#POPxoWomenWantMore శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సత్తా చాటేద్దాం.. విమెన్ పవర్ అంటే ఏమిటో చూపిద్దాం!

#POPxoWomenWantMore  శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సత్తా చాటేద్దాం.. విమెన్ పవర్ అంటే ఏమిటో చూపిద్దాం!

మార్చి నెల వస్తోందంటే చాలు.. మహిళా సాధికారత సాధించే దిశగా మహిళలను పురికొల్పే కార్యక్రమాలకు తెర లేస్తుంది. వారిని అభివృద్ధిలో భాగం చేయడానికి, నవసమాజ స్థాపనలో వారికి భాగ‌స్వామ్యం క‌ల్పించ‌డానికి..ముఖ్యంగా వారి హక్కులను వారు అనుభవించి స్వతంత్రంగా జీవించే దిశగా వారిని నడిపించడానికి మహిళా దినోత్సవాన్ని (Women's day) జరుపుకొంటాం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన ప్రపంచమంతా మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకొంటుంది.


మహిళలను సాధికారత దిశగా నడిపించాలంటే వారిలో ముందు అవగాహన పెరగాలి. అందుకే ప్రతి ఏటా మార్చి 8న జరుపుకొనే మహిళా దినోత్సవానికి ఓ థీమ్ (theme)ని ఎంపిక చేస్తుంది ఐక్య‌రాజ్య స‌మితి మ‌హిళా విభాగం. అలా ఎంపిక చేసిన థీమ్‌ను ఆధారంగా చేసుకునే మ‌హిళా దినోత్స‌వ వేడుకల‌ను నిర్వ‌హిస్తారు.


అయితే ఇలా ఎంపిక చేసే థీమ్ మ‌హిళ‌ల‌ను సాధికార‌త దిశ‌గా ప్రోత్స‌హించేదై ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఈ ఏడాదికిగానూ సైన్స్, టెక్నాల‌జీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో మ‌హిళ‌ల సంఖ్య పెరిగే విధంగా ఉన్న థీమ్‌ను ఎంపిక చేసుకుంది. ఇంత‌కీ ఆ థీమ్ ఏంటంటే- థింక్ ఈక్వల్, బిల్డ్ స్మార్ట్, ఇన్నోవేట్ ఫర్ ఛేంజ్. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తూ, విమెన్ పవర్ అవసరాన్ని తెలుపుతూ.. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా మనల్ని ముందుకు నడిపిస్తుంది ఈ థీమ్.


#StrengthOfAWoman ప్ర‌తి మ‌హిళ త‌న‌కి తాను విలువ ఇచ్చుకోవాల్సిందే..!


మారుతోన్న కాలానికి అనుగుణంగా దిన‌దినాభివృద్ధి చెందుతోన్న సైన్స్, టెక్నాల‌జీ రంగాల్లో మ‌హిళ‌ల‌కు కూడా అవ‌కాశాలు విరివిగా ఉంటున్నాయి. అంటే ఇన్నోవేషన్, టెక్నాలజీ కారణంగా మహిళలకు ఈరోజుల్లో అవకాశాలు పెరిగాయి. కానీ కొన్ని అధ్యయనాల ప్రకారం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ వంటి రంగాల్లో ఉన్న‌ మహిళల సంఖ్య పురుషులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది.


దీని కారణంగా చాలా అంశాల్లో లింగబేధం లేని ఆవిష్కరణలు రూపొందించండం అసాధ్యంగా మారిపోతుంది. ముఖ్యంగా వీటిని రూపొందించే క్రమంలో మహిళల ఆలోచనలను పరిగణనలోనికి తీసుకోవడం లేదు. వారి అవసరాలను గుర్తించడం లేదు. వారి అనుభవాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. ఈ పరిస్థితిని మార్చి స్టెమ్ రంగాల్లో స్త్రీల ప్రాభవాన్ని, ప్రాధాన్యాన్ని పెంచే దిశగా ఈ ఏడాది కృషి చేయ‌నున్నారు. కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు రూపొందించే సమయంలో మహిళల అవసరాలను సైతం దృష్టిలో పెట్టుకొన్నట్లయితే.. భవిష్యత్తులో సమాజాభివృద్ధికి  ఇప్పటి నుంచే బాటలు వేయచ్చు.


అమ్మాయిలను మనుషులుగా చూడండి.. మార్పు అదే వస్తుంది: నీలిమ పూదోట


ఈ ఏడాది విమన్స్ డే థీమ్ పారిశ్రామిక రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలు, సోషల్ ఎంట్రప్రెన్యూర్స్, జెండర్ ఈక్వాలిటీ యాక్టివిస్ట్స్, విమెన్ ఇన్నోవేటర్స్.. మున్నగువారిని సాధికార ఉద్యమంలో భాగంగా చేస్తుంది. వారి ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మహిళలకు అడ్డుగోడలుగా నిలుస్తున్న వాటిని తొలగించే ప్రయత్నం చేసే విధంగా ఈ థీమ్ ఎంచుకొన్నారు.


ఫలితంగా జెండర్ ఈక్వాలిటీ సాధించే దిశగా మరింత వేగాన్ని పుంజుకోవడంతో పాటు మహిళలు, బాలికల ఎదుగుదలకు అవసరైమన, అనువైన వాతావరణాన్ని కల్పించే దిశగా చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నం విజయవంతమై మహిళల పరిస్థితిలో మార్పు రావాలని మనమూ కోరుకొందాం.


ఈ భూమి మీద అస‌లు మ‌హిళ‌ లేక‌పోతే.. ఎలా ఉంటుందో మీరు ఊహించ‌గ‌ల‌రా?


Featured Image: Pexels.com