ఈ భూమి మీద అస‌లు మ‌హిళ‌ లేక‌పోతే.. ఎలా ఉంటుందో మీరు ఊహించ‌గ‌ల‌రా?

ఈ భూమి మీద అస‌లు మ‌హిళ‌ లేక‌పోతే.. ఎలా ఉంటుందో మీరు ఊహించ‌గ‌ల‌రా?

మ‌హిళ‌ (Woman).. పురుషునిలో స‌గ‌భాగం అని చెప్పడ‌మే త‌ప్ప ఆ మాట‌ల‌ను చేత‌ల్లో చూపించేవారు ఎంత‌కంతే అని చెప్పుకోవ‌చ్చు. అంతెందుకు.. తెల్లారింది మొద‌లు.. మ‌ళ్లీ రాత్రి నిద్రించేంత వ‌ర‌కు త‌మ రోజువారీ జీవితంలో స్త్రీ పాత్ర లేనిదే చాలామంది పురుషుల‌కు రోజు గ‌డ‌వ‌దంటే అతిశ‌యోక్తి కాదు.. ఈ క్ర‌మంలో అస‌లు ఈ భూమ్మీద అస‌లు ఆడ‌వారే లేక‌పోతే ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం రండి...


అది భాగ్య‌న‌గ‌రంలోని ఏఎస్‌రావు న‌గ‌ర్ కాల‌నీ.. స్ట్రీట్ నం. 5లో ఉండే శ్రీనివాస్ రావు దంప‌తులు ఇద్ద‌రూ గొడ‌వ‌ప‌డుతున్నారు.


ఏమండీ.. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఉద‌యాన్నే లేచి పిల్ల‌లిద్ద‌రినీ ర‌డీ చేసి, వంట‌, ఇంటిప‌ని అన్నీ చేసి ఆఫీస్‌కి వెళ్లి మీ త‌ర్వాతేగా నేను తిరిగొచ్చేది.. మ‌ళ్లీ ఇంటికొచ్చాక నేనే ఇంటిప‌నుల‌న్నీ చేస్తున్నా. పిల్ల‌ల హోమ్‌వ‌ర్క్ కూడా చేయిస్తున్నా. ఇంకా నేనేం చేయ‌ట్లేదు అనకండీ నాకు కోప‌మొస్తుంది.


కోప‌మొస్తే ఏం చేస్తావే.. మ‌హా అయితే ఏడుస్తావు.. అంత‌కంటే ఇంకేం చేయ‌లేవులే..


ఏ త‌ప్పూ చేయ‌ని న‌న్ను అంటే ఆ దేవుడు మీకు త‌గిన శిక్ష వేస్తాడు. ఆ శిక్ష‌తో ఒక్క నా విలువే కాదు.. ఆడ‌వాళ్లంద‌రి విలువా తెలుస్తుంది. అప్పుడు మీరు మ‌మ్మ‌ల్ని బాగా చూస్తారు. దేవుడా.. ప్లీజ్ ఒక్క‌సారి ఈయ‌న‌కు ఆడ‌వాళ్ల విలువేంటో తెలిసేలా చూడు..


పైన వైకుంఠంలో శేష‌త‌ల్పంపై ప‌డుకొని నిద్రిస్తున్న శ్రీ మ‌హావిష్టువుకి కాళ్లు వ‌త్తుతున్న‌ ల‌క్ష్మీ దేవి ఈ స‌మ‌స్య‌ల‌ను తీర్చి ఆడ‌వారి విలువ మ‌గ‌వారికి తెలియ‌జేయాల‌ని భావించింది. అందుకే త‌న భ‌ర్తకు ఓ ఆదేశంలాంటి స‌ల‌హా ఇచ్చింది. అదే- భూమి మీదున్న ఆడ‌వాళ్లంద‌రినీ చిన్న పిల్ల‌ల‌తో సహా ఒక రోజంతా మాయం చేయాలి అని..! భార్య చెప్పిన మాట న‌చ్చి శ్రీహ‌రి కూడా స‌రేనంటాడు.


