తమిళ స్టార్ విజయ్ తెర పైనే కాదు.. నిజ జీవితంలో కూడా ఆయన ఫ్యాన్స్‌కి హీరోనే!

తమిళ స్టార్ విజయ్ తెర పైనే కాదు.. నిజ జీవితంలో కూడా ఆయన ఫ్యాన్స్‌కి హీరోనే!

మనదేశంలో సినీ తారలకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక దక్షిణాదిలో అయితే హీరోలకి ఫ్యాన్స్ ఉంటారనడం కన్నా.. భక్తులు ఉంటారనడం ఒకింత సమంజసమేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే వీటికి కారణాలు, ఉదాహరణలూ లేకపోలేదు. తమ హీరోని ఎవరైనా ఏదైనా అంటే.. అలాంటి వ్యక్తులపై దాడి చేయడానికి కూడా వెనుకాడేవారు కాదు ఒకప్పటి అభిమానులు. అయితే కాలం మారింది. ఇప్పుడు ఆ గొడవలు, కొట్లాటలకు సోషల్ మీడియా వేదికలు వాహకంగా మారుతున్నాయి.


ఇలాంటి ట్రెండ్ నడుస్తున్న క్రమంలో.. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్‌కి (Ilayathalapathy Vijay) సంబంధించి ఇటీవలే జరిగిన సంఘటన సోషల్ మీడియాలో ట్రెండింగ్ న్యూస్‌గా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే అంశం గురించిన చర్చ అంతర్జాలంలో నడుస్తోంది.


ఇంతకీ అసలు విషయానికి వస్తే - విజయ తన 63వ (#Ilayathalapathy63)  చిత్ర షూటింగ్ కోసం తమిళనాడులోని SRM విశ్వవిద్యాలయం (SRM University) ప్రాంగణంలో జరిగిన షూటింగ్ స్పాట్‌కి రావడం జరిగింది. ఇది తెలిసిన ఆయన ఫ్యాన్స్ మరియు స్టూడెంట్స్ విజయ్‌ని దగ్గరగా చూసే ఉద్దేశంతో భారీ సంఖ్యలో స్పాట్‌కి చేరుకున్నారు. అప్పటికే ముందు జాగ్రత్తగా షూటింగ్ జరిగే ప్రాంతానికి చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు.  అయినా అభిమానులు ఊరుకోకుండా.. ఆ ఫెన్సింగ్ దగ్గరికి వచ్చి "విజయ్ ... విజయ్ ..." అని అరవడం మొదలుపెట్టారు.
ఇదే సమయంలో షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వడంతో.. విజయ్ క్యారవాన్‌లోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. మరల షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆయన బయటకి రాగానే.. తనని చూసి అభిమానులు ఆయన వద్దకు రావడానికి పోటీపడ్డారు. ఆయనని దగ్గరి నుండి చూడాలనే ఉద్దేశంతో.. ఫెన్సింగ్‌ను కూడా లెక్కచేయకుండా ముందుకు రావడంతో.. అది ముందుకి ఒరిగిపోయింది. దీనితో క్షణాల వ్యవధిలో విద్యార్థులు ఒకరిపై ఒకరు పడిపోయారు.


ఇది చూసిన వెంటనే విజయ్ (Vijay) ముందుకి కదిలి వచ్చాడు. రావడమే కాదు.. ఆ ఫెన్సింగ్ పైకి లేపే ప్రయత్నం కూడా చేశాడు. ఆయనతో పాటు.. తన పక్కనే ఉన్న సహాయక సిబ్బంది మరియు సెక్యూరిటీ కూడా ఆ ఫెన్స్‌ని పైకి లేపేందుకు సహకరించారు. ఈ పూర్తి సంఘటనని అక్కడున్న వారు ఒకరు వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోని "ఫ్యాన్స్‌ని కాపాడిన విజయ్" అనే టైటిల్ పెట్టి అంతర్జాలంలో విడుదల చేయడంతో అది వైరల్ న్యూస్‌గా మారింది.


దీనితో ఆయన ఫ్యాన్స్ అందరూ.. "మా హీరో రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో సైతం హీరోనే" అంటూ తమ హీరోని పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే మిగతా ఫ్యాన్ క్లబ్ పేజీల్లో కూడా "తమ హీరో మాత్రమే గొప్ప" అనే రీతిలో పోస్టులు పెట్టారు. తమ అభిమాన హీరోను.. మిగతా హీరోలతో పోల్చుతూ.. యాంటీ ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే  ఇలా చిన్న చిన్న విషయాలని పట్టుకుని తమ హీరో మాత్రమే గొప్ప అని అనడం కన్నా.. పెద్ద మూర్ఖత్వం ఇంకొకటి లేదంటూ అవతలి ఫ్యాన్స్ కూడా సమాధానాలు చెప్పడం గమనార్హం.ఏదేమైనా..ప్రస్తుతం ఈ వార్త ట్రెండ్ అయితే అయింది. ఇంతకీ విజయ్ చేసింది చాలా గొప్ప పని అని అభిమానులు చెప్పినా.. చెప్పకపోయినా.. ఆయన మాత్రం తన కళ్ళ ముందు జరిగినదానికి సగటు మానవుడిలా స్పందించాడన్నది మాత్రం నిజం...


ఇవి కూడా చదవండి


జయలలిత బ‌యోపిక్ "తలైవి" గురించి.. ఆసక్తికర విశేషాలు


వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న.. ప్రేమ పక్షులు - ఆర్య & సాయేషా


రూప‌మే కాదు.. సాయిప‌ల్ల‌వి మ‌న‌సూ అంద‌మైన‌దే..!