"పడి పడి లేచే మనసు"లో సాయిపల్లవి నటన.. పెద్ద హీరోయిన్లకు సవాలా..?

"పడి పడి లేచే మనసు"లో సాయిపల్లవి నటన.. పెద్ద హీరోయిన్లకు సవాలా..?

మన చిత్రపరిశ్రమలో చాలామంది నటులు ఉంటారు. కానీ అందులో కొంతమంది మాత్రమే స్టార్ స్టేటస్ అందుకుంటారు. హీరోయిన్స్ విషయం తీసుకున్నా కూడా అంతే. సంవత్సరానికి ఎంతో మంది నూతన కథానాయికలు తమ టాలెంట్‌ని నిరూపించుకునే క్రమంలో ఇండస్ట్రీకి  వస్తుంటారు. అయితే అందులో ఎంతమంది  విజయం సాధిస్తున్నారు అన్నది ప్రధానాంశం.


ఇక అలా ఈమధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి స్టార్ స్టేటస్ అందిపుచ్చుకున్న నటీమణుల లిస్ట్ ఒకసారి చూస్తే మనకి  కనిపించేది.. విన్పించేది ఒకే పేరు. ఆమే అనుష్క. 'సూపర్' చిత్రంతో  గ్లామర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ  తొందరగానే ఆ ఇమేజ్ నుండి ఆమె బయటపడగలిగింది. అందుకు ముఖ్య కారణం 'అరుంధతి'  చిత్రం అని చెప్పి తీరాలి. ఆ చిత్రంలో అనుష్క (Anushka) ప్రదర్శించిన అభినయం అనన్యసామాన్యం అని చెప్పాలి. ఇక ఆ తరువాత కూడా అటు గ్లామర్ పాత్రలతో పాటు.. ఇటు పాత్రకి ప్రాధాన్యం ఉండే చిత్రాలని చేస్తూ చాలాకాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో ఎదురులేకుండా స్టార్ స్టేటస్‌ని సొంతంచేసుకోగలిగింది.


అంతకముందు  త్రిష (Trisha) కొన్నిరోజులు తెలుగులో టాప్ కథానాయికగా ఉన్నప్పటికీ ఆమె చిత్రాలు వరుస విజయాలు అందుకుంటున్న క్రమంలో..  ఆమె తన దృష్టిని తమిళం వైపుకి మళ్ళించింది. ఇక ఈ జాబితాలో ఉన్న నయనతార, శ్రియ, కాజల్ అగర్వాల్ కూడా తమ తమ ఉనికిని చాటుకుంటూ ఎక్కువకాలం పాటు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నప్పటికీ  వారికంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ లేకపోయింది.


ఈ తరుణంలో  మలయాళ నటి సాయి పల్లవి (Sai Pallavi) తన భాషలో నటించిన 'ప్రేమమ్' చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆమెపై ఇతర భాషా దర్శకుల కళ్లు కూడా పడ్డాయి. మలయాళంలో ఆమె నటించిన "కలి" చిత్రం ఆమెలోని పెర్ఫార్మర్‌ని జనాలకు పరిచయం చేసింది. దాంతో ఆమెకు తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి. ఆమె తొలి తెలుగు చిత్రం 'ఫిదా'తో  (Fidaa)తో నిజంగానే ఆమె టాలీవుడ్ ప్రేక్షకులని ఫిదా చేసేసింది. తర్వాత ఆమె తెలుగులో మిడిల్ క్లాస్ అబ్బాయితో పాటు, కణం చిత్రంలో కూడా నటించింది. 


sai-pallavi-photos


2017లో ఈ రెండు తెలుగు చిత్రాల్లో నటించిన సాయి పల్లవి ఈ సంవత్సరం 'పడి పడి లేచే మనసు' (Padi Padi Leche Manasu) చిత్రంతో  ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ నుండి మొదలుకుని  మొన్న విడుదలైన ట్రైలర్ వరకు అందరి దృష్టి ఆమె పైనే ఉంది.  ఇక ప్రస్తుతం విడుదలైన సినిమాకి మిశ్రమ స్పందనలు వచ్చినా.. సాయి పల్లవి నటనకు మంచి మార్కులే పడ్డాయి. హీరోతో పోటీ పడీ మరీ ఆమె నటించిందని సమీక్షలు వస్తున్నాయి. ఇక హీరో శర్వానంద్ (Sharwanand), దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) కూడా సాయి పల్లవికి ఈ చిత్రానికి సంబంధించి సింహ భాగం క్రెడిట్ ఆమెకు గతంలోనే ఇచ్చేశారు.


ఇక సాయి పల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. ఇప్పటికే ఆమె తనను తాను ప్రూవ్ చేసుకుంది. లవ్ స్టోరీలో తొలిసారిగా ఆమెని చూసి ఫిదా అయిన ప్రేక్షకులు ఇప్పుడు మరోసారి అచ్చమైన  ప్రేమ కథలో ఆమె నటనకు మంచి మార్కులే వేశారు. దాంతో.. కొందరు ఆమెకి తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చినట్టే అని చెప్పుకుంటున్నారు. మరి ఆ విషయాన్ని కాలమే నిర్ణయించాలి.