అందం.. అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే అనిపించుకోవాలని ప్రతి అమ్మాయి ఆశపడుతుంది. కానీ చిన్న చిన్న చర్మ సమస్యల వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులో ముఖ్యమైనది ముఖంపై పెరిగే వెంట్రుకలు. ముఖంపై ఎక్కువగా వెంట్రుకలు పెరిగితే అబ్బాయిలా ఉన్నావంటారేమోనని చాలామంది బాధపడుతూ ఉంటారు. కొందరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తే.. చాలామంది వీటిని తొలగించుకోవడానికి రకరకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు.
వ్యాక్సింగ్, త్రెడింగ్, ఎపిలేటింగ్, ప్లక్కింగ్, ట్వీజింగ్, షేవింగ్, లేజర్ హెయిర్ రిమూవల్ వంటి పద్ధతులు ఈ వెంట్రుకలను తొలగించేందుకు తోడ్పడతాయి. అయితే వీటిలో చాలావరకూ తాత్కాలికమైనవే. మరికొన్ని ఎక్కువ నొప్పిని కలిగిస్తే.. ఇంకొన్ని చాలా ఖరీదైనవి కూడా. అందుకే వీటన్నింటికంటే ఉత్తమమైన పద్ధతి ఫేషియల్ బ్లీచ్ (Facial bleach)అని చెప్పుకోవచ్చు. ఇది ముఖం మీదున్న వెంట్రుకలు తగ్గించదు కానీ అవి కనిపించకుండా..మీ చర్మం రంగులో కలిసిపోయేలా చేస్తుంది. దీంతో ముఖంపై వెంట్రుకలు ఉన్నట్లు కూడా కనిపించదు. అందుకే ఇప్పుడు చాలామంది ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరి, మనమూ దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం రండి..
ఇంట్లోనే బ్లీచింగ్ చేసుకోవడం ఎలా?
సహజసిద్ధ పధార్థాలతో బ్లీచింగ్ చేయడమెలా?
బ్లీచింగ్‌కి సంబంధించి తరచూ ఎదురయ్యే సందేహాలు
ముఖంపై ఎక్కువగా వెంట్రుకలు రావడానికి గల కారణాలేంటి? (Reasons For Hair Loss)
హార్మోన్ల అసమతౌల్యత వల్ల చాలామందిలో శరీరం, ముఖంపై వెంట్రుకలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా ముఖంపై, దవడ, గడ్డం భాగంలో ఎక్కువగా వెంట్రుకలు రావడం మనం చూస్తుంటాం. ఈ భాగాల్లో ఎక్కువగా వెంట్రుకలు కనిపిస్తున్నాయంటే వెంటనే వైద్యుల సలహా తీసుకొని మందులు వాడడం మంచిది.
ఫేషియల్ బ్లీచ్ అంటే ఏంటి? (What Is Facial Bleach)
బ్లీచ్ క్రీంని ఎక్కువగా వివిధ రకాల కెమికల్స్‌ని కలిపి తయారుచేస్తారు. ఇందులో ఎక్కువగా సోడియం హైపోక్లోరైట్ కలుస్తుంది. ఇది ముఖంపై ఉన్న వెంట్రుకలను తెల్లగా మార్చుతుంది. అయితే ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే ఇది మీ చర్మంపై చూపే ప్రభావానికి దద్దుర్లు, దురద వంటివి ఎదురయ్యే అవకాశాలుంటాయి. అందుకే ముఖాన్ని బ్లీచ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు రెండు రోజుల ముందుగా చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసి ఏవైనా దుష్ప్రభావాలున్నాయా అని చెక్ చేసుకోవడం మంచిది.
