అమీర్ ఖాన్ (Aamir Khan).. మిస్టర్ పర్ఫెక్ట్ అని పేరు సంపాదించుకున్న ప్రముఖ బాలీవుడ్ హీరో. పేరుకి తగ్గట్టుగానే నటించే ప్రతి సినిమాలోని పాత్రకు తగినట్లుగా తన శరీరాన్ని మార్చుకునేందుకు ఏ మాత్రం వెనకాడరు అమీర్. ఇక ఆయన నటించిన కొన్ని సినిమాలైతే ఎవర్ గ్రీన్ క్యాటగిరిలో చాలా ఉంటాయి. ఇటీవల కాలంలో ఆయన వద్ద నుంచి వచ్చిన “దంగల్” (Dangal) చిత్రం కూడా వాటిలో ఒకటి. అయితే సినిమా విడుదలై రెండేళ్లు పూర్తైపోయిన తర్వాత ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా?? అక్కడికే వస్తున్నామండీ..
క్రీడా రంగంలో సంచలనం సృష్టించిన ఫోగట్ సిస్టర్స్‌ను వారి తండ్రి మహవీర్ సింగ్ ఫోగట్ (Mahavir Singh Phogat) ఎన్ని కష్టాలకోర్చి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేశారు, ఆ క్రమంలో ఆయన ఎదుర్కొన్న మానసిక వేదన.. వంటి వాటి ఆధారంగా దంగల్ చిత్రాన్ని రూపొందించారు దర్శక, నిర్మాతలు. ఇప్పుడు అచ్చం ఇలాంటి లైన్‌తోనే మరో కథ వెండితెరపై సందడి చేయనుందట! ఇంతకీ ఏంటా కథ? అది ఎవరిది?? .. మొదలైన వివరాల్లోకి వెళితే..
టెన్నిస్ కోర్టులో సంచలనాలు సృష్టిస్తోన్న విలియమ్ సిస్టర్స్ గుర్తున్నారా?? అదేనండీ.. మన సెరెనా విలియమ్స్ & వీనస్ విలియమ్స్. వీరికి చిన్నప్పట్నుంచి టెన్నిస్‌లో కోచింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా?? వారి తండ్రి రిచర్డ్ విలియమ్స్ (Richard Williams). అలాగని అతనేదో ఆటలో ప్రావీణ్యుడనో లేదా మాజీ టెన్నిస్ క్రీడాకారుడో అనుకునేరు..! ఎలాంటి క్రీడానేపథ్యంలో లేకపోయినప్పటికీ తన కుమార్తెలకు నాలుగున్నరేళ్ల వయసు నుంచే టెన్నిస్‌లో శిక్షణ ఇప్పించేందుకు.. ఎన్నో కష్టాలు పడి మరీ ముందుకెళ్లేవారు ఆయన. కడు పేదరికాన్నినెట్టుకొస్తూ మరీ కుమార్తెల విజయం కోసం తపించారాయన. అలా తండ్రి శిక్షణలోనే ఆరితేరిన ఈ విలియమ్ సిస్టర్స్ క్రమంగా ప్రపంచం గర్వించే స్థాయికి చేరుకున్నారు. అందుకే ఇప్పుడు ఈ విలియమ్ సిస్టర్స్ కథను.. వారి తండ్రి రిచర్డ్స్ కోణం నుంచి కథగా రాసి తెరకెక్కించేందుకు సన్నద్ధమవుతోంది హాలీవుడ్.
Image: Instagram/Venus Williams & Instagram/Geeta Phogat
మరి, ఈ కథలో రిచర్డ్స్ విలియమ్ పాత్ర పోషించనున్నది ఎవరో తెలుసా?? ప‌్రముఖ హాలీవుడ్ హీరో విల్ స్మిత్ (Will Smith). ‘కింగ్ రిచర్డ్’ (King Richard) అనే పేరుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందుకే దంగల్ కథతో ఈ కథను పోలుస్తూ; అందులో అమీర్ ఖాన్ పాత్రకు దగ్గరగా ఉన్న తండ్రి పాత్ర అంటూ రెండు సినిమాలను ఒకదానితో మరొకటి పోలుస్తున్నారు సినీ అభిమానులు. అయితే ఇలా క్రీడాకారిణుల తల్లిదండ్రుల కథను నేపథ్యంగా తీసుకొని వెండితెరపై మెరిసిన కథలు చాలానే ఉన్నాయి. కానీ దంగల్ సాధించిన స్థాయిలో ఇప్పటివరకు ఇలాంటి చిత్రాలేవీ అంతగా విజయం సాధించలేకపోయాయనే చెప్పాలి. అందుకే ఇప్పుడు సినిమా దంగల్‌ను మించి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు సినీ, క్రీడాభిమానులు.
అయితే విల్ స్మిత్ ఈ చిత్రంలో కేవలం ఒక నటుడిగానే కాదు.. నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. ఈ కథలో ముఖ్యంగా రిచర్డ్స్ కోణం నుంచి తన ఇద్దరు కుమార్తెలు ప్రఖ్యాత క్రీడాకారిణులుగా ఎదగడం, వారిద్దరే గ్రాండ్ స్లామ్స్, డబుల్ గ్రాండ్ స్లామ్స్.. సాధించడం.. అన్నింటినీ తెరపై మన కళ్లకు కట్టనున్నారట! అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమై వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయంటోందీ చిత్రబృందం.
దంగల్ సినిమాలానే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని, బాక్సాఫీస్‌ను షేక్ చేసేయాలని మనమూ ఆశిద్దాం..!
Featured Image: Instagram/Will Smith
ఇవి కూడా చదవండి
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో.. మరో కొత్త చిత్రం..!
“సైరా” చిత్రంలో.. కథను మలుపు తిప్పే మెగా డాటర్..?
జయలలిత బయోపిక్ “తలైవి” గురించి.. ఆసక్తికర విశేషాలు
దీపికా పదుకొణే రాజకీయాల్లోకి వస్తే.. ఏ శాఖ మంత్రి అవుతారో తెలుసా..?