ఆరోగ్యానికి, సౌందర్యానికి రక్ష.. ఈ పచ్చాపచ్చని కీరదోస..! (Benefits Of Cucumber In Telugu)

ఆరోగ్యానికి, సౌందర్యానికి రక్ష.. ఈ పచ్చాపచ్చని కీరదోస..! (Benefits Of Cucumber In Telugu)

వేసవి వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ కీరదోస ఆహారంలో భాగం కావాల్సిందే. అది అందించే ప్రయోజనాలు అలాంటివి మరి. ఉష్ణతాపాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అందుకే ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కనబరిచే వారు కీరదోసను తమ ఆహారంలో భాగం చేసుకొంటారు. ఎక్కువగా సలాడ్, జ్యూస్ రూపంలో దీన్ని తీసుకొంటూ ఉంటారు. సాండ్ విచ్ తరహా ఆహారపదార్థాల్లోనూ వీటిని భాగం చేసుకొంటూ ఉంటాం.


అందరూ ఇష్టపడే ఈ కీరదోస గురించి మనకు తెలిసింది చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే కీరదోసను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం సౌందర్యపరంగా, ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నాం. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా.. మరెందుకు ఆలస్యం.. కీరదోస గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకొందాం.


కీరదోస అందించే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు


కీరదోస అందించే సౌందర్యపరమైన ప్రయోజనాలు


కీరదోసను ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలంటే


కీరదోస వల్ల కలిగే దుష్పలితాలు


తరచూ అడిగే ప్రశ్నలు


కీరదోసలో ఉన్న పోషకాలు (Nutritional Value In Cucumber)


కీరదోసలో మనకు అవసరమైన అతి ముఖ్యమైన విటమిన్లు, పీచు పదార్థం, నీరు మనకు లభిస్తాయి. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కీరదోసలో శరీరానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్స్, లిగ్నన్స్, పీచుపదార్థం, బీటాకెరొటిన్ ఉంటాయి.


పీచు పదార్థం జీర్ణ సంబంధమైన సమస్యలను దూరం చేస్తుంది. బీటాకెరొటిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కంటి, చర్మ ఆరోగ్యాన్ని సైతం పరిరక్షిస్తుంది. కీరదోస విత్తనాల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే ఖనిజ లవణాలు సైతం దీనిలో ఉంటాయి.


కీరదోసలోని ప్రతి భాగంలో పోషకాలు నిండి ఉంటాయి. గింజలు, తొక్కలోనూ ఇవి అధికంగా ఉంటాయి. అలాగే క్యాలరీలతో పాటుగా కార్భోహైడ్రేట్స్, సోడియం, కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి.


కీరదోసలో (Keera Dosakaya) విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ ఉంటాయి. కాబట్టి కీరదోసను ఆహారంగా తీసుకొంటే.. ఇవన్నీ మన శరీరానికి లభిస్తాయి.


కీరదోసలో 95% మేర నీరు ఉంటుంది. అందుకే దీన్ని కచ్చితంగా ఆహారంగా తీసుకోమని ఆహార నిపుణులు చెబుతారు.


benefits-of-cucumber-in-telugu


కీరదోస అందించే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు (Health Benefits Of Cucumber In Telugu)


మనలో చాలామంది కీరదోస తినడానికి అంతగా ఇష్టపడరు. పచ్చిది తినాల్సి రావడం, చిరు చేదుగా ఉండటం వల్ల దీన్ని చాలా దూరంగా ఉంచుతారు. మీరు కూడా ఇలా చేస్తున్నారా? అయితే ముందు కీరదోస వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి. అది మన శరీరానికి చేసే మేలు గురించి తెలుసుకోండి. ఆ తర్వాత కీరదోస తినాలా వద్దా అనే నిర్ణయం మీరే తీసుకోండి.