food


రాత్రి కోపంతో అన్నం తిన‌కుండా ప‌డుకున్నాడు శ్రీనివాస్ రావు. ఉద‌యాన్నే ఆరు గంట‌ల‌కు నిద్ర‌ లేచే సరికే క‌డుపులో ఎలుక‌లు ప‌రిగెడుతున్నాయి. భార్య త్వ‌ర‌గా ఏదో ఒక‌టి చేస్తే బాగుండు.. టిఫిన్ త్వ‌రగా చేయ‌మ‌ని చెప్పాలి అనుకుంటూ లేచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఇల్లంతా రాత్రి ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే చింద‌ర‌వంద‌ర‌గా ఉంది. రోజూ ఇంటి ముందు వూడ్చి ముగ్గులు పెట్టి, తుల‌సి కోట‌కు పూజ చేసి.. వాకిలంతా ఎంతో అందంగా క‌నిపించేది. కానీ ఇప్పుడు అక్క‌డ ఏ మాత్రం క‌ళ లేదు. దేవుళ్ల ఫొటోలు కూడా వాడిపోయిన పువ్వుల‌తో క‌ళ లేకుండా క‌నిపిస్తున్నాయి. అస‌లేమైందీ శైల‌జ‌. ఎక్క‌డికి వెళ్లింది.. అంటూ ఇల్లంతా వెతికాడు. కానీ భార్య క‌నిపించ‌లేదు. రాత్రి జ‌రిగిన గొడ‌వ‌కి పుట్టింటికేమైనా వెళ్లిందేమో అని పిల్ల‌ల గ‌దికి వెళ్లి చూస్తే బాబు మాత్రమే ఉన్నాడు. పాప లేదు. బ‌య‌ట‌కు కానీ వెళ్లిందేమోన‌ని ప‌క్కింటివాళ్ల‌ను అడిగేందుకు వెళ్తే అక్క‌డ ప‌క్కింటాయ‌న‌ కూడా వాళ్లావిడ క‌నిపించ‌లేద‌ని కంగారు ప‌డుతున్నాడు. వీధిలో అంద‌రు మ‌గాళ్లూ ఇదే ప‌రిస్థితిలో ఉన్నారు.. ఈ ఆడ‌వాళ్లంద‌రూ ఎక్క‌డికి వెళ్లార‌బ్బా.. అంటూ ఆలోచిస్తుండ‌గానే బాబు ఏడుపు ప్రారంభించాడు. దీంతో పాలు మ‌ర‌గ‌బెట్టి కొన్ని బాబుకి పోసి, కొన్ని త‌ను తాగి.. ఎలాగో వాడికి స్నానం చేయించాన‌నిపించి, తాను ర‌డీ అయ్యి వాడిని తీసుకొని బ‌య‌ల్దేరాడు.


మ‌ద్య‌లో క‌డుపు న‌క‌న‌క‌లాడ‌డంతో ఎలాగూ బాబుకి కూడా మ‌ధ్యాహ్నానికి టిఫిన్ పెట్టాల‌ని గుర్తొచ్చి మ‌ధ్య‌లో ఉన్న ఓ టిపిన్ సెంట‌ర్ ద‌గ్గ‌ర బండి ఆపాడు. అక్క‌డ టిఫిన్ చాలా రుచిక‌రంగా ఉంటుంది. అక్క‌డున్న ఆంటీ చేయి ప‌డితే చాలు.. ప్లెయిన్ దోశైనా నోట్లో నీళ్లూరాల్సిందే.. కానీ ఈ రోజు అక్క‌డా ఆంటీ లేదు. అంకుల్ మాత్ర‌మే ఉన్నాడు. స‌ర్లే అని టిఫిన్ తీసుకొని తాను కొంచెం తిని బాబుకి పెట్టాడు. గ‌డ్డిలా ఉన్న ఆ టిఫిన్ తిన‌లేక ఇద్ద‌రూ స‌గం తిని బ‌య‌ల్దేరారు.


రోజూ స్కూల్లో బాబును తీసుకునే టీచ‌ర్లు, ఆయాలు లేక‌పోవడం చూసి స్కూల్‌కి కూడా వెళ్ల‌నని మారాం చేసి ఏడుస్తూనే లోప‌లికి వెళ్లాడు బాబు. ఆపై ఆఫీస్ దారి ప‌ట్టాడు శ్రీనివాస్. దారిలో ఎక్క‌డ చూసినా మ‌గ‌వాళ్లే త‌ప్ప ఆడ‌వాళ్లు అస్స‌లు క‌నిపించ‌లేదు.


office


బాబుని ర‌డీ చేయ‌డంతో ఆఫీస్ కి ఆల‌స్య‌మైంది. బాస్ ఏమంటాడో అనుకుంటూ లోప‌లికి వెళ్లిన అత‌న్ని బాస్ గుర్రుమంటూ ఓ చూపు చూసి.. అయోధ్య కంపెనీకి ఇవ్వాల్సిన కొటేష‌న్ తాలూకు ఫైల్ తీసుకురా.. అంటూ చెప్పాడు. ఆ మాట విన‌గానే గ‌తుక్కుమ‌న్నాడు శ్రీనివాస్‌. ఆ కొటేష‌న్ తాను, త‌న కొలీగ్ మృదుల క‌లిసి హ్యాండిల్ చేశారు. క‌లిసి చేశారు అనడం కంటే మృదుల చేస్తే తాను అందులో స‌గం క్రెడిట్ తీసుకున్నాడ‌ని చెప్ప‌డం స‌రైన‌దేమో.. ఇప్పుడు మృదుల లేదు. ఫైల్ ఎక్కడుందో తెలీదు. తిరిగి ప‌నిచేయాల‌న్నా దాని గురించి త‌న‌కు వివ‌రాలేమీ తెలీవు. ఏం చేయాలో పాలు పోలేదు. స‌రేన‌ని బాస్ క్యాబిన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు కానీ ఏం చేయాలో తెలీలేదు. కాసేపాగి ఆఫీస్ నుంచి బ‌య‌ట ప‌డ‌డ‌మే దీనికి చ‌క్క‌టి ప‌రిష్కారం అనుకున్నాడు. దీంతో త‌న‌కు తెలిసిన‌వాళ్ల‌కి ప్ర‌మాదం జ‌రిగింద‌ని అర్జంటుగా వెళ్తున్నానని చెప్పి బ‌య‌ట‌కొచ్చేశాడు.


వ‌చ్చేశాడే కానీ ఏం చేయాలో పాలు పోలేదు శ్రీనివాస్‌కి.. ఏదైనా సినిమాకి వెళ్దాం అనుకున్నాడు.. థియేట‌ర్‌లోకి వెళ్లి కూర్చుంటే ఎంత‌కీ హీరోయిన్ రాదే.. ఎప్పుడూ హీరోనే ఫైట్లు, మాట‌లు.. ఎంత‌క‌ని చూస్తాం. ఓ రొమాన్స్‌, ఓ మాస్ లేనిది.. దాంతో చిరాకొచ్చి బ‌య‌ట‌కొచ్చేశాడు. షాపింగ్‌కి వెళ్దామ‌నుకున్నాడు కానీ చాలా షాపులు మూసేసి ఉన్నాయి. తెరిచి ఉన్న షాప్స్‌లోనూ ఎవ‌రూ లేరు. ఎందుకంటే సేల్స్‌గ‌ర్ల్స్ లేరుగా..! దీంతో ఎక్క‌డికైనా వెళ్లి భోజ‌నం చేయాల‌నుకున్నాడు. మంచి హోట‌ల్‌కి వెళ్లి ఫుడ్ ఆర్డ‌ర్ ఇచ్చాడు. ఆక‌లిగా ఉంది ఫుల్‌గా తిందాం అనుకున్నాడు కానీ ఎవ‌రి కంప‌నీ లేకుండా ఒక్క‌డే తిన‌డం అంత‌గా న‌చ్చ‌లేదు. దీంతో స‌గంలోనే ఆపేసి బిల్ క‌ట్టేసి వ‌చ్చేశాడు. పార్క్‌కి వెళ్తే అక్క‌డా బోసిపోయిన‌ట్లుగానే ఉంది. పిల్ల‌లు, త‌ల్లులు ఎవ‌రూ లేరు క‌దా..


అక్క‌డి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. వెళ్లి టీవీ పెట్టాడు.. టీవీలో వార్త‌లు కూడా మ‌గ‌వాళ్లే చ‌దువుతున్నారు. ఆడ‌వాళ్లు స‌డ‌న్‌గా మాయ‌మైపోవ‌డం గురించే వార్త‌ల‌న్నీ.. ఫ్లైట్‌లో అటెండెంట్స్ లేర‌ని చాలామంది ప్యాసెంజ‌ర్స్ విమానం ఎక్క‌డమే మానేశార‌ట‌. షాపులు, బ్యాంకులు, హాస్పిటళ్లు అన్నీ మూత‌బ‌డిపోయాయ‌ట‌. ఇలాగైతే మ‌న‌కు భ‌విష్య‌త్తు ఉండ‌దు. జ‌నాభా పెర‌గ‌దు. మ‌నం ఇక్క‌డితోనే అంతం అయిపోతాం.. అంటూ వార్త‌ల్లో చెబుతున్నారు. ఇదంతా వింటుంటే రాత్రి త‌న భార్య చెప్పిన.. నేను లేక‌పోతే నా విలువ మీకు తెలుస్తుంది - అన్న‌మాట గుర్తొచ్చి క‌ళ్ల‌ వెంట నీళ్లు వ‌చ్చాయి శ్రీనివాస్‌కి.


teach


చుట్టూ చూస్తే ఇల్లంతా ఎంతో క‌ళావిహీనంగా క‌నిపించింది. రోజూ త‌న భార్య ఏం చేస్తుందిలే.. ఇంటి పనులు చేయ‌డం త‌న బాధ్య‌త అనుకున్నాడే త‌ప్ప త‌న‌కీ కాస్త విశ్రాంతి కావాల‌ని అనుకోలేదు. ఇక‌పై త‌ను తిరిగొస్తే స‌గం ప‌నులు త‌ను పంచుకుంటాన‌ని.. ఎప్పుడూ త‌న‌ని చుల‌క‌న చేసి మాట్లాడ‌న‌ని అనుకుంటూ ఉండ‌గానే బాబు స్కూల్ నుంచి ఫోన్ వ‌చ్చింది. స్కూల్లో టీచ‌ర్లు ఎక్కువ‌మంది లేక‌పోవ‌డం వ‌ల్ల పిల్ల‌లంద‌రినీ చూసుకోవ‌డం క‌ష్టంగా ఉంద‌ని వ‌చ్చి తీసుకెళ్ల‌మ‌ని ఫోన్‌. ఆ ఫోన్‌కాల్ చూడ‌గానే అమ్మ‌కి ఫోన్ చేయాల‌నిపించింది. త‌న బాధ చెప్పుకొని ఏడ‌వాల‌నిపించింది. కానీ ఫోన్ మొత్తం వెతికినా అమ్మ నంబ‌ర్ క‌నిపించ‌లేదు. నాన్న‌కి ఫోన్ చేస్తే అమ్మ కూడా క‌నిపించ‌ట్లేద‌ని అర‌వై ఏళ్ల నుంచి అన్ని ప‌నులూ త‌ను చేస్తుంటే త‌న విలువ తెలియ‌లేద‌ని బాధ‌ప‌డ్డాడు నాన్న‌. దీంతో నిజంగానే ఆడ‌వాళ్ల విలువ తెలిసొచ్చింద‌నుకుంటూ బాబుని తీసుకురావ‌డానికి స్కూల్‌కి బ‌య‌ల్దేరాడు శ్రీనివాస్‌.


