క్వీన్ ఆఫ్ హిందీ టెలివిజన్‌గా గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ (Ekta Kapoor) పండంటి మగబిడ్డకు తల్లయ్యారు. సింగిల్ పేరెంట్ అయిన ఆమె బిడ్డను పొందేందుకు సరోగసీ (Surrogacy) పద్ధతిని ఆశ్రయించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ జితేంద్ర కపూర్ (Jeethendra), శోభా కపూర్‌ల గారాల పట్టి అయిన ఏక్తా.. బాలాజీ టెలీ ఫిల్మ్స్ అధినేత్రిగానే కాదు.. బాలీవుడ్‌లో ప్రముఖ దర్శక, నిర్మాతగా సైతం చక్కని గుర్తింపును సంపాదించుకున్నారు.
గత ఏడేళ్లుగా ఓ బిడ్డకు తల్లి కావాలని ప్రయత్నిస్తోన్న ఆమె జనవరి 27న సరోగసీ విధానం ద్వారా ఒక మగబిడ్డకు తల్లయ్యారు. అంతేకాదు.. తన జీవితంలో లెక్కలేనంత సంతోషాన్ని, వెలుగుని నింపిన ఈ చిన్నారికి రవి కపూర్ అని పేరు కూడా పెట్టారు. అది ఆమె తండ్రి జితేంద్ర అసలు పేరే కావడం విశేషం.
ఏక్తా కపూర్ సోదరుడు తుషార్ కపూర్ (Tusshar Kapoor) సైతం 2016, జూన్‌లో సరోగసీ విధానం ద్వారానే ఓ బిడ్డకు తండ్రయ్యాడు. లక్ష్య్ కపూర్ అని పేరు పెట్టిన ఈ చిన్నారికి సంబంధించిన ఫొటోలను కూడా ఏక్తా.. ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటూ ఉండేది. తాజాగా తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని కూడా సోషల్ మీడియాలో అందరితోనూ పంచుకుంది.
“ఆ దేవుడి దయ వల్ల నా జీవితంలో నేను ఎన్నో విజయాలను చవిచూశా. కానీ ఇప్పుడు కలిగిన ఆనందం, అనుభూతి నాకు ఎప్పుడూ కలగలేదు. దీనికి కారణం నా జీవితంలోకి అడుగుపెట్టిన ముద్దుల బుజ్జాయి. నా బిడ్డ పుట్టుకతో నాకు కలిగిన ఆనందాన్ని చెప్పడానికి మాటలు సరిపోవు. మన జీవితంలో అన్నీ మనం కోరుకున్నట్లుగానే జరగకపోవచ్చు. ఎన్నో సమస్యలు ఎదురుకావచ్చు. కానీ ప్రతి సమస్యకీ పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అలా ఈ రోజు నా సమస్యకు పరిష్కారం లభించింది. పండంటి బిడ్డకు తల్లిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు, నా కుటుంబ సభ్యులకు ఇవి ఎంతో మధురమైన క్షణాలు. నాకు ఇంతటి సంతోషాన్ని అందించిన నా బిడ్డతో కలిసి తల్లిగా నా ప్రయాణాన్ని ప్రారంభించేందుకు నేను ఇక అస్సలు ఆలస్యం చేయదలచుకోలేదు” అంటూ తన ఆనందం అంతటికీ అక్షర రూపమిచ్చారు ఏక్తా.
గత ఏడేళ్లుగా ఆమె ఐయూఐ (IUI), ఐవీఎఫ్ (IVF) వంటి పద్ధతుల ద్వారా గర్భం ధరించడానికి ప్రయత్నించినప్పటికీ అవేవీ సఫలం కాకపోవడంతో.. ఏక్తా కపూర్ సరోగసీ విధానాన్ని ఆశ్రయించారని ఆమెకు చికిత్స చేసిన వైద్యురాలు, ప్రముఖ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ నందిని చెప్పుకొచ్చారు. ఏమైతేనేం.. 2016లో తుషార్ కపూర్, ఇప్పుడు ఏక్తా కపూర్.. సరోగసీతో సింగిల్ పేరెంట్ గానే తమ పిల్లలకు స్వాగతం పలికారు. ఇప్పుడు ఇదేమీ కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. బాలీవుడ్‌లో ఇప్పటికే పలువురు ప్రముఖులు, జంటలు ఈ పద్ధతి ద్వారా సంతానాన్ని పొందారు.
2017లో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు- నిర్మాత అయిన కరణ్ జోహార్ (Karan Johar) కూడా సరోగసీ ద్వారా కవలపిల్లలకు తండ్రయ్యారు. అలాగే అమీర్ ఖాన్ – కిరణ్ రావ్ (Aamir Khan-Kiran Rao) దంపతులు కూడా ఈ పద్ధతి ద్వారానే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. డిసెంబర్ 5, 2011 న జన్మించిన ఆ బిడ్డకు స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద ఆజాద్ రావ్ కిరణ్ అని నామకరణం చేశారు.
అలాగే బాలీవుడ్ కింగ్ ఖాన్‌గా పిలుచుకునే షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్ (Sharukh Khan-Gauri Khan) దంపతులు సైతం తమ మూడో సంతానాన్ని సరోగసీ ద్వారానే పొందారు. ఆ చిన్నారే అబ్రామ్. ఇక బాలీవుడ్‌లో బాగా పాపులారిటీ సంపాదించిన హాట్ బ్యూటీ సన్నీ లియోనీ, డేనియల్ వెబర్ (Sunny Leone- Daniel Webber) సైతం ఈ పద్ధతిలో తల్లిదండ్రులైనవారే! వీరే కాదు.. సొహైల్ ఖాన్ – సీమా సచ్ దేవ్ సైతం ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నవారే!
కేవలం బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా సరోగసీ ద్వారా తల్లిదండ్రులైన వారి జాబితాలో ఓ ప్రముఖ జంట స్థానం సంపాదించుకుంది. మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న – ఆమె భర్త ఆండీ శ్రీనివాసన్ (Manchu Lakshmi Prasanna-Andy) దంపతులు కూడా ఈ విధానం ద్వారా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. 2014లో పుట్టిన ఆ పాపాయికి నిర్వాణ అని నామకరణం చేశారు.
ఈ జాబితాలో తాజాగా చేరిన ఏక్తా కపూర్‌కి మనం కూడా శుభాకాంక్షలు చెప్పేద్దామా..
కంగ్రాట్స్ ఏక్తాకపూర్..
ఇవి కూడా చదవండి
టాలీవుడ్ మేటి కథానాయికల.. తొలి చిత్రాల ముచ్చట్లు మీకోసం..!
క్రీడాకారులుగా దూసుకుపోవడానికి.. మన యువ హీరోలు రెడీ..!
క్యాన్సర్ మహమ్మారిని గెలిచారు.. విజేతలై అందరికీ ఆదర్శంగా నిలిచారు..!