మహిళా చైతన్యానికి మారుపేరు.. హైదరాబాద్ మహిళా పోలీసుల "విమెన్ ఆన్ వీల్స్"

మహిళా చైతన్యానికి మారుపేరు.. హైదరాబాద్ మహిళా పోలీసుల "విమెన్ ఆన్ వీల్స్"

మన దేశంలోనే ప్రప్రధమంగా తెలంగాణలో ప్రారంభించిన షీ టీమ్స్ (She Teams) ప్రాజెక్టుకి అత్యంత ఆదరణతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ ప్రత్యేక విభాగం నెలకొల్పిన తరువాత హైదరాబాద్ నగరంలో ఆడవారి భద్రత శాతం ఎంతో మెరుగుపడింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈమధ్య విడుదల చేసిన గణాంకాలు చూస్తేనే మనకి ఈ విషయం అర్ధమైపోతుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో కూడా షీ టీమ్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు స్వాతి లక్రా ఐపీఎస్.


ఇదిలావుండగా మొన్నీమధ్యనే 'విమెన్ ఆన్ వీల్స్' (Women On Wheels) పేరిట హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో గస్తీ తిరిగేందుకు మహిళా పోలీసులతో ఒక ప్రత్యేక విభాగాన్ని సృష్టించారు . తొలి బ్యాచ్ నుండి 47 మందిని ఎంపిక చేసి వారికి రెండు నెలల పాటు 'కాంబాట్ ట్రైనింగ్' ఇవ్వడంతో పాటుగా డ్రైవింగ్ లో మెరుగైన తర్ఫీదుని ఇవ్వడం జరిగింది.


women-on-wheels-project-started-in-hyderabad


Image: Shika Goel/Twitter


ఇక ఈ బృందాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ముందుండి నడిపిస్తుండగా.. ఈ విభాగాన్ని ఇటీవలే శిఖ గోయెల్ ప్రారంభించారు. ప్రస్తుతానికి జంట నగరాల్లో ఉన్న ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఈ విభాగంలోని వారు ఒక్కొక్కరు కేటాయించబడ్డారు . రాబోయే కాలంలో ఈ సంఖ్యని గణనీయంగా పెంచి ఒక్కో పోలీస్ స్టేషన్ ఏరియాకి ఒక్కో బృందాన్ని అప్పగించే విధంగా కృషి చేస్తున్నట్టుగా శిఖ గోయెల్ తెలిపారు.


ప్రస్తుతం విమెన్ ఆన్ వీల్స్ సేవలను పగటి పూట మాత్రమే వినియోగిస్తున్నట్టుగా సమాచారం. వీరి సంఖ్య పెరిగాక రాత్రి వేళల్లో కూడా వీరిని వినియోగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇక ఇలా ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడానికి వెనకున్న బలమైన కారణమేంటి అంటే - మగవారితో సమానంగా డ్యూటీ చేయగలమనే నమ్మకం వీరిలో పెంపొందించడంతో పాటు.. అదేసమయంలో ఆపదల్లో ఉన్న ఆడవారికి సాటి ఆడవారు సహాయం చేయగలగడం అనే సూత్రం దాగి ఉంది అని చెబుతున్నారు.


ఏదేమైనా ... హైదరాబాద్ కేంద్రంగా పోలీసు వ్యవస్థలో ఇటువంటి విప్లవాత్మకమైన మార్పులు జరగడంతో పాటు.. ఎన్నో ఉపయోగకరమైన విభాగాలు ఏర్పాటవుతుండడం నిజంగా ఆనందించాల్సిన అంశమే కదా ...ఈ సందర్బంగా మా POPxo తెలుగు టీం తరపున "Women On Wheels"కి శుభాకాంక్షలు ...