డీహైడ్రేషన్‌కు గురి కానివ్వదు (Promotes Hydration)


వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురి కావడం సహజం. అలా అని రోజంతా నీటిని తాగుతూ ఉండలేం. మరి డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తగినంత నీటిని తాగుతూనే కీరదోసను కూడా ఆహారంగా తీసుకోవాలి. దీనిలో 95 శాతం నీరే ఉంటుంది. అంతేకాదు రోజుకి శరీరానికి అవసరమైన విటమిన్లు అన్నీ దీనిలో లభిస్తాయి. ఇది డీహైడ్రేషన్ రానివ్వకుండా చేయడమే కాదు.. డీహైడ్రేషన్‌కి గురైన వారిని రీహైడ్రేట్ చేస్తుంది. కాబట్టి మీవెంట కీరదోస తీసుకెళ్లడం మరచిపోవద్దు.


బరువు తగ్గేందుకు సహకరిస్తుంది (Helps To Lose Weight)


కీరదోసలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయని మనం ముందే చెప్పుకొన్నాం. దీనిలో కొవ్వు అసలు ఉండదు. పైగా దీనిలో పీచు పదార్థం, నీటి శాతం ఎక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకొనేవారు దీన్ని ఆహారంగా తీసుకోవడం మంచిది. మీడియం సైజులో ఉన్న యాపిల్, కీరదోసలను పోల్చిచూసినప్పుడు యాపిల్ కంటే కీరదోస తినడం ద్వారా శరీరానికి తక్కువ క్యాలరీలు లభిస్తాయి.


గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది (Improves Heart Health)


ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. దీనికి సరైన వ్యాయామం లేకపోవడం, బలవర్థకమైన ఆహారం తీసుకోకపోవడమే కారణం. మరి ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గించుకోవాలంటే కీరదోసను ఆహారంగా తీసుకోవడం మంచిది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కీరదోస గింజలను తినడం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ట్రై గ్లిజరైడ్స్ కూడా తగ్గుముఖం పడతాయి.


డిటాక్సిఫికేషన్ చేస్తుంది (Detoxification)


శరీరంలోని మలినాలు, వ్యర్థాలు ఎప్పటికప్పడు బయటకు వెళ్లకపోతే మనం అనారోగ్యం పాలవ్వాల్సి వస్తుంది. అందుకే శరీరాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవడం అవసరం. దీన్నే డీటాక్సిఫికేషన్ అని పిలుస్తాం. కీరదోస తినడం ద్వారా శరీరాన్ని డిటాక్సిఫై చేసుకోవచ్చు. దీనిలో ఉండే నీరు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి.


ఆహారం సులభంగా జీర్ణం (Helps In Digestion)


మొదటి నుంచి మనం చెప్పుకొంటున్నట్టుగానే కీరదోసలో నీటిశాతం, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి ఈ రెండూ చాలా అవసరం. ఇవి రెండూ కీరదోసలో (Keera Dosakaya) పుష్కలంగా ఉంటాయి. రోజూ కీరదోసను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆహారం సక్రమంగా జీర్ణమవడంతో పాటు మలబద్ధకం సమస్య తగ్గుముఖం పడుతుంది. పొట్టలో చేరిన బద్దెపురుగులను సైతం కీరదోస నిర్మూలిస్తుంది. దీనిలో ఉండే ఎరెప్సిన్ అనే ఎంజైమ్ బద్దెపురుగులను సంహరిస్తుంది.


నీరు పట్టడాన్ని తగ్గిస్తుంది (Inhibits Water Retention)


ఆరోగ్యపరమైన కారణాల వల్ల కొందరి శరీరంలో నీరు చేరుతుంది. కీరదోస తినడం ద్వారా ఈ సమస్య తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. కీరదోసలో ఉండే కెఫిక్ యాసిడ్ శరీరంలో చేరిన నీటిని బయటకు పంపించడానికి దోహదం చేస్తుంది.


benefits-of-cucumber-in-telugu


నోటి దుర్వాసనను దూరం చేస్తుంది (Helps To Get Rid From Bad Breath)


నోటి దుర్వాసన సమస్యను దూరం చేసుకోవడానికి చాలా రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. కీరదోసను సైతం ఈ సమస్యను తగ్గించడానికి ఉపయోగించవచ్చు. కీరదోసను సన్నగా కట్ చేసి దాన్ని నోటిలో పైభాగానికి అతుక్కొని ఉండేలా అర నిమిషం పాటు ఉంచాలి. కీరదోసలోని ఫైటో కెమికల్స్ నోటి దుర్వాసనకు కారణమైన బ్యాక్టీరియాను సంహరిస్తుంది. దీంతో తాజా శ్వాస మీ సొంతమవుతుంది. రోజూ కీరదోస తినడం ద్వారా దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.


క్యాన్సర్ రాకుండా చేస్తుంది (Prevent Cancer)


కీరదోసలో పాలిఫినాల్స్ ఉంటాయి. వీటినే లిగ్నన్స్ అని పిలుస్తారు. ఇవి రొమ్ము, గర్భాశయ, అండాశయ, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. వీటిలో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్‌కి సైతం క్యాన్సర్ రాకుండా చేసే గుణాలుంటాయి. కాబట్టి మీ ఆహారంలో కీరదోసను భాగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.


ఎముకలను దృఢంగా చేస్తుంది (Strengthen Bones)


కీరదోసలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ కె సైతం ఫుష్కలంగా లభిస్తుంది. ఇవి రెండూ ఎముకలను దృఢంగా మారుస్తాయి. కీరదోసలో ఉండే సిలికా సైతం ఎముకల సామర్థ్యాన్ని పెంచుతుంది.


బ్లడ్ షుగర్‌ను అదుపులోకి తెస్తుంది (Control Blood Sugar Level)


కీరదోసలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిస్‌ను తగ్గిస్తాయి. దీనిలో ఉన్న గ్లైకోసైడ్స్, స్టెరాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ మొదలైనవి మధుమేహం రావడానికి కారణమైన ఫ్రీరాడికల్స్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఈ ఫ్రీరాడికల్స్ కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా వాటి పనితీరు దెబ్బతింటుంది.


అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది (Helps To Reduce Blood Pressure)


మనం తీసుకొనే ఆహారంలో సోడియం అధికంగా, పొటాషియం తక్కువగా ఉంటే.. బ్లడ్ ప్రెజర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే సోడియంతో సమానంగా పొటాషియం కూడా తీసుకొంటే అది ఎలక్ట్రోలైట్‌గా పనిచేసి శరీరంలో అధికంగా ఉన్న సోడియంను మూత్రపిండాల సాయంతో బయటకు పంపేలా చేస్తుంది. కీరదోసలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఆహారంగా తీసుకొంటే అతి తక్కువ సమయంలోనే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.


కీరదోస అందించే సౌందర్యపరమైన ప్రయోజనాలు (Beauty Benefits Of Cucumber In Telugu)


కీరదోస వల్ల ఆరోగ్యపరంగానే కాదు.. సౌందర్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మార్చి అందంగా కనిపించేలా చేస్తుంది. కీరదోస వల్ల మనకు సౌందర్యపరంగా ఏయే లాభాలు కలుగుతాయి? దానికోసం మనం ఏం చేయాలో తెలుసుకొందాం.


