పెళ్లి (Marriage).. మన జీవితాన్ని పంచుకునేందుకు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని పెద్దల సమక్షంలో వారితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టే సంప్రదాయ తంతు. అయితే ఈ విషయంలో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకోవాలా? లేక పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని అంగీకరించి పెళ్లి చేసుకోవాలా అని కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జీవితాంతం మనతో కలిసి నడిచే భాగస్వామిని ఎంపిక చేసుకునే సమయంలో ఇలాంటి గందరగోళం ఉండడం సహజమే.
ఎందుకంటే వీటిలో దేని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. ప్రేమ పెళ్లి (Love marriage) ద్వారా మన గురించి వారు, వారి గురించి మనం పూర్తిగా తెలుసుకుని జీవితాన్ని ముందుకు కొనసాగించేందుకు సులభంగా ఉంటే; పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల ద్వారా ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటూ, సమస్యలు వచ్చినప్పుడు పెద్దల సహకారంతో వాటిని పరిష్కరించుకుంటూ మరింత అన్యోన్యంగా ఉంటూ భాగస్వామి గురించి రోజూ కొత్త కొత్త విషయాలు తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది.
అయితే ఈ రెండింట్లో ఏది మంచిది అంటే మాత్రం అది ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అందుకు వీలుగా ఇక్కడ కొన్ని అంశాలను మేం చెప్పాలని అనుకుంటున్నాం. అవి..
1. పెళ్లికి ముందు..
ప్రేమ పెళ్లి: మేమిద్దరం గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నాం. మా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. అతని భయాలు, కలలు, మునుపు ఉన్న బంధాలు.. ఇవన్నీ నాకు బాగా తెలుసు. అయినా సరే.. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అతనితోనే కలిసి జీవించాలని అనుకుంటున్నాను.
ప్రేమ పెళ్లిలో అవతలి వ్యక్తిలో ఉన్న లోపాలను కలుపుకొని వారిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తాం. అందుకే ఆ ప్రయాణం చాలా బాగుంటుంది అనిపిస్తుంది.
పెద్దలు కుదిర్చిన పెళ్లి: నా తల్లిదండ్రులు ఈ సంబంధం ఫిక్స్ చేశారు. కుటుంబం, కెరీర్, ఆలోచనలు.. మొదలైన విషయాలన్నింటిలోనూ నాకు తగిన వ్యక్తినే భాగస్వామిగా వారు ఎంపిక చేశారు. అతన్ని కలవమని నాకు చెప్పారు. కానీ నిజానికి అతని గురించి నాకు పెద్దగా వివరాలేమీ తెలియవు. కనీసం అతను ఎలాంటివాడో కూడా తెలీదు. అయినా సరే.. తల్లిదండ్రులపై ఉన్న నమ్మకంతో అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొన్నా. మా అమ్మానాన్నల మాటకు నేనెప్పుడైనా కాదని చెప్పానా??
2. పెళ్లి గురించి నిర్ణయం..
ప్రేమ పెళ్లి: ఇది కేవలం కలిసి జీవించాలనుకునే ఇద్దరు వ్యక్తులు మాత్రమే తీసుకునే నిర్ణయం. ఇందుకు మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే జీవితంలో ఉన్న కొన్ని కష్టసుఖాల్లో ఇద్దరూ కలిసి పాలుపంచుకున్నారు. మరి, జీవితాన్ని పంచుకునే విషయంలో ఇంకొకరి నిర్ణయంతో పనేముంది??
పెద్దలు కుదిర్చిన పెళ్లి: ఈ పెళ్లికి నేను ఒప్పుకునేలా చేసింది మా అమ్మానాన్నే. నేను అతన్ని కలిశాను. కానీ ఒక్కసారి కాసేపు కలుసుకుని మాట్లాడడం ద్వారా ఎదుటి వ్యక్తిని పూర్తిగా అంచనా వేయడం లేదా వారి గురించి తెలుసుకోవడం అసంభవం. ఆ సమయంలో వారిలో ఎలాంటి లోపాలు కనిపించకపోతే ఆ పెళ్లి ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది.
3. పెళ్లి రోజు..
ప్రేమ పెళ్లి: ప‌్రేమించిన వ్యక్తితో కలిసి నా జీవితాన్ని పంచుకోవడానికి ఎంతగానో పోరాడాను. అతన్ని నా భర్తగా చేసుకోవడానికి, మరింత సమయం సరదాగా పోట్లాడుకుంటూ గడపడానికి ఎంతో శ్రమించా. తీరా ఆ క్షణం వచ్చిన వేళ నా మనసులో ఎన్నో ఎమోషన్స్. ఏదో సాధించానన్న సంతోషం. జీవితంలో ఒక దశ నుంచి మరో దశలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. దీని కంటే ఉత్తమమైన క్షణం నా జీవితంలో ఇంకేదీ లేదని అనిపించింది.
పెద్దలు కుదిర్చిన పెళ్లి: పెళ్లి జరిగే క్షణంలో చాలా టెన్షన్ పడ్డా. నా జీవితంలో నేను తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఇదే అని నాకు అనిపించింది. అది కూడా కేవలం నా తల్లిదండ్రులపై ఉన్న నమ్మకంతోనే తీసుకున్న నిర్ణయం. ముఖ్యంగా పెళ్లయ్యాక వచ్చే తొలిరేయి నిజంగా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు మనకు తెలియని, పరిచయం లేని ఒక వ్యక్తితో మనం కలిసి పడుకోవాలి. ఇది నన్ను చాలా కలవరపెట్టింది.
