"తాజ్ మ‌హోత్స‌వ్" ఎందుకు అంత ప్రత్యేకమంటే..?

"తాజ్ మ‌హోత్స‌వ్" ఎందుకు అంత ప్రత్యేకమంటే..?

ప్రేమ‌కు చిహ్నం అన‌గానే మ‌నంద‌రికీ గుర్తుకొచ్చే అపురూప‌మైన క‌ట్ట‌డం తాజ్ మ‌హ‌ల్ (Taj Mahal). పూర్తిగా పాల‌రాతితో నిర్మించిన ఈ భ‌వంతిని వీక్షించేందుకు కేవ‌లం మ‌న దేశం నుంచే కాదు.. విదేశాల నుంచి కూడా ఎంతోమంది సంద‌ర్శ‌కులు త‌ర‌లి వ‌స్తుంటారు. ముఖ్యంగా ఫిబ్ర‌వ‌రిలో తాజ్ మ‌హ‌ల్‌ను వీక్షించేవారి సంఖ్య కాస్త ఎక్కువ‌గా ఉంటుంది. ఎందుకో తెలుసా?? ప‌్రేమికుల దినోత్స‌వం త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 18 నుంచి 27 వ‌ర‌కు ఇక్క‌డ నిర్వ‌హించే ఉత్స‌వ‌మే దీనికి కార‌ణం.


ఈ ఉత్స‌వాన్ని తాజ్ మ‌హోత్స‌వ్ (Taj mahotsav) అంటారు. ఏటా ప‌ది రోజుల పాటు ఘ‌నంగా నిర్వ‌హించే ఈ వేడుక‌ల్లో 18, 19వ శ‌తాబ్దానికి చెందిన మొఘ‌లుల కాలం నాటి హ‌స్త‌క‌ళ‌లు, వంట‌కాలు, వారి సంప్ర‌దాయాలు, ఆచార వ్య‌వ‌హారాల‌ను ప్ర‌తిబింబించేలా ప‌లు స్టాళ్ల‌ను ఏర్పాటు చేస్తారు నిర్వాహ‌కులు.


ఈ ఉత్స‌వాన్ని నిర్వ‌హించండం 1992లో ప్రారంభించారు. అప్ప‌ట్నుంచీ ఏటా ఫిబ్ర‌వ‌రి 18 నుంచి 27 వ‌ర‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ తాజ్ మ‌హోత్స‌వ్ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో ఏర్పాటు చేసే క్రాఫ్ట్స్ స్టాల్స్ ద్వారా దాదాపు 400 మంది హస్త క‌ళాకారుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతోంది. అంతేకాదు.. మ‌న దేశంలో ఆయా రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌సిద్ధ‌మైన క‌ళాకృతుల‌న్నీ ఈ వేదిక ద్వారా అంద‌రికీ అందుబాటులోకి కూడా వ‌స్తాయి. అదీకాకుండా విదేశీ టూరిస్టుల‌ను ఆక‌ర్షించ‌డంలో ఈ తాజ్ మహోత్స‌వ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు టూరిజం శాఖ కూడా ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డంలో సంయుక్తంగా ప‌ని చేస్తాయి.


ఇక ఈ వేడుక‌ల్లో భాగంగా మ‌న దేశానికి చెందిన సుప్ర‌సిద్ధ శాస్త్రీయ సంగీత‌, నృత్య కార్య‌క్ర‌మాల‌తో పాటు జాన‌ప‌ద సంగీతం, నృత్య కార్య‌క్ర‌మాలు కూడా చూప‌రుల‌ను బాగా ఆక‌ట్టుకుంటాయి. ఈ క్ర‌మంలో ప‌లు రాష్ట్రాల‌కు చెందిన భిన్న ఆచార వ్య‌వ‌హారాల‌ను కూడా అంద‌రికీ తెలియ‌జేసే ప్ర‌య‌త్నం చేస్తారు కళాకారులు. 


ఏంటీ?? ఈ వేడుక‌ల్లో కేవలం క‌ళ్లు, చెవుల‌కు మాత్ర‌మే విందు త‌ప్ప ఇంకేమీ లేదా అని ఆలోచిస్తున్నారా?? అక్క‌డికే వ‌స్తున్నామండీ.. ప‌లు రాష్ట్రాల‌కు చెందిన నోరూరించే వంట‌కాలు కూడా ఈ వేడుక‌ల్లో భాగ‌మే. మ‌న దేశీయ రుచుల‌ను విదేశీయుల‌కు రుచి చూపించేందుకు ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ఫుడ్ స్టాల్స్ కూడా పెడ‌తారు. ఇలా మొఘ‌లుల కాలం నాటి గొప్ప‌ద‌నం గురించి తెలుసుకుంటూ మ‌న దేశ క‌ళాకృతులు, హ‌స్త‌క‌ళ‌ల‌ను చూస్తూ, క‌ల్చ‌ర‌ల్ ప్రొగ్రామ్స్‌తో సంద‌డి చేస్తూ తాజ్ మ‌హ‌ల్ చూడాలంటే ఇదే అనువైన స‌మ‌యం.


అయితే ఈ ఉత్స‌వాల్లో పాల్గొనేందుకు ప్ర‌వేశ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 5 ఏళ్ల వ‌య‌సులోపు పిల్ల‌ల‌కు ప్ర‌వేశం ఉచితం. 5 నుంచి 10 ఏళ్ల వ‌య‌సున్న పిల్ల‌ల‌కు మాత్రం రూ.10/- టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పెద్ద‌లు కూడా రూ.50/- ప్ర‌వేశ రుసుము చెల్లించాలి. అయితే విదేశాల నుంచి వ‌చ్చే టూరిస్టులు మాత్రం ఈ వేడుక‌ల్లో ఉచితంగా పాల్గొన‌వ‌చ్చు. ఒక‌వేళ ఏదైనా స్కూల్ విద్యార్థులు ఇందులో గ్రూప్‌గా పాల్గొనాల‌ని అనుకుంటే.. 100 మంది పిల్ల‌ల‌కు కేవ‌లం రూ.500/- మాత్ర‌మే రుసుము చెల్లిస్తే చాలు. వీరితో పాటు ఇద్ద‌రు టీచ‌ర్ల‌కు ఉచిత ప్ర‌వేశం ఉంటుంది.


తాజ్ మ‌హోత్స‌వ్ సంద‌ర్భంగా మన‌మంతా ప్రేమ‌కు చిహ్నంగా భావించే తాజ్ మ‌హ‌ల్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విశేషాలు మీకోసం..


* షాజహాన్ తన మూడో భార్య అయిన ముంతాజ్ కోసం ఈ అంద‌మైన క‌ట్ట‌డాన్ని నిర్మించాడ‌ని మ‌నంద‌రికీ తెలుసు. కానీ ఆమె అసలు పేరు తెలిసిన వారు చాలా త‌క్కువ మందే అని చెప్పాలి. ముంతాజ్ అస‌లు పేరు అర్జుమంద్ భాను బేగ‌మ్.


* తాజ్ మహల్‌ని పోలిన విధంగా మరొక కట్టడాన్ని నలుపు రంగు మార్బుల్స్‌తో క‌ట్టించాల‌ని ప్ర‌ణాళిక రూపొందించాడు షాజ‌హాన్. కానీ త‌న కొడుకుల‌తో త‌లెత్తిన వివాదాల కార‌ణంగా ఆ క‌ట్ట‌డాన్ని పూర్తి చేయ‌లేక‌పోయాడు.


* షాజహాన్ మిగతా భార్యలు & ఆయ‌నకు నమ్మకస్తులైన వారి సమాధులు కూడా తాజ్ మహల్ ప్రాంగణంలోనే ఉన్నాయి.


* తాజ్ మ‌హ‌ల్‌ను నిర్మించ‌డానికి దాదాపు 22 వేల‌మంది కూలీలు 22 సంవ‌త్స‌రాల పాటు ప‌ని చేశారు. ఆ త‌ర్వాత కూడా కొంత కాలం పాటు భ‌వంతికి సంబంధించిన చిన్న చిన్న ప‌నులు జ‌రుగుతూనే ఉన్నాయ‌ట‌!


* తాజ్ మ‌హ‌ల్ క‌ట్ట‌డానికి అవ‌స‌ర‌మైన మెటీరియ‌ల్‌ను ఆ ప్ర‌దేశానికి చేర్చ‌డానికి దాదాపు 1000 ఏనుగుల‌ను ఉప‌యోగించార‌ట‌!


