బాలీవుడ్‌లో దీపికా రణ్‌వీర్.. మరి టాలీవుడ్‌లో..?

బాలీవుడ్‌లో దీపికా రణ్‌వీర్.. మరి టాలీవుడ్‌లో..?

కొన్ని సినిమాల్లో హీరో-హీరోయిన్ల జంటలను చూస్తుంటే వారు నిజజీవితంలో కూడా ఎంత చూడముచ్చటగా ఉంటారో అని మనకనిపిస్తుంటుంది. అయితే అందరూ ఆలా నిజజీవితంలో జంటలు కాలేకపోయినా కొందరు మాత్రం తమతో కలిసి నటించిన వారిని ఇష్టపడి, ప్రేమించి, పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో ఈ సంప్రదాయాన్ని మనం చూడవచ్చు. తాజాగా అలా పెళ్లి చేసుకున్న మరో బాలీవుడ్ జంట - దీపిక పదుకునే (Deepika Padukone) & రణ్ వీర్ సింగ్ (Ranveer Singh). గతంలో కూడా బాలీవుడ్‌లో (Bollywood) అమితాబ్ బచ్చన్-జయబాధురి, ధర్మేంద్ర-హేమమాలిని, అజయ్ దేవగన్-కాజోల్ ఇలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.


దీపికా రణ్‌వీర్ వివాహం సందర్భంగా.. మనం కూడా తెలుగు సినీ పరిశ్రమ లో (Tollywood) తమ సహనటులను ప్రేమించి పెళ్లిచేసుకున్న పలువురు జంటల గురించి తెలుసుకుందాం.


కృష్ణ -విజయనిర్మల


కృష్ణ-విజయనిర్మల 1970ల్లో హిట్ పెయిర్‌గా తెలుగు సినీ అభిమానులకు బాగా పరిచయం. సాక్షి, పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు, మోసగాళ్లకు మోసగాడు లాంటి హిట్ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ జంట వెండితెర పై చూడడానికి ఎంత చక్కగా ఉంటారో అన్న అభిప్రాయం వారి అభిమానుల్లో ఉండేది. అదే సమయంలో ఒక సినిమా షూటింగ్ సందర్బంగా కమెడియన్ రాజబాబు మాట్లాడుతూ - గుడిలో జరిగిన పెళ్లి సన్నివేశంలో కృష్ణ, విజయనిర్మల కలిసి భార్యభర్తలుగా నటించారు కాబట్టి.. కచ్చితంగా వీరు నిజజీవితంలో కూడా ఆలుమగలు అవుతారు అని సరదాగా చెప్పాడట. ఆతరువాత అందరికి షాక్ ఇస్తూ వారిరువురు పెళ్లి చేసుకున్నారు.


Tollywood-couple-krishna-and-vijayanirmala


సావిత్రి - జెమినీ గణేశన్


మహానటి సావిత్రి కూడా తనతో కలిసి నటించిన స్టార్ హీరో జెమినీ గణేశన్‌ని ప్రేమించి పెళ్లాడింది. అప్పటికే వివాహమయిన జెమినీ గణేశన్‌‌ని సావిత్రి మరోమారు వివాహమాడడం అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది అని చెబుతారు. ఆ మధ్యనే విడుదలైన సావిత్రి బయోపిక్ "మహానటి"లో కూడా ఈ విషయానికి సంబంధించిన మూలకారణాలను కాస్త ఫిక్షన్ జోడించి చూపించారు. కలత్తూర్ కన్నమ్మ, పావమనిప్పు, కార్పగం వంటి ఎన్నో తమిళ హిట్ సినిమాల్లో ఈ జంట జోడిగా నటించింది.


south-indian-couple-savitri-and-gemini-ganeshan


జీవిత-రాజశేఖర్


యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా కెరీర్ తొలినాళ్ళలోనే ఒక ట్యాగ్ సంపాదించుకున్న హీరో రాజశేఖర్ నిజజీవితంలో మాత్రం భార్యకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా పలుమార్లు వార్తల్లో నిలిచారు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, మగాడు, యుగకర్తలు, స్టేషన్ మాస్టర్ లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇక వీరి ప్రేమ విషయానికి వస్తే , తొలుత వీరి ప్రేమకి ఇరు కుటుంబాలు అభ్యంతరం చెప్పినప్పటికీ.. ఆ తరువాత వీరిరువురి పట్టుదలే వీరిని ఒక్కటిగా చేసింది అని ఈ ఇద్దరు చెబుతుంటారు. అలాగే వీరి కుమార్తెలు కూడా ప్రస్తుతం సినీ రంగం వైపు అడుగులు వేస్తున్నారు.


tollywood-couple-jeevitha-and-rajasekhar


సుమలత-అంబరీష్


తెలుగులో ఎన్నో సాఫ్ట్ రోల్స్‌లో నటించి మెప్పించిన అతికొద్దిమంది నటీమణులలో సుమలత కూడా ఒకరు. బయట చాలా రిజర్వుడ్‌గా ఉండే సుమలత ఓ ప్రముఖ హీరోని ప్రేమించిందనే విషయం అప్పట్లో పెను సంచలనమైంది. ఆ తర్వాత ఆమె ప్రేమించింది కన్నడ రెబెల్ స్టార్ అంబరీష్‌ని అని తెలియడంతో అందరూ ఒకింత ఆశ్చర్యపోయారట. ఇదే విషయాన్నీ అంబరీష్ 60వ జన్మదిన వేడుకల్లో ప్రముఖ హీరోలైన రజినీకాంత్, చిరంజీవి వంటివారు అందరితో సరదాగా పంచుకున్నారు. పెళ్ళైన చాలారోజుల తర్వాత... మళ్లీ ఈ మధ్యనే సినిమాలు చేయడం మొదలుపెట్టింది సుమలత. అయితే అనుకోని విషాదం ఆమె జీవితంలో ఈమధ్యకాలంలో అంబరీష్ మరణం ద్వారా ఎదురైంది. దీనితో సుమలత కుటుంబం ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయింది. ఆమె తోటి నటీనటులంతా ఈ కష్టసమయంలో ఆమెకి తోడుగా నిలిచారు.


మరిన్ని సెలబ్రిటీ వివాహాల గురించి ఆ ఆర్టికల్ చదివేయండి


అమల-నాగార్జున


నిర్ణయం, కిరాయి దాదా, శివ, చినబాబు, ప్రేమ యుద్ధం లాంటి సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించిన నాగార్జున, అమల అనతికాలంలోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. "శివ" చిత్రంలో నటిస్తున్న సమయంలోనే వీరిరువురి మధ్య ప్రేమ చిగురించినప్పటికీ.. అంతకుముందే పలు చిత్రాలలో వీరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే అప్పటికే నాగార్జున వ్యక్తిగత జీవితంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. ఆయన జీవితంలోకి అమల ప్రవేశించిన తరువాత ఆయన మరి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు అంటే అతిశయోక్తికాదు. ఈ ఇద్దరి జంట ఇప్పటి తరానికి కూడా ఎంతో స్ఫూర్తి అని చెప్పొచ్చు.


tollywood-couple-nagarjuna-and-amala


ఊహ-శ్రీకాంత్


పీపుల్స్ ఎన్ కౌంటర్ వంటి సినిమాతో తెరంగేట్రం చేసినప్పటికీ తాజ్ మహల్, పెళ్లి సందడి చిత్రాలతో తనకంటూ పరిశ్రమలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న నటుడిగా కితాబునందుకున్న వ్యక్తి శ్రీకాంత్. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన "ఆమె" చిత్రం షూటింగ్‌లోనే శ్రీకాంత్‌కి, ఊహకి మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత వారు పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. వీరి కుమారుడు రోషన్ ఇటీవలే "నిర్మలా కాన్వెంట్" చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు.


బడ్జెట్ ఫ్రెండ్లీ సెలబ్రిటీ వివాహాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి..!


మహేష్ బాబు - నమ్రత


"వంశీ" చిత్ర షూటింగ్ సమయంలోనే ప్రముఖ టాలీవుడ్ హీరో మహేష్ బాబు (Mahesh Babu), నటి నమ్రతల మధ్య మొదలైన ప్రేమ పెళ్లి వరకూ దారితీసింది. ఫిబ్రవరి 2005లో వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు (గౌతమ్ కృష్ణ, సితార).


tollywood-couple-mahesh-babu-and-namrata-shirodkar


అక్కినేని నాగచైతన్య - సమంత


"ఏ మాయ చేశావే" చిత్రం షూటింగ్‌లోనే ఆ సినిమా హీరో హీరోయిన్లు అయిన నాగచైతన్య, సమంతల మధ్య ప్రేమ చిగురించిందని టాక్. ఆ తర్వాత వారు ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో కూడా కలిసి నటించారు. గత సంవత్సరమే వీరి వివాహం జరిగింది.


tollywood-couple-samantha-and-naga-chaitanya


ఈ జంటలు వెండితెరపైనే కాకుండా నిజజీవితంలో కూడా భాగస్వాములుగా మారి తమ అభిమానులకి ఆనందాన్ని అందించారు.


వీరిలాగే బాలీవుడ్ కొత్త జంట అయిన దీపిక-రణ్‌వీర్‌ల పెళ్లి కూడా సాఫీగా సాగిపోవాలని ఆకాంక్షిద్దాం...