భారతీయ చలనచిత్ర పరిశ్రమని ఒకసారి చూస్తే, మనకి ఇది పురుషాధిక్య పరిశ్రమగానే పలుమార్లు కనిపిస్తుంది. అందుకు కారణాలు అనేకం. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల శాతం మగవారిని కేంద్రంగా పెట్టి తీసిన సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ కావడం దీనికి ప్రధాన కారణం. అదే సమయంలో మన ప్రేక్షకులలో కూడా హీరోకి ఉన్న ఫాలోయింగ్‌తో పోలిస్తే హీరోయిన్లకి ఉండే ఫాలోయింగ్ తక్కువనే చెప్పాలి. ఎప్పుడో వచ్చే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు మినహా.. ఎక్కువగా వచ్చేవి హీరో ఓరియంటెడ్
కమర్షియల్ చిత్రాలే.
అయితే దాదాపు ఒక దశాబ్దకాలం నుండి ఈ ధోరణిలో కాస్త మార్పుని మనం చూడచ్చు. గత కొన్నేళ్లుగా మహిళల పాత్రల చుట్టూ తిరిగే కథలని దర్శక-నిర్మాతలు తీయడం ..వాటికి ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తుండడంతో వీటి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. అందులో కూడా చారిత్రాత్మక పాత్రలని ఇతివృత్తంగా తీసుకుని .. స్టార్ స్టేటస్‌లో ఉన్న నటీమణులతో వాటిని తెరకెక్కిస్తుండడం ఒక మంచి పరిణామం అని చెప్పాలి.
తాజాగా ఇదే కోవకి చెందిన ఒక చిత్రం మన ముందుకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అదే మణికర్ణిక (Manikarnika)… ఝాన్సీ రాణి లక్ష్మీభాయ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రముఖ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) టైటిల్ పాత్రని పోషించగా ఈ చిత్రం జనవరి 25, 2019 తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు క్రిష్‌తో పాటు కంగన కూడా దర్శకత్వం వహించారు. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల
మన్ననలను పొందుతోంది.
ఇక మణికర్ణిక సినిమా మాదిరిగానే గతంలో కూడా హిందీ, తెలుగు భాషలలో పలు చిత్రాలు తెరకెక్కాయి. చారిత్రక కథల ఆధారంగా నిర్మించిన చిత్రాలు కూడా అందులో కొన్ని ఉన్నాయి. వాటి గురించి సంక్షిప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం.
మణికర్ణిక షూటింగ్ స్పాట్లో కంగన రనౌత్ ఆర్టికల్ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హిందీలో చారిత్రక చిత్రాలకు బీజం దాదాపు 30 సంవత్సరాల క్రితమే పడింది. 1983లో ప్రముఖ నటి హేమమాలిని నటించిన “రజియా సుల్తాన్” చిత్రం అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్. 2008లో జోధా అక్బర్ చిత్రంలో రాణి జోధాభాయ్ పాత్రలో ప్రపంచసుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మెరిసింది. రాజ్‌పుత్ రాణి జోధాబాయిగా ఆమె అభినయం అద్భుతమనే చెప్పాలి. రాణిగా హుందా తనంతో పాటుగా పలు యుద్ధ విద్యలను సైతం తన పాత్ర కోసం నేర్చుకుని ఆ సినిమాలో ప్రదర్శించగలిగింది ఆమె. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించగా అక్బర్ పాత్రలో హీరో హృతిక్ రోషన్ నటించారు. ఐష్-హృతిక్‌ల జంట బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాని నిలబెట్టగలిగింది.
ఆ తరువాత మన తెలుగులో గుణశేఖర్ తన కలల ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన చిత్రం రుద్రమదేవి విడుదలైంది. ఈ చిత్రం కోసం అనుష్క గుర్రపు స్వారీ, కత్తిసాము వంటి అనేక యుద్ధ విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుని మరీ నటించింది. ఇక రుద్రమదేవి చిత్రం తొలి భారతీయ 3D ఎపిక్ హిస్టారికల్ ఫిలింగా రూపొంది ఒక చరిత్ర సృష్టించింది అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం అయిన ఈ చిత్రం హిందీ భాషలోకి కూడా డబ్ చేయబడింది.
మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో అనేకమంది ప్రముఖ నటీనటులు తమ పాత్రలకి ఈ సినిమాలో ప్రాణం పోశారు. అయితే రుద్రమదేవి పాత్రకి అనుష్క మాత్రం నూటికి నూరు శాతం న్యాయం చేసింది అని మనం చెప్పి తీరాల్సిందే.
ఇక ఈ జాబితాలో మూడవ చిత్రమైన పద్మావత్ (‘పద్మావతి’ పేరుని కొన్ని కారణాల వల్ల మార్చడం జరిగింది) గురించి చెప్పుకోవాలి. ఎన్నో అవరోధాలు, ఆరోపణలు, హెచ్చరికల నడుమ ఈ చిత్ర నిర్మాణం జరగడం తరువాత కొన్ని నెలల పాటు ఈ సినిమా విడుదలకి నోచుకోకపోవడం జరిగింది. ఈ వివాదాలకి ప్రధాన కారణం ఈ చిత్ర కథలో ఉన్న సున్నితత్వమే. అయితే దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ ఎన్ని సార్లు ఈ విషయమై వివరించే ప్రయత్నం చేసినా అది నిరుపయోగమే అయి ఈ చిత్రం విడుదల పెద్ద సమస్యగా మారింది. ఆ తరువాత కోర్టు జోక్యంతో సినిమా విడుదలై ప్రేక్షకుల వద్ద మంచి మార్కులే కొట్టేసింది.
ముఖ్యంగా టైటిల్ పాత్ర పోషించిన దీపిక పదుకునే (Deepika Padukone) అభినయం అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది అంటే అతిశయోక్తి కాదేమో! మహారాణిలో కొన్ని ప్రధాన లక్షణాలు ఉండేవి అని చరిత్రకారులు చెప్పిన వాటితో పోల్చితే వాటిని దీపిక తన అభినయం, నడవడికతో మనకి సంపూర్ణంగా చూపెట్టగలిగింది. చివరగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కూడా పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఇలా ఈ నటీమణులు మన దేశానికి చెందిన నలుగురు మహారాణుల పైన నిర్మించిన చిత్రాలలో నటించి ఆయా పాత్రలకి జీవం పోశారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. కంగన కూడా “మణికర్ణిక” చిత్రంతో మరో సంచలనాన్ని నమోదు చేస్తుందని ఆశిద్దాం.