పెళ్లి లేదా వివాహం (Marriage) – ప్రతిఒక్కరి జీవితంలోనూ ఎంతో ప్రధానమైన ఘట్టం. పెళ్లంటే నూరేళ్ల పంటని కొందరంటే.. కాదు.. పెళ్లంటే నూరేళ్ల మంటనేవాళ్లు కూడా ఉన్నారు ఈ రోజుల్లో! కానీ ఒక పెళ్లితో వధువరుల జీవితాలు పరస్పరం ముడిపడడం మాత్రమే కాదు.. కుటుంబ సభ్యుల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పడి వారి జీవితాలను మరింత సంతోషమయం చేస్తాయి.
అయితే ఈ పెళ్లి అనే ఘట్టంలో ముఖ్యమైన పర్వాలు చాలానే ఉంటాయి. పెళ్లి శుభలేఖలు (wedding cards) ముద్రించడం, వాటిని పంచిపెట్టడం, బంధువులు- స్నేహితులను పెళ్లికి ఆహ్వానించడం, పెళ్ళికొడుకు/ పెళ్లికూతురిని చేయడం.. ఇలా ఎన్నో వేడుకలు అందులో భాగమే. ముఖ్యంగా పెళ్లి శుభలేఖలను ఎంపిక చేసి. ముద్రించి పంచి పెట్టడం చాలా సులభం అనుకుంటారు. కానీ వ్యయ, ప్రయాసలతో కూడిన దానంత గొప్ప ప్రహసనం లేదంటే లేదని చెప్పవచ్చు.
ఈ క్రమంలో నా వివాహం కుదిరిన తర్వాత.. పెళ్లి శుభలేఖల కోసం నేను పడిన శ్రమ, ఈ క్రమంలో నాకు ఎదురైన చిత్రమైన అనుభవాలను మీ అందరి ముందు ఉంచాలని అనుకుంటున్నా. అవేంటంటే-
“మా ఇంట్లో జరిగే పెళ్లి వేడుకకు.. మీ కుటుంబ సభ్యులంతా సపరివార సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించండి..” అంటూ సంప్రదాయబద్ధంగా మనం బంధుమిత్రులందరినీ పెళ్లికి ఆహ్వానిస్తాం. అందులో భాగంగానే ఒక అందమైన శుభలేఖను వారి చేతుల్లో పెట్టి పెళ్లి పిలుపులకు ఆహ్వానం పలుకుతాం.
బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను పెళ్లికి ఆహ్వానించే ఈ శుభలేఖను ఈ రోజుల్లో ఎవరికి వారు వారి తమ అభిరుచికి తగ్గట్లుగానే డిజైన్ చేయించుకుంటున్నారన్న సంగతి తెలిసిందే.
Image: Inksedge on Instagram
నేనూ అంతే మరి..! అందుకే పెళ్లి కుదిరిన వెంటనే కార్డుల కోసం వేట ప్రారంభించా. మీకు చెప్పలేదు కదూ..! కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు..! అనే సామెత చాలామంది వినే ఉంటారు. నా విషయంలో ఇది నూటికి నూరు శాతం సరిపోతుందని చెప్పచ్చు.
ఎందుకంటే అనుకోకుండానే మంచి సంబంధం రావడం, ఆ వెంటనే ఆ అమ్మాయికి, నాకు నిశ్చితార్థమవడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. వీటికి తోడు పెళ్లికి కూడా ఎక్కువ వ్యవధి లేదు. కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉంది. అందుకే నిశ్చితార్థం జరిగిన వెంటనే శుభలేఖల డిజైన్స్ కోసం వేట ప్రారంభించా.
పెళ్లికి గడువు చాలా తక్కువగా ఉండడం, అమ్మానాన్నలు వేరే ఊరిలో ఉండడంతో ఈ శుభలేఖల తంతుని నేను ఒక్కడినే చూసుకోవాల్సి వచ్చింది. అయితేనేం.. నా స్నేహితులకు ఈ విషయంలో ఇంతకుముందు కాస్త సహాయం చేసి ఉండడంతో .. అదే అనుభవంతో ఈ పని సులభంగా అయిపోతుందని అనుకున్నాను.
Images: Unique cards on Instagram
అనుకున్నదే తడవుగా.. హైదరాబాద్‌లోని ఇమ్లిబన్ బస్టాండ్ దగ్గరలోని గౌలిగూడ ప్రాంతానికి వెళ్లి అక్కడున్న షాపులన్నీ తిరిగి కార్డు ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నా.
కార్డుులు ఎక్కడ తీసుకోవాలన్న విషయం ఓకే. మరి, కార్డుకి ఎంత ధర పడుతుంది? అందులో ఏమేమి వివరాలు ఉండాలి? ప‌్రింటింగ్‌తో అయితే ఎంత ధర అవుతుంది?? ప‌్రింటింగ్ లేకుండా కార్డ్స్ ఎంతవుతాయి?? మొదలైన ప్రశ్నలకు మనకు సమాధానాలు కావాలి కదా..!
