నిజ‌మైన ప్రేమ‌కు మ‌రుప‌న్న‌దే లేదు.. ప్రేమికులందరూ తప్పక చదవాల్సిన ప్రేమకథ

నిజ‌మైన ప్రేమ‌కు మ‌రుప‌న్న‌దే లేదు.. ప్రేమికులందరూ తప్పక చదవాల్సిన ప్రేమకథ

నిజ‌మైన ప్రేమ‌ (true love) కు మ‌రుపంటూ ఉండ‌దు. దాన్ని మ‌ర్చిపోవాలంటే వూపిరి ఆగిపోవాల్సిందే. అందుకేనేమో.. ప్రేమించిన అమ్మాయి అమ్నీషియా (amnesia)తో త‌న‌ని మ‌ర్చిపోయినా.. రోజూ త‌న ప్రేమ‌ను ఆమెకు గుర్తుచేస్తూనే ఉన్నాడు ఆ యువ‌కుడు. ఆ మ‌ధ్య విడుద‌లైన "స‌త్య‌భామ" సినిమా చూశారా? భూమిక‌, శివాజీ క‌లిసి న‌టించిన ఆ చిత్రంలో క‌థానాయిక ఓ ప్ర‌మాదంలో త‌న గ‌తాన్ని మ‌ర్చిపోతుంది. రోజూ ఒకే తేదీ అనుకొని జీవిస్తూ ఉంటుంది.


కానీ క‌థానాయ‌కుడు మాత్రం ఆమెను ప్రేమిస్తూ త‌మ ప్రేమ‌కు మ‌తిమ‌రుపు అడ్డు కాద‌ని నిరూపిస్తాడు. అచ్చం ఇలాంటి సంఘ‌ట‌నే జ‌పాన్‌లోనూ జ‌రిగింది. ప్రేయ‌సి ప్ర‌మాదంలో గ‌తం మ‌ర్చిపోయి త‌న‌ని గుర్తుప‌ట్ట‌క‌పోయినా.. ఏమాత్రం వెన‌ుక‌డుగు వేయ‌కుండా ఆ అమ్మాయినే ప్రేమిస్తూ.. త‌న‌లో తిరిగి ప్రేమ‌ను పుట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ఓ ప్రియుడు. ఆ ప్రేమికుడి ప్ర‌య‌త్నం ప్రేమ‌పై ఎంద‌రికో ఉన్న న‌మ్మ‌కాన్ని పెంచుతోంది.


Movie-Still-Satyabhama-Shivaji


Image: Youtube/Satyabhama Telugu Movie


జ‌పాన్‌కి చెందిన లీ హువాయూ, మారుయామా గ‌త రెండున్న‌రేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరిద్ద‌రి ప్రేమ గురించి వారి త‌ల్లిదండ్రుల‌కు కూడా తెలుసు. పెళ్లి గురించి కూడా ఎన్నో క‌ల‌లు క‌న్నారు ఈ ప్రేమికులు. ఇర‌వై నాలుగేళ్ల వ‌య‌సులో ఉన్న వీరిద్ద‌రూ కెరీర్‌లో స్థిర‌ప‌డిన త‌ర్వాత వివాహ‌మాడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇంకొన్నాళ్లైతే త‌మ పెళ్లి జ‌రుగుతుంద‌ని సంతోషిస్తున్న స‌మ‌యంలోనే మారుయామా ఓ ప్ర‌మాదంలో గాయ‌ప‌డింది. బైక్ పై వెళ్తున్న ఆమెను ఓ కారు ఢీకొట్ట‌డంతో తీవ్ర గాయాల‌పాలైంది. ఆస్ప‌త్రిలో చేరినా ఫ‌లితం లేక చాలాకాలం పాటు కోమాలో ఉండిపోయింది.


ఆ త‌ర్వాత కోమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినా స‌రే.. ఆమె ఎవ‌రినీ గుర్తుప‌ట్ట‌లేక‌పోయింది. తానెవ‌రో కూడా ఆమెకు గుర్తులేక‌పోవ‌డం, అద్దంలో త‌న‌ని తాను చూసి కూడా గుర్తుప‌ట్ట‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కుటుంబ స‌భ్యుల‌ను, త‌న ప్రేమికుడిని కూడా ఆమె గుర్తుపట్ట‌లేదు. అయితేనేం లీ ఏమాత్రం బాధ‌ప‌డ‌లేదు. ఆమె తన ప్రేమ‌ను మ‌ర్చిపోయిందేమో.. కానీ తామిద్ద‌రి ప్రేమ గురించి త‌న‌కు తెలుసు క‌దా.. అనుకున్నాడు. అందుకే పాత జ్ఞాప‌కాల‌ను ఆమెకు గుర్తుచేసేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించాడు. కానీ లాభం లేక‌పోయింది. మ‌రీ ఇబ్బంది పెడితే ఆమె ప్రాణాల‌కే ప్ర‌మాదం అని వైద్యులు తేల్చి చెప్పేశారు. దీంతో ఆ ప్ర‌య‌త్నం మానుకున్న లీ మ‌రో ప్ర‌య‌త్నం చేయ‌డం ప్రారంభించాడు.