* శుక్ర‌వారం జ‌రిగే ప్రార్థ‌న‌ల కార‌ణంగా ప్ర‌తి శుక్ర‌వారం తాజ్ మ‌హ‌ల్‌ను సంద‌ర్శించ‌డానికి ఎవ‌రినీ అనుమ‌తించ‌ర‌ట‌! సో.. మీరు భ‌విష్య‌త్తులో ఆగ్రా వెళ్లిన‌ప్పుడు తాజ్ మ‌హ‌ల్ సంద‌ర్శ‌న శుక్ర‌వారం కాకుండా మ‌రో రోజు ఉండేలా ప్లాన్ చేసుకోండి.


* తెలుపు రంగులో ఉన్న ఈ పాల‌రాతి క‌ట్ట‌డం కాలుష్యం కార‌ణంగా క్ర‌మంగా ప‌సుపు రంగులోకి మారుతుండ‌డంతో ఆయా ప‌రిస‌ర ప్రాంతాల్లో కేవ‌లం ఎల‌క్ట్రానిక్ ఆధారిత వాహ‌నాలు తిరిగేందుకు మాత్ర‌మే అనుమితిచ్చారు. అవి కాకుండా మిగ‌తా వాహ‌నాలేవీ అక్క‌డ‌క‌కు ప్ర‌వేశించ‌కూడ‌దు. అంతేకాదు.. వీక్ష‌కులు సైతం పార్కింగ్ ప్ర‌దేశం నుంచి లోప‌లికి న‌డుచుకుంటూనే వెళ్లాల్సి ఉంటుంది.


* కేవ‌లం నేల మీదే కాదు.. క‌నీసం తాజ్ మ‌హ‌ల్ మీదుగా ఒక విమానం కూడా వెళ్ల‌దు. ఎందుకంటే తాజ్‌ని సంర‌క్షించే నిమిత్తం దానిని నో ఫ్ల‌యింగ్ జోన్‌లో ఉంచారు.


* వాస్త‌వానికి తాజ్ మ‌హ‌ల్‌ను మొద‌ట మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బుర్హ‌న్ పూర్‌లో క‌ట్టాల‌ని భావించారు. ముంతాజ్ మ‌ర‌ణించింది కూడా ఇక్క‌డే. కానీ స‌రిప‌డినంత పాల‌రాతి మార్బుల్స్ ఇక్క‌డ లేక‌పోవ‌డంతో ఈ క‌ట్ట‌డాన్ని ఆగ్రాలోనే నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.


* తాజ్ మహల్ నిర్మించే సమయంలో ప్ర‌ధాన ఆర్కిటెక్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన వ్య‌క్తి ఉస్తాద్ అహ్మద్ లహౌరి. ఈయ‌న ఇరాన్ దేశ‌స్థుడు. దిల్లీలోని ఎర్రకోట నిర్మాణానికి కూడా ఆయ‌నే నిర్మాణకర్తగా వ్యవహరించారు.


* 2000 సంవత్సరంలో ప్రముఖ మెజీషియన్ అయిన పీసీ సర్కార్ జూనియర్ తన అసాధారణ మాయాజాల ప్ర‌తిభ‌తో కొద్ది నిమిషాల పాటు ప్రజలకు తాజ్ మహల్‌ని కనిపించకుండా చేశాడు.


మీరు కూడా తాజ్ మ‌హ‌ల్ గురించి ఏమైనా ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు మాతో పంచుకోవాల‌ని అనుకుంటున్నారా?? అయితే ఈ క్రింద కామెంట్ బాక్స్‌లో రాయండి. వాటిలో వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వి, వివాదాలు లేకుండా ఉన్న అంశాల‌ను ఇందులో చేరుస్తాం.


Featured Image: Pixabay


ఇవి కూడా చ‌ద‌వండి


హైదరాబాద్‌లో "సామాన్యుడి ఐస్ క్రీమ్" అంటే.. గుర్తొచ్చే పార్లర్ ఇదే..!


తెలంగాణ స్పెషల్ వంటకం - సర్వ పిండి ముచ్చట్లు మీకోసం..!


గండికోట - ది ఇండియన్ గ్రాండ్ కాన్యన్ .. ఈ ప్ర‌దేశాన్ని అంద‌రూ చూసి తీరాల్సిందే..!