జుట్టు ఒత్తుగా తయారవుతుంది (Helps To Get Rid Of Hair Fall Problem)


జుట్టు రాలే సమస్య ఇటీవలి కాలంలో అందరూ ఎదుర్కొంటున్న కామన్ సమస్య. దీనికోసం మీరు ఎన్నో రకాల నూనెలు వాడి ఉంటారు. వివిధ బ్రాండ్లకు చెందిన షాంపూలు వాడి ఉంటారు. సహజసిద్ధమైన చిట్కాలను సైతం పాటించి ఉంటారు. ఈ సారి కీరదోసతో ఈ చిట్కాను పాటించండి. చిన్నసైజులో ఉన్న కీరదోసను తీసుకొని దాన్ని ముక్కలుగా తరగాలి. ఆ ముక్కలను మిక్సీ జార్‌లో వేయాలి. కీరదోస ముక్కలతో పాటు ఐదు టేబుల్ స్పూన్ల పెరుగు, టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వెనిగర్, టీస్పూన్ ఆలివ్ నూనె వేసి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని మాడుకి (scalp) అప్లై చేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆపై ఇరవై నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికోసారి ఈ చిట్కాను పాటించడం ద్వారా మీ జుట్టు ఒత్తుగా తయారవుతుంది. కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.


benefits-of-cucumber-in-telugu


సూర్యరశ్మి ప్రభావం నుంచి విముక్తి (Treats Sun Burn Skin)


కీరదోసలో (cucumber) సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి ఉష్ణతాపానికి గురైన చర్మాన్ని చల్లబరిచి సాంత్వన కలిగిస్తాయి. ఈ ఫలితం పొందడానికి ఓ చిట్కాను పాటించాల్సి ఉంటుంది. కీరదోసను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. అది చల్లబడిన తర్వాత.. దాన్ని మెత్తని పేస్ట్‌లా తయారుచేయాలి. దీన్ని సూర్యరశ్మి ప్రభావానికి గురైన చోట రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చర్మాన్ని శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. దీనికోసం మరో చిట్కాను సైతం పాటించవచ్చు. కీరదోస జ్యూస్ తీసి దాన్ని స్ప్రే బాటిల్లో పోసి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవచ్చు. దీన్ని ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత చర్మంపై స్ప్రే చేసుకొంటే చాలా చల్లగా అనిపిస్తుంది.


చర్మం ప్రకాశవంతంగా.. (Rejuvenates Skin)


చర్మం ఆరోగ్యంగా ఉంటే.. ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కీరదోస ఈ విషయంలో మనకు చాలా మేలు చేస్తుంది. కీరదోసలో ఎక్కువగా ఉండే నీరు, ఆస్ట్రింజెంట్ గుణాలు చర్మానికి పోషణను అందించి ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. దీనికోసం కీరదోస రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి దాన్ని ముఖానికి మాస్క్ మాదిరిగా అప్లై చేసుకోవాలి. కాసేపాగిన తర్వాత తడిచేసిన కాటన్ వస్త్రంతో తుడుచుకొంటే.. చర్మానికి కొత్త కళ వస్తుంది.


మంట పెడుతున్న చర్మానికి సాంత్వన (Reduce Skin Irritations)


కీరదోసలో 90 శాతం మేర నీరు ఉంటుంది. కాబట్టి ఇది చర్మాన్ని చల్లబరిచి మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో ఉన్న ఔషధ గుణాలు మంటను తగ్గించి చర్మం మునుపటి స్థితికి చేరుకొనేలా చేస్తాయి. దీనిలో ఉండే నీరు, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, ఆస్ట్రింజెంట్ గుణాలు చర్మానికి సాంత్వన కలిగించి చల్లబరుస్తాయి. ఈ ఫలితాన్ని పొందడానికి కీరదోస ముక్కలను మంట పెడుతున్న పావుగంట సమయం ఉంచాలి. ఆ తర్వాత వాటిని తొలగించి చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకొంటే సరిపోతుంది.


benefits-of-cucumber-in-telugu


ట్యాన్‌ను తొలగిస్తుంది (Removes Skin Tan)


సూర్యరశ్మి ప్రభావం కారణంగా చర్మంపై ట్యాన్ ఏర్పడటం సహజం. దాన్ని కీరదోస సాయంతో సులభంగా తొలగించుకొని చర్మాన్ని మెరిపించుకోవచ్చు. దీనిలో ఉన్న యాస్ట్రింజెంట్, సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు చర్మంపై పేరుకొన్న ట్యాన్‌ను తొలగిస్తాయి. దీనికోసం టేబుల్ స్పూన్ కీరదోస రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ తీసుకొని మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకొంటే ట్యాన్ తగ్గుతుంది. ఈ చిట్కాను అప్పుడప్పడూ పాటించడం వల్ల చర్మంపై ట్యాన్ ఏర్పడకుండా చూసుకోవచ్చు.