బ్లీచింగ్ ఎందుకు చేసుకోవాలి? (Why Bleach)
వ్యాక్సింగ్ వల్ల చర్మం ముడతలు పడి తొందరగా వృద్ధాప్య ఛాయలు కనిపించే అవకాశం ఉంటుంది. లేజర్ హెయిర్ రిమూవల్ చాలా ఖర్చుతో కూడుకున్నది. అంత ఖర్చు పెట్టుకోలేమనుకునేవారికి సులువైన పరిష్కారం ఫేషియల్ బ్లీచ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఇంట్లోనే సులువుగా వేసుకునే వీలుంటుంది. కేవలం ముఖానికే కాదు.. కాళ్లు, చేతులు, వీపు, పొట్ట భాగాల్లో దీన్ని ఉపయోగించవచ్చు. దీనికోసం పార్లర్‌కి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఫేషియల్ బ్లీచ్ ఉపయోగించేముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం మాత్రం తప్పనిసరి.
బ్లీచింగ్ వల్ల ప్రయోజనాలు (Benefits Of Bleaching)
1. వెంట్రుకలను తెల్లగా మారుస్తుంది.. (Hair)
ఫేషియల్ బ్లీచ్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల వెంట్రుకలు లేత బంగారురంగులోకి మారుతుంది. దీన్ని వేసుకోవడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ దీనివల్ల వెంట్రుకలు చర్మం రంగులోకి మారిపోతాయి. అవి చిన్నవి, పెద్దవి, లావుగా, సన్నగా ఎలా ఉన్నా సరే.. రంగు మారిపోతుంది. అయితే కనుబొమ్మల వద్ద, జుట్టు మొదలు దగ్గర బ్లీచ్ వేసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అవి కూడా రంగు మారే అవకాశం ఉంటుంది.
2. ట్యాన్‌ని తొలగిస్తుంది (Removes Tan And Spots)
కేవలం వెంట్రుకలను బ్లీచ్ చేయడం మాత్రమే కాదు.. చర్మపురంగును కూడా మార్చేందుకు ఇది తోడ్పడుతుంది. చర్మానికి బ్లీచ్ చేసుకోవడం వల్ల ఎండ వల్ల ట్యాన్ అయిన చర్మం తిరిగి సాధారణ రంగును సంతరించుకుంటుంది. ఏవైనా నల్లని మచ్చలుంటే అవి కూడా చర్మం రంగులో కలిసిపోయేందుకు అవకాశాలుంటాయి. అంతేకాదు.. చర్మంపై ఉన్న మృతచర్మం పూర్తిగా తొలగిపోవడం వల్ల చర్మం మరింత కాంతిమంతంగా మారుతుంది.
3. పిగ్మంటేషన్, మచ్చలను తగ్గిస్తుంది (Removes Pigmentation)
కేవలం చర్మం రంగును పెంచడమేకాదు.. మచ్చలు, పిగ్మంటేషన్ వంటివి ఏవైనా ఉంటే వాటిని తగ్గించేందుకు కూడా బ్లీచింగ్ ఉపయోగపడుతుంది. చర్మంపై ఉన్న లేయర్‌ని తొలగించడం వల్ల చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృత చర్మం వంటివి తొలగిపోతాయి. మచ్చలు, పిగ్మంటేషన్‌ని మాత్రమే కాదు.. బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వంటివాటినీ తగ్గించేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
4. నొప్పి ఉండదు.. (Less Pain)
ముఖంపై ఉన్న వెంట్రుకలను తొలగించేందుకు ఎన్నో రకాల పద్ధతులున్నాయి. కానీ వాటన్నింటిలోనూ నొప్పి కలిగించనిది ఈ ఫేషియల్ బ్లీచ్ మాత్రమే. వ్యాక్సింగ్ చేస్తున్నప్పుడు మంటపుట్టినట్లుగా ఇది ఎలాంటి నొప్పినీ కలిగించదు. అయితే దీన్నిఅప్లై చేసిన నిమిషం వరకూ కాస్త దురద పుట్టినట్లుగా అవడం సహజం. ఈ అసౌకర్యాన్ని భరిస్తే చాలు.. ఫేషియల్ బ్లీచ్‌తో ముఖాన్ని మెరిపించేయవచ్చు.
మరి, బ్లీచింగ్ ఎలా చేసుకోవాలి.. అవసరమైనంతమేరకే రంగు వచ్చేలా ఎలా జాగ్రత్తపడాలి వంటి చిట్కాలన్నీ తెలుసుకునే ముందు దానివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో కూడా తెలిసి ఉండడం మంచిది.