ఆ సమాధానాల బట్టే కదా.. మనకు ఒక అవగాహన ఏర్పడి, దాని ఆధారంగా ఎలాంటి డిజైన్ కార్డ్స్ తీసుకోవాలి? అనే నిర్ణయాన్ని తీసుకోగలం.
అందుకే ముందుగా ఒక షాపులోకి ప్రవేశించి.. అక్కడున్న డిజైన్స్‌ను పరికించి చూడడం మొదలుపెట్టా. వాస్తవానికి ఆ డిజైన్స్ ఏవీ నన్ను అంతగా ఆకట్టుకోలేదు. అవి చూస్తుండగానే అక్కడున్న ఒక కుర్రాడు వచ్చి నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. “నా పెళ్లికి కూడా ఇక్కడే కార్డ్స్ తీసుకున్నానండీ” అంటూ నాతో నమ్మబలికాడు. తప్పేముంది… అది కూడా వ్యాపారసూత్రంలో ఒక భాగమే మరి..! వినియోగదారులను ఆకర్షించడానికి అలా చెబుతుంటారని నాకు తెలుసు.
Image: White Mirage Invites on Instagram
కానీ ఏం చేస్తాం.. మన సందేహాలకు సమాధానాలు కావాలి కదా..! అందుకే అతనితో మాట్లాడుతూ నా సందేహాలను క్రమంగా నివృత్తి చేసుకున్నా. కానీ ఆయన చూపించిన డిజైన్స్ నాకు పెద్దగా నచ్చలేదు. అందుకే.. అదే విషయం చెప్పి అక్కడి నుంచి వెనుదిరగబోయా.
ఇంతలో అతను “కొనకపోతే మా సమయం వృథా చేయడం దేనికో” అంటూ.. సణగడం మొదలుపెట్టాడు. దాంతో నాకు కోపం వచ్చింది. అలాగని అతన్ని ఏమీ అనలేం కదా..! అందుకే “ఇక్కడకు వస్తే తప్పనిసరిగా ఏదైనా కొనుగోలు చేయాలని.. రూలేమైనా రాసి పెట్టారా??” అంటూ నాదైన శైలిలో ఒక కౌంటర్ వేసి అక్కడి నుంచి వచ్చేశా.
ఆ ప్రాంతంలో ఇంకాస్త ముందుకు వెళ్తే.. కొన్ని షాపులే తెరచి ఉన్నాయి. ఆదివారం కావడం వల్ల సగం షాపులు తెరవనేలేదు. “పోనీ.. ఈ రోజు ఇంటికి వెళ్లిపోయి, రేపు మళ్లీ వచ్చి కార్డు సెలక్ట్ చేద్దాం” అని మనసులో అనుకున్నాను. కానీ సమయాభావం వల్ల ఆ అవకాశం నాకు చిక్కలేదు. అందుకే అక్కడున్న షాపుల్లోనే “ది బెస్ట్” ఎంపిక చేసి ముద్రణకు ఇచ్చేద్దాం అనిపించి మళ్లీ నా వేటను కొనసాగించా. ఇంకాస్త ముందుకు వెళ్లేసరికి ఒక షాపు ముందు డిస్ ప్లేలో ఉంచిన కార్డ్ డిజైన్స్ నా దృష్టిని ఆకర్షించాయి.
వెంటనే అక్కడకు వెళ్లా. కానీ అక్కడ కూడా నాకు ఓ వింత అనుభవం ఎదురైంది. షాపు ఎంట్రన్స్‌లోనే యజమాని, కస్టమర్లను దబాయిస్తున్నాడు. కచ్చితంగా కార్డులు కొనేవారు మాత్రమే లోపలికి రావాలని.. టైంపాస్ కోసమో.. ఆప్షన్స్ కోసమో అయితే రావద్దని నిర్మొహమాటంగా ఆయన చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అయినా తెగించి లోపలికి వెళ్లాను.
నాకు ఉన్న బడ్జెట్ ఎంత? ఎన్ని కార్డ్స్ ప్రింట్ కావాలి.. ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలు పూర్తైన తర్వాత.. ఒక్కొక్కటిగా అనేక డిజైన్స్‌ను నాకు చూపించడం మొదలుపెట్టాడు ఆ షాప్ కుర్రాడు. వాటిలో నాకు బాగా నచ్చిన మూడు డిజైన్స్‌ను సెలక్ట్ చేశా. కాకపోతే వాటిని ఫొటోలు తీసుకునేందుకు మాత్రం షాపు యజమాని మమ్మల్ని అనుమతించలేదు.
