ADVERTISEMENT
home / Life
#నా ప్రేమకథ: బెదిరించారు.. భయపెట్టారు.. అయినా మా ప్రేమను గెలిపించుకున్నాం..!

#నా ప్రేమకథ: బెదిరించారు.. భయపెట్టారు.. అయినా మా ప్రేమను గెలిపించుకున్నాం..!

ప్రేమకథ (love story) అనగానే.. ఒక‌ అందమైన ఫెయిరీ టేల్ మన కళ్ల ముందు కదులుతుంది. అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు చూపులతో పలకరించుకోవ‌డం.. ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవ‌డం.. సంతోషంగా జీవితాన్ని గడిపేయడం.. ఇదే అందరికీ తెలిసిన ప్రేమకథ. కానీ నా ప్రేమకథ దానికి పూర్తిగా భిన్నమైనది. మలుపులు, మజిలీలతో చాలా అందంగా ఉంటుంది.(కొన్ని బాధించిన సంఘటనలూ ఉన్నాయి).

ఇది నా అందమైన ప్రేమకథ.. అన్నట్టు నా పేరు చెప్పలేదు కదూ.. రిషికా మిశ్రా సోని. నా భర్త శశాంక్ ఫేస్బుక్ ద్వారా నాకు పరిచయమయ్యారు. మార్చి, 2017లో మా ఇద్దరికీ పరిచయం అయింది. నేను సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆడపిల్లను. ఆడవారు.. మగవారి కంటే తక్కువ అనే భావన మా ఇంట్లో వాళ్లకి ఎక్కువ. ఇలాంటి ఇంట్లో పుట్టిన నాకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తిని కలుసుకోవడమంటే కష్టంతో కూడొకొన్న పనే. కొన్నిరోజులు మేం మాట్లాడుకొన్న తర్వాత వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకొన్నాం. ఇంటర్నెట్ డేటింగ్ గురించి నాకు అవగాహన ఉండటం వల్ల నా జాగ్రత్తలో నేనుండాలని భావించాను. ఎందుకంటే ఈ అబ్బాయిలకు ఒకసారి చనువిస్తే.. ఆ తర్వాత మన వెంటపడి వేధిస్తుంటారు. మేం కెఫె కాఫీ డే అవుట్ లెట్‌లో ఒకరినొకరు తొలిసారి చూసుకొన్నాం.

శశాంక్‌ని చూడగానే నా ఆలోచనలన్నీ మారిపోయాయి. తను చాలా ఇన్నోసెంట్‌గా ఉన్నాడు. దాంతో నాలోని భయం అంతా తొలగిపోయింది. అతన్ని చూస్తే అమ్మాయిలను వేధించే వ్యక్తిలా కనిపించలేదు. నాలాగే తను కూడా కొంచెం అసౌకర్యంగా ఫీలవుతున్న‌ట్లు అనిపించింది. అందుకే మా ఇద్దరి మధ్య ఉన్న వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశా. నాకు తెలిసిన కుళ్లు జోకులు రెండు మూడు చెప్పగానే తను కాస్త నవ్వాడు. అలా ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. అప్పుడే తను నాకు ఓ ప్రామిస్ చేశాడు. నన్ను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకొంటానని. కానీ అప్పుడు నేను దాన్ని నమ్మలేదు. ఇప్పుడు ఆ మాటలని గుర్తు తెచ్చుకొంటే.. తన మాటల్లోని నిజాయతీ అర్థం అవుతోంది.

ఆ తర్వాత నుంచి మేమిద్దరం రోజూ మాట్లాడుకోసాగాం. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి నాకు చెప్పాడు. ఆమెతో ఎనిమిదేళ్లు కలిసున్నట్లు చెప్పాడు. నేను కూడా నా కుటుంబం, మేం పాటించే సంప్రదాయాల గురించి చెప్పాను. మేం ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి ఒకరికొకరు చెప్పుకొన్నాం. దాదాపు ప్రతీ విషయాన్నీ ఒకరితో ఒకరు పంచుకొనేవాళ్లం. మాకు తెలియకుండానే అలా ప్రేమలో పడిపోయాం. చెప్పాలంటే మేమిద్ధరం భిన్న ధ్రువాలకు చెందినవాళ్లం. మా జీవన విధానాలు వేరు. ఆలోచననా సరళి వేరు. అలవాట్లు వేరు. మా ఇద్దరికీ ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు. అయినా మా ప్రేమ మరింత బలంగా తయారైంది.

ADVERTISEMENT

ప్రేమలో పడ్డామని సంతోషపడితే సరికాదు. ఎందుకంటే.. మన కోసం పెళ్లి అనే అతి పెద్ద సవాలు ఎదురుచూస్తూ ఉంటుంది. మా ప్రేమను రెండు కుటుంబాల వారు అంగీకరించాలి. నాకు బాగా తెలుసు. మా ఇంట్లో మా ప్రేమను అంగీకరించరు. నాకు నచ్చిన అబ్బాయిని.. అందులోనూ వేరే కులానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకొంటానంటే అసలు ఒప్పుకోరు. అది నాకు చాలా భయాన్ని కలిగించేది. కానీ నా ప్రేమను గెలిపించుకోవడానికి ధైర్యం చేశాను. జులై 18, 2017న నా తల్లిదండ్రులతో ప్రమేయం లేకుండా శశాంక్‌తో పెళ్లికి నేను అంగీకరించాను. మీకు మరో విషయం చెప్పనా..? ఆ రోజు శశాంక్ పుట్టిన రోజు.