Lee-and-Maruyama-japanese-lovers


Image: Twitter/TBS


 


త‌న ప్రేయ‌సికి త‌న ప్రేమ గురించి తెలిసేలా ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్యేకంగా ఏదో ఒక‌టి ఏర్పాటు చేసేవాడు. కాలంతో పాటు ఆమె ఒంటిపై అయిన గాయాలు త‌గ్గినా త‌న జ్ఞాప‌క‌శ‌క్తి మాత్రం తిరిగి రాలేదు. అయినా లీ ఏమాత్రం ఇబ్బంది ప‌డ‌లేదు. మారుయామాని రోజూ ప్రేమ‌లో ప‌డేయ‌డానికి ప్ర‌య‌త్నించేవాడు. రెండు నెల‌ల పాటు ఆమెకి నిన్న జ‌రిగిన విష‌యం ఈరోజు గుర్తుండేది కాదు. అందుకే రోజూ త‌న‌తో కొత్త‌గా మాట్లాడి త‌న ప్రేమ‌ను ఆమెకు వెల్ల‌డించేవాడు లీ.


చాలాసార్లు ఈ ప్ర‌క్రియ‌తో విసుగుచెందిన మారుయామా త‌న‌ని మ‌ర్చిపోమ‌ని.. త‌న‌లాంటి వ్య‌క్తిని పెళ్లి చేసుకొని లీ సంతోషంగా ఉండ‌మని కూడా చెప్పింద‌ట‌! అయినా లీ దానికి నో చెప్పాడు. "గ‌తంలో నువ్వు ఎలా ఉండేదానివో నాకు తెలుసు. అప్పుడు నేను నిన్ను ఇష్ట‌ప‌డ్డా. నువ్వు ఇలా ఉన్నా కూడా నాకు ఇష్ట‌మే.. నీ ప్ర‌వ‌ర్త‌న నాకు ఎలాంటి ఇబ్బందినీ క‌లిగించ‌ట్లేదు" అని చెప్పాడ‌ట‌. అంతేకాదు.. "నీకు పాత విష‌యాలు గుర్తులేక‌పోవ‌చ్చు. కానీ మ‌నిద్ద‌రం క‌లిసి కొత్త జ్ఞాప‌కాల‌ను సృష్టించుకోవ‌చ్చు" అని చెప్పుకొచ్చాడు. ప్ర‌తిరోజూ కొత్త ప‌ద్ధ‌తుల ద్వారా త‌న‌ని ప్రేమ‌లో ప‌డేసేందుకు ప్ర‌య‌త్నించేవాడ‌ట‌. రోజూ ఉద‌యాన్నే మారుయామాకి త‌న గురించి, లీ గురించి, తామిద్ద‌రి ప్రేమ గురించి.. ప్ర‌మాదం గురించి పూర్తిగా వివ‌రించేవాడ‌ట‌. ఇలా త‌న‌పై లీ చూపిస్తున్న ప్రేమ‌కు పొంగిపోయిన మారుయామా ఓరోజు అత‌నికి ప్ర‌పోజ్ చేయ‌డానికి సిద్ధ‌మైంది.


true-lovers-who-overcome-amnesia


Image: Twitter/ TBS


ఇంత సెన్సిటివ్ స‌మ‌యంలో నాకు తోడుగా నిలిచినందుకు నీకు కృత‌జ్ఞ‌త‌లు. నువ్వు న‌న్ను బాగా అర్థం చేసుకున్నావు. ఈ స‌మ‌యంలోనూ నాకు అన్నివేళ‌లా తోడుగా నిలిచావు. అమ్నీషియా కార‌ణంగా నా మ‌తిమ‌రుపు ఇంకా పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని వైద్యులు చెప్పారు. అలా అయితే నేను అన్ని విష‌యాలు మ‌ర్చిపోయే అవ‌కాశం ఉంది. అయినా నువ్వు నాకు జీవితాంతం తోడు నిలుస్తావా? అని ఆమె అడిగింది.


ఈ ప్ర‌శ్న‌కు లీ సంతోషంగా ఉంటాన‌ని స‌మాధానం చెప్పాడు.. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్‌లో వైర‌ల్‌గా మారింది. అమ్నీషియా వ‌ల్ల నేను మ‌రోసారి త‌న‌తో ప్రేమ‌లో ప‌డేందుకు అవ‌కాశం దొరికింది. నేను ఎన్నిసార్లు గ‌తం మ‌ర్చిపోయినా లీ న‌న్ను వ‌ద‌ల‌డు. న‌న్ను త‌న‌తో ప్రేమ‌లో ప‌డేలా చేసుకుంటాడ‌ని నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది అంటూ త‌న ప్రేమికుడి గురించి గ‌ర్వంగా చెప్పుకొచ్చింది మారుయామా.


Featured Image: Pixabay


ఇవి కూడా చ‌ద‌వండి.


మీ ప్రేమ బంధం .. ఎలాంటి అనుబంధమో తెలుసుకోవాలని భావిస్తున్నారా..?


మేజ‌ర్ శ‌శిధ‌ర‌న్ విజ‌య్ నాయ‌ర్‌ జంట ప్రేమ‌క‌థ వింటే.. మీరూ కంట‌త‌డిపెడ‌తారు..!


ఆమె కౌగిలిలో కరిగిపోయా.. ఈ లోకాన్నే మరిచిపోయా: మోడరన్ రోమియోల మాటలివే..!