ఇది మట్టి కుండ కాదు.. ఆరోగ్య ప్రదాయిని..!

ఇది మట్టి కుండ కాదు.. ఆరోగ్య ప్రదాయిని..!

వేసవిలో ప్రయాణీకులు, బాటసారుల దాహార్తిని తీర్చడానికి రోడ్డు పక్కన చలివేంద్రాలు పెడుతుంటారు. అక్కడ అందరూ ఆగి చల్లటి మంచినీళ్లు (water) తాగి మరీ వెళుతుంటారు. ఈ చలివేంద్రాల దగ్గర మీరు ఒకటి గమనించారా? చలివేంద్రాల్లో ఫ్రిజ్‌లుండవు. కానీ నీరు చాలా చల్లగా, రుచిగా ఉంటుంది. ఇదెలా సాధ్యం? ఎందుకంటే అక్కడ నీటిని ఎర్రమట్టితో తయారుచేసిన కుండల్లో నిల్వ ఉంచుతారు.


ఈ మధ్య అంటే ప్రతి ఇంట్లోనూ ఓ ఫ్రిజ్ ఉంటోంది. ఒకప్పుడు అలా ఉండేది కాదుగా. వేసవి మొదలయ్యేసరికి ప్రతి ఇంట్లోనూ ఓ కొత్త కుండ తీసుకొచ్చి పెట్టేవారు. ప్రస్తుతం అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుండటంతో.. మళ్లీ మట్టి కుండలో (clay pot) నీటిని తాగేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. కుండలో నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి నిజంగానే మేలు జరుగుతుందా? కుండలో నిల్వ ఉంచిన నీరు రుచిగా మారడానికి కారణమేంటి? మొదలైన విషయాలను మనమూ తెలుసుకుందాం.


1. అదనపు పోషకాలు


మట్టిలో వివిధ రకాల విటమిన్లు, ఖనిజ లవణాలుంటాయి. మట్టికుండల్లోనూ ఇవే ఉంటాయి. మన పూర్వీకులకు దీని గురించి అవగాహన ఉంది కాబట్టే.. కుండలో ఉంచిన నీటిని తాగేవారు. మట్టిలో ఉండే పోషకాలు కుండ ద్వారా దానిలో నింపిన నీటిలోకి చేరతాయి. అందుకే ఈ నీరు ఆరోగ్యకరమని చెబుతారు. కాబట్టి ఇకపై ఫ్రిజ్‌లో ఉంచిన నీటిని కాకుండా కుండలో ఉంచిన నీరు తాగడానికి ప్రయత్నించండి.2. నేచురల్ కూలర్


మట్టికుండలకు మన కంటికి కనిపించని చిన్న చిన్న రంధ్రాలుంటాయి. ఇవి నీటిని చల్లగా మారేలా చేస్తాయి. మీకు మరో విషయం తెలుసా? వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా నీటిని చల్లబరుస్తాయి. ఎండ ఎక్కువగా ఉంటే నీరు చాలా చల్లగా తయారవుతుంది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే కుండలో నీరు ఓ మాదిరిగా చల్లబడుతుంది. ఇలా వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా నీటి ఉష్ణోగ్రతలు మార్చడం ఒక్క కుండకు మాత్రమే సాధ్యం. తక్కువ ఖర్చులో ఎకో ఫ్రెండ్లీ విధానంలో చల్లటి నీటిని తాగడానికి ఇది అద్భుతమైన పద్ధతి.


3. నీరు కలుషితం కాదు


ఇటీవలి కాలంలో ప్టాస్టిక్ బాటిల్స్‌లో నిల్వ ఉంచిన నీటిని తాగుతున్నారు. ప్లాస్టిక్‌లో ఉండే  హానికారక రసాయనాల వల్ల నీరు కలుషితమవుతుంది. ఇలాంటి నీటిని తాగడమంటే అనారోగ్యాన్ని కోరి కొని తెచ్చుకొన్నట్టే. కానీ మట్టి పాత్రల విషయంలో ఇలా జరగదు. ఇవి హానికరమైన రసాయనాలతో నీటిని కలుషితం కానివ్వవు.


4. గొంతు, శ్వాస సంబంధ సమస్యలు రావు


సాధారణంగా ఫ్రిజ్‌లో నిల్వ చేసిన నీటిని తాగడానికి కొందరు ఇష్టపడరు. చల్లగా ఉన్న నీటిని తాగాలని ఉన్నప్పటికీ వాటికి దూరంగా ఉంటారు. ఎందుకంటే.. ఆ నీటి వల్ల దగ్గు, జలుబు రావడం, గొంతు పట్టినట్టుగా అనిపించడం తదితర సమస్యలు ఎదురవుతాయి. ఆస్తమా సమస్యతో ఉన్నవారైతే ఫ్రిజ్‌లో ఉంచిన నీటికి చాలా దూరంగా ఉంటారు. కుండలో ఉంచిన నీటిని తాగడం వల్ల అలాంటి సమస్యలేమీ ఎదురుకావు. ఇది నీటిని చల్లబరిచినప్పటికీ.. దాని వల్ల జలుబు, దగ్గులాంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు.5. వడదెబ్బ తగలదు


వేసవిలో వడదెబ్బకు గురి కావడం సహజమే. కుండలో నీటిని తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా చూసుకోవచ్చు. అదెలాగనుకొంటున్నారా? కుండలో నిల్వ ఉంచిన నీటిలో అదనపు పోషకాలు చేరతాయి. ఈ నీటిని తాగడం వల్ల చెమట ద్వారా శరీరం కోల్పోయిన విటమిన్లు, మినరల్స్ తిరిగి అందుతాయి. పైగా నీరు చల్లగా ఉంటుంది కాబట్టి దాహార్తి సైతం తీరుతుంది.


6. గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది


కుండలో నీటిని తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుముఖం పడుతుంది. అదెలా అని ఆలోచిస్తున్నారా? కుండలో నిల్వ చేసిన నీరు ఆల్కలీన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పీహెచ్ విలువను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుముఖం పడుతుంది.


7. ఆహారం సులభంగా జీర్ణం


కుండలో నిల్వ ఉంచిన నీరు ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఫలితంగా మెటబాలిజం ప్రక్రియ సైతం మెరుగుపడుతుంది.


ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలందించే మట్టి కుండ ఖరీదు అంత ఎక్కువేమీ కాదు. సైజు ఆధారంగా వంద నుంచి మూడొందల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి గ్రామాల నుంచి పట్టణాల వరకు అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా లభిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసి ఉపయోగించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు చేతి వృత్తుల‌ వారికి ప్రోత్సాహం అందించినట్టూ ఉంటుంది. ఏమంటారు??


Images: Instagram


ఇవి కూడా చదవండి


బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని అందించే.. బహు చక్కని దుంప 'బీట్రూట్'


చామంతి టీ గురించి ఎప్పుడైనా విన్నారా? రుచి చూశారా?


మహా ఔషధ గుణాలు కలిగిన ఆరోగ్య సంజీవని మెంతులు