శశాంక్ కుటుంబం మా కుటుంబానికి పూర్తి భిన్నంగా ఉంది. వారికి మా ప్రేమ, పెళ్లి నిర్ణయం గురించి తెలియగానే చాలా సంతోషించారు. నేను కాస్త బొద్దుగా ఉంటాను. అలా ఉండటాన్ని నేను ఇష్టపడతాను. నేనలా ఉండటం వల్ల శశాంక్ అమ్మానాన్నలకు నచ్చుతానో లేదో అని కాస్త కంగారుపడ్డాను. పైగా నాకు కుజదోషం ఉంది. కానీ ఇవేమీ వారికి ఓ సమస్యగా అనిపించలేదు. శశాంక్ నన్ను నన్నుగానే ప్రేమించింనందుకు చాలా సంతోషించారు.

మా ప్రేమ విషయం మా ఇంట్లో చెబితే ఏం జరుగుతుందో నేను ముందే ఊహించాను. అనుకొన్నట్లుగానే జరిగింది. నాపై కోపంతో అరిచారు. నన్ను బెదిరించారు. మా నాన్న రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. పలుకుబడి ఉన్న వ్యక్తి. నేను ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల ఆయన ప్రతిష్ఠ దెబ్బ తింటుందట. నన్ను ఎంతగా బెదిరించినా నా నిర్ణయం మార్చుకోదలుచుకోలేదు. నేను ప్రేమించిన శశాంక్‌నే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నాను. అందుకే పారిపోయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాం. డిసెంబర్ 11, 2017న ఆర్యసమాజ్‌లో మా వివాహం జరిగింది. ఇలా చేయడం చాలా మందికి నచ్చలేదు. మేం తప్పు చేస్తున్నామని వేలెత్తి చూపడం ప్రారంభించారు. అయినా అవేమీ మేం పట్టించుకోలేదు. మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పటి వరకు మేం తప్పుచేశామనే ఆలోచనే మాకు రాలేదు.

2-eloped-from-home-and-married

ADVERTISEMENT

గుళ్లో పెళ్లి చేసుకొన్న తర్వాత శశాంక్ కుటుంబంతో కలసి మా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకొన్నాం. ఆ తర్వాత మా నాన్న నుండి తప్పించుకోవడానికి మేం ముంబయి వెళ్లిపోయాం. వాట్సాప్‌‌లో మా పెళ్లి ఫొటోలు, వాయిస్ మెసేజెస్ పంపించి నేను ఓ ఇంటిదాన్నయ్యాననే విషయాన్ని నా తల్లిదండ్రులకు తెలియజేశాను.

మా నాన్న కొందరిని ముంబయి పంపించి మమ్మల్ని వెదకడం ప్రారంభించారు. మా అత్తింటికి వెళ్లి మా గురించి వివరాలు చెప్పమని బెదిరించారు. అయినా మేమెక్కడున్నామో వారు కనిపెట్టలేకపోయారు. చివరికి శశాంక్, అతని కుటుంబ సభ్యులపై పోలీస్ కేసు పెట్టారు. నేను మేజర్‌ని కావడం, వివాహం నా ఇష్టపూర్వకంగా జరగడంతో చేసేదేమీ లేక ఊరుకొన్నారు.

1-eloped-from-home-and-married

శశాంక్‌తో నా వివాహం అయిన తర్వాత.. నా కుటుంబం నాతో పూర్తిగా తెగతెంపులు చేసుకొంది. అది నాకు బాధ కలిగించలేదని, వారిని మిస్సవడం లేదని నేను అబద్ధం చెప్పలేను. కానీ నేను ఏమీ చేయలేను. నా అత్తామామలు చాలా మంచి వారు. నన్ను చాలా బాగా చూసుకొంటున్నారు. ముంబయి నుంచి తిరిగి వచ్చిన తర్వాత చాలా గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే.. ఒక కుటుంబం నాతో తెగతెంపులు చేసుకొంటే.. మరో కుటుంబం నన్ను ఆర్తిగా అక్కున చేర్చుకొంది. నన్ను ఎంతో ప్రేమించే వ్యక్తి నాకు భర్తగా లభించాడు. అందుకే దేవుడికి రోజూ నేను ధన్యవాదాలు చెబుతున్నా.

ADVERTISEMENT

ఏదో అద్భుత శక్తి మమ్మల్నిద్దరినీ ఒకటి చేసింది. ఈ ప్రయాణంలో చాలా విలువైనవే నేను కోల్పోయాను. అయినా నేను చాలా సంతోషంగా ఉన్నాను.

మీది కూడా ఇలాంటి ప్రేమకథేనా..? మీ కథను మాకు ఇక్కడ మెయిల్ చేయండి. సబ్జెక్ట్ లైన్లో ‘#నా ప్రేమకథ’ అని రాయడం మాత్రం మరచిపోవద్దు. మాకు అందిన ప్రేమకథల్లో ఉత్తమమైనవి సైట్లో పబ్లిష్ చేస్తాం.

Feature Image: Studio Snapster

 ఇవి కూడా చ‌ద‌వండి

ADVERTISEMENT

వెడ్డింగ్ స్పెషల్: కొత్త కోడలికి సరికొత్త లుక్ ఇచ్చే డిజైనర్ నగలు

పాఠ‌శాల నుంచి ప‌రిణ‌యం వ‌ర‌కు.. సాగిన ఈ ప్రేమ‌క‌థ అద్భుతం..!

ప్రేమ వివాహం.. ప్రేమతో మీకు నేర్పించే విషయాలు ఇవే..

06 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT