ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. నిజమే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉత్సాహంగా ఉండగలుగుతాం. ఏ పనైనా చేయగలుగుతాం. కానీ మహిళలు మాత్రం ఈ విషయంలో కాస్త అజాగ్రత్తగానే ఉంటారు. తమ కుటుంబ సంక్షేమమే తమ క్షేమంగా వారు భావిస్తారు. అందుకేనేమో తమకు వచ్చిన అనారోగ్యాన్ని ‘చిన్న ఇబ్బందే కదా!’ అంటూ తీసి పారేస్తుంటారు. అందుకే యోని సంబంధిత సమస్యల విషయంలో అయితే మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలా చేయడం సబబు కాదు. ఎందుకంటే.. మన శరీరంలోని సున్నితమైన భాగాల్లో యోని (vagina) కూడా ఒకటి. మరి దాని ఆరోగ్యం కాపాడుకోవాలంటే.. మనం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకొని యోని ఆరోగ్యం కాపాడుకొందాం.
Also Read: హెచ్ఐవీ లక్షణాలు ఎలా ఉంటాయంటే..(Symptoms Of HIV)
లైంగికపరమైన ఆరోగ్యం విషయంలో మన దేశంలో మహిళలు అంత శ్రద్ధ కనబరచరని చెప్పకోక తప్పదు. ఎందుకంటే వాటి గురించి మాట్లాడటమే తప్పుగా భావిస్తారు. కానీ ఆ ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యోని ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి
మన శరీరంలో కొన్ని అవయవాలను మనం ప్రత్యేకంగా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే అవి సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం పాటిస్తాయి. మన యోని కూడా అలాంటిదే. దానికోసం మార్కెట్లో దొరికే వెజైనల్ వాష్ వంటి వాటిని ఉపయోగించకూడదు. ఇవి యోని పీహెచ్ స్థాయిలను అసమతౌల్యం చేస్తాయి. కాబట్టి మనకు జరిగే మేలు కన్నా చెడే ఎక్కువగా ఉంటుంది. మరి వెజీనాను ఎలా శుభ్రం చేయాలి? దాని కోసం గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తే సరిపోతుంది. అలాగే అక్కడ సబ్బుని ఉపయోగించకపోవడమే మేలు.
యోనిని శుభ్రం చేసుకొనేటప్పుడు ఎప్పుడూ ముందు నుంచి వెనకకు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే వెనక నుంచి ముందుకు శుభ్రంచేసకోవడం వల్ల మలద్వారం(Anus) వద్ద ఉండే క్రిములు, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు మూత్ర ద్వార(Urethra) ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటి కారణంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇవి యోని ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే శుభ్రం చేసుకోవడానికి సాఫ్ట్ వైప్స్ ఉపయోగించాలి. దీనికోసం సెంటెడ్, కలర్ వైప్స్ మాత్రం ఉపయోగించకూడదు.
అమ్మాయిలూ.. మనం ధరించే ఇన్నర్స్ కూడా యోని ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి దానికి అనుగుణంగానే మన లోదుస్తులు ఉండాలి. కాటన్ ఇన్నర్స్ ధరించడం వల్ల హైజీనిక్‌గా,సౌకర్యవంతంగా ఉంటుంది. పైగా అక్కడ తేమ పెరగకుండా చేస్తుంది. ఫలితంగా యోని ఆరోగ్యాన్ని దెబ్బ తీసే బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. కాబట్టి సింథటిక్ తరహాలో దుస్తులను కాకుండా కాటన్ దుస్తులు ధరించడం మన ఆరోగ్యానికి మంచిది.
4. బాగా తినండి. ఆరోగ్యంగా ఉండండి (Eat Healthy)
మనం తినే ఆహారం కూడా యోని ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా అక్కడ ఇన్ఫెక్షన్లు రాకుండా చేయడంతో పాటు.. ఉన్న ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్, యోని పొడిబారడం (vaginal dryness) వంటి సమస్యలు రాకుండా చేసుకోవాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు తగినంత నీటిని కూడా తాగడం అవసరం. క్రాన్ బెర్రీ జ్యూస్, పెరుగు, సోయా ఉత్పత్తులు, నిమ్మ, గింజలు, చిలగడ దుంప వంటి వాటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
ఎందుకంటే.. పురుషుల వీర్యం క్షారత్వాన్ని కలిగి ఉంటుంది. కానీ యోని దగ్గర కాస్త ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల అక్కడ పీహెచ్ స్థాయుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అందుకే సెక్స్ తర్వాత వీలైనంత త్వరగా శుభ్రం చేసుకోవడం మంచిది. లేదంటే దురద, మంట లేదా ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
అవునండీ. యోని ఆరోగ్యం కాపాడుకోవడానికి కూడా కొన్ని వ్యాయామాలున్నాయి. ముఖ్యంగా కటి వలయ కండరాలు దృఢంగా మారడానికి కీగెల్ ఎక్సర్సైజెస్ (Kegel Excercise) చేయడం మంచిది. మరి ఇవెలా చేయాలో తెలుసా? చాలా సులభమేనండీ.. మూత్రం ఆపుకొంటున్నట్టుగా యోని కండరాలను బిగించాలి. ఇలా మూడు సెకన్ల పాటు ఉండి ఆ తర్వాత వదిలేయాలి. ఇలా 5-8 సార్లు చేయడం ద్వారా చక్కటి ఫలితం పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా యోని ఆరోగ్యం మెరుగు పడటం మాత్రమే కాదు.. లైంగిక జీవితాన్ని కూడా బాగా ఆస్వాదించవచ్చు.
ముందుగా మనం చెప్పుకొన్నట్లు యోని తనని తానే శుభ్రం చేసుకొంటూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడూ వెజీనా నుంచి డిశ్చార్జి అవుతుంది. అయితే దాని ఆధారంగా మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అని తెలుస్తుంది. పారదర్శకంగా, తెల్లగా లేదా కొద్దిగా పసుపు రంగులో డిశ్చార్జి అవుతూ ఏ విధమైన దుర్వాసనా లేకపోతే.. మీ యోని ఆరోగ్యంగా ఉన్నట్టే. అలా కాకుండా దుర్వాసన వస్తూ, డిశ్చార్జి అయ్యే రంగులో తేడా ఉండి, దురద, వాపు కూడా కనిపిస్తే.. ఏదో సమస్య ఉన్నట్టే భావించాలి. కాబట్టి వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి.
నెలసరి సమయంలో మనం తీసుకొనే జాగ్రత్తలు కూడా యోని ఆరోగ్యాన్ని కాపాడటంలో తోడ్పడతాయి. కాబట్టి నిర్ణీత వ్యవధిలో శానిటరీ న్యాప్కిన్, టాంపూన్లను మార్చాల్సి ఉంటుంది. అలాగే రోజులో కనీసం రెండుసార్లైనా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అప్పుడే మన లైంగిక అవయవాల పనితీరు బాగుంటుంది.
మీ లేడీ పార్ట్‌కి కూడా కాస్త గాలి తగలడం అవసరం. కాబట్టి రాత్రి వేళల్లో ఇన్నర్స్ ధరించకుండా ఉండటమే మంచిది. కానీ పగటి వేళల్లో మాత్రం ధరించడం ముఖ్యం. ఎందుకంటే.. పగటి సమయంలో మనం ధరించే వస్త్రాల కారణంగా అక్కడి చర్మానికి ఇబ్బందులు ఎదురవ్వచ్చు. రాత్రివేళల్లో ఇన్నర్ వేసుకోకపోవడం వల్ల మొదట చెమట, డిశ్చార్జి కారణంగా కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి
యోని ఆరోగ్యానికి సంబంధించిన అపోహలను దూరం చేసుకోవడం ఎలా.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి
వెజీనాకి సంబంధించి అమ్మాయిలు తెలుసుకోవాల్సిన 8 ఫన్నీ నిజాలు ఇవే.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి
యోని ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి