ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
పని కావాలంటే.. గర్భసంచి తొలగించుకోవాల్సిందే: మహారాష్ట్రలో భూస్వాముల ఆకృత్యాలు..!

పని కావాలంటే.. గర్భసంచి తొలగించుకోవాల్సిందే: మహారాష్ట్రలో భూస్వాముల ఆకృత్యాలు..!

ప్రతి ఏడాది మాదిరిగానే సత్య తన భర్తతో కలసి.. తన గ్రామం నుంచి పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతానికి పనుల కోసం వలసకు వెళ్లింది. అక్కడ వారు చెరకు తోటలను నరికే పని చేస్తుంటారు. సత్య లాంటి ఎందరో మహిళలు తమ కుటుంబాలతో కలసి అక్కడికి చేరుకొని ఉపాధి పొందుతుంటారు. ఉపాధితో పాటు శారీరక, లైంగిక, మానసిక హింసను కూడా అనుభవిస్తుంటారు. అంతకుమించి ఏం చేస్తారు పాపం? గొడవ పెట్టుకొంటే.. దొరికే నాలుగు రాళ్లు కూడా దొరకవు.

సత్య కూడా అంతే.. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా సరే ఇక్కడ పని చేస్తే తన కుటుంబం కొన్ని రోజుల పాటు పస్తుండాల్సిన అవసరం లేదు కదా అనుకుంది. అలా అనుకొనే కళ్లు మూసుకొని పనిచేసుకొంటూ పోతుంది. ఇటీవలే నెలసరి కారణంగా రెండు రోజుల పాటు పనికి వెళ్లలేదు. మూడో రోజు పనికి వచ్చినప్పుడు పని ఇప్పించిన మేస్త్రీ ఆమెను బండ బూతుల తిట్టడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగితే సరి. కానీ ఓ అడుగు ముందుకేసి ‘గర్భసంచి తీయించుకో.. ఇక పనికి నాగాలు పెట్టక్కర్లేదు’  అన్నాడు.

‘గర్భసంచి తీయించుకోవాలనే ఆలోచన ఉంటే చెప్పు.. డబ్బు అడ్వాన్స్‌గా ఇస్తా. లేదంటే మళ్లీ ను‌వ్వు పనికి నా దగ్గరకి రానక్కర్లేదు’ అంటూ మాట్లాడాడు. అవమానకరంగా అతడు మాట్లాడిన మాటలకు కళ్ల నుంచి ఉబికి వస్తున్న నీటిని ఆపుకొంటూ.. ‘సరే దొరా’ అంటూ పనిలోకి వెళ్లిందామె.

పనైతే చేస్తోంది కానీ.. సత్య మనసు మాత్రం నెలసరి కారణంగా పోగొట్టుకొన్న రెండు రోజుల కూలీ గురించే ఆలోచిస్తోంది. ‘నాతో పాటే వచ్చిన గౌరి, గంగు కూడా గర్భసంచి తీయించేసుకొన్నారు. ప్రతి రోజూ పనిలోకి వస్తున్నారు. నేను కూడా అలాగే చేస్తే పోలేదా? ఇంకా ఎన్ని ఏళ్లని తిట్టించుకొంటాం.. వచ్చే ఏడాదైనా.. గర్భసంచి తీయించుకొంటే మెరుగు.. లేదంటే అనవసరంగా డబ్బులు పోతాయి’ అనుకొంది. ఇది సత్య కథ.

ADVERTISEMENT

నర్మద కూడా సత్యతో పాటు.. పనుల కోసం పశ్చిమ మహారాష్ట్రకు వలస వచ్చినవారిలో ఉంది. ఈమెది సత్యతో పోలిస్తే భిన్నమైన కథ. భూస్వామి చేతిలో లైంగిక హింసకు గురైన మహిళ ఆమె. ఆమెపై భూస్వామి ఎంత కిరాతకంగా వ్యవహరించాడంటే.. ఆమె గర్భం బిడ్డను మోయలేనంత దారుణంగా తయారైంది. ఇక తప్పని పరిస్థితిలలో వైద్యుల సూచన మేరకు హిస్టరెక్టమీ ద్వారా గర్భసంచిని(Uterus) తొలగించుకోవాల్సి వచ్చింది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బిడ్డను కనే అవకాశం ఉన్నప్పటికీ.. కామందు చేతిలో బలి కాకుండా ఉండేందుకు గర్భసంచి తొలిగించుకోవడానికే మొగ్గు చూపింది నర్మద.

ఇది సత్య, నర్మదల కథ మాత్రమే కాదు.. వారి లాంటి ఎందరో మహిళలది. పొట్ట చేత పట్టుకొని వలస వస్తే వారిపై జరుగుతోన్న దాష్టీకమిది. అంతేనా.. పనులిచ్చే కాంట్రాక్టర్లు సైతం గర్భసంచి లేని మహిళలు, నెలసరి రాని మహిళలకు పని ఇచ్చేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు.. గర్భసంచి తొలగించుకొనేందుకు వారికివ్వాల్సిన కూలి డబ్బులనే అడ్వాన్స్ రూపంలో ఇస్తున్నారు. గర్భసంచి తొలగించుకోక తప్పని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎటూ పాలుపోని పరిస్థితుల్లో మహిళలు సైతం దీనికే మొగ్గు చూపుతున్నారు.

