గుండె వ్యాధులను నివారించే.. సులభమైన చిట్కాలు..! (Healthy Tips For Heart And Body In Telugu)

గుండె వ్యాధులను నివారించే.. సులభమైన చిట్కాలు..! (Healthy Tips For Heart And Body In Telugu)

‘రోజూ పోషకాలు నిండిన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం తప్పనిసరి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం’- ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ చాలామంది ఈ విషయాన్ని విస్మరిస్తూ ఉంటారు. ఫాస్ట్ ఫుడ్, ప్రోసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు. వ్యాయామం చేయడాన్ని కూడా అంత సీరియస్ గా తీసుకోరు. దీని కారణంగా దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే మన శరీరం, గుండె ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో అసలు మనం ఆరోగ్యంగా ఎందుకుండాలి? దాని వల్ల మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఈ విషయాలన్నీ తెలుసుకొందాం.


ఆరోగ్యంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే (How Being Happy Makes You Healthier)


 1. జీవితకాలం పెరుగుతుంది.

 2. వయసు పెరిగే కొద్దీ వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

 3. జీవనశైలి మారడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు మన దరికి రావు.

 4. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండవచ్చు.

 5. ఎక్కువ కాలం శృంగార జీవితం కొనసాగించవచ్చు.

 6. మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం.

 7. ఆరోగ్యంగా ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండగలుగుతాం.

 8. హెల్తీగా, ఫిట్‌గా ఉండటం వల్ల మలివయసులో సైతం ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు.


గుండె, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు (Healthy Tips For Heart And Body In Tamil)


1. నవ్వుతూ ఉండండి (Laugh)


సాధారణంగా మనం ఫేస్బుక్, వాట్సాప్ మెసెంజర్లో ఎక్కువగా LOL అని మెసేజ్ చేస్తూ ఉంటాం. అంటే లాఫింగ్ అవుట్ లౌడ్ అని. ఇలా పగలబడి నవ్వడం కేవలం మనం పంపే సందేశాల్లో మాత్రమే కాదు.. మన పెదవులు, ముఖంలో కూడా ఉండాలి. నవ్వడం వల్ల శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తక్కువగా విడుదలవుతాయి. దీని వల్ల గుండె కండరాలపై కలిగే ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి.. నవ్వడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. కామెడీ సినిమాలు, కామెడీ ప్రోగ్రాంలు చూడటం, జోక్స్ చదవడం, జోక్స్ వేయడం లాంటివి చేయండి. కచ్చితంగా మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.


ఇవి కూడా చదవండి: ఏడు రోజుల్లోనే అధిక బరువు తగ్గించే.. అద్భుతమైన డైట్ ప్లాన్ ఇది..!  


1-healthy-heart


2. సంగీతం వినడం (Listen To Good Music)


మనకి నచ్చిన పాటలు వింటున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుంది. సాధారణంగా మన మూడ్ బాగాలేకపోతేనో లేదా ఉత్సాహంగా పనిచేసుకోవడం కోసమో పాటలు వింటూ ఉంటాం. అయితే ఇక పై ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కూడా సంగీతం వినాల్సి ఉంటుంది. ఎందుకంటే మనసుకి నచ్చిన మ్యూజిక్ మెదడుపై పడే ఒత్తిడి ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంటే మన ఆరోగ్యాన్ని (health) రక్షిస్తున్నట్టే కదా. సంగీతం వినడం మాత్రమే కాదు.. దానికి తగ్గట్టుగా స్టెప్పులు కూడా వేసేయండి. ఇలా డ్యాన్స్ చేయడం వల్ల మన శరీరంలో అధికంగా చేరిన క్యాలరీలు సైతం ఇట్టే కరిగిపోతాయి.


3. చేపలు తినడం (Add Fish To Your Diet)


చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీర ఆరోగ్యాన్ని, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. సాల్మన్, ట్యునా, సార్డిన్స్, హెర్రింగ్ వంటి చేపల్లో ఈ ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ చేపలను వారంలో కనీసం రెండుసార్లు తినడానికి ప్రయత్నించండి.


4. చాక్లెట్ తినండి (Eat Chocolate)


చాక్లెట్లో గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తాయి. దీనిలో ఉన్న పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చాక్లెట్ గుండె ఆరోగ్యం కాపాడుతుంది కదా అని చెప్పి ఎక్కువ తింటే కోరి అనారోగ్యాన్ని కొనితెచ్చుకొన్నట్టే. కాబట్టి రోజుకి రెండు మూడు బైట్స్‌కు మించి ఎక్కువ తినకపోవడమే మంచిది.


2-healthy-heart


5. గింజలు (Nuts)


బాదం, వాల్ నట్ వంటి గింజల్లో గుండెకు(heart) మేలు చేసే కొవ్వులు, పీచు పదార్థం, ప్రొటీన్లు ఉంటాయి. వీటిని రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ నట్స్ తినే విషయంలోనూ జాగ్రత్తలు అవసరమే. ఎందుకంటే వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తక్కువ మొత్తంలో తినడం మంచిది.


6. క్రమం తప్పకుండా వ్యాయామం (Exercise Regularly)


మీరెంత యాక్టివ్ గా ఉంటే మీ ఆరోగ్యం(health) అంత బాగుంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండె పనితీరు బాగుంటుంది. అలాగే కండరాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి. అందుకే రోజూ ఎంతో కొంత వ్యాయామం చేయడం మంచిది. మీరు ఇప్పుడు ఎక్సర్సైజెస్ ఏమీ చేయడం లేదా? ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.


ఎంత బిజీగా ఉన్నా సరే రోజూ ఓ అరగంట సమయం ఎక్సర్సైజ్ కు కేటాయించడం మంచిది. ఎలాంటి వ్యాయామం చేయాలనే విషయంలో మనకు ఎన్నో ఆప్షన్లున్నాయి. జాగింగ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి ఉత్సాహాన్నిచ్చే వ్యాయామాలు చేయచ్చు. అలాగే వ్యాయామం చేసే విషయంలో మరీ ఎక్కువ సమయం కాకుండా అరగంటకు పరిమితం చేసుకొంటే సరిపోతుంది.


7. మెట్లు ఎక్కి వెళ్లండి (Use Strais)


ప్రస్తుత టెక్నాలజీ మనల్ని చాలా బద్ధకస్తులుగా మార్చేస్తోంది. అందుకే ప్రతి పనికీ ఏదో ఒక వస్తువుపై ఆధారపడటం అలవాటైపోయింది. నడిచి వెళ్లే దూరానికి సైతం బైక్ ఉపయోగిస్తున్నాం. మెట్లు ఎక్కి వెళ్లగలిగే సత్తువ ఉన్నప్పటికీ లిఫ్ట్ ఉపయోగిస్తున్నాం. కానీ ఇలా శరీరానికి కష్టం తెలియకుండా ఉంచడం వల్ల మన ఆరోగ్యానికే నష్టం కలుగుతుంది. మెట్లు ఎక్కడం వల్ల మన శరీరానికి సైతం చక్కటి వ్యాయామం దొరుకుతుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం. సో.. ఇకపై లిఫ్ట్ కి బదులుగా మెట్లు ఉపయోగించండి. మరీ ఎక్కువ అంతస్థులు ఎక్కాల్సి ఉంటే మాత్రం లిఫ్టే ఉపయోగించండి.


8. ధూమపానానికి దూరంగా ఉండండి (Avoid Smoking)


ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం తెలిసినప్పటికీ దానికి బానిసలవుతున్న వారెందరో ఉన్నారు. ఈ అలవాటు ఉన్నవారు నెమ్మదిగా ఈ వ్యసనానికి దూరం కావడం మంచిది. ఎందుకంటే.. ధూమపానం కారణంగా గుండె, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది. పైగా గొంతు, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పొగతాగే అలవాటుకి దూరంగా ఉండటం మంచిది.


4-healthy-heart


ఇది మట్టి కుండ కాదు.. ఆరోగ్య ప్రదాయిని..!


9. మానసిక ఆరోగ్యమూ ముఖ్యమే (Look After Your Metal Health)


డిప్రెషన్ తో బాధపడేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. డిప్రెషన్ తో బాధపడేవారికి సరైన తోడ్పాటు అందించకపోతే అది వారి ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మీపై ఒత్తిడి ప్రభావం పడుతోందని అనిపించినప్పుడు దాన్నుంచి బయటపడటానికి మీ సన్నిహితుల సాయం తీసుకొనే ప్రయత్నం చేయండి. ఒకవేళ డిప్రెషన్ ప్రభావం మీపై రెండు వారాల కంటే ఎక్కువ రోజులు కనిపిస్తే వెంటనే మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.


