బీడబ్ల్యూఎఫ్ టూర్‌లో.. దుమ్మురేపిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

బీడబ్ల్యూఎఫ్ టూర్‌లో.. దుమ్మురేపిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

2017 సెప్టెంబర్ నుండి తాను ఆడిన ప్రతి మేజర్ టోర్నీ  ఫైనల్స్‌లో తడబడుతూ దాదాపుగా ఏడు  టైటిల్స్‌ని ఒక్క అడుగు దూరంలో చేజార్చుకుంది సింధు. దీనితో  సింధుకి ఫైనల్స్ ఫోబియా అంటూ చాలామందే కామెంట్ చేశారు. ఒకరకంగా ఆమెకి కూడా ఇలా ఫైనల్స్ వరకు రావడం.. ఓడిపోవడం ఒకింత ఇబ్బందికరంగానే మారిపోయింది.


ఈ తరుణంలో నిన్న జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ (BWF World Tour) గెలుచుకుని పీవీ సింధు (PV Sindhu) ఒక నూతన అధ్యాయానికి  తెరతీసింది. చైనాలో నిన్న ముగిసిన బీడబ్ల్యూఎఫ్ టూర్ ఫైనల్స్‌లో జపాన్ (Japan) క్రీడాకారిణి ఒకుహార (Okuhara) పైన వరుస గేమ్స్‌లో గెలిచి టైటిల్‌ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో  బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా కూడా ఒక రికార్డు సృష్టించింది.


ఈ విజయం సాధించిన తరువాత తనని ఇక ఎవరు  ఫైనల్స్ ఫోబియా అంటూ ప్రశ్నించరు..అదే నాకు పెద్ద రిలీఫ్ అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తపరిచింది. ఈ విజయంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆనందానికి లోనవుతూ తమ బిడ్డ "సిల్వర్ సింధు" కాదని.. ఫైనల్స్ ఒత్తిడిని కూడా తమ బిడ్డ అధిగమించగలదని తమ భావోద్వేగాన్ని తెలియచేశారు. కోచ్ గోపీచంద్ (P Gopichand) కూడా సింధు పడిన కష్టానికి  ఫలితం దక్కిందని.. ఈ ఫైనల్స్ విజయం ఆమెకి భవిష్యత్తులో మరింత మెరుగ్గా ఆడటానికి ఉపయోగపడుతుందని తెలిపారు.


ఇక  సింధు సాధించిన ఈ అపూర్వ విజయానికి ఆమెకి సోషల్ మీడియా ద్వారా ప్రధాని నుండి మొదలుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, క్రీడా దిగ్గజాలు, తోటి క్రీడాకారులు, సినిమా స్టార్స్, సెలబ్రిటీలు  ఇలా అనేకమంది  సింధుని పొగడ్తలతో  ముంచెత్తారు. వరల్డ్ టూర్ ఫైనల్స్ ద్వారా సింధుకి రూ 86.30 లక్షల ప్రైజ్ మనీ తన ఖాతాలో వేసుకుంది. 


ఈ విజయం ఇచ్చిన స్పూర్తితో  తన ఆటని మరింతగా మెరుగుపరుచుకుంటాను అని తన తదుపరి లక్ష్యాలు  ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ (All England Badminton) , టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) & కామన్ వెల్త్ గేమ్స్ (CommonWealth Games) అని వాటిల్లో  మెరుగైన పతకాలు దేశానికి అందించడమే తన ముందున్న లక్ష్యమని  చెప్పింది  ఈ బ్యాడ్మింటన్ ర్యాకెట్ స్టార్ సింధు ...


ఇంతటి గొప్ప విజయాన్ని మనకి మన దేశానికి అందించిన  సింధుకి  POPxo తరపున శుభాకాంక్షలు ... ఇలాంటి విజయాలు మరెన్నో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.