజానీ రూపొందించిన నగలను ధరించారు.


దుప్పట్టాతో లుక్కే మారిపోయింది..


దుప్పట్టా విషయంలోనూ ఇద్దరిదీ భిన్నమైన స్టయిల్ అనే చెప్పుకోవాలి. సోనమ్ లెహంగాపై ఒక దుప్పట్టాను మాత్రమే వేసుకొంది. కానీ దీపిక మాత్రం రెండు దుప్పట్టాలను వేసుకొంది. ఒకటి పైట మాదిరిగా రెండోదాన్ని మేలి ముసుగులా ధరించింది.


దీపిక, సోనమ్ ఇద్దరూ ఇద్దరే అనిపించారు  కదా.. మరి వారిలో మీకు ఎవరి స్టయిల్ నచ్చింది.?