కమర్షియల్ హంగులతో నిండిన.. ఎన్టీఆర్: మ‌హానాయ‌కుడు (సినిమా రివ్యూ)

కమర్షియల్ హంగులతో నిండిన.. ఎన్టీఆర్: మ‌హానాయ‌కుడు (సినిమా రివ్యూ)

ఒక క‌థ లేదా సంఘ‌ట‌న గురించి చెప్ప‌మంటే చూసిన‌వారు ఒక‌లా చెప్తారు. ఆ ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న స‌భ్యులు ఒక‌లా చెప్తారు. అలాగే ఆ ఘటన గురించి విన్న‌వారు మ‌రోలా చెప్తారు. ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి కూడా ఈ విధంగానే ఆలోచించి ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను ఆయ‌న స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం యాంగిల్‌లోనే పూర్తిగా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే ఆ మ‌హాన‌టుడి జ‌న‌నం ద‌గ్గర్నుంచి సినిమాల్లో క‌థానాయ‌కునిగా ఎద‌గ‌డం వ‌ర‌కు ఎన్టీఆర్: క‌థానాయ‌కుడు (NTR Kathanayakudu) అనే టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన క్రిష్.. ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితాన్ని ఎన్టీఆర్: మ‌హానాయ‌కుడు (NTR Mahanayakudu) పేరుతో మ‌రో భాగంగా విడుద‌ల చేస్తామ‌ని ముందే చెప్ప‌డం మ‌నంద‌రికీ తెలిసిందే.


తెలుగింటి ఆడ‌ప‌డుచుల అన్న‌గా, అభిమాన క‌థానాయ‌కుని స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడిగా, ప్రియ‌త‌మ నాయ‌కుడిగా ఎన్టీఆర్ ఎదిగిన తీరుని రెండో భాగంలో క‌థ‌గా మ‌లుచుకున్నారు క్రిష్‌. అయితే ఇది కూడా పూర్తిగా బ‌స‌వ‌తార‌కం కోణంలోనే ఉండ‌డం విశేషం. ఈ సినిమా విడుద‌ల‌కు కొద్ది రోజుల ముందు రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌లో కూడా ఇది మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.


క‌థానాయ‌కుని స్థానం నుంచి రాజ‌కీయ నేత‌గా ఎదిగిన తీరు, ఈ క్ర‌మంలో ఆయ‌న ఎదుర్కొన్న ఇబ్బందులు, తనను గాయ‌ప‌రిచిన వెన్నుపోట్లు.. మొద‌లైన‌వి ఈ రెండో భాగంలో చూప‌నున్న‌ట్లు ముందే చెప్పారు. వీటికి త‌గ్గ‌ట్టే ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు సైతం భారీ స్థాయిలో ఏర్ప‌డ్డాయి. మ‌రి, క్రిష్ వాటిని అందుకోగ‌లిగారా? మ‌హానాయ‌కుడు ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకోగ‌లిగారు?? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలియాలంటే ఈ చిత్రం క‌థ‌లోకి వెళ్లాల్సిందే..


NTR-MAHANAYAKUDU-1


ఎన్టీఆర్ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం ద‌గ్గ‌ర నుంచి.. ఎన్టీఆర్ - నాదెండ్ల భాస్క‌రరావుల (NTR - Nadendla Bhaskar Rao) ఉదంతం వ‌ర‌కు బ‌స‌వ‌తారకం జీవించి ఉన్నారు. అందుకే మ‌హానాయ‌కుడు క‌థ‌లో కూడా ఇంత వ‌ర‌కు ప‌లు సంఘ‌ట‌న‌లు, కీల‌క ఘ‌ట్టాల‌ను ప్ర‌స్తావించారు. అంటే ఈ క‌థ 1985తో ముగిసిపోతుంద‌ని చెప్ప‌చ్చు. అంటే ఈ క‌థలో ఆయ‌న 1985లో తిరిగి ముఖ్య‌మంత్రి కావ‌డం, 1989లో ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం, అటు పిమ్మ‌ట ఆయ‌న జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి రాక‌.. ఎన్టీఆర్ నేతృత్వం నుంచి చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోకి తెలుగుదేశం పార్టీ మారిపోవ‌డం.. మొద‌లైన అంకాలేవీ ఈ చిత్రంలో మ‌న‌కు క‌నిపించ‌వు. ఇలాంటి అంకాలు, వాటిపై ఉన్న సందేహాల‌ను నివృత్తి చేసుకుందామ‌నుకునే ప్రేక్ష‌కుల‌కు ఇది కాస్త నిరాశ క‌లిగించే అంశ‌మ‌నే చెప్పాలి.