బ్లీచింగ్ దుష్ప్రభావాలు (Side Effects Of Bleaching)
కెమికల్స్‌తో కూడిన సౌందర్య ఉత్పత్తులు వాడే ముందు అది మన చర్మతత్వానికి సరిపోతుందా? లేదా? అని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. సున్నితమైన చర్మానికి బ్లీచ్ ఉపయోగించడం వల్ల దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది.
1. కెమికల్స్ ప్రభావం (Chemicals Impact)
బ్లీచ్‌లో సోడియం హైపో క్లోరైట్ వంటి గాఢ రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మంపై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువే. సెన్సిటివ్ స్కిన్ అయితే ఈ ప్రభావాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అందుకే బ్లీచింగ్‌కి ముందు మీ చర్మంపై రసాయనాలు ఉపయోగించడం మీకు ఇష్టమా? లేదా? ఆలోచించుకోవాలి. ఒకవేళ లేదంటే ఇతర తరహా హెయిర్ రిమూవింగ్ పద్ధతులను ఉపయోగించవచ్చు.
2. ట్యాన్ అయ్యే అవకాశాలు ఎక్కువ (More Chances Of Tan)
చర్మానికి బ్లీచ్ అప్లై చేసిన తర్వాత ఎండలోకి వెళ్తే సన్‌ట్యాన్‌కి గురయ్యే అవకాశం సాధారణం కంటే రెండురెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్లీచింగ్ చేసిన తర్వాత రెండుమూడు రోజులు ఎండలోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ ఎండలోకి వెళ్లడం తప్పకపోతే సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. ఎండ తగలకుండా దుస్తులు, క్యాప్, గొడుగు వంటివి ఉపయోగించాలి.
3. కాస్త మంట పుడుతుంది. (Irritation)
చర్మానికి బ్లీచ్ అప్లై చేసుకున్నప్పుడు ముందు కాసేపు వరకూ చర్మం కాస్త దురదగా సూదులతో గుచ్చుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇది సహజమే. రెగ్యులర్‌గా బ్లీచ్ చేసుకునేవారికి ఇది అలవాటైపోతుంది కూడా. అయితే మరీ ఎక్కువ మంటగా ఉన్నా.. ఈ దురద మీకు ఇబ్బందిగా అనిపించినా వెంటనే ముఖం కడుక్కోవడం మంచిది.
4. ఎక్కువసేపు ఉంచకూడదు. (Bad Effects After Longer Use)
బ్లీచ్‌ని ఎక్కువ సమయం ఉంచుకుంటే ఇంకా ఎక్కువ తెల్లగా మారొచ్చేమో అనుకొని చాలామంది దాన్ని అలాగే ఉంచేస్తూ ఉంటారు. అయితే ఇది ఏమాత్రం సరికాదు. బ్లీచ్‌లోని కెమికల్స్ వల్ల దీన్ని చర్మంపై ఎక్కువ సమయం ఉంచితే చర్మంపై పొక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్యాక్‌పై పదిహేను నిమిషాలని రాసి ఉంచితే కచ్చితంగా పావుగంట లేదా అంతకంటే ముందే దీన్ని తొలగించుకోవాలి. దీనికి ముందే మీ చర్మం మండినట్లుగా అనిపిస్తుంటే బ్లీచ్ తొలగించడం తప్పేమీ కాదు.
బ్లీచింగ్ సమయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు (Things To Remember During Bleaching)
మీ ముఖానికి బ్లీచ్ అప్లై చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ అంశాలను గుర్తుంచుకొని వాటికి అనుగుణంగా అప్లై చేస్తే ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురుకాకుండా ఉంటాయి.
– బ్లీచింగ్ చేసుకోవడానికి మంచి పేరున్న బ్రాండ్ ఉత్పత్తులే ఉపయోగించండి. మన దేశంలో ఫెమ్, జోలీన్, ఆక్సీబ్లీచ్, ఆక్సీగ్లో వంటి సంస్థల బ్లీచ్‌లు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి.