బైట త‌న బోర్డుపై శ్రీనివాస్ రావులో శ్రీ క‌నిపించ‌క‌పోవ‌డం చూసి శ్రీ అంటే ల‌క్ష్మి. మా ఇంటి ల‌క్ష్మి లేక‌పోతే నా జీవితం, నా పేరు రెండూ అసంపూర్ణ‌మే.. అనుకుంటూ చాక్‌పీస్‌తో త‌న‌పేరుని తిరిగి రాసుకొని బ‌య‌ల్దేరాడు. వ‌స్తూ వ‌స్తూ రాత్రి తిన‌డానికి భోజ‌నం తెచ్చుకొని రాగానే బాబు ప‌నుల‌న్నీ చూసేస‌రికి అలిసిపోయిన‌ట్లుగా అనిపించింది. రోజూ ఆఫీస్ ప‌నులు చేసినా ఇలా ఉండ‌దు. అలాంటిది శైల‌జ అటు ఆఫీస్‌, ఇటు ఇల్లు రెండు ప‌నులు ఎలా చేసుకుంటుందో. త‌ను నిజంగా దేవ‌త అనుకుంటూ బాబుకి అన్నం తినిపించి ప‌డుకోబెట్టాడు. మ‌న‌సులో ఉన్న బాధ‌, సంతోషం.. వంటి భావాల‌ను పంచుకోవ‌డానికి ఎవ‌రూ లేక‌, కుటుంబ, వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు సంబంధించి చ‌క్క‌ని స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చేవారు లేక‌.. చాలా ఒంట‌రిగా అనిపించింది అత‌నికి. దీంతో దేవుడా.. ఒక్కసారి నా భార్య‌ని తిరిగి నా ద‌గ్గ‌ర‌కు పంపించేయ్‌.. నేను మ‌ళ్లీ జీవితంలో ఎప్పుడూ త‌న‌ని చిన్న‌చూపు చూడ‌ను. త‌న‌కు అన్నింట్లోనూ సాయం చేస్తాను. అంటూ వేడుకొని ప‌డుకున్నాడు.


daught


ఉద‌యం లేచి చూసేస‌రికి త‌న భార్య శైల‌జ వంటింట్లో ప‌ని చేస్తోంది. ఇల్లు, వాకిలి ఎంతో శుభ్రంగా ఉన్నాయి. వెంట‌నే దేవుడా నా కోరిక నెర‌వేర్చావు.. అంటూ భార్య ద‌గ్గ‌రికి వెళ్లి త‌న‌ని కౌగిలించుకొని నేను త‌ప్పు చేశాను. ఇప్పుడు నీ విలువ నాకు తెలిసింది. ఈ రోజు నుంచి ప్ర‌తి ప‌ని మ‌నిద్ద‌రిదీ.. అంటున్న భ‌ర్త‌ను చూసి అస‌లేం జ‌రిగిందో అర్థం కాని శైల‌జ తల‌గోక్కుంది.


పైన వైకుంఠంలో శ్రీమహాల‌క్ష్మి.. చూశారా? ఒక్క‌రోజు ఆడ‌వాళ్లు లేకుండా చేస్తానంటే దాని వ‌ల్ల‌ ఏం మార్పు వ‌స్తుంది అన్నారు.. ఇప్పుడేమంటారు అని అడిగింది.. అందుకేగా.. నేనూ నీ ప్రేమ దాసుడ‌నైంది అంటూ న‌వ్వాడు శ్రీహ‌రి..!


ఇవి కూడా చ‌ద‌వండి..


బ్రేక‌ప్ అయినా వాలెంటైన్స్ డే.. ఇలా సెల‌బ్రేట్ చేసుకోవ‌చ్చు..!


ఆడ‌పిల్ల‌లంటే ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే..! ఎందుకో మీకు తెలుసా??


అమ్మాయిలూ.. 2019లో ఈ మాట‌లు మీరు త‌ప్ప‌క‌ చెప్పాల్సిందే..


Images : Pixabay, shutterstock