4. వైవాహిక జీవితం ప్రారంభించిన తొలిరోజుల్లో..
ప్రేమ పెళ్లి: ప‌్రేమించిన వ్యక్తిని పెళ్లాడి వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన తర్వాత అతని గురించి నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయని అర్థమైంది. ఆ విషయాలేవీ ఆయన నా బాయ్ ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు నాకు తెలియలేదు. ఈ క్రమంలోనే మా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కూడా వచ్చాయి. అయితే మా మధ్య ఉన్న ప్రేమ ముందు అవి గట్టిగా నిలవలేకపోయాయి. అంతేకాదు.. తన కుటుంబ సభ్యులతో నేను కలిసిపోయేందుకు నా భర్త నాకు చాలా సహకరించారు. నా అత్తామామలకు ఇష్టం లేకపోయినా నా అభిరుచులు, ఇష్టాయిష్టాలకు ఆయన అంగీకారం తెలిపారు.
పెద్దలు కుదిర్చిన పెళ్లి: ఇది కుటుంబ సభ్యులు కుదిర్చిన బంధం. అందుకే మా మధ్య ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించేందుకు వారెప్పుడూ మాకు సహకరిస్తూనే ఉన్నారు. అంతేకాదు.. వారి కుటుంబంలో అందరితోనూ కలిసిపోయేందుకు వీలుగా వారి పద్ధతులు, సంప్రదాయాలు, ఆచారవ్యవహారాల గురించి వారే నాకు అన్నీ తెలియజేశారు. అయితే తెలియని ఒక కొత్త వ్యక్తితో కలిసి జీవించడానికి ఉన్న ఇబ్బంది అతనితో కలిసి గదిని పంచుకోవడానికి ఉండకపోవచ్చు. ఎందుకంటే రోజూ మీరు అతని గురించి ఏదో ఒక విషయం తెలుసుకుంటూనే ఉంటారు. అవి మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో మీ బంధం దీర్ఘకాలం కొనసాగుతుందా? లేదా?? అనే సందేహం కూడా మీకు రాదు. కారణం.. అతనిలో మీకు.. మీలో అతనికి తెలియాల్సిన కోణాలు చాలానే ఉంటాయి. అవి తెలుసుకుంటూ జీవితాన్ని గడిపే క్రమంలో మీ బంధం ఆటోమేటిక్ గా గట్టిపడుతుంది.
5. బాధ్యతల విషయంలో..
ప్రేమ పెళ్లి: నాకు ఉన్న లక్ష్యాలు, భవిష్యత్తు గురించి ఉన్న నిర్దిష్టమైన అభిప్రాయాలు నా భర్తకు బాగా తెలుసు. నేను చేసే పనిలో పైకి ఎదగాలంటూ నా భర్త నన్ను ఎల్లవేళలా ప్రోత్సహిస్తూనే ఉంటారు. అన్నింటికంటే సంతోషకరమైన విషయం ఏంటంటే బాధ్యతలను మేమిద్దరం కలిసి పంచుకుంటాం.
పెద్దలు కుదిర్చిన పెళ్లి: మా విషయంలో తీసుకునే నిర్ణయాల్లో మా అత్తామామల జోక్యం కూడా ఉంటుంది. మీ గురించి మీ భర్త, అత్తమామలు అర్థం చేసుకుంటే ఫర్వాలేదు. లేదంటే ఈ విషయంలో కాస్త ఇబ్బందికరంగానే అనిపించవచ్చు.
6. పెళ్లై కొన్నేళ్లు గడిచాక..
ప్రేమ పెళ్లి: సందర్భానుసారంగా పోట్లాడుకున్నప్పటికీ.. గతంలో చేసిన పొరపాట్ల గురించి మళ్లీ మళ్లీ మాట్లాడినప్పటికీ ఈ బంధం అంతే ప్రేమగా కొనసాగుతుంది. ఇలా ప్రేమించిన వ్యక్తితో కలిసి జీవితం పంచుకోవడం అద్భుతంగా అనిపిస్తుంది.
పెద్దలు కుదిర్చిన పెళ్లి: ఇప్పటికి పెళ్లై కొన్ని ఏళ్లు గడిచాయి. పిల్లలు కూడా పుట్టారు. మంచైనా, చెడైనా ఇద్దరం ఒకరిని మరొకరు అంగీకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. కాలం గడిచే కొద్దీ మా బంధం మరింత గట్టి పడడమే కాదు.. అతని కుటుంబం కూడా నా కుటుంబంగా మారిపోయింది.
7. జీవిత భాగస్వామి విషయంలో..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా లేక పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నా ఆ బంధం ఎంత కాలం నిలుస్తుందన్నది కేవలం ఆ భార్యా భర్తలపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వారి మధ్య ఉన్న నమ్మకం, పరస్పరం కురిపించుకునే ప్రేమానురాగాలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. జీవితాన్ని పంచుకోవడానికి తగిన వ్యక్తిని ఎంపిక చేసుకుంటే అది ప్రేమ పెళ్లైనా లేక పెద్దలు చేసిన పెళ్లైనా జీవితం అద్భుతంగా ముందుకు కొనసాగుతుందని గుర్తుంచుకోండి.
GIFs: Tumblr
ఇవి కూడా చదవండి
ఆలుమగల ఆనంద దాంపత్యానికి అద్దం పట్టే.. అద్భుత చిత్రాలు..!
#నా కథ: మనల్ని మనం ప్రేమించుకుంటేనే ఇంకొకరు మనల్ని ప్రేమిస్తారు..!
పాఠశాల నుంచి పరిణయం వరకు.. సాగిన ఈ ప్రేమకథ అద్భుతం..!