– వివిధ రకాల చర్మతత్వాలకు నప్పేలా వివిధ ఉత్పత్తులు రూపొందిస్తుంటాయి సంస్థలు. అందులో మీ చర్మతత్వానికి ఏది సరైనదో అది ఎంచుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తపడొచ్చు.
– బ్లీచ్ చేసుకోవడానికి ముందు మీ కాలు లేదా చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసి చూడడం మంచిది. ఈ పరీక్ష తర్వాత రెండు రోజులైనా ఎలాంటి రాషెస్ రాలేదంటే మీరు ఆ ఉత్పత్తిని ఉపయోగించవచ్చని అర్థం. ఇలా చేయడం వల్ల మీ చర్మానికి అది నప్పుతుందా? లేదా? తెలుసుకోవడమే కాదు.. ఆ బ్లీచ్ పనితీరును కూడా గుర్తించే వీలుంటుంది.
– చాలామంది ముఖానికి బ్లీచ్ అప్లై చేస్తున్నప్పుడు ముక్కు, చెవుల లోపల కూడా పెట్టుకుంటూ ఉంటారు. బయట చర్మంతో పోల్చితే వాటిలోపల చర్మం మరింత సున్నితంగా ఉంటుంది. అందుకే వాటికి బ్లీచ్ అప్లై చేయకపోవడం మంచిది.
– ఇప్పటికే దద్దుర్లు వచ్చిన చోట లేదా పులిపిర్లు, పుట్టుమచ్చలపైన బ్లీచ్‌ని రాయకూడదు. ఇలా చేయడం వల్ల మరింత ఎక్కువగా మంటపుట్టే అవకాశం ఉంటుంది. చర్మం పగిలినా, దెబ్బలున్నా, ఎక్కువగా మొటిమలున్నా కూడా బ్లీచ్ ఉపయోగించకూడదు.
– బ్లీచ్ పెట్టుకున్నప్పుడు కాస్త దురదగా అనిపిస్తుంది. అయితే దురదగా ఉందని గోకడం వంటివి చేయకూడదు. మరీ ఎక్కువ మంటగా ఉంటే వెంటనే కడిగేసుకోవాలి.
– బ్లీచ్ ఉపయోగించిన తర్వాత చర్మం చాలా సున్నితంగా మారుతుంది. అందుకే రెండుమూడు రోజుల వరకూ గాఢమైన సబ్బులు, సున్నిపిండి వంటివి ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల చర్మం మరింత దెబ్బతింటుంది.
– బ్లీచ్ చేసుకునే ముందే అది ఏ ప్రదేశాల్లో అంటకూడదో అక్కడ కాస్త ప్లాస్టర్ లేదా బ్యాండ్‌ల సహాయంతో మూసి ఉంచి బ్లీచ్ వేసుకోవడం మంచిది.
– బ్లీచ్ దుస్తులపై పడితే మరకలు అంటే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు.. దుస్తులు కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే దుస్తులపై బ్లీచ్ పడకుండా జాగ్రత్తపడాలి. లేదా పాత బట్టలు ధరించి బ్లీచ్ వేసుకుంటే ఇంకా మంచిది.
– బ్లీచింగ్ తర్వాత మీ చర్మం కాస్త మంటపెడుతున్నట్లుగా అనిపిస్తే ఐస్‌క్యూబ్‌తో రుద్దుకోవడం లేదా ఫ్రిజ్‌లో ఉంచిన నీళ్లు, రోజ్‌వాటర్‌తో కడుక్కోవడం వల్ల ఆ మంటనుంచి ఉపశమనం పొందవచ్చు.
ఇంట్లోనే బ్లీచింగ్ చేసుకోవడం ఎలా? (How To Bleach At Home)
బ్లీచింగ్ చేసుకోవడం చాలా కష్టమని అంతా అంటుండడం చూసి ఇంట్లో దాన్నిచేసుకోలేం అని భావిస్తుంటారు అంతా.. అయితే ఇది అనుకున్నంత కష్టమేమీ కాదు. ప్రతి ప్యాక్ మీద దాన్ని ఎలా కలపాలో ఎలా వేసుకోవాలో రాసి ఉంటుంది. అయితే బ్లీచింగ్‌కి ముందు జుట్టును గట్టిగా వెనక్కి కట్టి ముడివేసుకోవాలి. అలాగే హెడ్‌బ్యాండ్ వేసుకోవడం ముఖం కడుక్కొని శుభ్రంగా ఉంచుకోవడం మంచిది.
– ముందుగా ప్యాకెట్ మీదున్న సూచనల మేరకు పౌడర్‌ని, క్రీమ్‌ని కలుపుకోండి. ఇందుకోసం ప్యాకెట్‌లో ఇచ్చిన స్పాచులా (ఒక రకం స్పూన్)ని ఉపయోగించవచ్చు.
– ఇప్పుడు స్పాచులా లేదా మీ చేతివేళ్ల సాయంతో బ్లీచ్‌ని మీ ముఖానికి అప్లై చేసుకోవాలి. కళ్లు, కంటిచుట్టూ ఉన్న ప్రదేశం, కనుబొమ్మలు, జుట్టుకి అంటకుండా జాగ్రత్తపడాలి.
– ముఖానికి పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ముట్టుకోకుండా ఎనిమిది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచుకోవాలి. మీ చర్మతత్వాన్ని బట్టి ఎంతసేపు ఉంచుకోవాలి అన్నది నిర్ణయించుకోవచ్చు. లేదా ఎనిమిది నిమిషాల తర్వాత కొద్దిగా తుడిచి మీకు నచ్చిన ఫలితం రాకపోతే కాస్త వేచిచూడవచ్చు. అయితే పదిహేను నిమిషాలకు మించి ఉంచుకోవడం మంచిది కాదు.
– ముందుగా కాటన్ బాల్స్‌ని నీటిలో ముంచి దానితో బ్లీచ్‌ని తుడిచేసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ముఖం కడుక్కోవడానికి ఎలాంటి ఫేస్‌వాష్ లేదా సబ్బు ఉపయోగించకూడదు.
– ముఖం తుడుచుకున్నతర్వాత మీది సున్నితమైన చర్మం అయితే ఎలాంటి దురదా రాకుండా ఒక ఐస్ ముక్కతో ముఖాన్ని బాగా తుడుచుకుంటే సరిపోతుంది.
అంతే బ్లీచ్ వేసుకోవడం అయిపోయింది. చాలా సులువు కదా..
బ్లీచ్ వేసుకున్న తర్వాత గుర్తుంచుకోవాల్సిన అంశాలు (Things To Remember After Bleach)
బ్లీచ్ వేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండలోకి వెళ్లకూడదు. ఇలా వెళ్లడం వల్ల సన్‌ట్యాన్, పిగ్మంటేషన్ వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. రెండు మూడు రోజుల తర్వాత కూడా బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ మర్చిపోకూడదు. ఒకసారి బ్లీచ్ చేసుకున్న తర్వాత తిరిగి బ్లీచింగ్‌కి కనీసం నెల నుంచి రెండు నెలల గ్యాప్ తప్పనిసరి. అంతకంటే ముందు చేసుకుంటే మీ చర్మం పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి బ్లీచ్ చేసుకున్న తర్వాత తిరిగి వెంట్రుకలు నల్లబడేందుకు నాలుగు వారాల సమయం పడుతుంది. అవి తిరిగి నల్లబడుతున్నప్పుడు మళ్లీ బ్లీచ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏది ఎంచుకోవాలి? (What Bleach To Choose)
మార్కెట్లో ఎన్నో రకాల బ్లీచ్‌లు లభ్యమవుతున్నాయి. అందులో హెర్బల్, ఫ్రూట్, రెగ్యులర్ బ్లీచ్‌లు ఉంటాయి. అన్నీ ఒకేలా పనిచేసినా అన్నింటికంటే హెర్బల్ బ్లీచ్‌లు చర్మంపై ఎలాంటి చెడు ప్రభావం చూపకుండా తమ పని పూర్తిచేస్తాయి. ఫ్రూట్ బ్లీచ్‌ని వివిధ పండ్ల ఎక్స్‌ట్రాక్ట్స్‌తో చేయడం వల్ల చర్మానికి ఇది మంచి చేస్తుంది.
సహజసిద్ధ పధార్థాలతో బ్లీచింగ్ చేయడమెలా? (Bleaching With Natural Products)
బ్లీచ్‌లో ఉన్న కెమికల్స్ చర్మాన్ని పాడుచేస్తాయని మీరు భావిస్తే.. లేదా మీ చర్మానికి కెమికల్స్ ఉపయోగించడం మీకు ఇష్టం లేకపోతే సహజసిద్ధ పదార్థాలను ఉపయోగించవచ్చు. రోజూ మన వంటగదిలో మనం ఉపయోగించే కొన్ని పదార్థాలకు మన చర్మం, జుట్టు రంగును మార్చే శక్తి ఉంటుందని మీకు తెలుసా? వీటిని సహజమైన బ్లీచింగ్ ఏజెంట్లుగా ఉపయోగించవచ్చు. ఇలాంటివాటిలో నిమ్మకాయ, బంగాళాదుంప, పసుపు, బొప్పాయి, శెనగపిండి, టొమాటో వంటివి ముఖ్యమైనవి. అయితే ఈ పద్ధతులు ముఖం మీద ఉన్న జుట్టు రంగును మార్చేందుకు అంతగా ఉపయోగపడకపోయినా ముఖానికి మంచి మెరుపును తీసుకురావడానికి మాత్రం చక్కగా ఉపయోగపడతాయి. ఈ ఉత్పత్తులను మేం రోజూ చూస్తూనే ఉంటాం. వీటితో చర్మాన్ని ఎలా బ్లీచ్ చేసుకోవాలి అని మీరు ఆలోచిస్తుంటే వాటితో తయారుచేసుకునే సహజసిద్ధమైన బ్లీచ్ గురించి తెలుసుకుందాం రండి.
నిమ్మకాయ (Lemon)
నిమ్మకాయలో ఆమ్లగుణం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మాన్ని కాంతిమంతం చేసేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు.. ట్యాన్‌ని తొలగించడం, మచ్చలు తగ్గించడంతో పాటు కొత్త చర్మకణాల ఉత్పత్తికి ఇది తోడ్పడుతుంది. ఇది కేవలం ముఖానికే కాదు.. జుట్టుకు కూడా బాగా పనిచేస్తుంది. దీన్ని వారానికి రెండుమూడు సార్లు ఉపయోగించవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా నిమ్మరసాన్ని ఒక బౌల్‌లోకి పిండి దాన్ని ముఖానికి రాసుకోవడమే. కాటన్ బాల్‌తో దీన్ని ముఖానికి పట్టించి గంటపాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత ముఖం కడుక్కొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది.
పసుపు (Turmeric)
పసుపు మంచి యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇది మన చర్మంపై ఉన్న పిగ్మంటేషన్, మచ్చలు వంటివే కాదు.. బ్లాక్‌హెడ్స్, మొటిమలను కూడా తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది. దీన్ని రోజూ చర్మానికి అప్లై చేసుకొని కాసేపు ఉంచుకోవాలి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మరింత ఆరోగ్యంగా మారుస్తాయి. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా అరటీస్పూన్ పసుపుని చెంచా పాలు లేదా నిమ్మరసంతో కలిపి 20-25 నిమిషాలు ఉంచుకొని గోరువెచ్చని నీటితో కడిగేసుకోవడమే. అయితే ముఖం కడుక్కున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
శెనగపిండి (Gram Flour)
శెనగపిండి వంటలోనే కాదు.. ముఖానికి వన్నెతీసుకురావడంలో కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది. శెనగపిండి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం కాంతిమంతమవడమే కాదు.. అవాంఛిత రోమాలు కూడా రాకుండా ఉంచుతుంది. ట్యాన్‌ని తొలగించడంతో పాటు బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వంటివి కూడా తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. ఇందుకోసం టేబుల్ స్పూన్ శెనగపిండి, టేబుల్ స్పూన్ రోజ్‌వాటర్, చిటికెడు పసుపు తీసుకొని కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని 20-25 నిమిషాలు ఉంచుకోవాలి. ప్యాక్ 80శాతం ఆరిన తర్వాత గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న వెంట్రుకలు రాలిపోతాయి. ఆ తర్వాత చన్నీళ్లతో ముఖం కడుక్కుంటే సరి.
బంగాళాదుంప (Potato)
బంగాళాదుంపల్లో సింపుల్ కార్బొహైడ్రేట్లు ఉంటాయి. దీన్ని రోజూ ఆహారంలో తీసుకోవడం మంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతుండడం మనకు తెలిసిందే. అయితే వీటిని చర్మసంరక్షణలో మాత్రం రోజూ ఉపయోగించవచ్చు. ఇవి మచ్చలు, నల్లని వలయాలు, మొటిమలు తగ్గించడంతో పాటు చర్మం రంగును కూడా మెరుగుపరుస్తుంది. దీనికోసం టేబుల్ స్పూన్ బంగాళాదుంప రసంలో అరటీస్పూన్ నిమ్మరసం వేసి కాటన్ బాల్ సాయంతో ముఖానికి బాగా పట్టించాలి. లేదా ఇందులో ముంచిన వస్త్రాన్ని ముఖంపై కప్పుకోవాలి. ఇలా గంటసేపు ఉంచుకున్న తర్వాత ముఖం కడుక్కొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
తేనె (Honey)
తేనె చర్మం రంగు మెరుగుపడేలా చేయడంతో పాటు చర్మంలోని తేమను కూడా పెంచుతుంది. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని కాంతిమంతం చేయడంతో పాటు మొటిమలు, మచ్చలు, పిగ్మంటేషన్‌ని తగ్గిస్తుంది. ఇందుకోసం తేనె, పాలపొడి, నిమ్మరసం సమపాళ్లలో తీసుకొని ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. దీన్ని ఇరవై నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత ముఖం కడుక్కోవాలి. వెంటనే మీ ముఖంలో వచ్చిన మార్పును మీరు గమనించవచ్చు.
మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే ఫేషియల్ బ్లీచ్‌లు (Most Common Facial Bleaches)
ఫేస్ బ్లీచ్ క్రీంలు అనగానే ఎన్నో రకాల ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఫ్రూట్ బేస్‌డ్ ఉంటే మరికొన్ని సెలూన్ బేస్‌డ్ బ్లీచ్‌లు ఉంటాయి.వీటన్నింటి పేర్లు వేరే కానీ ఆఖరికి వచ్చే ఫలితం మాత్రం ఒకే రకంగా ఉంటుంది. అందుకే మీ చర్మానికి తగిన బ్లీచ్‌ని ఎంచుకొని దాన్నే ఉపయోగించడం మంచిది. మన దేశంలో ఎక్కువగా దొరికే ఫేషియల్ బ్లీచ్‌లేంటంటే..
– జోలెన్ క్రీమ్ బ్లీచ్ (రూ.270)
– ఆక్సీలైఫ్ న్యాచురల్ రేడియన్స్ 5 క్రెమ్ బ్లీచ్ (రూ. 158)
– వీఎల్‌సీసీ ఇన్ స్టా గ్లో డైమండ్ బ్లీచ్ (రూ.60)
– ఓ3 ప్లస్ మెలాడర్మ్ విటమిన్ సి జెల్ బ్లీచ్ ఫర్ స్కిన్ లైటెనింగ్ అండ్ హెయిర్ లైటెనింగ్ (రూ.550)
– ఫెమ్ ఫెయిర్‌నెస్ న్యాచురల్స్ గోల్డ్ స్కిన్ బ్లీచ్ (రూ.64)
– వీఎల్‌సీసీ ఫెయిర్ స్కిన్ ఇన్ స్టా ఆక్సిజన్ బ్లీచ్ (రూ.158)
– డాబర్ ఫెమ్ టర్మరిక్ బాడీ బ్లీచ్ (రూ. 375)
– ఆక్సీగ్లో గోల్డెన్ గ్లో పపాయా బ్లీచ్ (రూ. 143)
– రిచ్‌ఫీల్డ్ లగ్జరీ గోల్డ్ బ్లీచ్ కిట్ (రూ. 145)
బ్లీచింగ్‌కి సంబంధించి తరచూ ఎదురయ్యే సందేహాలు (Frequently Asked Questions)
– బ్లీచ్ మన శరీరానికి హాని కలిగిస్తుందా? (Does Bleach Harm Our Body)
బ్లీచ్‌లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని దీర్ఘకాలికంగా ఉపయోగించడం సరికాదు. బ్లీచ్‌ని తరచూ వాడడం వల్ల చర్మం పాడయ్యే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు.. బ్లీచ్ వేసుకున్న తర్వాత ఎండలో వెళ్లినా చర్మం పాడయ్యే అవకాశాలుంటాయి. అందుకే సన్‌స్క్రీన్ తప్పనిసరి. కొన్ని జాగ్రత్తలు పాటించగలిగితేనే బ్లీచ్ వేసుకోవడం ఉత్తమం.
– ఎన్ని రోజులకోసారి బ్లీచ్ చేసుకోవచ్చు? (How Many Days You Should Bleach)
ప్రతి నాలుగు నుంచి ఎనిమిది వారాలకు ఒకసారి బ్లీచ్ చేసుకోవచ్చు. అయితే నాలుగు వారాల కంటే తక్కువ సమయంలో బ్లీచ్ చేసుకుంటే చర్మం పాడయ్యే అవకాశాలుంటాయి. అంతే కాదు బ్లీచ్ వేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం కూడా మర్చిపోకూడదు.
– సెన్సిటివ్ చర్మం ఉంటే బ్లీచ్ వేసుకోవచ్చా? ఇలాంటివారు ఏం చేయాలి? (Bleach For Sensitive Skin)
సెన్సిటివ్ చర్మం ఉన్నవారు మీ చర్మం మీద ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాచ్ టెస్ట్ చేసుకున్న 48 గంటల లోపు ఎలాంటి దురద, దద్దుర్లు, మంట, ఎరుపుదనం వంటివి కనిపించకపోతే ఆ బ్లీచ్‌ని ఉపయోగించవచ్చు. అలాగే బ్లీచ్ వేసి కడిగేసుకున్న తర్వాత ఐస్ ముక్కతో ముఖాన్ని రుద్దుకోవడం మర్చిపోవద్దు. ఇది దురద, ఎరుపుదనం వంటివన్నీ తగ్గిస్తుంది. ఇది చర్మ రంధ్రాలను కూడా మూసేస్తుంది. మేకప్ వేసుకోవడానికి ముందు కూడా ఐస్ ముక్కతో రుద్దుకోవడం వల్ల ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.
– సహజ ఉత్పత్తులకు మార్కెట్లో దొరికే బ్లీచ్‌లకు తేడా ఏంటి? (Diffrence Between Natural And Product Bleach)
ఇంట్లో మనం తయారుచేసుకొని ఉపయోగించే సహజ ఉత్పత్తులు మన చర్మాన్ని మాత్రమే కాంతిమంతం చేస్తాయి. మార్కెట్లో దొరికే బ్లీచ్‌లు మన ముఖంపై ఉన్న వెంట్రుకల రంగు మారుస్తాయి.
– సహజ ఉత్పత్తులు, మార్కెట్లో లభించే బ్లీచ్.. ఈ రెండిట్లో నేను దేన్ని ఉపయోగించాలి. (Which Bleach To Use)
ఇది మీ చర్మాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. మీ ముఖంపై ఎక్కువగా అవాంఛిత రోమాలుంటే మార్కెట్లో లభించే బ్లీచ్ మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. నల్లని చర్మాన్ని కాస్త కాంతిమంతంగా మార్చుకోవాలనుకుంటే సహజ ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది. ఈ సహజ ఉత్పత్తుల వల్ల చర్మం మరింత మెరుస్తూ కనిపించడం ఖాయం.
ఇవి కూడా చదవండి
ఈతరం అమ్మాయిలకు ఉపకరించే.. బామ్మగారి సౌందర్య చిట్కాలు..
ఎప్పటికీ మీ వయసు ఇరవైలానే కనిపించాలా?? అయితే ఇలా చేయకండి..!
పసుపు వాడేద్దాం.. ఈ ప్రయోజనాలు పొందేద్దాం..!
Images: Shutterstock