ఇక పాత్ర‌ధారుల విష‌యానికి వ‌స్తే తండ్రి సినీ ప్ర‌స్థానం ద‌గ్గ‌ర నుంచి రాజకీయ జీవితం వ‌ర‌కు క్షుణ్ణంగా ప‌రిశోధ‌న చేసి మ‌రీ ఆయ‌న పాత్ర‌లో న‌టించారు బాల‌కృష్ణ (Balakrishna). ఆ క‌ష్టం ఆయ‌న పాత్ర‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అలాగే ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర పోషించిన విద్యాబాల‌న్ (Vidya Balan) కూడా చాలా స‌హ‌జంగా న‌టించింద‌నే చెప్పాలి. ఇక క‌థ‌లో కీల‌క‌మైన చంద్ర‌బాబు నాయుడు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు పాత్ర‌ల్లో రానా ద‌గ్గుబాటి (Rana Daggubati) & భ‌రత్ రెడ్డి చ‌క్కని న‌ట‌ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు. ముఖ్యంగా ఎన్టీఆర్ - నాదెండ్ల ఎపిసోడ్‌లో చంద్రబాబు ఎటువంటి కీలక పాత్ర పోషించారు? ఆ సంక్షోభ సమయంలో ఆయన ఎలాంటి సమయస్ఫూర్తిని ప్రదర్శించారు? అసలు ఆయన తెలుగుదేశంలోకి ఎవరు పిలిస్తే వచ్చారు? అనేవి ఇందులో కాస్త విపులంగా చెప్పే ప్రయత్నం చేశారు.


ఈ క‌థ‌లో ప్ర‌తినాయ‌కులుగా నాదెండ్ల భాస్క‌రరావు & ఇందిరా గాంధీ (Indira Gandhi)ల‌ను చూప‌డం ద్వారా మ‌హానాయ‌కుడు క‌థ‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్దే ప్ర‌య‌త్నం చేశారు. భాస్క‌ర రావు పాత్ర‌లో న‌టించిన స‌చిన్ ఖేద్క‌ర్ త‌న‌దైన శైలిలో చ‌క్క‌ని న‌ట‌న క‌న‌బ‌రుస్తూనే విల‌నిజాన్ని పండించే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత‌మంది న‌టీన‌టులు త‌మ‌వైన సామ‌ర్థ్యాల‌తో మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు పెట్టుకున్న అంచ‌నాల‌ను మాత్రం ఇది అందుకోలేక‌పోయింద‌నే చెప్పాలి. కొన్ని పాత్ర‌ల‌ను ప‌రిధికి మించి ఎత్తిచూపే ప్ర‌య‌త్నం చేయ‌డం, ఇంట‌ర్వెల్ త‌ర్వాత వ‌చ్చే స‌న్నివేశాల్లో స‌హ‌జ‌త్వం లోపించ‌డం.. వంటి వాటితో పాటు క‌థ‌ను 1985తో ముగించ‌డంతో ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను సంపూర్ణంగా ఆవిష్క‌రించ‌డంలోని వెలితి స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.


ఇక సినిమా సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకోవాలంటే ఎం. ఎం. కీర‌వాణి అందించిన నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. అలాగే జ్ఞాన‌శేఖ‌ర్ (Gnanasekhar) ఛాయాగ్రహణం బాగుంది. ప్రొడ‌క్ష‌న్ డిజైనర్స్ సైతం అప్ప‌టి కాలానికి అనుగుణంగా సెట్స్ వేసి ఆనాటి ప‌రిస్థితుల‌ను ప్ర‌తిబింబించేలా ప‌రిస‌రాల‌ను తీర్చిదిద్దారు. ఇక సాయి మాధ‌వ్ బుర్ర ర‌చించిన సంభాష‌ణ‌లు ఈ క‌థ‌కు బ‌లం అని చెప్పుకోవ‌చ్చు. NBK Films నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీలేకుండా ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే ద‌ర్శ‌కుడు క్రిష్ విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం మొద‌టి భాగంతో పోలిస్తే రెండో భాగాన్ని న‌డిపించ‌డంలో కాస్త త‌డ‌బ‌డిన‌ట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప‌తాక స‌న్నివేశాల్లో క‌థ కాస్త తేలిపోయిన‌ట్లుగా ఉంటుంది. కానీ అక్క‌డ‌క్క‌డా మాత్రం ఆయ‌న త‌న ముద్ర‌ను వేయ‌గ‌లిగార‌ని చెప్ప‌చ్చు.


ఈ సినిమా గురించి ఒక్క ముక్క‌లో చెప్పాలంటే- అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో "మ‌హానాయ‌కుడు" కొంతలో కొంత తడబడ్డాడనే చెప్పాలి.


ఇవి కూడా చదవండి


ఒక రాజ‌కీయ నాయ‌కుడిని.. ప్ర‌జా నేత‌గా మార్చిన "యాత్ర" (సినిమా రివ్యూ)


ఈ పాపుల‌ర్ తెలుగు వెబ్ సిరీస్ మీరు చూశారా??


అభిమానులకు పైసా వసూల్.. ఎన్టీఆర్ "కథానాయకుడు" (సినిమా రివ్యూ)