ఎందుకంటే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శారీరకంగానూ ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ ఒత్తిడిని అదుపు చేయవచ్చు. డీప్ బ్రీతింగ్, మెడిటేషన్, యోగా, మసాజ్, ఎక్సర్సైజ్, ఆరోగ్యకరమైన ఆహారం, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడటం.. వంటివి చేయడం ద్వారా ఒత్తిడి ప్రభావం నుంచి బయటపడొచ్చు.


10. యోగా చేయండి (Yoga)


యోగా చేయడం వల్ల మనకు ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్న విషయం తెలిసిందే. కాబట్టి రోజూ కొంత సమయం యోగా చేయడానికి కేటాయించండి. యోగా వల్ల శరీరానికి వ్యాయామం అందడంతో పాటు ఒత్తిడి సైతం దూరమవుతుంది. ఫలితంగా శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి.


11. ఉప్పు తక్కువ తినండి (Reduce Salt Intake)


రోజుకో అరటీస్పూన్ ఉప్పు తగ్గించడం ద్వారా కరొనరీ హార్ట్ డిసీజ్ లు తగ్గుతాయట. న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కాబట్టి ఆహారంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించండి. ప్రాసెస్డ్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్ లో సైతం ఉప్పు వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని తినే ముందు కాస్త ఆలోచించుకోండి. అలాగే మీకు హైబీపీ లేదా హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఉన్నట్టయితే ఉప్పుకు బదులుగా సాల్ట్ సబ్సిట్యూట్స్ తీసుకోవడం మంచిది.


12. ఆరోగ్యకరమైన బరువు (Maintain Healthy Weight)


అధిక బరువు మన ఆరోగ్యానికి పెనుముప్పు కలిగించవచ్చు. మీ శరీరం ఖర్చు చేస్తున్న క్యాలరీల కంటే.. మీరు ఆహారంగా తీసుకొనే క్యాలరీలు ఎక్కువగా ఉంటే స్థూలకాయంతో ఇబ్బంది పడాల్సి రావచ్చు. అలాగని మొత్తానికి తిండి మానేయడం కూడా మంచిది కాదు. సరిపడినంత బరువు ఉన్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అంతేకాదు.. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఈ విషయంలో డైటీషియన్ సూచనలు పాటిస్తూ వ్యాయామం చేయడం తప్పనిసరి.


3-healthy-heart


ఆరోగ్యానికి, సౌందర్యానికి రక్ష.. ఈ పచ్చాపచ్చని కీరదోస..!


13. ఎక్కువ సమయం ఒకే చోట కూర్చోవద్దు (Don't Sit For Too Long)


ఎక్కువ శాతం మంది డెస్క్ జాబ్ లకే పరిమితం అవుతున్నారు. ఇలా ఎక్కువసేపు కూర్చొనే ఉండటం వల్ల మన ఆయుష్షు తగ్గిపోతుందట. ఇలా ఎటూ కదలకుండా ఒకే చోట కూర్చొన పని చేయడం వల్ల రక్తంలో కొవ్వు, చక్కెర శాతం పెరిగిపోతుంది. ఈ ప్రభావం నేరుగా మన గుండెపై పడుతుంది. కాబట్టి కుర్చీకి అతుక్కుపోకుండా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకొని కాసేపు అటూ ఇటూ తిరగండి. పని నుంచి కాస్త విరామం దొరికినా.. దాన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం ఉపయోగించండి.


14. బీపీ, షుగర్ నియంత్రణలో ఉండాలి (Keep Your Blood Pressure & Sugar Level Under Control)


బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతుంటే అవి అదుపులో ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అందుకే ఎప్పటికప్పుడు చెక్ చేయించుకొంటూ ఉండాలి. అలాగే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు కూడా పరీక్షించుకొంటూ ఉండాలి. ఎందుకంటే రక్తంలో వీటి స్థాయులు పెరిగితే అది గుండె ఆరోగ్యానికి ముప్పు కలిగించవచ్చు. కాబట్టి రెగ్యులర్ గా డాక్టర్ చెకప్స్ చేయించుకోవాలి. అప్పుడే వాటి స్థాయుల్లో పెరుగుదల ఉంటే దాన్ని నియంత్రణలో తీసుకురావడానికి వీలవుతుంది.


15. బ్రేక్ఫాస్ట్ తినడం మానేయద్దు (Don't Skip Breakfast)


కొన్నిసార్లు సమయం లేకపోవడం వల్ల లేదా ఏం తింటాంలే అనే ఉద్దేశంతోనో కొందరు ఉదయం టిఫిన్ తినడం మానేస్తారు. ఇలా చేయడం మంచిది కాదు. రోజంతా ఉత్సాహంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. అది కూడా పూర్తి పోషకాలతో కూడినదై ఉండాలి. ఓట్ మీల్స్, చపాతీ, లో ఫ్యాట్  మిల్క్, పెరుగు, పండ్లు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. దీని వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం.


16. ఒత్తిడి తగ్గించుకోండి (Don't Take Stress)


గుండె ఆరోగ్యంపై ఒత్తిడి తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాన్ని దూరం చేసుకొనే ప్రయత్నం చేయాలి. కొన్ని సృజ‌నాత్మ‌క పనులను అలవాటు చేసుకోవడం ద్వారా మహిళలు తమకు ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. దీని కోసం జిగ్సా పజిల్, కుకింగ్, అల్లికలు అల్లడం, ఎంబ్రాయిడరీ.. వంటివి చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అలాగే యోగా, ధ్యానం చేయడం ద్వారా కూడా ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చు.


17. ఆరోగ్యకరమైన అలవాట్లు (Develop Healthy Habits)


ఈ రోజు మనం అలవరుచుకొన్న అలవాట్లు రేపటి మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి రోజూ క్రమం తప్పకుండా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. మద్యపానం అలవాటు ఉంటే పరిమితంగా ఆల్కహాల్ తీసుకోవాలి. రోజుకి కచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. సరిగ్గా నిద్ర పట్టకపోతే వైద్యులను సంప్రదించి అవసరమైన మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే బీపీ, షుగర్ ఇతర జీవనసరళికి సంబంధించిన వ్యాధులకు ఔషధాలు వాడుతుంటే వాటిని క్రమం తప్పకుండా వేసుకోవాల్పి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సూర్యరశ్మి సోకకుండా చూసుకోవాలి. ఈ సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే సన్ స్క్రీన్ రాసుకోవడం మరచిపోవద్దు.


18. కొవ్వు పదార్థాలకు దూరంగా (Have Low-Fat Diet)


శరీరంలో, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగే కొద్దీ మనం అనారోగ్యానికి దగ్గరవుతున్నట్టే. ముఖ్యంగా దీని వల్ల మొదట ప్రభావితమయ్యేది గుండె ఆరోగ్యమే. కాబట్టి అనారోగ్యాన్ని కలిగించే ఫ్యాట్ కు దూరంగా ఉండాల్సిందే. అలాగని కొవ్వులు తినకుండా ఉండటం కూడా మంచిది కాదు. రోజూ మనం తీసుకొనే ఆహారంలో కొవ్వులను ఏడు శాతానికి మించకుండా చూసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.


5-healthy-heart


19. ఈ ఆహారానికి దూరంగా ఉండాల్సిందే (Keep These Foods At A Bay)


గుండె ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకూడదు. వీటిలో ఉండే కొవ్వులు, ఉప్పు, కొలెస్ట్రాల్ వంటి వాటి వల్ల గుండె ఆరోగ్యానికి ముప్పు ఏర్పడవచ్చు. జంక్ ఫుడ్ తో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ కి సైతం దూరంగా ఉండాలి. వాటికి బదులుగా ఆరోగ్యాన్ని అందించే పండ్లు, కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలి.


20. రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి (Visit Doctor In Regular Intervals)


నిర్ణీత వ్యవధిలో క్రమంతప్పకుండా చెకప్ చేయించుకొంటూ ఉండాలి. బీపీ, షుగర్ మాత్రమే కాదు.. ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలున్నాయేమో కూడా ఓసారి పరీక్షించుకోవాలి. అవసరమైతే డాక్టర్ కొన్ని పరీక్షలు సూచిస్తారు. వాటి ఆధారంగా ఏదైనా సమస్య ఉంటే సత్వరమే చికిత్స చేసి నయం చేయడానికి కుదురుతుంది. అలాగే మీకు ఏమైనా సమస్యలున్నా.. లేదా సందేహాలున్నా.. వాటిని నిర్మొహమాటంగా డాక్టర్ ను అడిగి వాటికి సమాధానాలు తెలుసుకోండి.


చెకప్ వెళ్లినప్పుడు డాక్టర్ ను ఎలాంటి ప్రశ్నలు అడగాలి? (Questions To Ask Doctor About Heart Health)


డాక్టర్ దగ్గరకు చెకప్ కోసం వెళ్లినప్పుడు మన సమస్యను ఎలాంటి మొహమాటం లేకుండా వారికి వివరించడంతో పాటు.. వారిచ్చే సూచనలను శ్రద్ధగా విని వాటిని తు.చ. తప్పకుండా పాటించడం మంచిది. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. వైద్యులు మనకు ఎంత వివరించినా కొన్ని సందేహాలు మాత్రం మన మనసులో మెదులుతుంటాయి. వాటిని కూడా ఎలాంటి సంకోచం లేకుండా అడిగి వాటికి సమాధానాలు తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. మరి ఎలాంటి ప్రశ్నలు అడగాలి? కొన్ని ప్రశ్నలు మచ్చుకు మీకోసం..


 1.  మా కుటుంబంలో ఒకరిద్దరికి హార్ట్ ఎటాక్ ఉంది. నాకు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందా?

 2. నాకు హైబీపీ ఉంది. దీని వల్ల గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుందా?

 3. నా శరీర బరువు కూడా నా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా?

 4. నా ఆరోగ్యం మెరుగుపడటానికి నేను ఎంత మేర బరువు తగ్గాల్సి ఉంటుంది?

 5. నేను తినే ఆహారం వల్ల కూడా నా ఆరోగ్యం దెబ్బ తింటుందా? గుండె ఆరోగ్యం మెరుగు పడాలంటే నేను ఎలాంటి ఆహారం తినాలి?

 6. ప్రస్తుతం నా బ్లడ్ ప్రెజర్ నార్మల్ గానే ఉంది. ఇది పెరగకుండా ఉండాలంటే.. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక వేళ బీపీ పెరిగితే నేను మందులు వాడాల్సి ఉంటుందా? మెడిసిన్ వాడకుండానే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుందా?

 7. నా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

 8. నా ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలి?

 9. నేను గర్భం దాల్చకుండా ఉండటానికి బర్త్ కంట్రోల్ పిల్స్ ఉపయోగించాను. అవి నా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఏదైనా ఉంటుందా?

 10. గర్భం దాల్చిన సమయంలో నా రక్తపోటు పెరిగింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. దీనివల్ల గుండె ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందా?

 11. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ప్రీ ఎక్లాంప్సియా(గుర్రపువాతం)కు గురయ్యాను. దీని వల్ల భవిష్యత్తులోనూ సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. ఇది నిజమేనా?

 12. జెస్టేషనల్ డయాబెటిస్(గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం) వల్ల కూడా గుండె సమస్యలు రావచ్చా?


ఇలాంటి ప్రశ్నలు అడగడం ద్వారా మీ సందేహాలను తొలగించుకొనే ప్రయత్నం చేయవచ్చు. మీరు అడిగిన సందేహాల ఆధారంగా మీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులకు సైతం కొంత అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి వారు దానికి అనుగుణంగా కొన్ని పరీక్షలు సైతం సూచించి తద్వారా మీకు సరైన చికిత్స చేయడానికి వీలవుతుంది. ఆరోగ్యపరమైన సందేహాలను అడిగే విషయంలో చాలామంది వైద్యులను అడగడానికి సిగ్గుపడుతుంటారు. మరికొందరైతే అనారోగ్యం గురించి మాట్లాడటానికి అసలు ఇష్టపడరు. దాని గురించి మాట్లాడితే అది వారికి వచ్చేస్తుందనే అపోహే దీనికి కారణం. ఆరోగ్యాన్ని సంరక్షించుకొనే విషయంలో ఇలాంటి అపోహలను, అపనమ్మకాలను పక్కనబెట్టడం మంచిది. అప్పుడే ముందుగానే లేదా ఆరంభంలోనే సమస్యను గుర్తించి దానికి తగిన చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది.


Images: Shutterstock