పూసర్ల వెంకట సింధు.. అదేనండీ.. మన పీవీ సింధు (PV Sindhu).. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని మనందరికీ తెలుసు. ఎన్నో విజయాలు సాధించడం ద్వారా క్రీడాచరిత్రలో తనకంటూ ఓ పేజీని ప్రత్యేకంగా లిఖించుకున్న సత్తా ఆమె సొంతం. బ్యాడ్మింటన్ (Badminton) కోర్టులో దిగితే ఆమె ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో మనకు తెలిసిందే.
మరి, ఈ క్రీడ గురించి కాసేపు పక్కన పెట్టి సింధు ఇంకేమైనా రికార్డులు సాధించిందా?? అని మీకెప్పుడైనా సందేహం వచ్చిందా?? అయితే మీ సందేహానికి మా సమాధానం అవును..! ఎందుకంటే ఇటీవలే ఆమె ఒక ప్రత్యేకమైన రికార్డు సృష్టించింది. ఇంతకీ అదేంటంటే..
Indian badminton star @Pvsindhu1 became first woman to fly DRDO developed Light Combat Aircraft (LCA) Tejas @AeroIndiashow 2019. Today DRDO is celebrating Women Achievers in Aerospace. @DefenceMinIndia @PIB_India @SpokespersonMoD #AeroIndiaWomenDay #AeroIndia2019 pic.twitter.com/AzTwy4YBy8
— DRDO (@DRDO_India) February 23, 2019
పీవీ సింధు కో-పైలట్‌గా మారి యుద్ధరంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే తేజస్ (Tejas) విమానాన్ని నడిపింది. మరి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన సింధు విమానం ఎలా నడిపింది? శిక్షణ ఎప్పుడు తీసుకుంది? కో-పైలట్‌గా ఎప్పుడు మారింది?? అసలు ఏమా కథ అంటే..
ఇటీవలే బెంగళూరు (Bengaluru)లో మూడు రోజుల పాటు ఏరో ఇండియన్ ఎయిర్ షో నయనానందకరంగా జరిగింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం మొదలుపెట్టిన మేక్ ఇన్ ఇండియా (Make In India) కార్యక్రమంలో భాగంగా.. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఉత్పత్తులను ప్రోత్సహించే క్రమంలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (Hindustan Aeronautics Limited) రూపొందించిన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్‌ని ఈ ఎయిర్ షోలో ప్రదర్శించారు. మొత్తం ఎయిర్ షోలోనే ఈ విమానం చాలా ప్రత్యేకమైందని చెప్పవచ్చు. ఎందుకంటే యుద్ధరంగంలో వినియోగించేందుకు అవసరమైన అన్ని ఆపరేషన్స్ క్లియర్‌గా ఉన్నట్లుగా మిలిటరీ వర్గాల నుంచి సర్టిఫికెట్ కూడా పొందిందీ విమానం.
పూర్తి దేశీయ టెక్నాలజీతో రూపొందిన ఈ సింగిల్ ఇంజిన్ మల్టీ రోల్ లైట్ ఫైటర్ (Single Engine Multi-Role Light Fighter)ను మన దేశ ఎయిర్ ఫోర్స్‌కు అందించారు. బెంగళూరులో మూడు రోజుల పాటు జరిగిన ఈ ఎయిర్ షోలో శనివారం (ఫిబ్రవరి 23) విమెన్స్ డేగా పరిగణిస్తూ ఆ రోజు మహిళా పైలట్స్ చేసే విన్యాసాలను వీక్షకులకు పరిచయం చేశారు ఎయిర్ షో నిర్వాహకులు. ఇందులో భాగంగానే పీవీ సింధుని సైతం తేజస్ ఎయిర్ క్రాఫ్ట్‌లో గగనతలంలోకి తీసుకెళ్లడం ద్వారా మన దేశ మహిళల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు.
ఎయిర్ షో గ్రౌండ్‌కు సంప్రదాయక గ్రీన్ కలర్ యూనిఫాంలో చేరుకున్న సింధుకు తేజస్ ఫ్లైట్ టేకాఫ్‌కి ముందు తగిన శిక్షణ ఇచ్చారు. అనంతరం చీఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat) పైలట్‌గా; పీవీ సింధు కో- పైలట్‌గా తేజస్‌లో గగనతలంలోకి దూసుకెళ్లారు. అయితే మునుపెన్నడూ విమానం నడపడంలో ఏ మాత్రం అనుభవం లేని సింధుకు, కో పైలట్ గా వ్యవహరించడం ఇది తొలిసారే కావడం గమనార్హంం అయినప్పటికీ ఆమెకు అస్సలు భయం వేయలేదట! ఆమె ధైర్యానికి ఇదే ప్రతీక అంటూ అక్కడున్న అధికారులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇలా తేజస్‌లో ప్రయాణించడం ద్వారా ఆ ఎయిర్ క్రాఫ్ట్‌లో ప్రయాణించిన తొలిమహిళగా; అత్యంత పిన్నవయస్కురాలిగా కూడా రికార్డు సృష్టించింది సింధు. దీంతో బ్యాడ్మింటన్ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ తెలుగు తేజం ఖాతాలో మరో రికార్డు చేరినట్లైంది.
ఇదే రోజున ఏరో స్పేస్ రంగంలో రాణించిన మహిళలకు అవార్డులు అందించడంతో పాటు.. వారి జీవితాలపై ప్రత్యేకంగా రూపొందించిన విమెన్ ఇన్ ఏవియేషన్ (Women In Aviation) అనే చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. ప్రస్తుతం రక్షణ శాఖా మంత్రిగా వ్యవహరిస్తోన్న శ్రీమతి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) సైతం గతంలో జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ప్రయాణించిన తొలి మహిళా మంత్రిగా రికార్డు సృష్టించారు.
ఇక సింధు బ్యాడ్మింటన్ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే.. వచ్చే నెల మొదటి వారంలో లండన్‌లో జరగనున్న ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ (All England Badminton) టోర్నీలో పాల్గొనేందుకు ఆమె సన్నద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో ఆమె జయకేతనం ఎగురవేయాలని, మన దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలని.. మనమంతా ఆశిద్దాం.
Featured Image: https://www.instagram.com/pvsindhu1
ఇవి కూడా చదవండి
దీపికా పదుకొణే రాజకీయాల్లోకి వస్తే.. ఏ శాఖ మంత్రి అవుతారో తెలుసా..?
నాట్యం నేర్చుకున్న 43 ఏళ్లకు.. అరంగేట్రం చేసిన సినీనటి సుహాసిని..!
మన సినిమాలూ… కామిక్ బుక్స్‌గా వచ్చేస్తున్నాయి..!