ఈ సంవత్సరం రంజాన్ (Ramzan) సీజన్ ఇంకొక 10, 12 రోజుల్లో మొదలుకానుంది. ముస్లిం సోదర-సోదరీమణులు నెల రోజుల పటు ఉపవాస దీక్షలు చేస్తూ.. ఈ నెలలో తమ దైవాన్ని కొలుస్తుంటారు. ఇక ఈ రంజాన్ ఉపవాస దీక్షలు జరిగినన్ని రోజులూ హైదరాబాద్ నగరమంతా శోభాయమానంగా వెలిగిపోతుంటుంది, పైగా ఈ నెల రోజుల పాటు సంప్రదాయ నైజాం & ఇరానియన్ వంటకాలు.. హైదరాబాద్‌లో (Hyderabad) విరివిగా లభిస్తుంటాయి.
ఈ వంటకాల్లో.. హైదరాబాద్‌లో మాత్రమే లభించే “హలీమ్” (Haleem) ఈ సీజన్‌కే ప్రత్యేకమైన వంటకంగా నిలుస్తుంటుంది. ఇక ఈ ఇరానియన్ వంటకమైన హలీమ్‌ని రుచి చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఆహారప్రియులు అందరూ.. హైదరాబాద్‌కి వలస పక్షుల మాదిరిగా ఈ నెల రోజుల పాటు వస్తూనే ఉంటారు.
అంతటి ప్రఖ్యాతి వంటకమైన హలీమ్.. రుచికరమైన వంటకాల్ని ఇష్టపడే వారి చేత ‘శేభాష్’ అనిపించుకుంది. అలాగే ప్రపంచం మొత్తంలోనే హలీమ్ లభ్యమయ్యే కేంద్రంగా హైదరాబాద్ పేరు స్థిరపడిపోయింది.
ఇక హలీమ్‌కి ప్రజల్లో వస్తున్న ఆదరణని దృష్టిలో పెట్టుకుని.. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్ చైన్ అయిన ‘ప్యారడైజ్’ వారు ఈ నెల 24 నుండే.. తమ హోటల్స్ ద్వారా హలీమ్‌ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం ప్యారడైజ్ హోటల్స్ వెలువరించింది. కొన్ని చోట్ల ఈ హలీమ్ ప్రజలకి కేవలం.. రంజాన్ ఉపవాస దీక్ష కొనసాగే 30 రోజుల్లో మాత్రమే లభిస్తుంది.
ఈ క్రమంలో అసలు హైదరాబాద్ కేంద్రంగా మన ట్విన్ సిటీస్‌కే తలమానికంగా మారిన హలీమ్‌ని రుచి చూడడానికి.. ఏయే హోటల్స్‌కు వెళ్లాలి? హైదరాబాద్ – సికింద్రాబద్ జంట నగరాల్లో బెస్ట్ హలీమ్ దొరికే హోటల్స్ ఎక్కడున్నాయి.. మొదలైన విషయాలు తెలుసుకుందాం. రాబోయే నెలరోజుల్లో.. కేవలం మన భాగ్య నగర వాసులకే కాకుండా ఎందరో హలీమ్ ప్రేమికులకు ఈ “బెస్ట్ హలీమ్ హోటల్స్” జాబితా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాము.
హైదరాబాద్‌లో బెస్ట్ హలీమ్ (Best Haleem) దొరికే ఫుడ్ పాయింట్స్ లేదా హోటల్స్ గురించి ఈ క్రింద చదవండి –
షాదాబ్ హోటల్ (Hotel Shadab)
ఓల్డ్ సిటీలో ప్రఖ్యాత చార్మినార్ సమీపంలో ఉండే ఫేమస్ హోటల్స్‌లో లభించే హలీమ్ చాలా ప్రత్యేకం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల తరువాత నుండి ఈ హోటల్ పరిసరాలన్నీ జనాలతో కిక్కిరిసిపోతుంటాయి. అదే సమయంలో ఈ హోటల్‌లో లభించే హలీమ్‌తో పాటుగా.. లభించే బిర్యానీకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖులంతా కచ్చితంగా ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజు ఇక్కడ చేయి కడగాల్సిందే!
హోటల్ నయాబ్ (Hotel Nayab)
హోటల్ నయాబ్ – ఈ హోటల్ కూడా హైదరాబాద్ పాత నగరంలోనే ఉంది. చూడడానికి చిన్న హోటల్‌గానే కనిపించినా ఇక్కడ లభించే హలీమ్‌క చాలా ఆదరణ ఉంది. ఇక్కడ హలీమ్ తో పాటుగా మనకి భేజా ఫ్రై & పాయా వంటి ఇతర మాంసాహార వంటకాలు లభిస్తాయి.
గ్రాండ్ హోటల్ (Grand Hotel)
అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉండే ఈ గ్రాండ్ హోటల్‌లో లభించే బిర్యానీకి చాలా మంచి పేరుంది. అటువంటిది ప్రతి సంవత్సరం రంజాన్ సమయంలో లభించే హలీమ్ ఇంకెంత రుచికరంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇంతటి బిజీ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా.. ఈ హోటల్ కి రంజాన్ సీజన్‌లో ప్రజల రద్దీ పెద్ద స్థాయిలోనే ఉంటుంది.
హోటల్ రుమాన్ (Hotel Rumaan)
దాదాపు ఓల్డ్ సిటీకి బార్డర్‌లో ఉండే టోలిచౌకి ప్రాంతంలో ఉన్న ఈ హోటల్‌కి రంజాన్ సీజన్ రాగానే కస్టమర్లు జోరు పెరుగుతుంది. ఇక్కడ దొరికే రుచికరమైన బిర్యానీతో పాటుగా.. స్పెషల్ హలీమ్ కూడా ఇక్కడికొచ్చే వారికి ఆప్యాయంగా స్వాగతం చెబుతుంటుంది. ఇక ఇక్కడ లభించే హలీమ్ నుండి మంచి నెయ్యి ఘుమఘుమలు వస్తుంటాయి. దీనితో ఇక్కడ హలీమ్ తినే వారు కాస్త లావు అవ్వడం గ్యారెంటీ!
ప్యారడైజ్ (Paradise Hotel)
హైదరాబాద్ అంటే ప్యారడైజ్ అనే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారంతా కూడా హైదరాబాద్ వస్తే తప్పకుండా ప్యారడైజ్‌లో బిర్యానీ రుచి చూడకుండా ఉండరు. అంతటి మెగా ఫాలోయింగ్ ఉన్న ఈ హోటల్ తన కస్టమర్స్ కోసం ఏడాదిలో ముప్ఫైరోజులు మాత్రమే దొరికే హలీం కోసం.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా కదా! పైగా ఈ సంవత్సరం రంజాన్ నెల మొదలవ్వడానికి ఒక వారం ముందు నుండే హలీమ్ విక్రయాలు ప్రారంభించబోతున్నారు.
సార్వి హోటల్ (Sarvi Hotel)
సార్వి హోటల్ ఇరానీ చై & ఉస్మానియా బిస్కెట్‌కి ఎంత ఫేమస్సో.. అదే స్థాయిలో స్పెషల్ హలీమ్ పరంగా కూడా అంతే ఫేమస్. ఇక ఈ రంజాన్ సీజన్‌లో తప్పకుండా సార్వి హోటల్‌లో తయారుచేసే హలీమ్‌ని రుచిచూడాల్సిందే. ఎందుకంటే ప్రతి ఏడు రంజాన్ సీజన్‌లో నిర్వహించే ‘బెస్ట్ హలీమ్’ పోటీలలో.. సార్వి హోటల్ మొదటి మూడు స్థానాల్లో ఏదో ఒక దాంట్లో నిలుస్తుంటుంది.
హోటల్ ఇక్బల్ (Hotel Iqbal)
సరిగ్గా చార్మినార్‌కి పక్కనే ఉండే ఈ హోటల్ ఇక్బల్‌లో దొరికే.. స్పైసి హలీమ్‌కి ప్రజల్లో ఆదరణ బాగా ఉంది. ప్రతి ఏడు రంజాన్ సీజన్‌లో చార్మినార్‌ని చూసేందుకు వచ్చే వారు తప్పకుండా.. ఈ ఇక్బల్ రెస్టారెంట్‌లో హలీమ్‌ని రుచి చూడకుండా వెళ్ళరు అంటే అతిశయోక్తి కాదు. పైగా రంజాన్ సీజన్‌లో చార్మినార్ పరిసరాల్లో షాపింగ్ చేసేందుకు వచ్చే వారికి కూడా ఇది మంచి ఫుడ్ పాయింట్ అనే చెప్పాలి.
కేఫ్ 555 (Cafe 555)
మాసాబ్ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న ఈ కేఫ్ 555 లో హలీమ్ కావాలంటే.. అక్కడికి వెళ్ళాక దాదాపు 20 నిమిషాలు వేచి చూడాల్సిందే. కారణం అక్కడ ప్రతిరోజు సాయంత్రం హలీమ్ కోసం వచ్చే వారి సంఖ్య ఆ స్థాయిలో ఉంటుంది. ఇక ఇక్కడ హలీమ్ ప్రత్యేకత ఏంటంటే – మనం స్నేహితులం 10, 20 & 30 మంది వస్తే వారికి అందరికి సరిపోయే విధంగా ఇక్కడ జంబో ప్యాక్స్ రూపంలో సర్వ్ చేయడం విశేషం. అందుకోసమే ఎక్కువ సంఖ్యలో యువత ఈ 555 కేఫ్ కి హలీమ్‌ని రుచి చూడడానికి వస్తుంటారు.
కేఫ్ బహార్ (Cafe Bahar)
హైదరాబాద్‌లోని పాత ఎమ్యెల్యే క్వార్ట్రర్స్‌కి దగ్గరలో ఉండే కేఫ్ బహార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అక్కరలేదు. ఎందుకంటే దాదాపు జంట నగరాల్లో అందరికి సుపరిచితమైన హోటల్ ఇది, ఇక్కడ లభించే బిర్యానికి ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. ఇక అంత రుచికరమైన బిర్యాని దొరికే హోటల్‌లో హలీమ్ ఏ స్థాయిలో ఉండబోతుందో అన్నది మనం ఊహించగలం. అందుకనే రంజాన్ సీజన్‌లో.. హైదరాబాద్ వాసులు హలీమ్ కోసం వెళ్ళే హోటల్స్ జాబితాలో కేఫ్ బహార్ తప్పనిసరిగా ఉంటుంది.
పిస్తా హౌస్ (Pista House)
పిస్తా హౌస్ వారు హలీమ్ వంటకానికి మరియు దానిని విక్రయించేందుకు ఎంతటి జాగ్రత్తలు & తగుచర్యలు తీసుకుంటారో హైదరాబాద్ వాసులని అడిగితే మీకే తెలుస్తుంది. ఈ రంజాన్ సీజన్ 30 రోజులు కూడా హైదరాబాద్ & సికింద్రాబాద్‌లోని ఏ ప్రాంతంలో చూసినా మనకి పిస్తా హౌజ్ అవుట్ లెట్స్ కనిపిస్తుంటాయి. ఇక ప్రత్యేకించి చార్మినార్ దగ్గర ఉన్న పిస్తా హౌస్ హలీమ్‌ని టాప్ హలీమ్‌గా పేర్కొంటారు. మెహదీపట్నం ప్రాంతంలో పిస్తా హౌస్ హలీమ్‌ని విక్రయించేందుకు ఒక శాశ్వత అవుట్ లెట్‌ని నిర్మించారంటే.. ఈ హలీమ్‌కి ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఉన్నారో మీరే అంచనా వేయండి.
షాగౌజ్ (Hotel Shah Ghouse)
ఈ వారాంతంలో బిర్యాని కోసం మేము మెహదీపట్నం దగ్గర ఉన్న షాగౌజ్‌కి వెళ్ళాము అని.. ప్రతి 50 మందిలో 15-20 మంది మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ నిష్పత్తిని బట్టి షాగౌజ్ బిర్యానీ భాగ్యనగరంలో ఉండే యువతకి ఏ స్థాయిలో నచ్చిందో మీరే అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇక్కడ బిర్యానీతో పాటుగా.. ప్రతి రంజాన్ సీజన్‌లో దొరికే హలీమ్ కోసం కూడా నగర నలుమూలల ఫుడ్ లవర్స్ వస్తుంటారు. అలా షాగౌజ్ హోటల్‌కి హలీమ్ కోసం వచ్చిన వారు రుచికరమైన బిర్యాని కూడా టేస్ట్ చేయకుండా వెళ్ళలేరు. దీనితో ఈ రంజాన్ సీజన్‌లో షాగౌజ్‌కి వస్తే.. అటు బిర్యానితో పాటుగా ఇటు హలీమ్ కూడా హాయిగా ఆరగించవచ్చు.
ఈ వివరాలు చూడగానే మీకు ఎప్పుడు హలీమ్ అమ్మకాలు మొదలవుతాయి.. ఎప్పుడు టేస్ట్ చూడాలి అన్న తపన మొదలయ్యే ఉంటుంది కదా. ఇంకొద్ది రోజులు ఆగండి, మీకు నచ్చే.. మీరు మెచ్చే హలీమ్ ఈ పైన పేర్కొన్న హోటల్స్‌లో మీకోసం ఎదురుచూస్తుంటుంది.
Featured Image: Shutterstock
ఇవి కూడా చదవండి
ఆహా.. ఏమి రుచి..! ఈతరం యువతను.. అమితంగా ఆకర్షిస్తున్న కర్రీ పాయింట్స్
మరో సరికొత్త రికార్డు సాధించిన.. హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ
హైదరాబాద్‌లో “సామాన్యుడి ఐస్ క్రీమ్” అంటే.. గుర్తొచ్చే పార్లర్ ఇదే..!