బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్ మనసు తెలుగు చిత్రసీమ వైపు మళ్ళిందా? అన్న వార్తలు ఇప్పుడు హైదరాబాద్‌లో హల్చల్ చేస్తున్నాయి. నటిగా కెరీర్ తొలినాళ్ళలో తెలుగులో వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’లో.. అలాగే నందమూరి బాలకృష్ణ సరసన ‘అల్లరి పిడుగు’లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తరువాతి కాలంలో హిందీ చిత్రసీమకే పరిమితమై తెలుగు చిత్రాల వైపు తొంగి కూడా చూడలేదు.
అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఆమె ఇన్నాళ్ళకి ఒక తెలుగు సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకుగాను కత్రినా కైఫ్‌ని సంప్రదించి కథని వినిపించడం కూడా జరిగిందట. అయితే ఈ విషయానికి సంబంధించి ఆమె నుండి ఇంకా అంగీకారం రాలేదట. ఇంతకీ ఆమెని సంప్రదించిన దర్శకుడు సుకుమార్ కాగా…. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వివరాలతో మీకు ఆమెని ఏ హీరో పక్కన నటించడానికి సంప్రదించారో అర్ధమైపోయిందిగా.. మీరు అనుకున్నది నిజమే… అవును.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పక్కన కత్రినాను కథానాయికగా తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు.
రంగస్థలం (Rangasthalam) చిత్రంతో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు సుకుమార్. అలాగే “భరత్ అనే నేను” చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి.. ప్రస్తుతం మహర్షిగా ప్రేక్షకుల ముందుకి రానున్న హీరో మహేష్ బాబు. వీరిద్దరి కలయికలో త్వరలో ప్రారంభం కానున్న చిత్రంలో హీరోయిన్ ఎంపికకి సంబంధించి ఇప్పటికే చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. అందులో భాగంగానే కత్రినా కైఫ్‌ని తీసుకునేందుకు దర్శకుడు సుకుమార్ మొగ్గు చూపుతున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఆమెని ఆయన కలిసి కథని వినిపించారట. అలాగే ఆమె పాత్రని గురించి కూడా చెప్పడం జరిగిందట. అయితే స్క్రిప్ట్ పరంగా ఆమె సంతృప్తి వ్యక్తం చేసినప్పటికి.. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని సమాచారం.
ఒకవేళ గనుక ఈ చిత్రం చేయడానికి కత్రినా కైఫ్ గనుక ఒప్పుకుంటే దాదాపు 14 ఏళ్ళ తరువాత తెలుగు సినీపరిశ్రమకి రీ-ఎంట్రీ ఇచ్చినట్టుగా అవుతుంది. అయితే ఇప్పటికే బాలీవుడ్లో టాప్‌స్టార్‌గా ఉన్న ఆమె తెలుగులోకి రావడం ఎంత వరకు కరెక్ట్? అలాగే ఈ కథ, పాత్ర తనకి నప్పుతాయా? లాంటి ప్రశ్నలు ప్రస్తుతం ఆమె ముందు ఉన్నాయి. మరి వీటన్నిటిని ఆమె పరిగణనలోకి తీసుకొని.. తాను ఒక నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.
అయితే ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా విద్యా బాలన్ (Vidya Balan) తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి విజయం సాధించడం అనే పరిణామం ఏమైనా.. కత్రినా కైఫ్ రీ-ఎంట్రీ పై ప్రభావం చూపొచ్చా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
మరి ఈ విషయమై కత్రినా నిర్ణయం ఎలా ఉంటుంది అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ మధ్యనే ఆమె బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ పక్కన నటించిన జీరో (Zero) సినిమాలో పాత్రకి మంచి ప్రశంసలు దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రివ్యూ
రజనీకాంత్ స్టామినాని మరోసారి చూపించిన చిత్రం “పేటా”
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ‘వినయ విధేయ రామ’ ప్రత్యేకతలేమిటి..?