ఇదే మాట మహిళా సంఘాలను అడిగితే వారు చెప్పే సమాధానం ఒక్కటే. ‘ఇది వాళ్లకు కాస్త కూస్తో పనిచేసుకొని నాలుగు రాళ్లు వెనకేసుకొనే సమయమిది. ఇప్పుడు సంపాదించుకొన్న డబ్బుతోనే ఏడాదంతా గడపాలి. ఇలాంటి సమయంలో నెలసరి వస్తుందనో లేక గర్భం దాలుస్తారనే కారణంతో పనులు ఇవ్వకపోవడం వల్ల కుటుంబమంతా పస్తులు ఉండాల్సి వస్తుంది. దీంతో మహిళలు సైతం హిస్టరెక్టమీ ద్వారా గర్భసంచి తొలగించుకోవడం లేదా ట్యూబెక్టమీ చేయించుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇలా చేయడం మానవ హక్కులను ఉల్లఘించడం కంటే దారుణమైన పని’ అని మానవ హక్కుల సంఘాలు కార్యకర్తలు, మహిళా సంఘాల కార్యకర్తలు చెప్పడం గమనార్హం.

ADVERTISEMENT

ఇలా పనిచేసే మహిళలలో కొందరు ముందే మధ్యవర్తి ద్వారా భూస్వామి నుంచి అప్పు తీసుకొని ఉంటారు. దాన్ని తీర్చడం కోసం వారి పొలాల్లో చెరకు నరికే పనిచేస్తారు. కొన్ని రోజుల పాటు వారి కింద పనిచేసి అప్పు తీర్చే ప్రయత్నం చేస్తారు. తాము చేసిన కష్టానికి తృణమో, ఫలమో దక్కుతుందని భావిస్తారు. కానీ వారికి దక్కే ఫలితం శూన్యం. ఎన్ని రోజులు పనిచేసినా.. ఇంకా అప్పు మిగిలి ఉందని చెబుతారు. ఆ అప్పును తీర్చడానికి మళ్లీ పనుల్లోకి రావాల్సిన  పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పాలంటే ఇది ఓ రకంగా వెట్టి చాకిరీ లాంటిది. ఇలా చేయడం వల్ల వారి కష్టాన్ని దోచుకోవడంతో పాటు మహిళలను లైంగికపరమైన హింసకు గురి చేస్తున్నారు.

దేశంలోనే అధికమొత్తంలో చెరకు ఉత్పత్తి మహారాష్ట్రలో జరుగుతుంది. పశ్చిమ మహారాష్ట్రలో భాగమైన బీడ్, షోలాపూర్, సంగ్లి, సతారా, కొల్హాపూర్ జిల్లాల్లో సుమారుగా ఐదు లక్షలకు పైగా వలస కూలీలు చెరకు నరికే పనిలో నిమగ్నమై ఉంటారు. వీరిలో ఎక్కువ మంది భార్యాభర్తలే అయి ఉంటారు. వారిలో చాలామంది యాభై వేల నుంచి అరవై వేల వరకు అప్పు తీసుకొని దాన్ని తీర్చే క్రమంలో కూలీలుగా పనిచేస్తుంటారు. వారికిచ్చే కూలీ కూడా తక్కువే. ఒకసారి కోతలు పూర్తయిన తర్వాత మళ్లీ పని కోసం రావాలంటే ఏడాది వరకు ఆగాల్సిందే. భార్యాభర్తలకే ఇక్కడ పని దొరకుతుంది. కాబట్టి అమ్మాయిలకు చిన్నవయసులోనే వివాహాలు చేసేస్తుంటారు.

ఉదయం నాలుగు గంటలకే ఇక్కడ పని మొదలవుతుంది. అప్పటి నుంచి మధ్యాహ్నం రెండు, మూడింటి వరకు అలా పనిచేస్తూనే ఉంటారు. చెరకు గెడలను ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లలోకి మోస్తుంటారు. అధిక మొత్తంలో బరువులు మోయడం వల్ల మహిళలకు కొన్ని సందర్బాల్లో ఫీల్డ్‌లోనే గర్భస్రావాలు జరుగుతుంటాయి. కానీ ఇదే విషయాన్ని అక్కడి భూస్వాములతో చెబితే వచ్చే సమాధానాలు కూడా ప్రతికూలంగానే ఉంటాయి.

ADVERTISEMENT

స్త్రీలతో బలవంతంగా పనిచేయిస్తూ.. వారి హక్కులకు భంగం కలిగిస్తున్నారంటే.. అక్కడి భూస్వాములు, మధ్యవర్తులు ఒప్పుకోరు. వారికి తగిన కూలీ అందకపోతే మళ్లీ ఇక్కడకు పనికోసం రారు కదా అని తిరిగి ప్రశ్నిస్తారు. అంతేకాదు మహిళలపై అసలు ఎలాంటి అఘాయిత్యాలు జరగవని చెబుతారు. ‘ఇక్కడ పనులు పూర్తయితే తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోతారు. అక్కడ చేయడానికి వీరికి పెద్దగా పని దొరకదు. కాబట్టి.. ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకొంటూ జీవనం సాగిస్తారు. దానికంటే మా దగ్గర పనిచేయడమే మేలు కదా” అంటారు.

మహిళలు ఎదుర్కొంటున్న ఈ దారుణమైన పరిస్థితిపై మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పోరాటం సాగిస్తున్నాయి. వారి ప్రయత్నం సఫలమై.. మహిళలు సురక్షితమైన వాతావరణంలో పనిచేసుకొనే వీలు కలగాలని మనమూ ఆకాంక్షిద్దాం..

Featured Image: Shutterstock

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

అమ్మాయిలను మనుషులుగా చూడండి.. మార్పు అదే వస్తుంది..

ఏడాదిలో ఒక్క రోజు కాదు ప్రతి రోజూ మహిళలదే..

సమాజం గొడ్రాలు అని ఏడిపిస్తే మొక్కలు వృక్షమాతను చేశాయి.

10 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT