అందమైన డ్రస్, చక్కటి మేకప్.. ఇలా ఎన్ని ఉన్నా సరే.. చక్కటి హెయిర్‌స్టైల్ (Hairstyles) లేకపోతే మీ లుక్ అందంగా కనిపించదని మీకు తెలుసా? మన ముఖం అందంగా కనిపించడానికి.. మీ జుట్టు కూడా అందంగా ఉండడం ఎంతో అవసరం. ఇందుకోసం అందమైన హెయిర్‌స్టైల్ మంచి ఎంపిక.
అందమైన కేశాలు మన లుక్‌ని పెంచి.. మనం మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. ఇలాంటి అందమైన హెయిర్‌స్టైల్స్ చేయించుకోవడంలో మన టాలీవుడ్ నాయికలు (Tollywood heroines) ముందుంటారు. మనమూ వారిని ఫాలో అవుతూ.. వారిలా సులువైన హెయిర్‌స్టైల్స్‌తో అందంగా మెరిసిపోదాం.
Also Read: జుట్టు పొడవు మధ్యస్థంగా ఉండేవారికి నప్పే సమ్మర్ హెయిర్ స్టైల్స్ (Summer Haircuts)
1. సైడ్ కార్న్ రో..
అందమైన వదులైన జుట్టు మీకు అందంగా ఉంటుందని మీ భావన. అయితే మీ జుట్టును అలాగే వదిలేసి జడతో కొత్త లుక్ ఇచ్చే అవకాశం ఉంది. జుట్టును వదిలేసి జడ ఎలా వేస్తారు అని మీకు కూడా అనుమానం వస్తోందా? దీనికి సమాధానం అందాల హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ వేసుకున్న ఈ హెయిర్‌స్టైల్. ముందు నుండి జడ వేసుకుంటూ వెనుక వరకూ తీసుకెళ్లి అక్కడ పిన్‌పెట్టి వదిలేయడమే ఈ స్టైల్.
దీనికోసం ముందుగా జుట్టును పక్క పాపిట తీసి వదిలేసుకోవాలి. ఇప్పుడు పక్కన తక్కువగా జుట్టు ఉన్నవైపున.. మరో మూడు భాగాలుగా జుట్టును పాపిట తీసుకోవాలి. ఈ ఒక్కో భాగాన్ని ముందు నుంచి వెనక్కి జడలా అల్లుకోవాలి. వెనుక వరకూ ఇలా జడలా అల్లుకున్న తర్వాత.. దానిని పిన్ సాయంతో వాటిని మిగిలిన జుట్టుతో కలుపుకోవాలి. ఈ అందమైన హెయిర్‌స్టైల్ మోడ్రన్ దుస్తులకు చాలా బాగా నప్పుతుంది.
2. బ్రెయిడ్ బన్
సంప్రదాయమైన పండగలు, ఫంక్షన్లు ఇతర వేడుకలకు సాధారణ హెయిర్‌స్టైల్‌లో కాకుండా.. కాస్త ప్రత్యేకంగా కనిపించాలని అంతా అనుకుంటారు. పూలు పెట్టుకొని అందంగా తయారవ్వాలంటే.. ఎండా కాలంలో చెమటతో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఈ బ్రెయిడ్ బన్‌ను మీ సమస్యకు చక్కటి పరిష్కారంగా చెప్పచ్చు.
బ్రెయిన్ బన్‌లో తొలుత మధ్య పాపిట తీసి ముందున్న కాస్త జుట్టుతో జడను వెనుక వరకూ అల్లుకుంటూ రావాలి. ఇలా అల్లుకుంటూ వచ్చిన తర్వాత.. వెనుక జుట్టునంతా కలిపి జడగా మార్చుకోవాలి. ఆపై దీన్ని కొప్పులా పైకి కట్టుకొని చివర్లు కనిపించకుండా లోపలికి పెట్టుకోవాలి. కావాలంటే పూలు కూడా పెట్టుకోవచ్చు. ఈ హెయిర్‌స్టైల్ సంప్రదాయబద్ధమైన దుస్తులకు చాలా బాగా నప్పుతుంది.
Read More: Best hairstyles for girls
3. ఫిష్ టెయిల్
ఎన్ని హెయిర్‌స్టైల్స్ ఉన్నా.. జడకున్న అందం జడదే. అయితే ఎప్పుడూ మామూలు జడే వేసుకుంటే ప్రత్యేకత ఏముంటుంది.అందుకే ఈ సారి ఫిష్‌టెయిల్‌ని ప్రయత్నించండి. ఇది ఇటు మోడ్రన్, అటు ట్రెడిషనల్ దుస్తులకి చక్కగా నప్పుతుంది. దీన్ని వేసుకోవడానికి జుట్టును వెనక్కి దువ్వి.. జడ వేయడానికి మూడు పాయలకు బదులు రెండు పాయలుగా విడదీయాలి.
ఇప్పుడు ఒక భాగం బయటవైపున్న జుట్టునుంచి.. సన్నని పాయను తీసుకొని అవతలి దానిలో కలపాలి. అవతలి పాయను కూడా అలాగే చేసి ఇవతలి పాయలో ఆ జుట్టును కలపాలి. ఇలా చేసుకుంటూ కింద వరకూ రావాలి. ఆపై రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. కావాలంటే పాయల మధ్య చిన్న చిన్న ప్లాస్టిక్ పూలను పెట్టుకోవచ్చు. లేదా సైడ్‌కి ఓ రోజా పువ్వును పెట్టుకున్నా అందంగానే ఉంటుంది.
4. అసిమెట్రికల్ ఫ్రెంచ్ బ్రెయిడ్
ఫ్రెంచ్ జడంటే ఇష్టం లేనివాళ్లు ఎవరూ ఉండరేమో. ఇది కొందరికి బాగా నప్పుతుంది కూడా. అయితే మీ జుట్టును జడలా వేసుకోవడం అన్ని సందర్భాల్లోనూ నప్పకపోవచ్చు. ఇలాంటప్పుడు మీ ఫ్రెంచ్ బ్రెయిడ్‌కే కాస్త ట్విస్ట్‌ని ఇచ్చి ఇలా కొత్తగా ప్రయత్నించండి. దీనికోసం జుట్టు మధ్యలో కొంత భాగాన్ని ఉంచి.. అటూ ఇటూ రెండు పాపిటలు తీసి జుట్టును మూడు భాగాలుగా విడదీయాలి.
ఇప్పుడు మధ్యలో మిగిలిన భాగాన్ని ఫ్రెంచ్ బ్రెయిడ్‌లాగా అల్లుకుంటూ రావాలి. ఇలా వెనుక వరకూ తీసుకొచ్చి వెనుక రబ్బర్ బ్యాండ్ పెట్టి వదిలేయాలి. మరీ కింద వరకూ లేకుండా కాస్త పైకి రబ్బర్ బ్యాండ్ పెట్టడం వల్ల వెనుక జుట్టు మొత్తం అందంగా కనిపిస్తుంది. ఈ తరహా జుట్టు కూడా అటు సంప్రదాయబద్ధమైన దుస్తులకు, ఇటు మోడ్రన్ డ్రస్సులకు బాగా సూటవుతుంది.
5. ట్విస్టెడ్ బ్రెయిడ్ పోనీ టెయిల్
ఈ తరహా జడ వేసుకోవడం అన్నింటికంటే సులభం. మీరు మామూలుగా ఆఫీస్‌కి వెళ్లాక.. అక్కడి నుంచి అనుకోకుండా ఏదైనా పార్టీకి వెళ్లాల్సి వస్తే దీన్ని ప్రయత్నించండి. దీనికోసం జుట్టును పక్క పాపిట తీసి వదిలేయాలి. ఆ తర్వాత ఎక్కువ జుట్టు ఉన్న వైపు ముందు భాగం నుంచి.. మూడు అంగుళాల మేరకు జుట్టును తీసి మిగిలిన దాన్ని రబ్బర్ బ్యాండ్‌తో కడితే సరిపోతుంది.
ఇప్పుడు ఈ మూడు అంగుళాల భాగం నుంచి ఒక్కో అంగుళాన్ని ఒక్కో పాయగా తీసుకొని.. ఆ పాయను గట్టిగా మెలి తిప్పి చుడుతూ వచ్చి వెనుక పిన్ చేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత రబ్బర్‌బ్యాండ్ తీసి.. జుట్టును ఓసారి దువ్వి మొత్తం జుట్టును కలిపి.. మళ్లీ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇది కనిపించకుండా జుట్టు నుంచి.. ఒక చిన్న భాగాన్ని తీసి రబ్బర్‌బ్యాండ్ మీదుగా పెడితే ఇంకా అందంగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి.
మీ అందమైన మెరిసే జుట్టు కోసం.. చక్కటి షాంపూ బ్రాండ్లివే..!
సమంత మేకప్ సీక్రెట్లు తెలుసుకుందాం.. మనమూ సెలబ్రిటీ లుక్ పొందేద్దాం..!