దాంతో అమ్మానాన్నలకు ఫోన్ చేసి కార్డ్ ఎలా ఉంటుందో వివరించా. వారు కూడా ఫలానా డిజైన్‌లో, ఫలానా కలర్ లేదా?? అంటూ కొన్ని సందేహాలు అడగడం.. వాటికి షాపు కుర్రాడి సహాయంతో నేను సమాధానాలివ్వడం అక్కడికక్కడే జరిగిపోయాయి.
అలా నేను ఫైనల్‌గా ఒక కార్డుని ఎంపిక చేసేసరికి.. ఒక పెద్ద తతంగం ముగిసిందన్నట్లు అనిపించింది. కానీ ఇదంతా ఒక ఎత్తైతే.. ఆ కార్డులో ఉండే వివరాలు – అవేనండీ.. వధూవరుల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, వివాహ వేదిక వివరాలు, పెళ్లి సమయం, రిసెప్షన్ జరిగే సమయం.. వంటివన్నీ కూడా ఇవ్వాలి కదా.
దాంతో ఆ వివరాలన్నీ ఒక పేపర్ పై రాసి.. వాటిని కార్డులపై ప్రింట్ చేయించేందుకు షాపువారికి ఇచ్చా. అక్కడ ఉన్న ఒక డీటీపీ ఆపరేటర్ కమ్ డిజైనర్ సహాయంతో.. వారు అక్కడికక్కడే వాటిని శుభలేఖలో పొందుపరిచేందుకు వీలుగా డిజైన్ చేసి నాకు ప్రూఫ్ చూపించారు.
తెలుగుతో పాటు.. ఇంగ్లీషులో కూడా ఆ కార్డును ప్రూఫ్ రీడింగ్ చేసి.. ఎక్కడా అక్షర దోషాలు లేకుండా జాగ్రత్తపడేసరికి ఒక పెద్ద పోటీ పరీక్ష రాసినట్లు అనిపించింది.
ఎందుకంటే కార్డులో ఒక్క చిన్న తప్పు ఉన్నా.. మళ్లీ అన్ని కార్డులను తిరిగి ముద్రించాల్సి ఉంటుంది. దాని కారణంగా డబ్బు మాత్రమే కాదు.. సమయం కూడా వృథానే అవుతుంది కదా! అందుకే అన్నీ జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మరీ పని ముగించా. ఎట్టకేలకు ఫైనల్ కాపీ సిద్ధం చేసుకుని దాన్ని ఇటు మా కుటుంబ సభ్యులతో పాటు, అటు అమ్మాయి తరఫు వారికి కూడా వాట్సాప్ ద్వారా పంపించా.
అయితే మా వాళ్లు ఇదే పెళ్లికి సంబంధించి.. వేరే పనుల్లో తీరిక లేకుండా గడపడం వల్ల వారి నుంచి అంగీకారం వచ్చే సరికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. ఈలోగా ఖాళీగా ఉండడం దేనికని, నా కోసం పర్సనలైజ్డ్ కార్డ్స్ కొన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నా.
నేను ఆ పనిలో ఉండగానే ఇరు కుటుంబ సభ్యులు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు కార్డ్ ఫైనల్ ప్రింట్ కాపీలో కొన్ని మార్పులు – చేర్పులు చేయించి, ప్రింటింగ్‌కు ఆర్డర్ ఇచ్చేశా. అలాగే నా పర్సనలైజ్డ్ కార్డ్స్ కూడా సెలక్ట్ చేసి ప్రింట్‌కు ఇచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి నాకు చాలా సమయమే పట్టింది.
నాకు ఎదురైన ఈ అనుభవాలను నా స్నేహితులతో చెప్పగా.. “ఇదేమీ చూశావు.. ఇంకా అసలు కథ ముందు ఉంది..” అంటూ అనేసరికి.. “ముందుంది మొసళ్ల పండగ..” అనే సామెత నాకు గుర్తొచ్చింది.
ఎందుకంటే వాటిని పంచే సమయంలోనూ వింత అనుభవాలు చాలా ఎదురవుతాయంటూ వారి అనుభవాలు నాకు చెప్పకొచ్చారు. వాటితో పాటు చిన్నపాటి హెచ్చరిక కూడా ఇచ్చారనుకోండి..! కానీ కొత్త జీవితం ప్రారంభించే సంతోషంలో ఇవేవీ మనల్ని ఆపలేవుగా!! ఏమంటారు?? మరి, మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి వింత అనుభవాలు ఎదురయ్యాయా?? అయితే వాటిని మాతో పంచుకోండి..!
Featured Image: Kards.in (Instagram)
ఇవి కూడా చదవండి
క్రికెట్ లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ రికార్డు సృష్టిస్తోన్న కోహ్లీ..!
‘మా’ ఎలక్షన్స్‌లో మహిళల సత్తా.. కీలక పదవుల్లో జీవిత రాజశేఖర్, హేమ..!
తెలంగాణలో తొలి విమెన్ కమాండో టీంని ప్రారంభించిన కరీంనగర్ అధికారులు..!