వర్క్ ఫ్రం హోమ్ (work from home).. మన దేశంలో చాలామంది మహిళలకు ఇప్పటికీ ఇది అందని ద్రాక్షే! ఇంటి పట్టున ఉంటూనే ఆఫీసు బాధ్యతలను నిర్వర్తించేందుకు ఎంతోమంది మహిళలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ సదావకాశాన్ని అందించే సంస్థలు తక్కువనే చెప్పాలి. అయితే వర్క్ ఫ్రం హోం జాబ్స్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ ప్రభావం చేసే పనిపై పడుతుంది. అలాగే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకునేవారు తమని తాము ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవి
ట్యాక్స్ ఎలా విధిస్తారు??
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు మీరు పని చేసే ప్రదేశం బట్టి మీరు కట్టాల్సిన ట్యాక్స్ కూడా మారుతుంది. ఉదాహరణకు మీరు భారతీయులై ఉండి విదేశాల్లో ఉన్న సంస్థ కోసం పని చేస్తుంటే.. మీకు వచ్చే సంపాదన రూపాయల్లోనే ఉంటుంది. అయితే మీకు వచ్చే జీతం ప్రకారం మీకు ఎంత పన్ను విధిస్తారు అనేది మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ఆయా సంస్థ హెచ్ ఆర్ అధికారులను అడిగి తెలుసుకోండి. అలాగే ఒక సర్టిఫైడ్ ట్యాక్స్ కన్సల్టెంటుని సంప్రదించి మీ వార్షిక పన్ను విధానాల గురించి చర్చించి, తదనుగుణంగా ప్రణాళిక వేసుకోవడం మంచిది.
ప్రశాంతమైన పని ప్రదేశం..
మీరు ఇంట్లో ఉంటూ ఆఫీసు పనులు చేసినా.. లేదా మీరే స్వయంగా ఏవైనా హస్తకళలు రూపొందిస్తూ వాటిని అమ్మాలని అనుకున్నా.. అందుకు అనువైన స్థలం కూడా ఉండాల్సిందే! లేదంటే మీకు వచ్చే ప్రతి చిన్న ఆలోచన మీ పనికి భంగం కలిగించే అవకాశాలు లేకపోలేదు.
ఉదాహరణకు మీరు ఇంట్లోనే సోఫాలో కూర్చొని పని చేసుకుంటున్నారని అనుకుందాం.. ఆ సమయానికి ఎదురుగా ఉన్న టీవీని చూడగానే కాసేపు టీవీ చూడాలని అనిపించడం సహజం. ఇలాంటి సందర్భంలో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని .. మీ దృష్టి పని మీదకు మరలేలా చేసుకోవాల్సింది మీరే! అందుకే ఇలాంటి అవాంతరాలకు అవకాశం లేకుండా పని చేసే ప్రదేశం ప్రశాంతంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉన్నా.. ఆఫీసులో ఉన్నామనే భావనతోనే పని చేయాలి.
ప్రేరణ కొనసాగుతుందా??
ఆఫీసులో పని చేసే క్రమంలో ఉద్యోగుల్లో పని చేయాలనే ప్రేరణ నింపేందుకు ఆయా సంస్థలు ప్రతి వారం లేదా నెలకోసారి మోటివేషనల్ సెషన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఇవి మనల్ని ఉన్న స్థానం నుంచి తర్వాతి స్థానానికి చేరుకొనేలా చేస్తాయి. మరి, ఇంట్లోనే పని చేసే క్రమంలో మనకు మనమే ప్రేరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఒకరు వచ్చి మీరు ఈ పని చేయాలి.. మీ కెరీర్ బాగుంటుంది.. అంటూ మనల్ని ముందుకు తోయరు. మనల్ని మనమే ప్రేరేపించుకునేలా ఉండాలి.
పనికి అంతరాయం కలగకుండా ఉంటుందా?
ఆఫీసులో అయితే కొలీగ్స్ మన దగ్గరకు వచ్చి మాట్లాడడం, మీటింగ్స్ పెట్టడం లాంటివి చేస్తుంటారు. అటువంటప్పుడు మన పనికి డిస్టర్బెన్స్ కలగడం సహజం. ఈ క్రమంలో తిరిగి ఆ పనిపై దృష్టి సారించడం కూడా కాస్త కష్టమే. అందుకే చాలామంది వర్క్ ఫ్రం హోం అనగానే.. ఇలాంటి అవాంతరాలు ఏవీ ఉండవు కాబట్టి హాయిగా పని చేసుకోవచ్చని భావిస్తారు. అంతేకాదు.. రోజులో ఎక్కువ సమయం పని చేయడం ద్వారా ఎక్కువ పని పూర్తి చేయచ్చని కూడా అనుకుంటారు. కానీ అది కూడా ఎంత వరకు ఆచరణలో పెట్టగలరు అన్నది ప్రశ్నార్థకమే!
ఎందుకంటే పని చేసే సమయంలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా ఉండేలా ఇంట్లో వాతావరణం ఉన్నప్పుడే చక్కని ఉత్పాదకతతో పని చేసే వీలుంటుంది. టీవీ కనిపించగానే సోఫా సెట్‌లో వాలిపోవడం, బైక్ కనిపించగానే సరదాగా రెండు రౌండ్లు షికారు చుట్టి రావాలని అనుకోవడం, మంచం కనిపించగానే కాసేపు పడుకొని లేచేద్దాం అనుకోవడం.. ఇవన్నీ పనికి అంతరాయాన్ని కలిగించేవే! ఇలాంటివేవీ లేకుండా ఇంట్లోనే ఒక గదిని ఆఫీసులా మార్చుకొని.. నిర్ణీత సమయంలో ఆ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటే ఏకాగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లదు.
వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు బ్యాలన్స్ చేయగలనా?
ఇంట్లోనే పని చేసుకుంటున్నాం కదాని నచ్చిన సమయంలో పని చేయడం సరికాదు. ఆఫీసు సమయం ఆఫీసుకు, ఇంటి సమయం ఇంటికి కేటాయించడంలో సఫలత సాధించినప్పుడే మీ పర్సనల్, ప్రొఫెషనల్ జీవితాలను బ్యాలన్స్ చేయడంలో మీరు విజయం సాధించినట్లు లెక్క! అలాకాకుండా టీవీ చూస్తూ రిపోర్ట్ తయారుచేస్తున్నా.. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఈమెయిల్స్‌కు సమాధానం ఇస్తున్నా మీరు పనిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలన్స్ చేయలేకపోతున్నారనే అర్థం. ఇలాకాకుండా దేని సమయం దానికి కచ్చితంగా కేటాయించండి. తప్పకుండా రెండూ సమన్వయం చేసుకుంటూ సంతోషంగా ముందుకెళ్లవచ్చు.
టెక్నికల్ స్కిల్స్ పెంపొందించుకోవాలి..
చేసే పని ఏదైనా సరే.. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా అప్ డేట్ అవుతూ ఉండాలి. ఈ క్రమంలో క్లయింట్స్‌తో మాట్లాడేందుకు, ఆన్ లైన్ మీటింగ్స్‌లో పాల్గొనేందుకు అవసరమయ్యే టెక్నికల్ స్కిల్స్ కూడా మనకు ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి స్కైప్, హ్యాంగ్ అవుట్.. వంటివి ఉపయోగించే విధానం ముందుగానే తెలుసుకుని ఉండాలి. అలాగే అవసరమైతే మరిన్ని టెక్నికల్ స్కిల్స్ నేర్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాలి.
పిల్లల సంరక్షణ ప్రభావం పనిపై పడకూడదు..
స్కూలు ఉన్నప్పుడు పిల్లలు ఉదయాన్నే వెళ్లిపోతారు కాబట్టి పనికి ఎలాంటి అంతరాయం కలగదు. కానీ స్కూల్‌కి సెలవులు ప్రకటించినప్పుడు మాత్రం వారిని చూసుకుంటూనే పని కూడా చేసుకుందాం అని మీరనుకుంటే పొరపాటే! ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మీ పూర్తి దృష్టి పనిపై పెట్టడం కుదరదు. వారు ఏదో ఒక రకంగా మీ పనికి భంగం కలిగించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే.. ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చినప్పుడు వారి సంరక్షణ చూసుకునేందుకు ఒక మనిషిని మాట్లాడుకోవడమే మంచిది. లేదా వారిని డే కేర్ సెంటర్స్‌లో చేర్చి సాయంత్రం ఆఫీసు పని పూర్తయ్యాక ఇంటికి తీసుకురావచ్చు.
చివరిగా మేం చెప్పేది ఒక్కటే- ఆఫీసు పని చేసే ప్రదేశం ఏదైనా సరే.. మీ దృష్టంతా పని మీదే ఉండాలి తప్ప దానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు. అలాగే వృత్తిపరమైన బాధ్యతలకు అధిక సమయం కేటాయిస్తూ ఇంటి బాధ్యతలను చిన్నచూపు చూడకూడదు. రెండూ బ్యాలన్స్ చేస్తేనే ఒక స్త్రీగా వర్క్ లైఫ్ బ్యాలన్స్‌లో విజయం సాధించినట్లు లెక్క!
Featured Image: Pixabay
ఇవి కూడా చదవండి
లక్ష్యం చేరుకొనే ప్రయాణంలో మనం నేర్చుకొనే విషయాలివే..
హెల్త్ సరిగ్గా లేకున్నా ఆఫీసుకి వెళ్లాల్సొస్తే.. ఏం చేయాలి..?
ఆఫీసులో స్టైల్ గా మెరిసిపోవాలంటే .. ఈ ఫ్యాషన్ ఫాలో అవ్వాల్సిందే..!