మ‌ణిక‌ర్ణిక‌పై.. మెగాస్టార్ ప్రశంసల వర్షం..!

మ‌ణిక‌ర్ణిక‌పై..  మెగాస్టార్ ప్రశంసల వర్షం..!

ఝాన్సీ ల‌క్ష్మీబాయి (Jhansi Lakshmibai) జీవిత క‌థ ఆధారంగా రూపొందిన చిత్రం మ‌ణిక‌ర్ణిక (Manikarnika). గ‌త వారం విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ను బాగానే రాబ‌డుతోంది. ఇక ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషించిన కంగ‌నా ర‌నౌత్ (Kangana Ranaut) న‌ట‌నను మెచ్చుకోని వారంటూ ఎవ‌రూ ఉండ‌రంటే అది అతిశ‌యోక్తి కాదు. ముఖ్యంగా ప‌లు యుద్ధ‌విద్య‌లను ఆమె వెండితెర‌పై ప్ర‌ద‌ర్శించిన తీరు అంద‌రినీ అమితంగా ఆక‌ట్టుకుంటోంది.


అంతేకాదు.. జాతీయ అవార్డు గ్ర‌హీత అయిన కంగ‌న ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో మ‌రోసారి త‌న‌ని తాను నిరూపించుకుంది. ఆమె న‌ట‌న‌కు సామాన్య ప్రేక్ష‌కులు మొద‌లుకొని సెల‌బ్రిటీల వ‌ర‌కు ఫిదా అయ్యారంటే కంగ‌న ఏ స్థాయిలో త‌న న‌ట‌ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించిందో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే ఆమెను ప్ర‌శంసించిన వారి జాబితాలో ప‌లువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్ర‌ముఖులు చేర‌గా.. టాలీవుడ్ న‌టీమ‌ణి సమంత సైతం కంగ‌న‌ను తాజాగా తెగ పొగిడేసింది. ఇప్పుడు ఈ జాబితాలో మ‌రో అగ్ర‌న‌టుడు కూడా చేరిపోయారు. 

 


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవ‌ల మ‌ణిక‌ర్ణిక సినిమా చూసిన త‌ర్వాత.. కంగ‌న న‌ట‌న‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోయార‌ట‌! ముఖ్యంగా పోరాట స‌న్నివేశాల్లో ఆమె చేసిన గుర్ర‌పు స్వారీ, క‌త్తి యుద్ధం వంటివి ఆయ‌న‌కు చాలా బాగా న‌చ్చాయ‌ట‌. ఈ క్ర‌మంలోనే చిత్ర ద‌ర్శ‌కుడు క్రిష్ (Krish) & కంగనా రనౌత్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశార‌ట‌!


ప్ర‌స్తుతం ఆయ‌న టాలీవుడ్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సైరా (Sye Raa) చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయినా స‌రే.. ప్ర‌త్యేకించి కాస్త స‌మ‌యం, విరామం తీసుకుని మ‌రీ మ‌ణిక‌ర్ణిక సినిమాను చూసేందుకు వెళ్లారు. ఈ విష‌యం అంద‌రినీ ఒకింత ఆశ్చ‌ర్యానికి గురి చేసిన‌ప్ప‌టికి.. దీని వెనుక వేరే ఆంత‌ర్యం కూడా ఉందంటున్నాయి సినీవ‌ర్గాలు. సైరా చిత్రంలో కూడా చిరంజీవి పోషిస్తోన్న న‌ర‌సింహా రెడ్డి పాత్ర బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసేదే.


ఈ క‌థ‌లో కూడా పోరాట స‌న్నివేశాలు ఎక్కువ‌గానే ఉంటాయి. ముఖ్యంగా గుర్ర‌పు స్వారీ (Horse Riding) నుంచి కత్తి యుద్ధం (Sword Fight) వరకు అన్నీ ఇందులో ఉండ‌డంతో ఆ స‌న్నివేశాలు ఎలా చిత్రీక‌రించారు? వాటిలో ఎవ‌రు, ఎలా న‌టించారు? అప్ప‌టి కాల‌మాన ప‌రిస్థితుల‌ను తెర‌పై ఎలా చూపించారు?? వ‌ంటి అంశాల‌ను ప‌రిశీలించేందుకు చిరంజీవి త‌న బావ‌మ‌రిది మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ (Allu Aravind)తో క‌లిసి ఈ సినిమా చూశార‌ట‌!


ఇప్ప‌టికే 150 సినిమాల్లో న‌టించిన మెగాస్టార్ సైతం నిత్య‌విద్యార్థిలా ఏ పాత్ర‌లో ఎలా న‌టించాలి? యుద్ధ స‌న్నివేశాల‌ను ఎలా తీయాలి? వ‌ంటి అంశాలు తెలుసుకునేందుకు.. ఇలా ప్ర‌త్యేకించి సినిమా చూడ‌డం అంద‌రిలోనూ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. కొంద‌రైతే ఆయ‌న క‌ఠోర శ్ర‌మ‌కు ఇదొక నిద‌ర్శనం అని కూడా అంటున్నారు.


ఇక సైరా సినిమా విష‌యానికి వ‌స్తే ఈ చిత్రం షూటింగ్.. దాదాపు 60 శాతానికి పైగా పూర్త‌యింద‌ట‌! అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన VFX ప‌నులు కూడా మొద‌లైపోయాయి. సైరాను ఈ ఏడాది ఆగ‌స్టు 15 సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ విష‌య‌మై చిత్ర నిర్మాత రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ఇప్ప‌టికే ఒక స్ప‌ష్ట‌త ఇవ్వ‌గా.. ద‌ర్శకుడు సురేంద‌ర్ రెడ్డి సైతం ఇందుకోసం ప‌ట్టుద‌లగా ప‌ని చేస్తున్నార‌ట‌!


ఈ సినిమా ప్రారంభంలోనే అభిమానుల్లో ఏర్ప‌డిన కొన్ని అంచ‌నాలు.. ఇందులోని ప్ర‌ధాన పాత్ర‌ల్లో ప‌లువురు ప్ర‌ధాన తార‌లు న‌టిస్తుండ‌డంతో మ‌రింత పెరిగిపోయాయి. అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) , జగపతి బాబు (Jagaapthi Babu) , నయనతార (Nayanthara) వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో భాగ‌మైన విష‌యం మ‌నంద‌రికీ విదిత‌మే. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే మ‌రి..!


ఇవి కూడా చ‌ద‌వండి


మణికర్ణిక సినిమాపై సమీక్ష


కంగనకు మణికర్ణిక చిత్రం ఎందుకు స్పెషల్ అంటే..!


మరో సవాల్ విసురుతున్న కంగన రనౌత్ మణికర్ణిక