మొటిమలు రాకుండా (Treat Blemishes)


కీరదోసలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. టేబుల్ స్పూన్ ఓట్స్‌లో కొద్దిగా కీరదోస గుజ్జు కలిపి దాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.


ముడతలు తగ్గిస్తుంది (Remove Eye Wrinkles)


కీరదోస చర్మంపై ఉన్న ముడతలను తగ్గిస్తుంది. దీంట్లో యాంటీ ఏజింగ్ గుణాలు, విటమిన్ సి, కెఫిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి చర్మంపై ముడతలను తగ్గించి యంగ్ లుక్‌ను అందిస్తాయి. దీనికోసం.. కీరదోస తొక్క తీసి గుండ్రటి ముక్కలుగా కోయాలి. చర్మంపై ముడతలున్న చోట కొద్దిగా తేనెరాసి పైన కీరదోస ముక్కలను ఉంచాలి. ఇరవై నిమిషాల తర్వాత కీరదోస ముక్కలను తొలగించి మైల్డ్ క్లెన్సర్‌తో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది


చర్మ రంధ్రాలు తెరుచుకొనేలా.. (Open Pores)


మనం ఉపయోగించే మేకప్ ఉత్పత్తులు, సౌందర్య ఉత్పత్తులతో పాటు వాతావారణ కాలుష్యం కారణంగా మన చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. దీని కారణంగా మొటిమల సమస్య ఎక్కువ కావచ్చు. మరి చర్మరంధ్రాల్లో చేరిన మురికిని తొలగించుకోవడమెలా? దీనికి కీరదోస చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. దీనికోసం నాలుగు నుంచి ఐదు కీరదోస ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం తీసుకొని మెత్తగా బ్లెండ్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. మరింత మంచి ఫలితం పొందాలంటే.. కీరదోస ముక్కలను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత మెత్తగా చేసుకోవాలి.


కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది (Reduce Dark Circles)


సరిగ్గా నిద్ర లేకపోయినా.. ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. వీటి కారణంగా ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. అందుకే కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలను తొలగించుకోవడానికి అందరూ ప్రాధాన్యమిస్తూ ఉంటారు. కీరదోసతో వీటిని చాలా సులభంగా తొలగించుకోవచ్చు. చెంచా కీరదోస రసంలో అర చెంచా కలబంద గుజ్జు కలిపి దాన్ని నల్లటి వలయాలు ఏర్పడిన చోట రాయాలి. 20 నిమిషాల తర్వాత దాన్నిశుభ్రం చేసుకొంటే సరిపోతుంది.


కీరదోసను ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలంటే..(Ways To Eat Cucumber)


benefits-of-cucumber-in-telugu


 1. సాధారణంగా కీరదోసను పచ్చివిగా తినడానికే ఇష్టపడుతుంటారు. ఇలా తినేటప్పుడు కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లి తింటే రుచిగా ఉంటుంది.

 2. కీరదోసను ఉల్లిపాయలతో కలిపి సలాడ్ మాదిరిగా చేసుకొని తినవచ్చు.

 3. కీరదోస గింజలను వేరు చేసి వాటిని వెజిటబుల్, ఫ్రూట్ సలాడ్లపై చల్లుకోవచ్చు.

 4. సాండ్ విచ్‌లో భాగంగా చేసుకొని తినవచ్చు.

 5. కీరదోసతో సూప్ తయారుచేసుకోవచ్చు.

 6. కీరదోస ముక్కలను తినడం మీకు కష్టంగా అనిపిస్తే.. దాన్ని జ్యూస్‌లా తయారుచేసుకోవచ్చు.

 7. పచ్చివి తినడం ఇష్టం లేనివారు కీరదోస ముక్కలను గ్రిల్ చేసుకొని తినొచ్చు.


కీరదోస వల్ల కలిగే దుష్పలితాలు (Side Effects Of Cucumber)


కీరదోసను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయో.. అంతే మొత్తంలో దుష్పలితాలు కలిగే అవకాశం సైతం ఉంది. అవేంటో తెలుసుకుందాం.


 1. కీరదోసలో కుకుర్బిటాసిన్, టెట్రాసైక్లిక్ ట్రైటెర్పనాయిడ్స్ ఉంటాయి. వీటిని టాక్సిన్లుగా పరిగణిస్తారు. కాబట్టి అవసరమైనదానికంటే.. ఎక్కువ మొత్తంలో వీటిని తీసుకోవడం వల్ల కొన్ని రుగ్మతలు రావచ్చు.

 2. కీరదోస గింజల్లో కుకుర్బిటిన్ అనే పదార్థం ఉంటుంది. దీనికి డైయూరిటిక్ గుణాలుంటాయి. ఇది శరీరం నుంచి నీటిని వెలుపలికి పంపిస్తుంది. దీనివల్ల డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. కాబట్టి అవసరమైనంత మేరకు మాత్రమే కీరదోసను ఆహారంగా తీసుకోవడం మంచిది.

 3. కీరదోసలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. శరీరంలో అధిక మొత్తంలో పొటాషియం చేరితే దీని వల్ల కడుపులో నొప్పి, కడుపుబ్బరంగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పొటాషియం కారణంగా మూత్రపిండాల పనితీరు సైతం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

 4. కొంతమందిలో కీరదోస తినడం వల్ల సైనసైటిస్ సమస్య వచ్చే అవకాశం ఉంది.

 5. గర్భం దాల్చిన మహిళలు కీరదోసకు దూరంగా ఉండటం మంచిది. కీరదోసకు ఉండే డైయురెటిక్ గుణాల కారణంగా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావచ్చు. దీనిలో ఉన్న పీచు పదార్థం మేలు చేసేదే అయినప్పటికీ అధికమోతాదులో తీసుకోవడం వల్ల కడుపులో నొప్పి వచ్చే అవకాశాలుంటాయి.

 6. కీరదోస మెరుస్తూ కనిపించడానికి దానిపై పలుచని మైనం పూత పూస్తారు. దీనివల్ల కూడా మనకు అనారోగ్యం ఎదురుకావచ్చు.


కీరదోస వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదుర్కోకుండా ఉండాలంటే దానిని ఉప్పు నీటిలో బాగా కడిగి.. తొక్క తీసి తినడం మంచిది.


తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)


1. కీరదోసను రాత్రి సమయంలో ఆహారంగా తీసుకోవచ్చా?


కీరదోస మనకు ఆరోగ్యపరంగా ఎన్నో రకాల ప్రయోజనాలు అందించినప్పటికీ.. రాత్రి వేళల్లో దాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కీరదోసను ఆహారంగా తీసుకోవడం చాలా సులభం. కానీ అది జీర్ణమవ్వడానికి మాత్రం కాస్త సమయం పడుతుంది. దీనివల్ల కడుపు పట్టేసినట్టుగా, ఉబ్బరంగా అనిపిస్తుంది. అలాగే కీరదోసలో 95 శాతం మేర నీరే ఉంటుంది. దీనివల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీనిలో ఉన్న కుకుర్బిటాసిన్ కారణంగా అజీర్తి సమస్య రావచ్చు.


2. కీరదోసను ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవచ్చా?


నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. దీని వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఆరోగ్యపరంగానూ,  సౌందర్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలుంటాయి. దీనిలో క్యాలరీలు తక్కువగా పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి రోజూ ఆహారంగా తీసుకోవచ్చు. కానీ దానికీ ఓ పరిమితి ఉంది. రోజుకి ఒక కీరదోసను ఆహారంగా తీసుకొంటే సరిపోతుంది.  అంతకుమించి ఎక్కువ తినడం వల్ల కొన్నిసార్లు దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌తో బాధపడేవారు దీనికి దూరంగా ఉండటమే మంచిది.


benefits-of-cucumber-in-telugu


3. గర్భిణులు కీరదోసను ఆహారంగా తీసుకోవచ్చా?


కీరదోస వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నప్పటికీ వాటిలో అలర్జీలు కలిగించే లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకే గర్భిణులను కీరదోస తినవద్దని చెబుతారు. కీరదోసలో ఉన్న డైయురెటిక్ గుణాల కారణంగా తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావచ్చు. ముఖ్యంగా హెపటైటిస్, కొలైటిస్, క్రానిక్ నెప్రైటిస్, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలతో ఇబ్బందిపడే గర్భిణులు వీటిని ఆహారంగా తీసుకోకూడదు.


అన్నివిధాల ఆరోగ్యంగా ఉన్న గర్భిణులు తగు మొత్తంలో కీరదోసను ఆహారంగా తీసుకోవచ్చు. దీనిలో ఉండే విటమిన్ కె గర్భంలోని బిడ్డ ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. కీరదోసలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల గర్భం దాల్చినవారు డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఉంటారు. గర్భం దాల్చిన వారిలో కొంతమంది కాళ్లకు నీరు పడుతుంటుంది. ఇలాంటి వారు కీరదోస తినడం ద్వారా ఈ సమస్య తగ్గేలా చూసుకోవచ్చు.


4. కీరదోస తినడం ఎంత వరకు శ్రేయస్కరం?


పైన మనం చర్చించుకొన్నట్టుగా కీరదోస తినడం వల్ల ప్రయోజనాలున్నాయి. దుష్ప్రభావాలూ ఉన్నాయి. కానీ అది మనం తినే కీరదోస మోతాదుపై ఆధారపడి ఉంటుంది. తగుమొత్తంలో కీరదోస తినడం ద్వారా చాలా ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. దీనిలో తక్కువ క్యాలరీలుంటాయి కాబట్టి.. బరువు తగ్గాలనుకొనేవారు దీన్ని ఆహారంగా తీసుకోవచ్చు.


రక్తపోటు, బ్లడ్ షుగర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్థం ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. కాబట్టి పరిమితంగా తీసుకొన్నంత వరకు కీరదోస మనకు మేలే చేస్తుంది.


5. కీరదోస తొక్కను మనం ఆహారంగా తీసుకోవచ్చా?


తొక్కతో పాటు కీరదోసను తినడం ద్వారా మనకు మరిన్ని పోషకాలు అందుతాయి. తొక్క తీసేయడం వల్ల పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్ కోల్పోతాం. అందుకే కీరదోసను తొక్క తీయకుండా తినడమే మంచిది. కానీ అలా తినేటప్పుడు కీరదోస తొక్కపై మైనం పూత లేదని నిర్దారించుకొన్న తర్వాతే తొక్కతో పాటు తినడం మంచిది. లేదంటే అనారోగ్యాన్ని మన చేతులారా కొని తెచ్చుకొన్నవాళ్లమవుతాం.


Featured Image: Shutterstock


Running Images: Shutterstock, Pixabay


ఇవి కూడా చదవండి:


బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని అందించే.. బహు చక్కని దుంప 'బీట్రూట్'


ఏడు రోజుల్లోనే అధిక బరువు తగ్గించే.. అద్భుతమైన డైట్ ప్లాన్ ఇది..!


మహా ఔషధ గుణాలు కలిగిన.. ఆరోగ్య సంజీవని "మెంతులు"