ఉత్తరాఖండ్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. పచ్చదనం పరుచుకున్న కొండలు, అందమైన లోయలు, అందమైన నదులు.. ఇలా ఎక్కడ చూసినా అందమేనని చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడి ముస్సోరీ(Mussoorie) వీకెండ్ ట్రిప్ (Trip)కి ఎక్కువ మంది ఎంచుకునే ప్రాంతంగా చెప్పుకోవచ్చు. కుటుంబంతోనే కాదు.. స్నేహితులతో కలిసి ఇక్కడికి వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. మంచు దుప్పటి కప్పుకున్న అందమైన హిమాలయాల మధ్య నెలకొని ఉన్న ఈ ప్రదేశం అక్కడికి వెళ్లినవారందరికీ ఆహ్లాదాన్ని పంచుతుందనడంలో అతిశయోక్తి లేదు. మరి, ఈ అద్భుతమైన ప్రదేశానికి మీరూ వెళ్లాలనుకుంటే అక్కడ ఉండగా మీరు వెళ్లాల్సిన ప్రదేశాలు, చేయాల్సిన పనులు ముందుగానే తెలుసుకోవాల్సిందే.
1. కెంప్టీ ఫాల్స్ చూడాల్సిందే..
భారతదేశంలో ఎక్కువ మంది విహారయాత్రలకు వెళ్లే ప్రదేశాల్లో ఒకటిగా నిలిచిన కెంప్టీ ఫాల్స్ జలపాతం ముస్సోరీ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సముద్రమట్టానికి 4500 అడుగుల ఎత్తులో అందరికీ ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ ప్రదేశాన్ని 1835లో బ్రిటిష్ ఆఫీసర్ జాన్ మెకినన్హే పిక్నిక్ స్పాట్ గా మార్చారట. అప్పటినుంచి ముస్సోరీ వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశాన్ని చూడకుండా అస్సలు తిరిగివెళ్లరు.
2. మిస్టీ సరస్సులో బోటింగ్
కెంప్టీ నదిలోని నీటితో ఏర్పడిన సరస్సు ఇది. కెంప్టీ ఫాల్స్‌కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరస్సు చుట్టూ అందమైన ఆకుపచ్చని ప్రకృతి అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సరస్సులో నచ్చినవారందరితో కలిసి బోటింగ్ చేయడంలో సరదానే వేరు. అందుకే వారాంతాల్లో ఇక్కడ చాలా రద్దీగా ఉంటుందట.
3. షెడప్ చాపెల్లింగ్ టెంపుల్ సందర్శించండి
దీన్ని టిబెటన్ బుద్ధిస్ట్ టెంపుల్‌గా కూడా చెబుతుంటారు. దీన్ని ముస్సోరీలోని టిబెట్ కమ్యూనిటీ ఏర్పాటుచేసింది. అందమైన మట్టిదీపాలతో పాటు.. చుట్టూ అందమైన పూలచెట్లు, అందమైన గోడలు, వాటికి తగిలించిన చిన్నచిన్న జెండాలు ఈ టెంపుల్ అందాన్ని ఎంతచూసినా తనివితీరనట్లుగా మారుస్తాయి. ఇక్కడి నుంచి ముస్సోరీలోని అందమైన ప్రకృతితో పాటు మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాల అందాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఉదయం 5 గంటలకు లేదా సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకూ ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు.
4. లైబ్రరీ బజార్‌లో షాపింగ్
దీన్ని కితాబ్ ఘర్ అని కూడా అంటారు. ఈ మార్కెట్‌ని 1835లో ప్రారంభించారు. లక్ష్మీ నారాయణ ఆలయం, గురుద్వారా సింగ్ సభా, అమానియా మసీద్, క్రైస్ట్ చర్చ్‌లకు మధ్యలో నెలకొని ఉన్న ఈ మార్కెట్ నిర్మాణ శైలి అబ్బురపరుస్తుంది. ఈ మార్కెట్ ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకూ తెరిచి ఉంటుంది.
5. పారాగ్లైడింగ్ చేయండి..
ముస్సోరీలో పారాగ్లైడింగ్ చాలా ఫేమస్. టూ సీటర్ గ్లైడర్స్‌లో ప్రొఫెషనల్ గ్లైడర్లు మనకు సాయంగా ఉంటారు. వీరికి గాలిలో కొన్ని వేల గంటల పాటు ఎగిరిన అనుభవం ఉంటుంది కాబట్టి మనం ముందుగా ఎలాంటి శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు సాహస క్రీడలంటే ఇష్టం, వాటిలోని థ్రిల్‌ని ఎంజాయ్ చేసే ధైర్యం ఉంటే చాలు. ఎక్కువ సమయంపాటు గాలిలో ఉండాలనుకునేవారికోసం వేరే ఏర్పాటు కూడా ఉంటుంది. ఈ తరహా గ్లైడింగ్‌లో దాదాపు పదివేల అడుగుల పైన గంట పాటు ఉండే వీలుంటుంది.
ధర – సాధారణ పారాగ్లైడింగ్‌కి రూ.2000, గంట పాటు గాల్లోనే ఉండాలంటే రూ.10000
ఆపరేటర్స్ – పారాగ్లైడింగ్ ఇన్ ముస్సోరీ, జిప్‌లైన్ ఎడ్వెంచర్స్
6. రోప్‌వేలో కొండ ఎక్కండి
చిన్నతనంలో ఏదైనా కొండ ఎక్కాలంటే కేబుల్‌కార్స్ ఎక్కేందుకు నేను చాలా ఆసక్తి చూపించేదాన్ని. ముస్సోరీలో ఈ అనుభవం పొందడం చాలా సులువు. జూలాఘాట్ నుంచి గన్ హిల్ వరకూ దాదాపు నాలుగు నుంచి ఏడు నిమిషాల ప్రయాణం చేస్తే ముస్సోరీలోనే రెండో అతిపెద్ద పర్వతం గన్ హిల్ పైకి చేరుకుంటాం. ఈ ప్రయాణం మనం జీవితంలో మర్చిపోలేని ప్రయాణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక పైకి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కిందకు చూస్తే కనిపించే అందం అద్భుతం అని చెప్పవచ్చు.
7. బినాగ్ వన్యప్రాణి అభయారణ్యం
రాజాజీ నేషనల్ పార్క్‌లోని భాగమైన ఈ అభయారణ్యం ప్రకృతి ప్రేమికులకు చక్కటి విందుచేస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని మొక్కలు, జంతువులు ఇక్కడ ఉండడం దీని ప్రత్యేకత. రెడ్ బిల్డ్ బ్లూ మాగ్‌పై, హిమాలయన్ మేక, చిరుతలు, పులులు, వైట్ కాప్‌డ్ వాటర్ రెడ్ స్టార్ట్ వంటివి కేవలం ఈ అభయారణ్యంలోనే కనిపిస్తాయి. ఇక్కడి నుంచి చౌఖంబా, బందార్‌పంచ్ పర్వతాల అద్భుతమైన అందాలను తనివితీరా చూసే వీలుంటుంది.
8. నాగ్ టిబ్బా ట్రెక్‌కి వెళ్లండి.
ట్రెక్కింగ్ అంటే ఆసక్తి ఉన్నవారు చాలామంది హిమాలయాల్లో టెక్కింగ్ చేయాలని ఆశపడుతుంటారు. ఎందుకంటే ఇతర ప్రదేశాల్లో చేసే ట్రెక్కింగ్‌కి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇలాంటివారు నాగ్‌టిబ్బా ట్రెక్కింగ్‌కి వెళ్లి హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ఈ ట్రెక్‌ని అన్నివయసుల వారూ ఎక్కేందుకు వీలుగా ఉంటుంది. రెండు రోజుల ట్రెక్ తర్వాత 915 అడుగుల ఎత్తున్న పర్వత అంచులను చేరుకోవచ్చు. ఘర్‌వాల్ అడవుల మధ్య నుంచి వెళ్లే ఈ ట్రెక్ అడవుల సోయగాన్ని చూసే వీలు కల్పిస్తుంది. కుటుంబమంతా కలిసి చక్కటి అవుటింగ్‌కి వెళ్లాలనుకుంటే ఇది చక్కటి ఎంపిక అవుతుంది.
9. రస్కిన్‌బాండ్‌ని కలవండి
చిన్నతనంలో రస్కిన్ బాండ్ రాసిన పుస్తకాలు చదివి ఆయన్ని ఎప్పటికైనా కలవాలని చాలామంది అనుకొనే ఉంటారు. దానికి ఇదే చక్కటి అవకాశం. ఇక్కడి అందమైన ప్రకృతికి ముగ్ధుడైన రస్కిన్ బాండ్ లాండూర్ కంటోన్మెంట్ టౌన్‌లో స్థిరపడ్డారు. మరి, ముస్సోరి వరకూ వెళ్లిన తర్వాత ఆయనను కలిసే అరుదైన అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా చెప్పండి? ముస్సోరీ మాల్ రోడ్‌లోని కేంబ్రిడ్జ్ బుక్ డిపోలో ప్రతి శనివారం సాయంత్రం 3.30 నుంచి 5.30 వరకూ ఉంటారు. అక్కడ కూడా ఆయనను కలుసుకోవచ్చు. అక్కడికి వెళ్లి ఆయనతో మాట్లాడడమే కాదు.. ఫోటోలు దిగడం, పుస్తకాలపై ఆటోగ్రాఫ్స్ తీసుకోవడం వంటివి కూడా చేస్తుంటారట.
10. కాసా మియా బేకరీలో తినండి.
ముస్సోరీ అందాలను చూస్తూ మైమరచిపోవడమే కాదు.. ఆ అందాల నడుమ నోరూరించే తియ్యతియ్యని పేస్ట్రీలను కూడా తింటే బాగుంటుంది కదా.. ఈ బేకరీ చిన్నదే అయినా ఇక్కడ లభించే డానిష్ పేస్ట్రీలు, ఫ్రెష్ ఫ్రూట్ క్రీం, క్రిస్ప్ ప్యాటీస్, క్రోసియంట్ బ్రెడ్ వంటివన్నీ నోరూరిస్తాయి
ఎక్కడ ఉండొచ్చు..
కాస్మండా ప్యాలస్ – మాల్ రోడ్‌లోని ఈ ప్యాలస్‌ను పాత కొత్తల సంగమంగా చెప్పుకోవచ్చు. పాత తరం నిర్మాణ శైలితో కొత్తతరం లగ్జరీని కూడా కలిపి దీన్ని నిర్మించారు.
స్టార్స్ క్లార్క్ ఇన్ – చుట్టూ అందమైన ప్రకృతితో నిండి ఉన్న ఈ హోటల్ డూన్ వ్యాలీ వ్యూతో ఉదయం లేవగానే అందమైన వాతావరణం ఉండేలా చూస్తుంది. దీంతో పాటు సౌకర్యవంతమైన రూమ్స్ మీకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండే వీలు కల్పిస్తాయి.
హోటల్ డన్స్‌వర్ట్ కోర్ట్ – కొండపై నెలకొని ఉన్న ఈ హోటల్ ముస్సోరీలోని లగ్జరీ హోటళ్లలో ఒకటి. పర్వతాలు, లోయల వ్యూతో.. చక్కటి సౌకర్యవంతమైన గదులతో ఆకట్టుకుంటుందీ హోటల్.
ఇవి కూడా చదవండి
మీ ఫోన్‌లో తప్పక ఉండాల్సిన ట్రావెల్ యాప్స్ గురించి ఆంగ్లంలో చదవండి
విహార యాత్ర సమయంలో తీసుకెళ్లాల్సిన ఫంకీ యాక్సెసరీస్ గురించి ఆంగ్లంలో చదవండి.
వీసా లేకుండా వెళ్లదగిన ఇతర దేశాల పర్యాటక ప్రాంతాల గురించి ఆంగ్లంలో చదవండి.