ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఈ న్యాయవాది.. మనదేశంలోనే కులం, మతం లేని మొదటి వ్యక్తి

ఈ న్యాయవాది.. మనదేశంలోనే కులం, మతం లేని మొదటి వ్యక్తి

‘మీరేమిట్లు?’ మీకెప్పుడైనా ఈ ప్రశ్న ఎదురైందా? దానర్థం మీ కులమేంటని? మీకు నచ్చితే సమాధానం చెబుతాం.. లేదా అలా అడిగినందుకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదులుతాం. కానీ ఇదే ప్రశ్న తమిళనాడుకి చెందిన న్యాయవాది స్నేహ పార్తిబరాజ అడిగితే.. ఏం సమాధానం చెబుతుందో తెలుసా? ‘నాకు కులం(Caste) లేదు. మతం(Religion) లేదు’ అని. కులానికి, మతానికి ప్రాధాన్యం ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో ఇలా చెప్ప‌డానికి ఎంత ధైర్యం కావాలి? కానీ ఈ విషయంలో స్నేహలో మనకు తెగువ కనిపిస్తుంది. అలా చెప్పడం వెనుక దాగున్న తొమ్మిదేళ్ల పోరాటం కనిపిస్తుంది.

1-sneha-pratibha-raja

1950లోనే మన దేశంలో కులవ్యవస్థను చట్టబద్ధంగా నిర్మూలించారు. అయినప్పటికీ పాఠశాలలలో, కళాశాలలలో చివరికి ఉద్యోగాల్లో చేరేటప్పుడు సైతం మనం కులం, మతానికి సంబంధించిన వివరాలను నింపాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో అయితే వాటిని కచ్చితంగా పూరించాల్సిందే. అలా చెప్పడానికి ఇష్టం లేని వారు ‘Others’ అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు స్నేహ ఇకపై సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖాళీని నింపాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే.. మనదేశంలో కులం లేని మతం లేని మొట్ట మొదటి వ్యక్తి ఆమె. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ సైతం ఆమె అందుకొన్నారు. దీని కోసం ఆమె తొమ్మిదేళ్లు పోరాటం సాగించాల్సి వచ్చింది. అందుకే ఆమెకు నటుడు, రాజకీయనాయకుడు అయిన కమల్ హాసన్ నుంచి ప్రశంసలు సైతం దక్కాయి. కులమతాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించే వారంతా.. ఆమెను వేనోళ్ల కీర్తిస్తున్నారు. ఆమె కథ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్నేహ పార్తిబరాజ పాటు ఆమె సోదరీమణులు జెన్నిఫర్, ముంతాజ్‌లను ఆమె తల్లిదండ్రులు కుల మతాలకు అతీతంగానే పెంచారు. ఈ ముగ్గురు పేర్లను గమనించారా? మూడూ మూడు మతాలకు చెందినవి. స్కూల్, కాలేజీ అడ్మిషన్లలో సైతం కులమతాల ప్రస్తావన వారు తీసుకురాలేదు. వాటిలో ఇండియన్ అని మాత్రమే రాసేవారు. తల్లిదండ్రులకున్న ఆదర్శభావాలే.. స్నేహ సైతం పునికి పుచ్చుకొన్నారు. ఆమె వృత్తిరీత్యా ఒక న్యాయ‌వాది. స్నేహ భర్త పార్తిబరాజ కూడా ఆదర్శభావాలు కలిగినవారే. వీరిద్దరి వివాహం.. కులమత సంప్రదాయాలకు అతీతంగా జరిగింది. వీరిద్దరికీ కలిగిన సంతానం విషయంలోనూ తన తల్లిదండ్రులనే అనుసరించారు స్నేహ. అదిరై నస్రీన్, అదిలా ఇరీన్, ఆరిఫా జెస్సీ – ఇవి స్నేహ, పార్తిబరాజ దంపతుల కుమార్తెల పేర్లు. ఒక్కొక్కరి పేరులోనూ రెండు మతాలకు సంబంధించిన పదాలున్నాయి.. గమనించారా? ఇన్ని ఆధునిక భావాలున్న స్నేహ “నో క్యాస్ట్, నో రెలీజియన్” సర్టిఫికెట్ తీసుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా?

ADVERTISEMENT

3-sneha-pratibha-raja

సాధారణంగా చదువు, ఉద్యోగాలకు సంబంధించి.. కుల ధృవీక‌ర‌ణ‌ పత్రాలను సమర్పిస్తుంటారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనకబడిన వర్గాలకు చెందినవారు వీటికోసం దరఖాస్తు చేసుకొంటూ ఉంటారు. ఇటీవలి కాలంలో ఇతర కులాల వారు సైతం ఫీజు రీయంబర్స్మెంట్, రిజర్వేషన్లు, స్కాలర్ షిప్పుల కోసం వీటిని తీసుకొంటున్నారు. దీన్ని స్థానిక తహసీల్దారు ధృవీక‌రిస్తారు. ఈ క్యాస్ట్ లేదా కమ్యూనిటీ సర్టిఫికెట్ స్థానంలోనే స్నేహ నో కమ్యూనిటీ సర్టిఫికెట్ తీసుకొన్నారు. ఈ సర్టిఫికెట్ తీసుకోవడానికి స్నేహకు సుమారుగా తొమ్మిదేళ్లు స‌మ‌యం పట్టింది.

కులం, మతం లేని వ్యక్తిగా ధృవీక‌ర‌ణ‌ పత్రం జారీ చేయాల్సిందిగా 2010 నుంచి స్నేహ తహసీల్దార్‌కు  అర్జీ పెట్టుకొనేవారు. అయితే వాటిని వారు తిరస్కరించేవారు. 2017లో మాత్రం కుల ధృవీక‌ర‌ణ‌ పత్రం కోసం అందరూ ఎలా దరఖాస్తు చేసుకొంటారో.. అదే మాదిరిగా కులం, మతం లేని వ్యక్తిగా ధృవీక‌ర‌ణ‌ పత్రం కోసం దరఖాస్తు చేసుకొన్నారు.

దీనికి ‘ఇలాంటి సర్టిఫికెట్ ఇప్పటి వరకు ఎవరూ జారీ చేయలేదు’, ‘ఈ సర్టిఫికెట్ తీసుకోవడం వల్ల మీకు ఏం ప్రయోజనం ఉంటుంది?’, ‘సరైన కారణం లేకుండా.. ఇలాంటి ధృవీక‌ర‌ణ‌ పత్రం జారీ చేయం’ అనే సమాధానాలు వచ్చాయి. ‘ఫలానా కులానికి చెందిన వ్యక్తినని ధృవీక‌ర‌ణ‌ పత్రం ఇస్తాం కానీ.. కులం, మతం లేని వ్యక్తిగా ధృవీక‌ర‌ణ‌ పత్రం ఇవ్వలేమ’ని తేల్చి చెప్పేశారు.

ADVERTISEMENT

ఈ విషయంలో అధికారులను ఒప్పించడానికి స్నేహ చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఈ సర్టిఫికెట్‌తో తాను ఎలాంటి లబ్ధి పొందనని, అది కేవలం తన గుర్తింపు మాత్రమేనని సబ్ కలెక్టర్ ప్రియాంక పంకజం, తహశీల్దార్ టి. సత్యమూర్తికి వివరించారు స్నేహ. ఆమె మాటలకు కన్విన్స్ అయిన అధికారులు చివరికి ఆమెకు కులం, మతం లేని వ్యక్తిగా ధృవీక‌ర‌ణ‌ పత్రం ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. దీని కోసం ఆమె స్కూల్, కాలేజీ డాక్యుమెంట్లను సైతం పరిశీలించారు. వాటిలో కులం, మతానికి సంబంధించిన కాలమ్స్ రెండూ ఖాళీగానే ఉండటాన్ని గమనించిన తిరుపత్తూర్ సబ్ కలెక్టర్ ప్రియాంక పంకజం స్నేహ మాటల్లోని నిజాయతీని, ఆమె ఆలోచనల్లోని గొప్పదనాన్ని గుర్తించి నో క్యాస్ట్ నో రెలీజియన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అంగీకరించారు. అలా దేశంలోనే ఇలాంటి ధృవీక‌ర‌ణ‌ పత్రం పొందిన మొదటి వ్యక్తిగా గుర్తింపు సాధించారు స్నేహ పార్తిబరాజ.

Images: Sneha Parthibaraja Facebook

ఇవి కూడా చ‌ద‌వండి

ప‌చ్చ‌ని కొండ‌ల‌నే.. పెళ్లి వేదిక‌గా చేసుకున్న ప్రేమ జంట‌..!

ADVERTISEMENT

సహజమైన చిత్రకళతో.. అద్భుతాలు సృష్టిస్తున్న “కీర్తి ప్రత్యూష”

ముచ్చటైన “మైక్రో ఆర్ట్స్‌”తో.. మనసులను దోచేస్తున్న “తెలుగమ్మాయి”

20 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT