అనుష్క (Anushka).. తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకించి పరిచయం అవసరం లేని పేరు. అసలు పేరు స్వీటీ శెట్టి (Sweety Shetty) అయినా తెలుగులో తెరంగేట్రం చేసిన తొలి చిత్రమైన “సూపర్”తో అనుష్క అని దర్శకుడు పూరీ జగన్నాథ్ పెట్టిన స్క్రీన్ నేమ్‌తోనే నటీమణిగా గుర్తింపు సంపాదించుకుంది. సాషా అనే ఒక మాస్ క్యారక్టర్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన స్వీటీ.. ఆ తర్వాత చాలా క్లాస్ చిత్రాల్లో కూడా నటించి అనుష్క అంటేనే ఒక బ్రాండ్ అనే స్థాయికి చేరుకుంది. అయితే ఈ అందాల ముద్దుగుమ్మ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఇటీవలే 14 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా తన మొదటి చిత్ర దర్శకుడు దగ్గర్నుంచి అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున అక్కినేని వరకు.. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మొదలుకొని అభిమానులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ప్రత్యేకమైన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది స్వీటీ. ఒక యోగా టీచర్‌గా అసలు సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న సమయంలో అనుకోకుండా సినిమాలో నటించే అవకాశం రావడంతో.. ఏదో సరదాగా ఇటువైపు వచ్చిందీ ముద్దుగుమ్మ. అందుకే ఇప్పటికీ తాను ఈ పరిశ్రమలోకి కావాలని రాలేదని.. యాదృచ్ఛికంగా అలా జరిగిపోయిందని చెబుతూ ఉంటుందీ సుందరి.
అయితే తొలిసారి స్క్రీన్ టెస్ట్‌లో పాల్గొన్నసందర్భంలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అది- కెమెరా ముందు ఎలా నిలబడాలో తెలియని అనుష్కకి కెమెరా మెన్ చిన్అప్ & చిన్‌డౌన్ అని చెప్పగానే పూర్తిగా కిందకు, పైకి చూడడంతో అక్కడున్నవారంతా నవ్వారట! అలా అసలు బేసిక్స్ కూడా తెలియకుండానే నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిందీ అమ్మడు. అలాంటి ప్రయాణం ఇంత సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతుందని ఏనాడూ ఊహించలేదని.. ఇదంతా ఒక కలలానే ఉందని అంటూ ఉంటుంది స్వీటీ.
అనుష్క కొనసాగించిన ఈ 14 ఏళ్ల కెరీర్‌లో కేవలం హిట్స్ మాత్రమే కాదు.. కొన్ని ఫ్లాపులు కూడా చవిచూడక తప్పలేదు. అదే సమయంలో కొన్ని బ్లాక్ బస్టర్స్‌తో ఇండస్ట్రీనే కుదిపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పూరీ జగన్నాథ్ సూపర్‌తో కెరీర్ ప్రారంభించిన స్వీటీ ఆ తర్వాత రాజమౌళి చిత్రమైన విక్రమార్కుడులో నటించి మరిన్ని మంచి మార్కులు సంపాదించుకుంది. ఇటు గ్లామరస్ హీరోయిన్ అనిపించుకుంటూనే మరోవైపు అరుంధతి, పంచాక్షరి.. వంటి చిత్రాల ద్వారా అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనలోని నటికి మరిన్ని మెరుగులు దిద్దుకుంది.
ఆమె ఇప్పటివరకు నటించిన సినిమాల్లో విక్రమార్కుడు, లక్ష్యం, అరుంధతి, బిల్లా, సింగం, మిర్చి, బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో, బాహుబలి 2, భాగమతి.. మొదలైనవి హిట్ మార్క్‌ను అందుకోవడం మాత్రమే కాదు.. చాలా రికార్డులను సైతం తిరగ రాశాయి. అలాగే ఆమె పోషించిన జేజమ్మ/ అరుంధతి, మాయ, వెన్నెల, దేవసేన, రుద్రమదేవి, భాగమతి.. మొదలైన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో ఆమెకు సుస్థిర స్థానం ఏర్పడేలా చేశాయి.
నటించే ప్రతి పాత్రలోనూ వైవిధ్యంగా కనిపించాలనుకునే తత్వం అనుష్క సొంతం. అందుకే అరుంధతి వంటి ఒక పవర్ ఫుల్ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటించిన తర్వాత బిల్లా చిత్రంలో బికినీతో హాట్ హాట్ గాళ్‌గా మెరిసింది. అలాగే తమిళంలోనూ సూర్య సరసన నటించిన సింగం సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు 48 సినిమాల్లో నటించినప్పటికీ చక్కని కథానాయికగా అందరి మనసుల్లోనూ బలమైన ముద్ర వేయగలిగింది.
ఇక బాహుబలి సినిమాలో నటిస్తున్న సమయంలోనే సైజ్ జీరో కోసం బాగా బరువు పెరిగింది స్వీటీ. దీని కారణంగా కొన్ని రోజులు ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. అయితే అలా పెరిగిన బరువును తగ్గించుకునేందుకు సహజసిద్ధమైన పద్ధతులనే ఆశ్రయించింది. పట్టుదల & కఠోర శ్రమతో మళ్లీ తన మునుపటి శరీరాకృతిని సొంతం చేసుకోగలిగింది. ప్రస్తుతం ఆమె తెలుగులో సైలెన్స్ అనే సినిమాలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ఆర్. మాధవన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోందీ చిత్రబృందం.
ఇవి కూడా చదవండి
రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ & ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ??
అమీర్ ఖాన్ “దంగల్” సినిమా.. హాలీవుడ్‌లో విల్ స్మిత్ చిత్రానికి ప్రేరణ..?
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో.. మరో కొత్త చిత్రం..!