దీపికా పదుకొణె (Deepika Padukone).. తనదైన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే ముద్దుగుమ్మ. ఈ అమ్మడి నటప్రతిభకు ఇప్పటికే ఎన్నో అవార్డులు సైతం ఆమెను వరించాయి. తాజాగా సినీ పరిశ్రమకు ఆమె చేస్తున్న సేవలను మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే ఆమెను ఐకానిక్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌తో ఘనంగా సత్కరించింది.
లోక్ మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ (Lokmat Maharashtrian Of The Year Awards) వేడుకలు ఇటీవలే ముంబయిలో కన్నలపండువగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఐకానిక్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌తో సత్కరించగా; ప‌్రముఖ బాలీవుడ్ హీరో వికీ కౌశల్‌ను పాత్ బ్రేకింగ్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌తో సత్కరించారు. ఈ అవార్డుల వేడుకలో బాలీవుడ్‌కు చెందిన రోహిత్ శెట్టి, రితేష్ దేశ్‌ముఖ్, జరైన్ ఖాన్.. తదితరులతో పాటు రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సైతం పాల్గొన్నారు.
అతిరధమహారథుల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేతుల మీదుగా దీపికా పదుకొణె ఈ అవార్డుని అందుకుంది. ఈ సందర్భంగా అవార్డుల వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న వ్యక్తి దీపికను సరదాగా ఓ ప్రశ్న అడిగారు. రానున్న రెండు నెలల్లో మన దేశంలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే- “మీరు రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యే పరిస్థితి వస్తే, మీరు ఏ మంత్రిత్వ శాఖని తీసుకుంటారు” అని! మరి, దీనికి మన దీపిక ఏం సమాధానం చెప్పిందో తెలుసా??
“నాకు శుభ్రత అంటే చాలా ఇష్టం. అందుకే ఇంట్లో ఏ కాస్త సమయం దొరికినా ఏదో ఒకటి శుభ్రం చేస్తూనే ఉంటాను. అందుకే నేను స్వచ్ఛభారత్ (Swacch Bharat)కు మంత్రిని కావాలనుకుంటున్నా.. అంటూ సరదాగా సమాధానం చెప్పింది. అంతేకాదు.. ఈ సందర్భంగా తన చిన్ననాటి తీపిగుర్తులను సైతం అందరితోనూ పంచుకుంది. నేను శుభ్రం చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తానని చిన్నప్పుడు నా స్నేహితులంతా తమ బుక్ షెల్ఫ్స్ క్లీన్ చేయడానికి నన్ను పరోక్షంగా పిలిచేవారు తెలుసా.. అంటూ అందరిలోనూ నవ్వుల పువ్వులు పూయించిందీ బ్యూటీ.
ఆ తర్వాత అవార్డు గురించి మాట్లాడుతూ- “ఈ పురస్కారం లభించడం నాకెంతో ఆనందంగా ఉంది. నాకు ఈ నగరం ఎంతో నచ్చింది. ముఖ్యంగా నా కలను సాకారం చేసుకునే అవకాశాన్ని నాకు అందించింది. 18 ఏళ్ల వయసులో ముంబయి వచ్చిన నాకు ఈ నగరం అండగా నిలబడింది. ఇందుకు నేను ఎంతగానో రుణపడి ఉంటాను..” అంటూ భావోద్వేగంతో తన మనసులోని మాటలను బయటపెట్టింది దీపిక.
ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే గతేడాది పద్మావత్ (Padmaavat) సినిమాతో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దీపిక ..ఆ తర్వాత తన పెళ్లి వార్తలతో చాలా రోజుల పాటు ట్రెండింగ్ ఐకాన్స్‌లో ఒకరిగా నిలిచింది. రణ్ వీర్‌ను పెళ్లాడిన తర్వాత ఆమె యాసిడ్ బాధితురాలు లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో ఆమె పాత్రను పోషించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. అయితే ఈ సినిమాకు ఆమె కేవలం నటి మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి ‘చపక్’ (Chhaapaak) అనే పేరు పెట్టారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఆమె దర్శకత్వంలో గతేడాది విడుదలైన “రాజీ” బాక్సాఫీస్‌ను ఎంతగా షేక చేసిందో మనకు తెలిసిన విషయమే.
దీపికకు గతేడాదిలానే ఈ ఏడాది కూడా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా జీవితం సాఫీగా ముందుకు సాగిపోవాలని, ఆమె శ్రమకు తగిన గుర్తింపు లభించాలని మనమంతా కూడా ఆశిస్తూ ఈ అవార్డు అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసేద్దామా..
కంగ్రాచ్యులేషన్స్ దీపిక..!
ఇవి కూడా చదవండి
నాట్యం నేర్చుకున్న 43 ఏళ్లకు.. అరంగేట్రం చేసిన సినీనటి సుహాసిని..!
మన సినిమాలూ… కామిక్ బుక్స్‌గా వచ్చేస్తున్నాయి..!
స్త్రీల ఆత్మగౌరవానికి.. అభ్యున్నతికి పెద్దపీట వేసిన “కళా తపస్వి” చిత్రాలు..!