కొత్తగా ప్రేమలో పడిన వారందరూ ఎప్పుడు డేట్(Date)కి వెళ్దామా అని వేచి చూస్తుండడం సహజం. అయితే డేట్‌కి ఎక్కడికి వెళ్లాలంటే మాత్రం వారికి గుర్తొచ్చేది కేవలం రెస్టారెంట్లు, సినిమాలు, రిసార్ట్‌లకు వెళ్లడం మాత్రమే. అయితే ఎప్పుడూ డిన్నర్‌లు, సినిమాలకు వెళ్లాలంటే చాలామందికి బోర్ కొడుతుంది.
ఇవి ఎంత సౌకర్యంగా ఉన్నా.. కొన్నాళ్లకు మాత్రం రొటీన్‌గా మారి బోర్ కొడుతుంటాయి. ఈ పద్ధతి ఒకసారి మీ బంధంలోకి ప్రవేశిస్తే మీ రిలేషన్‌షిప్ కూడా బోర్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లోనే సినిమాలు చూస్తూ.. పిజ్జాలు తింటూ గడపొచ్చు. కానీ ఎప్పుడూ అదే చేయలేం కదా. అందుకే మీ ఇద్దరికీ ప్రత్యేకంగా ఉండేలా ఈ డేట్ ఐడియాలు (Offbeat date ideas) ఓసారి ప్రయత్నించి చూడండి. చాలా ఎక్సయిటింగ్‌గా, ఆసక్తిగా అనిపిస్తుంది. కొత్తదనం కూడా మీ సొంతమవుతుంది.
మీలోని శ్రేయా ఘోషల్‌ని, అరిజిత్ సింగ్‌ని బయటకు తీసుకొచ్చే సందర్భం ఇది. మీ గొంతు ఎంత కర్ణకఠోరంగా ఉన్నా.. నచ్చిన వ్యక్తితో కలిసి పాటలు పాడుతుంటే ఆ కిక్కే వేరు. అందుకే మీకు దగ్గర్లో ఉన్న కరయోకి బార్‌కి వెళ్లిపోండి. ఇద్దరూ కలిసి మీకు నచ్చిన పాటల ట్యూన్స్‌కి సింగర్లలా పాటలు పాడే ఈ రాత్రి మీకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది.
మీ ఇద్దరికీ రకరకాల తినుబండారాలు, స్ట్రీట్ ఫుడ్ తినడం అంటే ఇష్టం అయితే.. ఎప్పుడూ పెద్ద పెద్ద రెస్టారెంట్లకే కాదు.. అప్పుడప్పుడూ లోకల్ బండ్ల వద్దకూ వెళ్లవచ్చు. మనం ఉండే ప్రదేశంలో కొన్ని వంటలకు కొన్ని ప్రత్యేకమైన పాయింట్లుంటాయి. అయితే ఇద్దరూ కలిసి వెళ్లి స్ట్రీట్‌ఫుడ్ తినాలా? అని చాలామంది ఆగిపోతూ ఉంటారు. అయితే ఈసారి స్ట్రీట్ ఫుడ్స్‌ని ప్రయత్నించి చూడండి. మీ నగరంలోనే అలా అలా తిరుగుతూ.. మీకు నచ్చిన చోట ఆగి స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల తక్కువ ఖర్చుతోనే రోజంతా ఆనందంగా గడపగలుగుతారు. అప్పుడప్పుడూ లోకల్ మార్కెట్లకు వెళ్లి అక్కడ దొరికే వస్తువులను కూడా కొంటూ ఉండడం వల్ల కొత్త ఫీలింగ్ మీ సొంతమవుతుంది.
హైదరాబాద్‌లో సాలర్‌జంగ్ మ్యూజియం చూడాలంటే రోజంతా సరిపోదు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉదయాన్నే మ్యూజియం చూడడం ప్రారంభిస్తే సాయంత్రానికి అది పూర్తవుతుంది. ఈలోపు అప్పటి రాజుల గురించి తెలుసుకోవడంతో పాటు చక్కటి శిల్పకళ, చిత్ర కళను చూసే వీలు కలుగుతుంది. ఇదే గాక.. మీకు పెయింటింగ్స్ అంటే ఆసక్తి ఉంటే ఆర్ట్ గ్యాలరీలను కూడా సందర్శించవచ్చు.
మీ ఇద్దరికీ నచ్చిన సింగర్ లైవ్ మ్యూజిక్ షో ఉందంటే మాత్రం.. ఆ రాత్రికి టికెట్లు బుక్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిమాన సంగీతకారుల వీనుల విందైన సంగీతానికి నృత్యం చేస్తూ గడపడం మీకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఒకవేళ లైవ్ షో లేకపోతే డిస్కోలకు కూడా వెళ్లవచ్చు.
మీ ఇద్దరికీ ఏదైనా గేమ్ అంటే ఇష్టమైతే.. ఆ గేమ్‌ని ఆడుతూ సమయం గడపండి. లేదా ఒకరికి వచ్చినదాన్ని ఇంకొకరు నేర్చుకుంటూ రోజు గడపండి. అటు ఇద్దరూ కలిసి గడిపినట్లు ఉండడంతో పాటు మీరు ఓ కొత్త విద్యను కూడా నేర్చుకోగలుగుతారు. ఎప్పుడూ ఇదే కాకుండా అప్పుడప్పుడూ గేమింగ్ జోన్‌కి వెళ్లి బౌలింగ్, స్నూకర్, వీడియోగేమ్స్ వంటివి ఆడవచ్చు. మీ ఇద్దరికీ వీడియోగేమ్స్ అంటే ఇష్టమైతే.. ఇంట్లోనే ఇద్దరూ కలిసి మంచి గేమ్ ఆడుతూ రోజంతా గడపడానికి ప్రయత్నించండి.
చాలామంది బీచ్‌లో సూర్యాస్తమయాన్ని చూసేందుకు ఇష్టపడతారు. కానీ సూర్యోదయం చూస్తూ బీచ్‌లో గడపడంలో ఉన్న మజా ఏంటో అది చూస్తే కానీ అర్థం కాదు. అలా చూస్తూ బీచ్‌లో సమయం గడపడంతో పాటు అక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసి వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. హైదరాబాద్‌లో ఉన్నవారు నెక్లెస్ రోడ్డుకు వెళ్లి అక్కడ సూర్యోదయాన్ని చూసే ప్రయత్నం చేయండి. అంతేకాదు.. పక్కనే ఉన్న పార్కుల్లో కాసేపు ఆహ్లాదంగా గడిపి అప్పుడు ఇంకెక్కడికైనా వెళ్లండి. ఉదయాన్నే ఆనందంగా రోజు ప్రారంభమైతే ఆ రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.
ఇవీ, ఎప్పుడూ వెళ్లే ప్రదేశాలకు కాకుండా.. ఇతర ప్రదేశాలకు వెళ్లేందుకు కొన్ని మంచి ఆలోచనలు.. ఇవి మీకు నచ్చితే మీ మనసైనవారితో వీటిని ప్రయత్నించండి.
ఇవి కూడా చదవండి
డేట్ కు వెళ్తున్నారా? ఇలా రెడీ అవ్వండి
మీ ప్రేమ బంధం .. ఎలాంటి అనుబంధమో తెలుసుకోవాలని భావిస్తున్నారా..?
టీనేజ్ క్రష్.. కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్.. అచ్చం సినిమా లాంటి ప్రేమకథ